సహజంగా ‘రాయబారం’ అంటే కాంప్రమైజ్ చేసి, ఇరుపక్షాల మధ్య ఘర్షణ లేకుండా చూసేది కదా! కానీ, మనకు తెలిసిన రాయబారాలన్నీ ఘర్షణ పెంచి, యుద్ధాలు తప్పనిసరిగా జరిగేలా చేశాయి! అత్యంత ప్రసిద్ధి గాంచిన శ్రీకృష్ణ రాయబారమే తీసుకొందాం. మొదట్నించీ పరమాత్మకు పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య ఇష్టం లేదు. వెళ్లే ముందు, పాండవులు కొంచెం మెత్తబడి, సంధికి మొగ్గు చూపితే, వాళ్లను రెచ్చగొట్టాడు! ఇక కౌరవ సభలో, ఆయన “మా భీముడి గద అంటే ఏమనుకున్నారు? మా అర్జునుని గాండీవం ఎంత పవర్‌ఫుల్లో తెలుసా?” అని వారిని బెదిరించాడు. తాను ‘దండంబున్ గొని దోలు స్యందనము మీదన్’ సారథిగా ఉంటానన్నాడు. “ఒక్క దుర్యోధనుని అసూయ కోసం మీరంతా చావకండి” అన్నాడు.
శా.:
“ఈ దుర్యోధనుడింత గర్వియగునే యీ యున్నవారెల్ల, నా
చే దైన్యంబున. బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్
లేదే యొండు దెఱంగు సత్కులము బాలింపంగ వర్ణింప, రా
దే దుష్టాత్మకు నీచునొక్కరుని, బోదే భేదమీ జాతికిన్?”
రాయచారం ముగిసింది. ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుంటున్నాడు. ఈయన బెదిరింపులకు వారు బెదరలేదు. పైగా ఆయన్నే బంధించాలని చూశారు! ఆయనకు కావలసిందీ అదే. వీడ్కోలు మాటలు చూడండి.
ఉ.
“రోషము నాపయిం గలిగి క్రూరత గౌరవు లింతసేత సం
తోషమ, నీవు ప్రాభవముతో తగ నాకు ననుజ్ఞ యిమ్ము; ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషము జక్కం బెట్టి, జగతీవర! యింతకు పోయి వచ్చెదన్”
యుద్ధం జరిగితే కృష్ణునికేం ప్రయోజనం? దుష్టశిక్షణ. ధర్మరక్షణ. అదే కదా కృష్ణావతార పరమార్ధం.
ద్రుపద పురోహితుని రాయబారం కూడా విభిన్నం. ఆ విప్రుడు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ఆయనను భీష్ముడిలా పొగిడాడు -
కం.
“నీ వాక్యము విప్రస్వా/భావికమై యిట్లు శృతికి బరుషంబయినన్
భావింప గార్యమున యం/దే విధమున సభకు నింత నిష్టంబగునే!”
ఇక సంజయ రాయబారం. ఆయన ప్రాజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. ధృతరాష్ట్రుని పట్ల మొక్కవోని రాజభక్తి గలవాడు. ‘రాజ్యభాగం లేకుండా, మంచి మాటలతో సంధి చేసుకు రమ్మ’ని గుడ్డిరాజు చెప్పడంలో ఆయన కుటిల స్వభావం అర్థమవుతుంది. తిరిగి వచ్చి, రాజుతో ఇలా చెబుతున్నాడు.
ఉ.:
మానుషశక్తి యొల్లడు సమంచిత దైవమ యూదియుండు నీ
పైన నతండు పుణ్యమును పాపము బెట్టిన వాడు నీవు నీ
సూను వశంబ కాని యొక చొప్పు దలంపవు కర్ణ సౌబలా
ధీనము కార్య నిశ్చయము దెల్లము నీమత మొప్పదేమియున్.
సంధి పొసగేది కాదని, నిజం నిష్ఠూరమైనా చెప్పేశాడు సంజయుడు.
ఆంజనేయస్వామి, అంగదుడు, రావణాసురుని వద్దకు రాయబారం వెళ్లినపుడు కూడా, బెదిరింపులే తప్ప, నచ్చచెప్పినట్లుగా కనబడదు. స్వయంగా బల ప్రదర్శన కూడా చేసి వచ్చాడు అంగదుడు.
రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల మద్దతు కూడగట్టడం కోసం, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, రాయబారిగా వచ్చాడు. ఆయన సాంప్రదాయకంగా, వామపక్ష లేబర్ పార్టీకి చెందినవాడు. భారత స్వపరిపాలనకు అనుకూలుడు. కాని, భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి పూర్తిగా విముఖుడైన చర్చిల్ నాయకత్వంలోని సంకీర్ణ యుద్ధ క్యాబినెట్ సభ్యుడు. “యుద్ధంలో మాకు మద్దతిస్తే, తర్వాత మీకు మేం ఫ్రీడం ఇస్తాం” అని బేరం పెట్టాడు క్రిప్స్. కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ ఒప్పుకోలేదు. రాయబారం ఫెయిలయ్యింది.
‘బుగ్గానిపల్లె పంచాయితీ’ అని మా కర్నూలు జిల్లాలో ఒకటుంది లెండి. డోన్-నంద్యాల రైలు మార్గంలో బేతంచెర్ల తర్వాత ‘సిమెంట్‍నగర్’ స్టేషన్ వస్తుంది. ఆ ఊరి పేరే బుగ్గానిపల్లె. అక్కడి పెద్దమనుష్యులు ఇరు పక్షాలకు సంధి కుదర్చకుండా, జాగ్రత్తగా పంచాయితీ చేస్తారు. ఇరువర్గాలూ నష్టపోయి, సంధి కుదిర్చేవారికే బెనిఫిట్! ఇదో రకం. వీళ్ళు రెండు వైపులా ఉన్నట్లు ఉంటారు. జోసెఫ్ అడిసన్, “మచ్ మైట్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్” అని సర్ రోగర్ డి కావర్లీ తో ఒక చోట ‘స్పెక్టేటర్’ వ్యాసాలలో చెప్పిస్తారు. పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలకు అదే ప్రేరణ అని చెబుతారు. కర్ర విరగకుండా, పాము చావకుండా చేసే రాయబారం ఇది. ఇది చాలా ప్రమాదకరం!
భార్యాభర్తలు గొడవ పడితే, వారి మధ్య సయోధ్య కుదర్చడానికి రాయబారం చేయటమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. ఎందుకంటే, ఎంతగా పోట్లాడుకున్నా, వాళ్లిద్దరూ ఎప్పటికైనా ఒకటే.
ఇంగ్లీషులో రాయబారిని ‘అంబాసడర్’ అంటారు. అప్పట్లో ఒక కార్ల కంపెనీ తమ కారుకు ఆ పేరును పెట్టింది. అప్పుడు కారంటే అంబాసడర్ కారే. రాయబారి ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉన్నతస్థాయి దౌత్యవేత్త. ఆయనను ‘ఎన్వాయ్’ అని కూడా అంటారు. తాను రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తాడు. రెండు దేశాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తాడు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) అధికారులతో రాయబారులుగా పంపుతారు. కామన్‌వెల్త్ దేశాలలోని రాయబారులను ‘హైకమిషనర్’ అంటారని మీకు తెలుసు. వీళ్లు కాక, బ్రాండ్ అంబాసిడర్స్ అని ఉన్నారు. విరాట్ కోహ్లి, అమితాబ్, షారుక్ ఖాన్ లాంటి వారు. వీరితో పేచీ లేదు.
రాయబారి సహనశీలుడు, స్థితప్రజ్ఞుడు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నిష్ణాతుడూ అయి ఉండాలి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాకూడదు. అన్నట్లు, మీకెవరితోనైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను మీడియేషన్ చేస్తా! వద్దంటున్నారా? సరే సరే! అదన్నమాట!