Sunday, November 24, 2024

ఛందో బందోబస్తు - దత్తవాక్కు - ఆంధ్రప్రభ ఆదివారం - 24 నవంబర్ 2024

“ఛందో బందోబస్తులన్నీ బంద్” అని శ్రీశ్రీ గారంటే, “ఛందస్సు వద్దని ఛందస్సులోనే చెప్పాడు పాపం!” అన్నారట విశ్వనాథ వారు. ఛందోబద్ధంగా కవిత రాసేవారంతా పండితులనీ, వచన కవిత రాసేవారు కాదనీ పాతకాలంలో ఒక అపోహ! ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నాడు విశ్వనాథ లాక్షణికుడు. ఇక జగన్నాథ పండితరాయలు ఒకడుగు ముందుకు వేసి, “రమణీ యార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్” అన్నాడు. మనోహరమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమైనా సరే కావ్యమట. మరెందుకీ సిద్ధాంతరాద్ధాంతాలు? ఏ కవిత్వం గొప్పదని? అన్నీ గొప్పవే!
ఛందస్సుతో ఉన్న కఠిన నియమాలు (rigid rules) భావవ్యక్తీకరణకు అడ్డు వస్తాయన్నది కొంతవరకు నిజమే అంటాను నేను. దీనివల్ల ప్రాచీన కవులు కూడా ఇబ్బంది పడ్డారు. పోతన గారి ఈ ప్రసిద్ధ పద్యం చూడండి!
“ఓ యమ్మ నీ కుమారుడు/మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా/పోయెదమెక్కడి కైనను/మాయన్నల సురభులాన, మంజులవాణీ!”
పద్యం చివర్లో ఈ సంబోధన చూడండి! కేవలం ‘యతి’ స్థానం కోసమేనా? గోపకాంతలు కృష్ణుని మీద కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చారు. కోపంగా ఉన్నారు. వారు యశోదమ్మను మంజులవాణీ (మనోహరమైన పలుకులు పలికేదానా!) అని ఎందుకు పిలుస్తారు? యతి కోసమే కదా! పోతన్నగారికి నా క్షమాపణలు, పాదాభివందనాలు! పోతన్నగారే కాదు. ఇతర ప్రాచీన కవులందరూ యతుల స్థానంలో ఏదో ఒక సంబోధన వేసుకున్నవారే! అది తప్పని నా అభిప్రాయం కాదండోయ్! వారంతా మహాకవులు! వారిని విమర్శించ గల స్థాయి నాకేదీ? నవయుగ కవిచక్రవర్తి శ్రీ గుర్రం జాషువ గారు “కావ్య శిల్పమున కన్న నభిప్రాయ ప్రకటనమే నా పరమావధి” అన్నారు. పద్యాన్ని కొత్తపుంతలు తొక్కించి, అనన్యసామాన్యంగా మలచి పద్యానికి చెలికాడయ్యాడు ఆయన. అంతటివాడు, ఛందస్సు కవులనెలా సతాయిస్తుందో చెపుతున్నాడు చూడండి! తన ‘నా కథ’లో!
సీ:
గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ, తగ్గవో యని యతిస్థాన మురుము/యతిని మచ్చికజేసి యడుగు ముందుకుసాగ ప్రాసంబు కుత్తుక బట్టి నిలుపు/ప్రాస వేదన దాటి పయనంబు సాగింప, భావంబు పొసగ కిబ్బంది పెట్టు/భావంబు పొసగించి పద్యంబు ముగియింప రసలక్ష్మి, కినిసి మారాము సేయు
తే.గీ.:
ఇట్టి ప్రతిబంధకంబుల నెల్ల గడచి/గట్టు కెక్కుదమన్న, వ్యాకరణ శాస్త్ర/మాదరింపదు శబ్ద మర్యాద గాన/రాక కవి గాని బ్రతుకు, రామ రామ!
పద్యం ఛందస్సులో ఉంది. కాని ఛందో కష్టాలను రమ్యంగా వివరించింది. మళ్ళీ నేను వ్యాఖ్యానం చేయాల్సిన పని లేదు. సుబోధకం! దటీజ్ జాషువా!
మా సోదరులు, డా. జోస్యుల కృష్ణబాబు గారు మహాపండితులు. పెద్దాపురం కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా చేశారు. ఆయన పద్య వైభవాన్ని వివరిస్తూ ఆ మధ్య ఒక చక్కని, ఆలోచింప చేసే వ్యాసం వ్రాశారు. అన్నా, నీ కోసం టోపీలు తీస్తున్నాం! (హ్యాట్సాఫ్‌కు వచ్చిన అవస్థ!). ఆయన మహాసహస్రావధాని, డా. గరికపాటి నరసింహారావుగారు పద్యాన్ని గురించి చెప్పిన ఒక పద్యాన్ని ఉదహరించారు.
తే.గీ.:
పద్యమన్నది వేయేండ్ల పసిడిపంట,/ పద్యమన్నది తెలుగింటి పాడిపంట/ తెలుగు పద్యమె పాడుము తెలుగుబాల!/ తెలుగు తేజమ్ము వెలయంగ దిశలమ్రోల!/‘గరికపాటి వారు గడుసువారు!’ ఈ పాదం తేటగీతేనండోయ్! నేనే వ్రాశా!
మా అన్నయ్య, జోస్యుల కృష్ణబాబుగారు ‘పద గతౌ’ అన్న సంస్కృత ధాతువు నుండి ‘పద్యం’ అనే పదం పుట్టిందన్నారు. పద్యమంటే, నియమబద్ధమైన నడక గలది! భాష గుర్రమైతే, భావం రథం. కవి సారథిగా ఉండి, భావరథానికి భాష అనే గుర్రాన్ని పూన్చి, ఛందరాజ మార్గంలో హేలగా నడిపించడమే పద్యం అంటారాయన. ఆయనంత బాగా నేనెక్కడ చెప్పగలనుగాని, పద్యరచన గుర్రపుస్వారీ అయితే వచన కవిత్వ రచన గేర్‌లెస్ స్కూటరు నడపడం లాంటిదంటాను నేను. వచన కవితలు రాసేవారప్పుడే కనుబొమలు ముడివేస్తున్నారు! వారికి నా శతకోటి వందనాలు! వారూ గొప్పవారేనని ముందే విన్నవించా, సవినయంగా!


వచన కవిత్వంలో కొత్త కొత్త ఛందస్సులు వస్తున్నాయి. వచన కవిత్వంలో ఛందస్సా? అని అనుకోకండి! అంతవరకెందుకు సార్, మనం రోజూ మాట్లాడుకునే మాటల్లో కూడా ఛందస్సుంది! “ఏమోయ్! కొంచెం కాఫీ ఇస్తావా?”, “ఇస్తానుండండి! కాస్త ఆగాలి మరి!” ఏం ఇది ఛందస్సు కాదా? “ఒక్కటిచ్చానంటే, గూబ గుయ్యిమంటుంది! నీ దిక్కున్న చోట చెప్పుకో!” ఇది ఛందస్సు కాదా! పద్యకవులు రాసే పద్యాలు సామాన్యుల కర్థం కావని వచన కవులు అంటుంటారు. వచన కవితలు కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా రాసే మహాకవులున్నారండీ బాబు! దాన్ని కవిత్వంలో ‘అస్పష్టత’ అన్నారు (obscurity). ‘Obscurity for obscurity’s sake’. అస్పష్టత కోసమే అస్పష్టతను ఆవిష్కరించే ఘనులున్నారు. వారికి నా లాల్ సలామ్! “హృదయాన్ని పేల్చుకుని, పేల్చుకుని, చీల్చుకుని, చీల్చుకుని, తిమిరంను ఛేదించు”. మీకేమయినా బోధపడిందా? అయితే నాకు ఫోన్ చేసి దానర్థం చెప్పండి, దయచేసి!
నానీలనీ, హైకూలనీ, కానీలనీ, టూకీలనీ, సెవెన్ లింగులనీ, ప్రపంచకాలనీ, సమ్మోహనాలనీ వ్యంజకాలనీ, అబ్బో! ఎన్నో మినీ కవితాప్రక్రియలు సృష్టించి, సుసంపన్నం చేస్తున్నారు ఆధునిక వచన కవులు. కాదేదీ కవితకనర్హం! ‘పద్యం బూర్జువా సంస్కృతికి దర్పణం’ - అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకాయన చాలా కాలం క్రిందట అంటే, నేను నా నిరసన పత్రికాముఖంగా తెలియచేశా లెండి! ఆయన మేరువు, నేనేమో రేణువుని. నన్నెవరు పట్టించుకొంటారు? ఏది రాసినా, మనసుకు హత్తుకోవాలి, పద్యమైనా కవిత ఐనా, లేకపోతే హాస్యనటి శ్రీలక్ష్మి ఏదో సినిమాలో అన్నట్లు అది ‘తవిక’ అవుతుంది! అదన్నమాట!
 

1 comment:

  1. పాఠకుని మనసుకు హత్తుకునేదే కవిత. అది పద్యము కావచ్చు పాట కావచ్చు వచనము కావచ్చు. కళ్ళ నీళ్లు తెప్పించే గుర్రం జాషువా గారి పద్యాలు దైవ స్తుతిని ఎంతో హృద్యంగా చేసిన పోతన గారి పద్యాలు ఎవరు మర్చిపోగలరు. ఆనాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో కౌలల్లిన పద్యాలు ఇప్పటికీ జనాలనాల్కలపై ఉన్నాయి కదా చాలా బాగా చెప్పావు

    ReplyDelete