‘భార్యావిధేయులు’ అనగానే నాకెందుకో శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. సత్యభామ ఆయనను నిరంతరం కట్టడి చేస్తుంటుంది. డామినేట్ చేస్తూంటుంది! ఐనా, ఆయన కిమ్మనడు! ‘అంతేగా!’, అంతేగా!’ అంటుంటాడు పైగా! కానీ, అదంతా నటనే! జగన్నాటక సూత్రధారి! ‘మీరజాలగలడా నా యానతి?’ అంటూ జూనియర్ సముద్రాల గారు రాసిన పాటను జమునగారు అద్భుతంగా అభినయించారు. కాని, చివరకు స్వామి ‘తన నాథుడు మాత్రమే కాదు, జగన్నాథుడ’ని ఆమె గ్రహించవలసి వచ్చింది. ఈ పాటను, సత్యభామ పాత్రకు పేరుపొందిన స్థానం నరసింహారావుగారే ‘మూలం’ రచించారని అంటారు. ఈ ‘తులాభారం’ నాటకాన్ని వ్రాసిన శ్రీ ముత్తరాజు సుబ్బారావు గారికి జై!
భార్యకు విధేయుడిగా ఉండడంలో కొంత సుఖం ఉంది అంటారు, ఆ సుఖం తెలిసినవారు. ఇంగ్లీషులో వీరిని ‘హెన్‌పెక్డ్’ అంటారు. కేంబ్రిడ్జి నిఘంటువు, భార్యావిధేయుడిని ఇలా నిర్వచించింది - “ఒక స్త్రీ చేత అదుపు చేయబడి, కొంచెం భయపడుతూ ఉండే మగవాడు. ఆ స్త్రీ అతని భార్యే.” ఫెమినిస్టులు, పురుషాహంకారాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూంటారు. కానీ, ఈ రెండో పార్శ్వాన్ని పెద్దగా ఎవరూ చూపించరు! ‘కుకోల్డ్’ అని ఇంకో మాట కూడ ఉంది. వీళ్లందరూ పరిహాసానికి గురైనవారే కాని జాలిపడిన వారు లేరు వారి మీద!
ఉద్దాలకుడు ఒక మునీశ్వరుడు. ఆయన భార్య చండిక. నిజంగా చండికే. భర్తంటే లెక్కలేదు. ‘ముక్కు పట్టి ఆడిస్తూ ఉంటుంది’ మగడిని. దీన్నే ‘లెడ్ బై నోస్’ అంటారు. ‘యతో’ అంటే ‘తతో’ అంటుంది. ‘ఎడ్డెం’ అంటే ‘తెడ్డెం’ అంటుంది. తన బాధను తన గురువు గారితో చెప్పుకుంటే ఆయన ఒక సులువు చెప్పాడు. అట్నుంచి నరుక్కురమ్మని! ఉద్దాలకుని తండ్రి తద్దినం. పెడదామంటే వద్దంటుంది కదా! అందుకని “మా నాన్న నాకేం చేశాడు? ఆయనకు తద్దినం పెట్టను!” అంటాడు! “మామగారు మంచివారు! నోరు ముయ్యండి. పెట్టాల్సిందే” అంటుంది చండిక. “పెడితే పెట్టొచ్చుగాని, గారెలు, బూరెలు, మూడు కూరలు, మూడు పచ్చళ్ళు ఏం చేయనక్కరలేదు.” అంటాడు. “అలా వీల్లేదు. అన్నీ చేస్తా!” అంటుందామె. గురువుగారి స్ట్రాటజీ బాగుంది కదా!
గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, చివరికి యస్వీరంగారావు గారలు కూడా భార్యా విధేయ పాత్రల్లో జీవించారు! భర్త ఎవరైనా, భార్య మాత్రం, సూర్యకాంతం గారే! ‘భర్తావిధేయురాలు’ అన్న పదమే లేదు చూశారా! రంగనాయకమ్మ గారు, వోల్గా గారు ఊరికే హడావిడి చేస్తుంటారు గాని, మగవాళ్ళల్లో అంత దుర్మార్గులు ఉంటారా చెప్పండి? బాపు గారి దగ్గర్నుంచి, ఈనాటి కార్టూనిస్టుల వరకూ, సోషల్ మీడియా జోకర్ల (అంటే జోకులు వేసేవారు) వరకూ, అంట్లు తోమే భర్తలు, వంట చేసే భర్తలు, బట్టలుతికే భర్తలు, అప్పడాల కర్రతో నెత్తిన బుడిపెలు కట్టించుకునే భర్తలు.. అంతా వీళ్ళే కదా! కాబట్టి, ఫెమినిజం కంటే పెళ్ళామిజమే ఎక్కువ యువరానర్!
మరి ‘పతివ్రత’ల సంగతేమిటి? అంటున్నారా మాస్టారు! వాళ్లెప్పుడూ గొప్పవాళ్లే. వాళ్ళ భర్తలకి ఏమన్నా అయితే, వాళ్ళు సూర్యోదయం కాకుండా చేసి, లోకాలను అతలాకుతలం చేయగలరు. త్రిమూర్తులను పసిపాపలుగా మార్చగలరు. మరీ సూపర్ ప్రతివ్రతలున్నారండోయ్! కుష్టువ్యాధిగ్రస్థుడైన భర్తను, గంపలో తలమీద మోసుకుంటూ, ఉంపుడుగత్తె దగ్గరకు మోసుకుపోతుంది ఒక మేడం గారు. ఇలాంటి వాళ్లను చూస్తేనే ఫెమినిస్టులకు ఒళ్ళు మండేది! మండదూ మరి?
అయినా, భార్యలు భర్తలను డామినేట్ చేస్తూ౦టే, నా మటుకు నాకు ముచ్చటగా ఉంటుందండి. మరి నీ సంగతేమిటి? అంటున్నారా? నేను చెప్పింది వేరే వాళ్ల గురించి! నా సంగతి మీకెందుకు? చెప్పాల్సిందే నంటారా? సరే. మా ఆవిడ మంచిదండోయ్! నన్నేమి అనదు!
వెనకటికి, భార్యకు వీరవిధేయుడైన ఒక రాజు గారుండేవారట. భార్యంటే కించిత్ భయం కూడాను! ఆయన రాజ్యంలో అందరూ ‘డిటో’లేనట. ‘యథారాజా తథా ప్రజా!’ అసలు భార్యావిధేయుడు గాని ‘రియల్ హీరో’ ఎవరయినా ఉన్నారా? ఉంటారా? అని సదరు రాజుగారికి డౌటనుమానం ఎలిపొచ్చింది! ఒక పెద్ద సభ పెట్టాడు. ప్రజలంతా భార్యలతో వచ్చేశారు! “మీలో భార్యావిధేయులు కాని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి” అని ప్రకటన! ఎవ్వరూ ఎత్తలేదు. సభలో భయంకర నిశ్శబ్దం! కాసేపటి తర్వాత ఒకాయన చెయ్యెత్తాడు! అంతే! జయజయధ్వానాలు! పదిమంది అతన్ని భుజాల మీద మోసుకొని తెచ్చి వేదిక మీద దింపారు.
రాజుగారు అడిగారా వీరుడిని - “భర్తావతంసా! మీ విజయరహస్యంబును విన కుతూహలముగా నున్నది” అని. “విజయ రహస్యమా! గదేందిర భై?” అన్నాడు అతను. ఏమిటో చెప్పాక “ఏమో నాకేం తెలుసు? చెయ్యత్తమని మా యావిడ మోచేత్తో పొడిచింది. ఎత్తానంతే!” అన్నాడు.
నాకు తెలియక అడుగుతాను గానీ, నీ ఆలనాపాలనా చూస్తూ, కావలసినవి వండి పెడుతూ, చొక్కా గుండీ ఊడిపోతే చొక్కా మీదే దాన్ని సూదీ దారంతో కుట్టి, నీకు దగ్గరగా వచ్చి, దారాన్ని మునిపంటితో కొరికే నీ భార్య, నిన్ను డామినేట్ చేస్తే తప్పేంటి కామ్రేడ్! అసలు ‘భర్త’ అంటే ఎవరు? భార్య ఆధిక్యతను భరించేవాడు! భార్య చెప్పినట్లు విని బాగుపడనివారు లేరు, లేరు, ఈ జగాన లేరు! మా ద్రోణాచలం - కర్నూలు ప్యాసింజర్‌లో ఒక గుడ్డివాడు ఇలా పాడుతూ వచ్చేవాడు. “హాలయాన వెలసిన హా దేవుని రీతి, హిల్లాలే హీ జగతికి జీవన జ్యోతి!” ఈ పాట రాసిన వీటూరి, పాడిన ఘంటసాల వారలు అతని పాట వింటే జుట్టు పీక్కునేవారు. నేనసలే స్త్రీజన పక్షపాతిని! వాళ్లు మొగుళ్లను డామినేట్ చేస్తారు గాని, భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయే శోభన్ బాబు, జగపతిబాబు గార్ల ఫాన్లండీ వాళ్ళు! అదన్నమాట!
No comments:
Post a Comment