Wednesday, March 26, 2025

అతి గోప్యం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

ఆ మధ్య మా దగ్గర బంధువు ఒకాయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి, రెండు స్టెంట్స్ వేయించుకున్నాడట. కానీ ఆ విషయం బంధువులెవ్వరికీ తెలియకుండా వాళ్ళు జాగ్రత్తపడ్డారు. ఎందుకో మరి? ‘సంసారం గుట్టు, వ్యాధి రట్టు’ అని కదండీ మన పెద్దలు చెప్పింది? ఈమధ్య మానవ సంబంధాలు తూతూ మంత్రంగా తయారైనాయి. దీనికి తోడు అతి గోప్యాలు! మా పరిచయస్థులొకరు మా యింటికి వచ్చారొక రోజు. ఆయనకు కాఫీ ఇవ్వాలి కదా! మా శ్రీమతి, “సార్, మీకు చక్కెర వేయచ్చునా.. లేక..” అన్నది. భారత్ మధుమేహ రాజధాని గదా! అందుకాయన. “అబ్బే! నాకు షుగర్ అస్సలు లేదమ్మా! కాని పంచదార వేయకండి” అన్నాడు. ‘ఇదేదో విరోధాభాసాలంకారంలా ఉందే?’ అని అనుకున్నాను. లేక ముందుజాగ్రత్తేమో! తర్వాత ఎవరో చెప్పారు, ఆయన ‘వెరీ వెరీ స్వీట్ బోయ్’ అని, ఇన్సులిన్ కూడా తీసుకుంటాడని! ఎందుకీ గోప్యాలు!
ప్రఖ్యాత వ్యాసరచయిత ఫ్రాన్సిస్ బేకన్, ‘ఆఫ్ సిమ్యులేషన్ అండ్ డిస్‌సిమ్యులేషన్’ అనీ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ‘దాపరికం, బహిర్గతం’ అన్న మాట! కాని లోతుగా వెళితే, డిస్సిమ్యులేషన్ అంటే మన ఆలోచనలను, విషయాలను దాచి ఉంచడం. సిమ్యులేషన్ అంటే ఇతరులను మోసగించడం కోసం, ఒక కపటచిత్రాన్ని ఆవిష్కరించడం.
తెనాలి రామకృష్ణుడు మహాకవి. కాని ఆయనను ‘వికటకవి’గా ముద్ర వేశారు. ఆయన హస్యచతురతను రకరకాల కథలుగా సృష్టించారు. కల్పితాలయినా అవి బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్! ఆయన పాండిత్యం కంటే ఇవే చాలామందికి తెలుసు, మధ్యలో తెనాలాయన ఎందుకు? కొంపదీసి మీది తెనాలా? అనుకుంటున్నారా? కొంపతీయకున్నా, మాది తెనాలి కాదండోయ్! దాచమని అత్యంత గోప్యంగా చెప్పిన విషయాన్ని ఆయన సోషియల్ మీడియాలో ఎంత విస్తృతంగా ప్రచారం చేశాడో చూడండి! “అప్పుడు సోషియల్ మీడియా ఎక్కడుంది? పోదురూ! బడాయి!” అంటున్నారా! అది ఎప్పుడూ ఉంది: ఏమంటే రూపం వేరు!
తెనాలివారు ఒకసారి రాణీగారి మందిరానికి వెళ్లాడు. ఆయనకు రాజకుటుంబంతో క్లోజ్ రిలేషన్స్ ఉండేవి! నేరుగా లోపలికి వెళ్లగలిగే చనువు, చొరవ ఉన్నాయి. సరిగ్గా అప్పుడు, రాణీగారు మోచేతుల మీద విపరీతంగా గోక్కుంటున్నారు. రాణీగారయితే గొప్పా ఏం? దురదలకు అవన్నీ తెలియవు. ఆమె తెనాలి వారితో “స్వామీ! ఈ దురదలతో చచ్చే చావయింది. దయచేసి ఈ విషయం ఎక్కడా అనకండి!” అన్నది. “మహారాణి!
మీరంతగా చెప్పాలా?” అన్నాడు. తర్వాత ఆమె దేవాలయానికి బయలుదేరుతూ, ఈయననూ రమ్మంది. సింగిల్ గుర్రం పూన్చిన చిన్నవాహనంలో ఆమె వస్తుండగా, పరిజనులు, సైనికులు, ముందూ వెనుకా! ఇంతలో వికటకవిగారు గుర్రం మూతికి తన అంగోస్త్రం కట్టారు. బండికి పరదాలు! ఒక రాజ సేవకుడు అడిగాడు, “స్వామీ! ఎందుకలా కట్టారు?” అని. వికటకవి అతని చెవిలో రహస్యంగా చెప్పాడు “రాణిగారికి దురదలు! ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. గుర్రం ఏమయినా పొరపాటున ఎవరికైనా చెబుతుందేమో అని ఈ జాగ్రత్త! నీవు కూడా ఎవ్వరితో అనకు” అన్నాడు. ఆయన ఇదే మాట ఇంకొకాయనతో అన్నాడు. ఇలా మొత్తం అందరికీ తెలిసిపోయింది. సోషియల్  మీడియా చాలా పవర్‌ఫుల్.
ప్రాన్సిస్ బేకన్ గారు దాపరికాన్ని రకరకాలుగా పేర్కొన్నారు. మొదటిది ‘సీక్రెసీ’. తన భావాలు ఎవరికీ చెప్పడు. ఇది అంత హానికరం కాదట. ఇది కొన్నిసార్లు అవసరం కూడానట. రెండవది ‘హిపోక్రసి’. అంటే తనను ఇంకో రకంగా (మోసపూరితంగా) చూపించుకోవడం. మరీ ఎక్కువ దాపరికం మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుందట.


‘ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు’ అని నానుడి. పాపం ప్రతీదానికి వాళ్లనెందుకండీ ఆడిపోసుకుంటారు? ఎందుకు నానదంటే నానే లోపు దాన్ని ఇతరులకు చేరవేస్తారనేమో! అది వారి బోళాతనాన్ని, దాపరికం లేని గుణాన్ని చూపిస్తుందంటా నేను! నేనసలే స్త్రీ జన పక్షపాతినని మీకు ఇదివరకే మనవి చేసి ఉన్నా! సెల్‌ఫోన్లు వచ్చింతర్వాత, ఆడవారి ‘విషయ బహిర్గత ప్రావీణ్యం’ నాలుగు రెట్లు పెరిగింది. అయినా వారికీ కాలక్షేపం కావాలి కదా! తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ‘షేర్’ (సోషయల్ మీడియా భాషండోయ్!) చేస్తే తప్పులేదు. కాని, ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్నట్లుగా తమ సృజనాత్మకతను జోడించి, విషయానికి మసాలా దట్టించి వదలకూడదు. ఒకావిడ ఒక బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది. అమ్మాయి పేరును బట్టి అది కులాంతర వివాహం అని అర్థమైంది. ఇక ఈవిడ తన ‘కిత్ అండ్ కిన్’ అందరికే ఒకటే కాల్సు! దాన్ని మతాంతర వివాహంగా మార్చింది. దానికి ముందు ఉభయ కుటుంబాల్లో ఎన్ని గొడవలైనాయో (ఏ గొడవలూ అవలేదు, శుభ్రంగా ప్రేమించుకున్నారు, ఉభయులూ అంగీకరించారు) వివరించింది. నువ్వుగింజ నానకపోగా, బాగా ఉబ్బిందన్నమాట!
ఒక్కటి మాత్రం నిజం మాస్టారు. సత్యం ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లాంటిది. దాన్ని ఎంత దాచాలనుకున్నా దాని సువాసన దాన్ని పట్టిస్తుంది. అబద్ధం అతి త్వరగా వ్యాపిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో హిపోక్రసీ లేకుండా జీవించడం కష్టం. ఒక సూపర్ హిట్ సినిమాను, అది ఎంత చెత్తగా ఉన్నా, బాగులేదని చెప్పలేం. అలా ఉంది పరిస్థితి. సాధ్యమైనంత వరకు ఓపెన్ మైండ్‌తో ఉందాం! పదిమందికి తెలిస్తే మనకు మంచి జరుగుతుందంటే చెబుదాం! అతి గోప్యం హానికరం! అదన్నమాట!



నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 20వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 20వ భాగం సంచికలో చదవండి.
~
"అసూయాపరుడి మానసిక స్థితిని దుర్యోధన సార్వభౌముడిలా చెప్పాడు -
‘కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్’  
ఈ పద్యం శ్రీనాథునిది. ‘కాశీఖండం’ అనే కావ్యంలో వింధ్యపర్వతంతో చెప్పించాడు మహాకవి. దానిని యన్.టి.ఆర్ గారు తమ ‘దానవీర కరకర్ణ’లో వాడుకున్నారు, సందర్భోచితంగా!”
సభికులు అతన్ని అభినందించారు. ఒథెల్లోను తీసుకొచ్చి శ్రీనాథునితో, NTR తో ముడిపెట్టినందుకు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-20/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 27వ భాగం లింక్

అనుకంపాపూరితుడైన అబ్జనాభుండు సురలతో నిట్లు పలికెను.
ఉ.:
వింటిని దైత్యు దుర్మదపు వికృత చేష్టలు, దుష్టకృత్యముల్
మింటను భాస్కరోదయము మించిన చీకటి బాపునట్లు, నా
కంటకు పాపముల్ పగిలి కర్మఫలంబది పండువేళ, మీ
కంటిన వాని పీడ తొలగన్ వధియించెద, నోర్పు పట్టుడీ!
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-27/

 

 

'తిరువణ్ణామలై, షోలింగర్ యాత్ర' - లింక్

తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర దర్శనం, రమణాశ్రమ సందర్శనం, గిరిప్రదక్షిణం తదితర వివరాలతో పాటు, షోలింగర్‍లో కొండపై వెలిసిన నృసింహ స్వామి ఆలయ దర్శనం  
పూర్తి కథనం సంచికలో చదవవచ్చు.

 

https://sanchika.com/thiruvannamalai-sholinger-yaatra-pds/

 

 

Thursday, March 20, 2025

మైట్యూబ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నాకెందుకో, యూట్యూబ్‌కు మైట్యూబ్ అని పేరు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మిత్రమా! ఎందుకంటే ఎవరయినా సరే, ఒక ఛానెల్ పెట్టి, తమకు తెలిసింది. తెలియనిదీ చెప్పి, ఊదరకొట్టేయొచ్చు. నాకు కొంతమంది, “మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేయొచ్చు కదా!” అని ఒక అయాచిత, ఉచిత సలహా పారేస్తుంటారు. ఉచితాలు మంచివి కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టే హితవు చెప్పినా వాళ్లు వినరే! ఖర్చు లేని పని గదా! అప్పుడు, ఎవరో పంపిన ఒక జోక్ నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు, “పెద్దయ్యాక, నీవేమవుతావురా?” అని అడిగితే, “ఇంజనీరు అవుతా, లేదా డాక్టర్‌ను అవుతా, లేదా కలెక్టర్‌ను అవుతా” అని చెప్పేవాడట. తీరా పెద్దయ్యక “వెల్‍కమ్ టు మై యూట్యూబ్ ఛానెల్ ‘ఊకదంపుడు!’ లైక్! కామెంట్! అండ్ సబ్‌స్క్రైబ్!” అంటూ తయారయ్యాడట!
ఈమధ్య సొంతంగా యాట్యూబ్ ఛానెల్ పెట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. పవన్ అన్న చెప్పినట్లు, ‘ట్రెండ్ సృష్టించడమే గాని, ఫాలో అవను’ అన్నది ఈ సోకాల్డ్ యూట్యూబర్లకు వర్తించదు. ‘బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్!’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది లెండి. అంటే ఎవడి తప్పెట (డబ్బా!) వాడు మోగించుకోవడం. మైట్యూబర్లు, సారీ. యూట్యూబర్లు చెప్పేదానికి, చూపేదానికి ఫలానా ప్రమాణం అంటూ ఏవీ ఉండనవసరం లేదు సోదరా! మనకు వచ్చింది, నచ్చింది, చెప్పేయవచ్చు.
యూట్యూబర్‍లలో చాలామంది వాడే ఊతపదం ‘ఐతే’. ప్రతి వాక్యంలో కనీసం నాలుగైదు ఐతేలు ఉంటేగాని వారికి నోరు పెగలదు మరి. మా ఉద్యోగ పెన్షనర్ల ఛానెల్స్ బోలెడు. ‘ఐ.ఆర్, డి.ఎ.లపై సంచలన ప్రకటన! ఉద్యోగ పెన్షనర్లు సంబురాలు!’ అని పైన ఉంటుంది. ఓపన్ చేస్తే, దాన్ని ప్రకటించింది. యూనియన్ వాళ్లు! విసుగొచ్చి మావాళ్లు అవి చూడడం మానేశారంటే నమ్మండి!
‘పద్యవీణ’ అని చానెల్ పెడతాడొక శాల్తీ. ఆయనకు పద్యం రాగయుక్తంగా చదవడం రాదు. వివరణ ఎంత ఘోరంగా ఉంటుందంటే, “ఆకాశవాణి! అల్లాటప్పా కేంద్రం! వార్తలు చదువుతున్నది వెంగళప్ప!” లెవెల్లో సాగుతుంది. ఇంకో ఆయన తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రముఖ నటులు ఉన్న సన్నివేశాన్ని చూపుతూ, సౌండ్ మ్యూట్ చేసి, ఈయన ఆ పద్యాలను పాడుతుంటాడు. ఎంత స్ట్రాటజీయో చూడండి! యన్టీఆర్‌ను, యస్వీఆర్‌ను చూడ్డం ఎవరికైనా ఇష్టమే కదా! కాని అక్కడ పాడుతున్నది ఘంటసాలవారు కాదు, మైట్యూబర్!
ఇంకొకాయన, మార్కర్ పెన్‌తో డిస్ ప్లే బోర్డు మీద రాస్తూ, కొట్టేస్తూ, తుడుపుతూ నానా పాట్లు పడుతుంటాడు వివరిస్తూ! పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్నమాట! దాంట్లో పవరూ ఉండదు, పాయింటూ ఉండదు! నీరస నిస్సార ప్రెజెంటేషన్ మాత్రం ఉంటుంది.



ఇంతకు ముందు టి.వి. ఛానళ్లలో డిబేట్లలో పాల్గొనే సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొందరు, ‘మైట్యూబర్స్’ అవతారమెత్తారు. ఏదో ఒక పార్టీకి విధేయులే. కాని చాకచక్యంగా దానికి ‘నిస్పక్షపాత పూత’ పూస్తారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ సి.ఎం.కు ఇంకా ప్రజాదరణ వెల్లువెత్తుతోందని వాదిస్తారు. ఈ పొలిటికల్ లాయల్టీస్ మనలాంటి అజ్ఞానులను తికమకపెడతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్న సూత్రం వీరికి కరెక్ట్‌గా సరిపోతుంది. కాని వారి ‘భావం’ మనకు ‘భవతి’ ఐతే మటుకు చిక్కే.
ఇక పండగలు, ప్రాశస్త్యాలు, ఆధ్యాత్మిక విషయాలయితే ఇక చెప్పనక్కర లేదు. మైట్యూబయ్యలు, మైట్యూబమ్మలు విజృంభించి చెప్పేస్తుంటారు, అందరికీ తెలిసినవే అయినా, వాళ్లే కనిపెట్టినట్లు! ఎవరయినా లబ్ధప్రతిష్ఠుల వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా నెగెటివ్‌గా బయటకు వచ్చిందనుకోండి! ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక!’ ఐనా, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో, తీర్మానించేస్తుంటారు! ఎవరిది కరెక్టో తెలియక ‘వ్యూయర్స్’కు మకతిక!
ఇక వంటలు చేసి చూపించే వాళ్లయితే “హాలో ఫ్రెండ్స్!” అంటూ మొదలుపెట్ట “నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి” అని స్వకల్యాణం, విశ్వకల్యాణం గురించి చెప్పి, ఒంగోలు గంగాళం ఉప్మా, కర్నాటక కారాబాత్, పప్పు, చారు కూడా చాలా వివరంగా చేసి చూపిస్తారు. ఈ మధ్య కొందరు బొగ్గుల కుంపటి, మట్టి పాత్రలు, మూకుడులు, పైగా వాటికి విభూతి రేఖలు, కుంకుమ పెట్టి, సదాచార సంపన్న వంటలు చేస్తారు. కొందరు పొలాల్లో మూడు రాళ్లు పెట్టి, కర్రలు మండించి వంట చేస్తారు. అవన్నీ చూడడానికి బాగుంటాయి, చేసేవారికి నాలుగు రాళ్లు (అదేనండి బాబు, డబ్బులు) వస్తాయి గాని, అలా వంటలు చేసే కాలం ఎప్పుడో పోయింది.
అలాగని అందరూ అలాంటివారని కాదు నా ఉద్దేశం. చక్కని నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి చూపించే యూట్యాబర్లు కూడా ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వారు చక్కగా ప్రకాశింప చేస్తారు. వ్యూయర్‌షిప్ కోసం వారు చేయరు. అలాంటి వాళ్లను మైట్యూబర్స్ అనలేం. ‘వుయ్‌ట్యూబర్లు’ అంటే బాగుంటుంది. మైట్యూబర్లలో లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారండోయ్! డబ్బుదేముందండీ మాస్టారు! కుక్కను కొడితే రాలుతుంది! అలాగని కొట్టి చూసేరు! ఇంకేం? మీరూ ఒక ‘మైట్యూబ్’ పెట్టి చెలరేగిపోండి! అదన్నమాట!



ఉషా వారపత్రికలో నా కథ ఏకాంతం

ది 18 మార్చ్ 2025 నాడు వెలువడిన ఉషా వారపత్రికలో, సరస కథల పోటీలో ఎంపికైన నా కథ, 'ఏకాంతం' ప్రచురితమైంది.
ఈ క్రింది ఇమేజ్‍లపై నొక్కి కథను చదవండి.

 


 


 Click on the image to view in bigger size

 

 



నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో

 డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 19వ భాగం సంచికలో చదవండి.
~
నిజమే! భగవంతునికి భక్తుడవడం సరేగాని మిత్రుడవడం, అంత ప్రేమను పొందడం కుచేలుని ప్రత్యేకత.
ఆయనను దేవునిగా కాకుండా, ఇష్టసఖునిగా, చనువుగా చూడడం సుదామునికే చెల్లింది. అందుకే మనం సినిమాలలో చూసినట్లుగా, కుచేలుడు భక్తిపారవశ్యంతో, చేతులు మోడ్చి, వంగిపోయి, వంకరలు తిరుగుతూ, కళ్ల నీళ్లతో ప్రవర్తించలేదు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-19/

 

 



పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 26వ భాగం లింక్

దేవా! తత్త్వజ్ఞులు వేదాంతులు అపరోక్షానుభవమున జీవ దేవ తారతమ్యంబు తొలగి, చిదానంద రూపుడైన నిన్ను తెలియుదురు.
కం.:
కన మంత్రజ్ఞులు సాంఖ్యము
ఘనయోగము విడిచి, యాత్మ కాయములను, నీ
వను లక్ష్యంబున నిలుపుచు
పూనిక నిను చేరుచుంద్రు, భుజగశయానా!

~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-26/

 



శ్రీదేవీ వైభవం పుస్తకావిష్కరణ సభ - నివేదిక లింక్

తేదీ 12 మార్చ్ 2025 న, కరీంనగర్ వాగీశ్వరీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో, బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారు రచించిన పద్యకావ్యం, ‘శ్రీదేవీవైభవం’ ఆవిష్కరణ సభ భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేను ప్రధాన వక్తగా ప్రసంగించాను.
నివేదికని సంచికలో చదవవచ్చు. 

 

https://sanchika.com/sridevivaibhavam-padyakaavyam-aavishkarana-sabha-nivedika/

 

Friday, March 14, 2025

నినాదమే ఒక విధానం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ దినపత్రిక

నినాదాలు కూడ భాషలో, సాహిత్యంలో ఒక భాగమే అంటాను నేను. మీరేమంటారు? ఒక నినాదం, ఒక విధానానికి ‘షార్ట్ ఫాం’ అంటే మీరు ఒప్పుకుంటారా? నినాదం అంటే.. “ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క విశేష ఉద్దేశం”. సాహిత్యపరంగా చూస్తే, ఆ ఉద్దేశానికి, అది పరిచయ వ్యాఖ్య లేదా సంక్షిప్త రూపం.
మన భారతదేశ జాతీయ నినాదంతో మొదలుపెడదాం. ‘సత్యమేవ జయతే’! ‘ఏవ’ అంటే సంస్కృతంలో ‘కేవలం’, ‘అది మాత్రమే’ అని అర్థం. ‘సత్యం మాత్రమే జయిస్తుంది’. ఎంత గొప్ప నినాదం! నిజానికి దీన్ని ముండకోపనిషత్ లోని ఒక మంత్రం నుంచి తీసుకున్నారు. భారత జాతీయ నినాదంగా 1950 జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం నాడు ఆమోదించారు. జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ కింద ఇది ఉంటుంది. ఖుర్‌ఆన్‌లో ఒక సూక్తి ఉంటుంది. ‘నస్‌రుమ్ మినల్లాహి వఫతహ్ ఉన్ ఖరీబ్’ - అంటే సత్యం యొక్క జయం (అల్లాహ్ జయం) అతి దగ్గరలో ఉంటుందని. చెక్ రిపబ్లిక్ దేశం నినాదం ‘ప్రావ్ దావిటేజీ’ (సత్యం మాత్రమే ఉంటుంది).
దురదృష్టం ఏమిటంటే రానురాను సోషియల్ మీడియా పుణ్యమా అని, సత్యం కనుమరుగైపోయి ‘గాసిప్’గా మారింది. జి.ఆర్. మహర్షి ‘పురాగానం’ అన్న ఒక గొప్ప కథను వ్రాశారు. “కోతి నుండి మనిషి పుట్టాడంటారు. నిజమేనా?” అని ఒక పిల్లకోతి, కోతి బాబాగారిని అడిగితే, (కోతుల్లో కూడా బాబాలుంటారండోయ్!) ఆయన చిద్విలాసంగా నవ్వి “ఎవరి జ్ఞానం కొద్దీ వారు రాసుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ మనం నమ్మాల్సిన పనిలేదు” అంటారు. ఈ చురక ఇప్పటి ట్రెండ్‌కు సరిగ్గా సరిపోతుంది!
కొన్ని నినాదాలు ఎంత శక్తివంతమైనవంటే, ప్రభుత్వాలను (పార్టీలను) అధికారంలోకి తెచ్చేస్తాయి. ఉదాహరణకు ‘గరీబీ హటావో’ తీసుకుందాం. దీనిని ఇందిరాగాంధీ గారు 1971లో తన ఎన్నికల ప్రచారంలో పేల్చారు. అది 5వ పంచవర్ష ప్రణాళికలో ఒక భాగం. ప్రతిపక్షాలు దాన్ని ‘గరీబోం కో హటావో’ అని ఎగతాళి చేసేవారనుకోండి, అది వేరే విషయం. 2004 ఎన్నికల్లో, పాలక బి.జె.పి, ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) అని ఒక మార్కెటింగ్ నినాదాన్ని వదిలింది. అయినా, వాజపేయి ప్రభుత్వం ఓడిపోయింది! అంటే అంత వెలిగిపోలేదన్నమాట! ఎన్.టి.ఆర్. గారి ‘ఆత్మగౌరవ’ నినాదం బ్రహ్మాండంగా పనిచేసి, టి.డి.పి.ని అధికారం లోకి తెచ్చింది 1983లో! ‘తెలంగాణ వచ్చుడో, చచ్చుడో!’ అన్న టి.ఆర్.ఎస్ నినాదం, మాండలీక పరిమళాలను వెదజల్లటంతో కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏ విజయమూ శాశ్వతం కాదు సార్! నచ్చకపోతే ఎవరినైనా ప్రజలు మార్చేస్తారు మరి. దటీజ్ ది పవర్ ఆఫ్ పీపుల్! ది డెమోక్రసీ! మళ్లీ పవరిచ్చినా, సీట్లు తగ్గించి, హెచ్చరిస్తారు ఓటర్లు! అందరినీ వింటారు, చెయ్యల్సింది చేస్తారు.


స్వాతంత్య్ర సమరంలో ‘నినాదాలు’ తమ సత్తా చూపాయి! ఆయుధం చేయలేని పనిని నిదానాలు చేయగలవని నిరూపించాయి! నినాదాన్ని సృష్టించడం ఒక అద్భుత సృజనాత్మక ప్రక్రియ. నినాదాలు కూడా సాహిత్యంలో భాగమే! 1942లో ‘క్విట్ ఇండియా’ నినాదం అలాంటిదే! మొదట ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారట. రాజగోపాలాచారి గారు ‘రిట్రీట్ ఆర్ విత్‌డ్రా’ అయితే బాగుంటుందన్నారట. ఈ రెండూ గాంధీజీకి అంతగా నచ్చలేదట. చివరికి ‘క్విట్ ఇండియా’ నచ్చి దాన్ని ఆయన ఖరారు చేశారట. దాన్ని సూచించిన వారు యూసుఫ్ మొహర్ అలీ. ‘జైహింద్’ నినాదాన్ని సృష్టించినవారు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ అబిద్ హసన్ సఫ్రానీ గారు. నేతాజీకి ఆ నినాదమంటే చాలా ఇష్టం. ప్రతి సభలో, సమావేశంలో అది భరతవాక్యంగా ఇప్పటికీ నిలిచిపోయింది. ‘కాకా బాప్టిస్టా’ అనే ఆయన మేధోపుత్రిక (అదేనండీ బ్రెయిన్ చైల్డ్!) యొక్క ఒక పదబంధాన్ని, లోకమాన్య తిలక్, ‘స్వరాజ్యం నా జన్మహక్కు’గా అనుసృజన చేశారు.
‘రణన్నినాదం’ అని కొందరు వాడుతుంటారు. నాకెందుకో అది తప్పేమో అనిపిస్తుంది. రణత్+నినాదం. యుద్ధ స్ఫూర్తిని కలిగించే నినాదమనా? కావచ్చు కాని ‘ని’ కి వత్తు ఎందుకో? రణనినాదం అంటే సరిపోదూ? దానిలో నాకు తెలియని వ్యాకరణ రహస్యం ఉందేమో? మీకు తెలిస్తే చెప్పరూ ప్లీజ్? దీన్ని చూస్తే ‘సత్యనారాయణ’ను కొందరు ‘సత్యన్నారాయణ’ అనడం గుర్తొస్తుంది నాకు. ఒత్తు పెడితే ‘ఎఫెక్టివ్’గా ఉంటుందనో ఏమో? అన్నీ ‘ఏమోలే’!
కొన్ని నినాదాలు వ్యక్తిగత అహంకారాన్ని సూచిస్తాయి. పధ్నాలుగవ లూయీ చక్రవర్తి ‘నేనే రాజ్యాన్ని!’ అని నినదించాడు. ఆయన పిచ్చిగాని, ఆయనే రాజ్యం ఎలా అవుతాడు? రాజ్యం శాశ్వతం. రాజు నాలుగు నాళ్లుండి పోతాడు.
నినాదం వల్ల ఒక విధానం ఆవిష్కరించబడాలి. అది ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. అప్పుడే అది సార్థకం అవుతుంది. కొన్ని అంత పాపులర్ కాకపోయినా, బాగుంటాయి. ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అన్నారు గాంధీ. ‘ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు’ అన్నారు నెహ్రూ. ‘చిన్న లక్ష్యం ఒక నేరం’ అన్నారు అబ్దుల్ కలాం. లాల్ బహదూర్ శాస్త్రిగారి ‘జై జవాన్, జై కిసాన్’ గొప్ప నినాదం. సైనికులను, రైతులను అది గ్లోరిఫై చేసింది! ‘కళ, కళ కోసం కాదు, ప్రజల కోసం’ అన్నారు బళ్లారి రాఘవ! ‘విప్లవం వర్ధిల్లాలి’ అన్న భగత్‌సింగ్ నినాదం పోరాట పటిమకు స్ఫూర్తినిచ్చింది. ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ అన్నారు పి.వి. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు దాశరథి. కవిత్వం పరిమళించే నినాదం!
‘అమర్ హై’కు, ‘జిందాబాద్’కు తేడా తెలియకుండా డబ్బు తీసుకునో, బిర్యానీ పాకెట్ కోసమో నినాదాలు చేసే వారిని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తుంది. అవి చేయించే వారంటేనే నాకు ఒళ్ళు మంట! ఒక వ్యక్తి అమరుడు కావాలంటే మాటలా? ‘జిందాబాద్’ పర్షియన్ మూలాలు కల మాట. ‘లాంగ్ లివ్’ అన్న మాట. ఎవరంటే వారి కోసం నినాదాలు ఇవ్వకూడదు. అదన్నమాట!



సీనియర్ సిటిజన్స్ ఫోరమ్, పెన్షనర్స్ అస్సోసియేషన్ సభలో నా ప్రేరణాత్మక ప్రసంగం

కరీంనగర్, జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరమ్, మరియు జిల్లా పెన్షనర్స్ అస్సోసియేషన్ వారు 12 మార్చ్ 2025 ఏర్పాటు చేసిన సభలో నేను ప్రేరణాత్మక ప్రసంగం చేశాను.
సంబంధిత న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్

 



 

Click on images to view in bigger size.

 

 

 

 

 

 

 

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 18వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 18వ భాగం సంచికలో చదవండి.
~
తిరుపాలమ్మకు గ్యాసు స్టవ్ మీద ఎట్లా వంట చేయాలో నేర్పించింది కాశింబీ. జాగ్రత్తలు చెప్పింది. అంతా విని తిరుపాలమ్మ అన్నది గ్యాస్ సిలిండర్‌ను చూస్తూ - “వంటిట్లోనే బాంబు పెట్టుకున్నట్లే గదమ్మా!”
కాశింబీ నవ్వింది! “అదేం లేదులేమ్మా! రెండ్రోజులు పోతే అదే అలవాటయిపోతాది” అంది.
ఆ రోజు కాశింబీనే వంట చేసింది. బుడంకాయ (పుల్ల దోసకాయ) పప్పు, పుండుకూర (గోంగూర) పచ్చడి, మటకాయల (గోరుచిక్కుడు) తాలింపు చేసి, రాములకాయల (టమోటాల)తో చారు చేసింది. ఆ సాయంత్రం సారు, అమ్మ వెళ్లిపోయారు నంద్యాలకు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-18/

 




పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 25వ భాగం లింక్

కం.:
విద్యలకెల్లను నీవే
ఆద్యుడవో పంకజాక్ష! ఆశ్రితరక్షా!
సద్యోజాతము నీ దయ
అద్యంతము లేని దేవ! ఆత్మస్వరూపా!
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-25/

 

 



Thursday, March 6, 2025

'దేవీ వైభవం' గ్రంథావిష్కరణ సభకు ఆహ్వానం

కరీంనగర్ భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తేదీ 12 మార్చి 2025 నాడు స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి పద్యకావ్యం 'దేవీ వైభవం' ఆవిష్కరణ జరగనున్నది. నేను ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నాను.
ఆహ్వాన పత్రిక చూడండి.


Click on image to view in bigger size
 

బ్రహ్మం గారి మఠంలో శ్రీనాథుని హరవిలాస కావ్యంపై ప్రవచనాలు, సత్కారం

బ్రహ్మం గారి మఠంలో, శివరాత్రి ఉత్సవాలలో, శ్రీనాథుని హరవిలాస కావ్యంపై నా సంగీత ప్రవచనాలు, ఆస్థాన పండితుల వారిచే సత్కారం, శేష వస్త్ర ప్రదానం.
ఓం నమః శివాయ! 🙏🌹







Click on the images to view in bigger size

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 17వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 17వ భాగం సంచికలో చదవండి.
~
వైనతేయకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పురాణాలు, ఇతిహాసాలు, హరికథలుగా ఎంతో కాలం నుంచి వింటున్నారు ప్రజలు. వారికి కొత్తదనం కావాలి. ప్రెజెంటేషన్‌లో వైవిధ్యం కావాలి. అంతేగాని, హరికథలకు ఆదరణ తగ్గిందనడంతో నిజం లేదు. దీనికి తార్కాణం తాను రూపొందించిన ‘వ్యక్తిత్యశిల్పమే!’.
ఒక ప్రోగ్రాముకు ఇంకో ప్రోగ్రాముకు అతడు పేర్కొనే ఉదాహరణలలో భేదాలుండేవి. తాను చదివిన సాహిత్యం నుండి ఎన్నో దృష్టాంతాలను సేకరించుకున్నాడు. వాటిని వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా mould చేసుకోసాగాడు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-17/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 24వ భాగం లింక్

అంత గరుత్మంతుండు వినయాంతరంగుండై వారికి ఎదురేగ
ఉ.:
బంగరు వన్నె కాంతిగల పక్షములన్, అమరాభిమానమున్
రంగరినట్టి దెందమున, రాజితమౌ హరిచందనంబు తోన్
అంగము వెల్గ, భూషణచయంబు చలింప ప్రియంపు మాటలన్
ఇంగిత మొప్ప వారి హరి జేరగ దోడ్కొని పోయె, బ్రీతుడై
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-24/

 

3వ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు 2025 - నివేదిక - లింక్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి, మరియు ‘తెలుగు సంపద’ బెంగుళూరు వారి సంయుక్త ఆధ్యర్యంలో, ఫిబ్రవరి 27, 28 తేదీలలో 3వ అంతర్భాతీయ తెలుగు భాషా సమావేశాలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
మొదటి సెషన్‍లో (27 ఫిబ్రవరి తేదీన) నేను నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. మొదటగా, కవిసమ్రాట్ విశ్వనాథ విరచితమైన ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు, భాషించునపుడు వినిపించు భాష’ అన్న తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని వివరించే సీస పద్యాన్ని సుస్వరంగా ఆలపించగా, సభికులు పరవశించి, కరతాళ ధ్వనులు చేశారు.
పూర్తి నివేదికని సంచికలో చదవండి.

 

https://sanchika.com/moodava-antarjaateeya-telugu-bhaashaa-samaavesaalu-2025-nivedika/