Sunday, January 12, 2025

పాజిటివ్.. నెగెటివ్!- దత్తవాక్కు - ఆంధ్రప్రభ

ప్రతి విషయానికీ రెండు పార్శ్వాలుంటాయి. నాణేనికి రెండు వైపులున్నట్లు! దాన్నే ‘అదర్‍సైడ్ ఆఫ్ ది కాయిన్’ అన్నాడు అంగ్రేజీవాడు! ఈమధ్య సోషియల్ మీడియాను గమనిస్తే, పాజిటివ్‌గా, నెగెటివ్‌గా, పుంఖానుపుంఖాలుగా అభిప్రాయాలు వెల్లువెత్తడం కనిపిస్తుంది. వీళ్ళకు ‘నెటిజన్లు’ అని పాత్రికేయులే పేరు పెట్టారు! సరిగ్గా నప్పింది! నెట్‌లో హడావిడి చేసే సిటిజన్లన్న మాట. సంస్కృతంలో ‘యద్భావం తద్భవతి’ అన్న ఒక సూత్రం ఉంది. దాన్ని ఇంగ్లీషులో తర్జుమా చేద్దాం. ‘యాజ్ యు థింక్, సో యు బికమ్’. నిజానికి ఇది పాజిటివ్ దృక్పథాన్ని ప్రతిబించించే అంశం కాని, సమకాలీన జర్నలిజం సోషల్ మీడియాలలో ఇది ‘ఎవరికి నచ్చింది వారు చెప్పుకునే’ దానిగా పరిణమించింది.
ముందు అధికారంలో ఉన్నవారు అంతా సర్వనాశనం చేశారనీ, తాము వచ్చి చక్కదిద్దుతున్నామనీ, ప్రస్తుతం పగ్గాలు చేపట్టిన వారు సెలవిస్తుంటారు. ప్రతిపక్షం తక్కువేం తినలేదు. తాము బ్రహ్మండంగా వెలగబెట్టిన దాన్ని ఇప్పుడొచ్చిన వాళ్లు పూర్తిగా పాడుచేస్తున్నారని వీళ్లు! విచిత్రం ఏమిటంటే, ‘కడుపు నిండిన’ వర్గమే సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటుంది. పాలన వల్ల పాజిటివ్ గానో నెగెటివ్ గానో ‘అఫెక్ట్’ అయినవారికి, బీదాబిక్కీకి, సోషల్ మీడియా మేధా ప్రదర్శన చేసే టైమ్ ఉండదు! జీవనపోరాటమే వారికి సరిపోతుంటే, ఈ అభిప్రాయ పోరాటం వారెక్కడ చేయగలరు? కేంద్రంలో, రాష్ట్రాలలో, జరుగుతున్న పరిణామాలకు నెటిజన్లు స్పందిస్తున్న తీరు చూస్తే విస్తుబోతాం.
ఒక బాలమేధావి, ప్రపంచ స్థాయి ఛెస్ ఛాంపియన్‌గా, నిలిస్తే, ఆయన పేరు మూలాలు వెతుకుతాడో మేధావి. ఇంకొకాయన, కేంద్ర ఆర్థికమంత్రిగారు ఎయిర్‌పోర్ట్‌లో ఆ పిల్లవానికి వచ్చిన ప్రైజ్‍మనీపై ట్యాక్స్ వసూలు చేయడానికి ఎదురుచూస్తున్నారని జోక్ చేస్తాడు! ఒక మాస్ హీరో వీరమాస్ సినిమా విడుదల రోజు ఆ మహానటుడు థియేటర్‌కు వస్తే, తొక్కిసలాట జరిగి ఒకరు మరణిస్తే, వేరొకరు చావు బతుకుల్లో ఉంటే, నెటిజన్ల ‘యద్భావం తద్భవతి’ యాటిట్యూడ్‌లు వారి వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ (సారీ! దీనికి తెలుగు పదం తోచడం లేదు) ను ప్రతిబింబిస్తాయి. ఆయన థియేటరుకు వెళ్లడం తప్పని ఒకరంటే, ఆయనకూ సినిమా చూసే హక్కు ఉందంటాడు ఇంకొకాయన. అరెస్టయిన ఆయన్ను చూడడానికి సెలిబ్రిటీలందరూ వెళ్లడం, మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లకపోవడం గురించి కామెంట్స్ చేస్తారు. జాతీయ అవార్డు పొందిన వాడిని అరెస్టు చేస్తారా? అంటూ ఆశ్చర్యపోతాడు ఇంకో ఆయన. ఇంకో ప్రముఖ నటుని కుటుంబంలో ఆస్తి పంపకాలలో, తండ్రీ కొడుకులు గొడవ పడితే, అదేదో జాతీయ ప్రాముఖ్యత గల అంశమైనట్లు, హై డ్రామా! ఉత్కంఠ! అంటూ గంటల తరబడి ఊదరకొడతారు. పైన పేర్కొన్న విషయాల్లో, ప్రభుత్వ చర్యలను విమర్శించేవారు, మద్దతిచ్చేవారు, ‘యద్భావం తద్భవతి’ లాగా తయారవుతారు. ఇదంతా ఒక ప్రహసనం! కామన్ మ్యాన్‌కు అనవసరం!



కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ నెగెటివ్ గానే ఉంటాయి. పాజిటివ్ వెర్షన్ ఉండదు. “ఫరవా లేదు” అంటాం గాని, “ఫరవా ఉంది” అని ఎవరయినా అన్నట్లు ఎక్కడా కనబడదు! “శుభస్య శీఘ్రం” అని ఉంది గాని “అశుభస్య ఆలస్యం” అని లేదు కదా! సామెతల్లో అయితే పాజిటివ్ నెగెటివ్ రెండు ఉండి, ఏది అనుసరించాలో తెలియక, మనల్ని కన్‍ఫ్యూజ్ చేస్తాయి. ఉదా: ‘నిదానమే ప్రధానం’ ఓ.కె. - మరి, ‘ఆలస్యం అమృతం విషం’? ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్!’ బాగానే ఉంది! ‘హేస్ట్ ఈజ్ వేస్ట్’ ఇదీ సరే! మరి, ‘మేక్ హే వైల్ ది సన్ షైన్స్!’ - దీన్నెలా తీసుకోవాలని మా గురువు గారు తాటిచెర్ల కృష్ణశర్మగారిని అడిగానో సారి. ఆయన నవ్వుతూ, “ఒరేయ్! టు హూమ్ సో ఎవర్ ఇట్ ఈజ్ కన్సర్న్‌డ్” అన్నారు! “ఎవరికేది వర్తిస్తే వారికది!”
నిజమే! వామపక్షవాదులు దేన్నైనా, తమ భావజాలంతో ముడిపెడుతుంటారు. దాన్ని ఇష్టపడేవారికి అది నచ్చుతుంది. పెద్దాయన చేస్తున్నదంతా అద్భుతం అని ఆయన తరపు వాళ్లంటే, కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు అని అగెనెస్ట్ బ్యాచి! ‘యద్భావం తద్భవతి’ వాళ్ళు ఉండనే ఉన్నారు! నాలాంటి, మీలాంటి వాళ్ళకు ఏది నిజమో తెలియక జుట్టు పీక్కుంటాం. ఎప్పుడూ ఒక్కలాగే ఉంది మన పరిస్థితి! ఎవరూ ఊడబొడిచిందేమీ లేదు!
‘ఆబ్జెక్టివ్ క్రిటిసిజమ్’ అని సాహిత్య విమర్శలో ఒక చక్కని సిద్ధాంతం ఉంది. ‘నిష్పక్షపాత’ అని అర్థం, ‘ఆబ్జెక్టివ్’ అన్న పదానికి. అదిప్పుడెక్కడ ఏడ్చింది, మహాప్రభో!? ‘నిజమైన’ దాన్ని చెప్పే నాథుడే కరవయ్యాడు! ‘కనకదుర్గ పూజామహిమ’ అని విఠలాచార్య గారి సినిమా ఈమధ్య యూట్యూబ్‌లో, మా స్మార్ట్ టీవీలో చూశానండి. ‘రామాయణంలో పిడకల వేట’ అనుకుంటున్నారా! కాదు! అందులో ఒక రాజు, ఒక రాణి ఉంటారు. రాజు మిక్కిలినేని గారు. రాణి ఎవరో మరి? ఇద్దరూ సంగీతంలో నిష్ణాతులే. వారు సౌధోపరి భాగంలో ఉండగా, ఒక జంతువు అరుపు వినబడుతుంది. దాని అరుపులోని షడ్జమం, పంచమం వగైరాలను బట్టి అది మగనక్క అని రాజుగారు, కాదు ఆడనక్క అని రాణిగారు వాదించుకుంటారు. వాదోపవాదాలు పెరిగి పందాల వరకు వెళుతుంది విషయం. ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని కోట్లల్లో పందేలు కాసే అద్భుత ప్రజాస్వామ్యం మనది! ఎవరు గెలిస్తే, మిగతావారు అడవులలో వెళ్లాలని.. ఈ కథ ఎందుకు చెప్పానో తమరికర్ధమయే ఉంటుందీ పాటికి. ఇప్పటి పరిస్థితి అలాగే ఉంది మరి! ఏ నక్క ఐతే ఏమిటి? దానికంత రాద్ధాంతం అవసరమా! ఒక్కటి మాత్రం తప్పదు! నిజం నిప్పు! అది దాచాలన్నా దాగదు! అదన్నమాట!

No comments:

Post a Comment