Wednesday, March 26, 2025

'తిరువణ్ణామలై, షోలింగర్ యాత్ర' - లింక్

తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర దర్శనం, రమణాశ్రమ సందర్శనం, గిరిప్రదక్షిణం తదితర వివరాలతో పాటు, షోలింగర్‍లో కొండపై వెలిసిన నృసింహ స్వామి ఆలయ దర్శనం  
పూర్తి కథనం సంచికలో చదవవచ్చు.

 

https://sanchika.com/thiruvannamalai-sholinger-yaatra-pds/

 

 

Thursday, March 20, 2025

మైట్యూబ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నాకెందుకో, యూట్యూబ్‌కు మైట్యూబ్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మిత్రమా! ఎందుకంటే ఎవరయినా సరే, ఒక ఛానెల్ పెట్టి, తమకు తెలిసింది. తెలియనిదీ చెప్పి, ఊదరకొట్టేయొచ్చు. నాకు కొంతమంది, “మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయొచ్చు కదా!” అని ఒక అయాచిత, ఉచిత సలహా పారేస్తుంటారు. ఉచితాలు మంచివి కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టే హితవు చెప్పినా వాళ్లు వినరే! ఖర్చు లేని పని గదా! అప్పుడు, ఎవరో పంపిన ఒక జోక్ నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు, “పెద్దయ్యాక, నీవేమవుతావురా?” అని అడిగితే, “ఇంజనీరు అవుతా, లేదా డాక్టర్‌ను అవుతా, లేదా కలెక్టర్‌ను అవుతా” అని చెప్పేవాడట. తీరా పెద్దయ్యక “వెల్‍కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్ ‘ఊకదంపుడు!’ లైక్! కామెంట్! అండ్ సబ్‌స్క్రైబ్!” అంటూ తయారయ్యాడట!
ఈమధ్య సొంతంగా యాట్యూబ్ ఛానెల్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. పవన్ అన్న చెప్పినట్లు, ‘ట్రెండ్ సృష్టించడమే గాని, ఫాలో అవను’ అన్నది ఈ సోకాల్డ్ యూట్యూబర్లకు వర్తించదు. ‘బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్!’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది లెండి. అంటే ఎవడి తప్పెట (డబ్బా!) వాడు మోగించుకోవడం. మైట్యూబర్లు, సారీ. యూట్యూబర్లు చెప్పేదానికి, చూపేదానికి ఫలానా ప్రమాణం అంటూ ఏవీ ఉండనవసరం లేదు సోదరా! మనకు వచ్చింది, నచ్చింది, చెప్పేయవచ్చు.
యూట్యూబర్‍లలో చాలామంది వాడే ఊతపదం ‘ఐతే’. ప్రతి వాక్యంలో కనీసం నాలుగైదు ఐతేలు ఉంటేగాని వారికి నోరు పెగలదు మరి. మా ఉద్యోగ పెన్షనర్ల ఛానెల్స్ బోలెడు. ‘ఐ.ఆర్, డి.ఎ.లపై సంచలన ప్రకటన! ఉద్యోగ పెన్షనర్లు సంబురాలు!’ అని పైన ఉంటుంది. ఓపన్ చేస్తే, దాన్ని ప్రకటించింది. యూనియన్ వాళ్లు! విసుగొచ్చి మావాళ్లు అవి చూడడం మానేశారంటే నమ్మండి!
‘పద్యవీణ’ అని చానెల్ పెడతాడొక శాల్తీ. ఆయనకు పద్యం రాగయుక్తంగా చదవడం రాదు. వివరణ ఎంత ఘోరంగా ఉంటుందంటే, “ఆకాశవాణి! అల్లాటప్పా కేంద్రం! వార్తలు చదువుతున్నది వెంగళప్ప!” లెవెల్లో సాగుతుంది. ఇంకో ఆయన తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రముఖ నటులు ఉన్న సన్నివేశాన్ని చూపుతూ, సౌండ్ మ్యూట్ చేసి, ఈయన ఆ పద్యాలను పాడుతుంటాడు. ఎంత స్ట్రాటజీయో చూడండి! యన్టీఆర్‌ను, యస్వీఆర్‌ను చూడ్డం ఎవరికైనా ఇష్టమే కదా! కాని అక్కడ పాడుతున్నది ఘంటసాలవారు కాదు, మైట్యూబర్!
ఇంకొకాయన, మార్కర్ పెన్‌తో డిస్ ప్లే బోర్డు మీద రాస్తూ, కొట్టేస్తూ, తుడుపుతూ నానా పాట్లు పడుతుంటాడు వివరిస్తూ! పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్నమాట! దాంట్లో పవరూ ఉండదు, పాయింటూ ఉండదు! నీరస నిస్సార ప్రెజెంటేషన్ మాత్రం ఉంటుంది.



ఇంతకు ముందు టి.వి. ఛానళ్లలో డిబేట్లలో పాల్గొనే సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొందరు, ‘మైట్యూబర్స్’ అవతారమెత్తారు. ఏదో ఒక పార్టీకి విధేయులే. కాని చాకచక్యంగా దానికి ‘నిస్పక్షపాత పూత’ పూస్తారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ సి.ఎం.కు ఇంకా ప్రజాదరణ వెల్లువెత్తుతోందని వాదిస్తారు. ఈ పొలిటికల్ లాయల్టీస్ మనలాంటి అజ్ఞానులను తికమకపెడతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్న సూత్రం వీరికి కరెక్ట్‌గా సరిపోతుంది. కాని వారి ‘భావం’ మనకు ‘భవతి’ ఐతే మటుకు చిక్కే.
ఇక పండగలు, ప్రాశస్త్యాలు, ఆధ్యాత్మిక విషయాలయితే ఇక చెప్పనక్కర లేదు. మైట్యూబయ్యలు, మైట్యూబమ్మలు విజృంభించి చెప్పేస్తుంటారు, అందరికీ తెలిసినవే అయినా, వాళ్లే కనిపెట్టినట్లు! ఎవరయినా లబ్ధప్రతిష్ఠుల వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా నెగెటివ్‌గా బయటకు వచ్చిందనుకోండి! ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక!’ ఐనా, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, తీర్మానించేస్తుంటారు! ఎవరిది కరెక్టో తెలియక ‘వ్యూయర్స్’కు మకతిక!
ఇక వంటలు చేసి చూపించే వాళ్లయితే “హాలో ఫ్రెండ్స్!” అంటూ మొదలుపెట్ట “నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి” అని స్వకల్యాణం, విశ్వకల్యాణం గురించి చెప్పి, ఒంగోలు గంగాళం ఉప్మా, కర్నాటక కారాబాత్, పప్పు, చారు కూడా చాలా వివరంగా చేసి చూపిస్తారు. ఈ మధ్య కొందరు బొగ్గుల కుంపటి, మట్టి పాత్రలు, మూకుడులు, పైగా వాటికి విభూతి రేఖలు, కుంకుమ పెట్టి, సదాచార సంపన్న వంటలు చేస్తారు. కొందరు పొలాల్లో మూడు రాళ్లు పెట్టి, కర్రలు మండించి వంట చేస్తారు. అవన్నీ చూడడానికి బాగుంటాయి, చేసేవారికి నాలుగు రాళ్లు (అదేనండి బాబు, డబ్బులు) వస్తాయి గాని, అలా వంటలు చేసే కాలం ఎప్పుడో పోయింది.
అలాగని అందరూ అలాంటివారని కాదు నా ఉద్దేశం. చక్కని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి చూపించే యూట్యాబర్లు కూడా ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వారు చక్కగా ప్రకాశింప చేస్తారు. వ్యూయర్‌షిప్ కోసం వారు చేయరు. అలాంటి వాళ్లను మైట్యూబర్స్ అనలేం. ‘వుయ్‌ట్యూబర్లు’ అంటే బాగుంటుంది. మైట్యూబర్లలో లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారండోయ్! డబ్బుదేముందండీ మాస్టారు! కుక్కను కొడితే రాలుతుంది! అలాగని కొట్టి చూసేరు! ఇంకేం? మీరూ ఒక ‘మైట్యూబ్’ పెట్టి చెలరేగిపోండి! అదన్నమాట!



ఉషా వారపత్రికలో నా కథ ఏకాంతం

ది 18 మార్చ్ 2025 నాడు వెలువడిన ఉషా వారపత్రికలో, సరస కథల పోటీలో ఎంపికైన నా కథ, 'ఏకాంతం' ప్రచురితమైంది.
ఈ క్రింది ఇమేజ్‍లపై నొక్కి కథను చదవండి.

 


 


 Click on the image to view in bigger size

 

 



నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో

 డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో చదవండి.
~
నిజమే! భగవంతునికి భక్తుడవడం సరేగాని మిత్రుడవడం, అంత ప్రేమను పొందడం కుచేలుని ప్రత్యేకత.
ఆయనను దేవునిగా కాకుండా, ఇష్టసఖునిగా, చనువుగా చూడడం సుదామునికే చెల్లింది. అందుకే మనం సినిమాలలో చూసినట్లుగా, కుచేలుడు భక్తిపారవశ్యంతో, చేతులు మోడ్చి, వంగిపోయి, వంకరలు తిరుగుతూ, కళ్ల నీళ్లతో ప్రవర్తించలేదు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-19/

 

 



పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 26వ భాగం లింక్

దేవా! తత్త్వజ్ఞులు వేదాంతులు అపరోక్షానుభవమున జీవ దేవ తారతమ్యంబు తొలగి, చిదానంద రూపుడైన నిన్ను తెలియుదురు.
కం.:
కన మంత్రజ్ఞులు సాంఖ్యము
ఘనయోగము విడిచి, యాత్మ కాయములను, నీ
వను లక్ష్యంబున నిలుపుచు
పూనిక నిను చేరుచుంద్రు, భుజగశయానా!

~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-26/

 



శ్రీదేవీ వైభవం పుస్తకావిష్కరణ సభ - నివేదిక లింక్

తేదీ 12 మార్చ్ 2025 న, కరీంనగర్ వాగీశ్వరీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో, బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు రచించిన పద్యకావ్యం, ‘శ్రీదేవీవైభవం’ ఆవిష్కరణ సభ భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేను ప్రధాన వక్తగా ప్రసంగించాను.
నివేదికని సంచికలో చదవవచ్చు. 

 

https://sanchika.com/sridevivaibhavam-padyakaavyam-aavishkarana-sabha-nivedika/

 

Friday, March 14, 2025

నినాదమే ఒక విధానం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నినాదాలు కూడ భాషలో, సాహిత్యంలో ఒక భాగమే అంటాను నేను. మీరేమంటారు? ఒక నినాదం, ఒక విధానానికి ‘షార్ట్ ఫాం’ అంటే మీరు ఒప్పుకుంటారా? నినాదం అంటే.. “ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క విశేష ఉద్దేశం”. సాహిత్యపరంగా చూస్తే, ఆ ఉద్దేశానికి, అది పరిచయ వ్యాఖ్య లేదా సంక్షిప్త రూపం.
మన భారతదేశ జాతీయ నినాదంతో మొదలుపెడదాం. ‘సత్యమేవ జయతే’! ‘ఏవ’ అంటే సంస్కృతంలో ‘కేవలం’, ‘అది మాత్రమే’ అని అర్థం. ‘సత్యం మాత్రమే జయిస్తుంది’. ఎంత గొప్ప నినాదం! నిజానికి దీన్ని ముండకోపనిషత్ లోని ఒక మంత్రం నుంచి తీసుకున్నారు. భారత జాతీయ నినాదంగా 1950 జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఆమోదించారు. జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ కింద ఇది ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఒక సూక్తి ఉంటుంది. ‘నస్‌రుమ్ మినల్లాహి వఫతహ్ ఉన్ ఖరీబ్’ - అంటే సత్యం యొక్క జయం (అల్లాహ్ జయం) అతి దగ్గరలో ఉంటుందని. చెక్ రిపబ్లిక్ దేశం నినాదం ‘ప్రావ్ దావిటేజీ’ (సత్యం మాత్రమే ఉంటుంది).
దురదృష్టం ఏమిటంటే రానురాను సోషియల్ మీడియా పుణ్యమా అని, సత్యం కనుమరుగైపోయి ‘గాసిప్’గా మారింది. జి.ఆర్. మహర్షి ‘పురాగానం’ అన్న ఒక గొప్ప కథను వ్రాశారు. “కోతి నుండి మనిషి పుట్టాడంటారు. నిజమేనా?” అని ఒక పిల్లకోతి, కోతి బాబాగారిని అడిగితే, (కోతుల్లో కూడా బాబాలుంటారండోయ్!) ఆయన చిద్విలాసంగా నవ్వి “ఎవరి జ్ఞానం కొద్దీ వారు రాసుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ మనం నమ్మాల్సిన పనిలేదు” అంటారు. ఈ చురక ఇప్పటి ట్రెండ్‌కు సరిగ్గా సరిపోతుంది!
కొన్ని నినాదాలు ఎంత శక్తివంతమైనవంటే, ప్రభుత్వాలను (పార్టీలను) అధికారంలోకి తెచ్చేస్తాయి. ఉదాహరణకు ‘గరీబీ హటావో’ తీసుకుందాం. దీనిని ఇందిరాగాంధీ గారు 1971లో తన ఎన్నికల ప్రచారంలో పేల్చారు. అది 5వ పంచవర్ష ప్రణాళికలో ఒక భాగం. ప్రతిపక్షాలు దాన్ని ‘గరీబోం కో హటావో’ అని ఎగతాళి చేసేవారనుకోండి, అది వేరే విషయం. 2004 ఎన్నికల్లో, పాలక బి.జె.పి, ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) అని ఒక మార్కెటింగ్ నినాదాన్ని వదిలింది. అయినా, వాజపేయి ప్రభుత్వం ఓడిపోయింది! అంటే అంత వెలిగిపోలేదన్నమాట! ఎన్.టి.ఆర్. గారి ‘ఆత్మగౌరవ’ నినాదం బ్రహ్మాండంగా పనిచేసి, టి.డి.పి.ని అధికారం లోకి తెచ్చింది 1983లో! ‘తెలంగాణ వచ్చుడో, చచ్చుడో!’ అన్న టి.ఆర్.ఎస్ నినాదం, మాండలీక పరిమళాలను వెదజల్లటంతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏ విజయమూ శాశ్వతం కాదు సార్! నచ్చకపోతే ఎవరినైనా ప్రజలు మార్చేస్తారు మరి. దటీజ్ ది పవర్ ఆఫ్ పీపుల్! ది డెమోక్రసీ! మళ్లీ పవరిచ్చినా, సీట్లు తగ్గించి, హెచ్చరిస్తారు ఓటర్లు! అందరినీ వింటారు, చెయ్యల్సింది చేస్తారు.


స్వాతంత్య్ర సమరంలో ‘నినాదాలు’ తమ సత్తా చూపాయి! ఆయుధం చేయలేని పనిని నిదానాలు చేయగలవని నిరూపించాయి! నినాదాన్ని సృష్టించడం ఒక అద్భుత సృజనాత్మక ప్రక్రియ. నినాదాలు కూడా సాహిత్యంలో భాగమే! 1942లో ‘క్విట్ ఇండియా’ నినాదం అలాంటిదే! మొదట ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారట. రాజగోపాలాచారి గారు ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అయితే బాగుంటుందన్నారట. ఈ రెండూ గాంధీజీకి అంతగా నచ్చలేదట. చివరికి ‘క్విట్ ఇండియా’ నచ్చి దాన్ని ఆయన ఖరారు చేశారట. దాన్ని సూచించిన వారు యూసుఫ్ మొహర్ అలీ. ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించినవారు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అబిద్ హసన్ సఫ్రానీ గారు. నేతాజీకి ఆ నినాదమంటే చాలా ఇష్టం. ప్రతి సభలో, సమావేశంలో అది భరతవాక్యంగా ఇప్పటికీ నిలిచిపోయింది. ‘కాకా బాప్టిస్టా’ అనే ఆయన మేధోపుత్రిక (అదేనండీ బ్రెయిన్ చైల్డ్!) యొక్క ఒక పదబంధాన్ని, లోకమాన్య తిలక్, ‘స్వరాజ్యం నా జన్మహక్కు’గా అనుసృజన చేశారు.
‘రణన్నినాదం’ అని కొందరు వాడుతుంటారు. నాకెందుకో అది తప్పేమో అనిపిస్తుంది. రణత్+నినాదం. యుద్ధ స్ఫూర్తిని కలిగించే నినాదమనా? కావచ్చు కాని ‘ని’ కి వత్తు ఎందుకో? రణనినాదం అంటే సరిపోదూ? దానిలో నాకు తెలియని వ్యాకరణ రహస్యం ఉందేమో? మీకు తెలిస్తే చెప్పరూ ప్లీజ్? దీన్ని చూస్తే ‘సత్యనారాయణ’ను కొందరు ‘సత్యన్నారాయణ’ అనడం గుర్తొస్తుంది నాకు. ఒత్తు పెడితే ‘ఎఫెక్టివ్’గా ఉంటుందనో ఏమో? అన్నీ ‘ఏమోలే’!
కొన్ని నినాదాలు వ్యక్తిగత అహంకారాన్ని సూచిస్తాయి. పధ్నాలుగవ లూయీ చక్రవర్తి ‘నేనే రాజ్యాన్ని!’ అని నినదించాడు. ఆయన పిచ్చిగాని, ఆయనే రాజ్యం ఎలా అవుతాడు? రాజ్యం శాశ్వతం. రాజు నాలుగు నాళ్లుండి పోతాడు.
నినాదం వల్ల ఒక విధానం ఆవిష్కరించబడాలి. అది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. అప్పుడే అది సార్థకం అవుతుంది. కొన్ని అంత పాపులర్ కాకపోయినా, బాగుంటాయి. ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అన్నారు గాంధీ. ‘ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు’ అన్నారు నెహ్రూ. ‘చిన్న లక్ష్యం ఒక నేరం’ అన్నారు అబ్దుల్ కలాం. లాల్ బహదూర్ శాస్త్రిగారి ‘జై జవాన్, జై కిసాన్’ గొప్ప నినాదం. సైనికులను, రైతులను అది గ్లోరిఫై చేసింది! ‘కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అన్నారు బళ్లారి రాఘవ! ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న భగత్‌సింగ్ నినాదం పోరాట పటిమకు స్ఫూర్తినిచ్చింది. ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ అన్నారు పి.వి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు దాశరథి. కవిత్వం పరిమళించే నినాదం!
‘అమర్ హై’కు, ‘జిందాబాద్’కు తేడా తెలియకుండా డబ్బు తీసుకునో, బిర్యానీ పాకెట్ కోసమో నినాదాలు చేసే వారిని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తుంది. అవి చేయించే వారంటేనే నాకు ఒళ్ళు మంట! ఒక వ్యక్తి అమరుడు కావాలంటే మాటలా? ‘జిందాబాద్’ పర్షియన్ మూలాలు కల మాట. ‘లాంగ్ లివ్’ అన్న మాట. ఎవరంటే వారి కోసం నినాదాలు ఇవ్వకూడదు. అదన్నమాట!