Monday, July 28, 2025

అంతా నేనే చేశాను! - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. పాక్ కాళ్లబేరానికి వచ్చి “నీవే తప్ప నితః పరం బెరుగ మన్నింపందగన్ దీనునిన్, రావే ఈశ్వర, కావవే వరద, సంరంక్షించు భద్రాత్మకా!” అని గజేంద్రమోక్షంలో ఏనుగు శ్రీహరిని వేడుకున్న చందంగా, మన దేశాన్ని వేడుకుంది. అంతం కాదిది ఆరంభం అని మరీ స్పష్టం చేసి భారత్ ఊరుకుంది.
తనను తాను ఆమ్నిపొటెంట్ అని, ఆమ్నిసైంట్ అని, అదేనండీ, సర్వసమర్థుడిననీ, సర్వజ్ఞుడిననీ భావించుకుని, అదే భ్రమలో ఉండే ట్రంపు, ప్రారంభించాడు - “ఇండియా పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశా!” అని డంబాలు కుంభాలతో పోయడం మొదలెట్టాడు. “మధ్యన నీ బోడి పెత్తనమేమిటోయ్!” అని మోడీ స్పష్టం చేశాడు. ఐనా వినడే! “ట్రంపు గారి సొంపు ఇంతింత గాదయా” అని, “పాడిన పాటే పాడకురా, పాచిపళ్ల వాడా!” అని గడ్డి పెడితే, చివరకు ఒప్పుకున్నాడు! తాను కాదని! అందుకే బద్దెన గారన్నారు “వెనుకటి గుణ మేల మాను, వినరా సుమతీ!” అని. పూర్తి పద్యం ఈయనకు రాదా? కొంపతీసి! అనుకుంటున్నారా? వచ్చు. కాని పూర్తిగా రాస్తే, ట్రంప్ అభిమానులు, ముఖ్యంగా మన దేశంలో, బాధపడతారని మానేశాను. “స్వభావో దురతిక్రమః” అన్నాడు రావణాసురుడు, తన మాతామహుడు, మంత్రి ఐన మాల్యవంతునితో. ఇక్కడ పూర్తి శ్లోకం వ్రాస్తాను.
ద్విధా భజ్యేయమాప్యేవం న నమేయం తు కస్యచిత్। 
ఏష మే సహజో దోషః స్వభావో దురతిక్రమః॥ (యుద్ధకాండ 36.11)
“నాయనా! రామునితో యుద్ధం వద్దు, నా మాట వినురా!” అని మాల్యవంతుడు చెబితే, రావణుడు, “అబ్బే! వీల్లేదు. గ్రాండ్ పా! నన్ను రెండు ముక్కలుగా కోసినా, నేనెవరికి లొంగను. ఇది నాలోని సహజ దోషం!” అన్నాడు (అందుకే దుర్యోధనున్నీ, రావణున్నీ తెలిసిన మూరులన్నారండోయ్). చివర్లో తన బలహీనతను జనరలైజ్ చేశాడు (చేసింది వాల్మీకి సార్!) “స్వభావాన్ని అధిగమించడం కుదరదు కదా మరి!”.
ఇది ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో కూడ బయటపడింది. ఇరాన్‌ను బెదిరించాడు. గడ్డపాయన, పెద్దాయన, ఆయతొల్లా ఖొమైనీ, “ఐ కేర్ ఎ పిన్” అన్నాడు. “పో బే!” అన్నాడు కూడా! ట్రంప్ ఇరాన్‌పై క్షిపణులు ప్రయోగించినా ఇరాన్ బెదరలేదు. పైగా అమెరికా మీదే ప్రతిదాడులు చేసింది.
ఇక కె.ఎ. పాల్ గారు ఉండనే ఉన్నారు. తానే ఇండో- పాక్ యుద్ధాన్ని ఆపానని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంతకుముందు కూడా చాలా యుద్ధాలను ఇలాగే ఆపాడట. ఆయన ప్రజ్ఞలు వింటే ఉత్తరకుమారుడు కూడా తల దించుకోవలసిందే.


గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వారు కూడా తామే కర్తలమని చెప్పుకోరు. అది వారి వినయశీలం. మన భారతీయ వేదాంతంలో అదొక ఉదాత్త భావన! ‘అహంకారం’ నుండి విముక్తుడయితే తప్ప, మనిషి మహనీయుడు కాలేడు.
టి.టి.డి. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ పి. వి. ఆర్. కె. పసాద్ గారు వెంకటేశ్వరస్వామి సేవలలో తాను సాధించిన విజయాలను, పొందిన అనుభవాలను, వినమ్రంగా, ‘నాహం కర్తా, హరిః కర్తా’ అనే శీర్షికతో ‘సర్వ సంభవమ్’ పుస్తకంలో వ్రాసుకున్నారు.
శ్రీనాధకవి “చిన్నారి పొన్నారి చిరుత కూకటనాడు రచియించితి మరుత్తరాట్ చరిత్ర” అని ప్రారంభించి గొప్పలు చెప్పుకున్నారు. చివరికేమయింది?
మాకు వరుసకు పెదనాన్నగారు, పాణ్యం భైరవ శర్మగారు. ఆయన ట్రంప్ కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. ఆయన ధోరణి ఇలా ఉంది. “ఒరేయ్ దత్తుడూ (అంటే నేనన్నమాట!) ఢిల్లీకి వెళ్లాను కదా ఆ మధ్య! ఇందిరాగాంధీని ఎడాపెడా దులిపేసి వచ్చాను. ‘ఏమిటమ్మాయ్? ఎమర్జెన్సీ ఇంకా ఎన్నాళ్లు పెడతావు? ఎత్తెయ్యి! అర్ఘ్యాల్లోకి పిండాల్లోకి లేకుండా పోతావు జాగ్రత్త!’ అని తిట్టానురా. కిక్కురుమంటే ఒట్టు”. నేను అనుమానంగా చూస్తూంటే, “ఒరేయ్, నీకబద్ధం నాకు నిజం” అనేవాడు. ఆయన మద్రాసుకు వెళితే దిగేది ఎక్కడో తెలుసా మీకు? కరుణానిధి గారింట్లోనే! లేకపోతే ఆయన ఒప్పుకోడు మరి! ఈ టైపు గొప్పల వల్ల, పెద్దగా ప్రమాదం లేదు లెండి.
ఇంతకూ, ట్రంప్ అంత సీన్ నాకు లేదుగానీ, ఈ బనకచర్ల డ్యాం వివాదాన్ని మీరే పరిష్కరించాలని అటు చంద్రబాబు గారు, ఇటు రేవంత్ రెడ్డి నన్ను బ్రతిమాలుతున్నారండీ బాబు! నవ్వుతున్నారెందుకు? అదన్నమాట!



పుస్తక పరిచయం - శ్రీలక్ష్మీనృసింహ మాహాత్మ్యము

నృసింహులు నాచే రాయించుకున్న 'శ్రీలక్ష్మీనృసింహ మాహాత్మ్యము'  పుస్తక పరిచయం వీడియోని స్వాధ్యాయ వారి యూట్యూబ్ ఛానె‍ల్‌లో చూడగలరు.

 


 

Thursday, July 24, 2025

సర్వదేవ నమస్కారః - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

“అన్ని మతముల సారంబు యవని యొకటె” అని ఆర్యోక్తి. ఆ సారాన్నే ఆయా మతాల్లోని బోధకులు విభిన్నంగా వివరిస్తారు. కానీ ‘Ultimate Truth’ మాత్రం ఒక్కటే. “ఏకం సత్ విప్రాః బహుధావదన్తి” అని మన భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. ఇక్కడ ‘విప్రాః’ అన్న పదానికి ‘పండితులు’ అని అర్థం.
‘Literary Parallel’ అంటే ప్రపంచ సాహిత్యాలలో ఉన్న సామ్యం గల విషయాలు. అలాగే ‘రెలిజియస్ ప్యారెల్లల్’ కూడా ఉంది. హిందూమతంలో, ప్రయాణం చేసేవారికి వీడ్కోలు చెప్పేటప్పుడు “శివాస్తే పంథానః” అంటారు. అంటే, “నీ మార్గములు శుభకరములగు గాక!” అని అర్థం. “విష్ యు హ్యాహీ జర్నీ” అనేది పాపులర్ వీడ్కోలు. విదేశాలకు వెళ్లి వారికి మాత్రం అలా చెప్పకూడదని, “బాన్‌ వాయేజ్” అని చెప్పాలని మీవంటి వారు చెప్పారు సుమండీ! బైబిల్‌లో “యెహావా నీ మార్గమును సుగమము చేయుగాక” అన్న అర్థాన్నిచ్చే సూక్తి ఉంది.
వేదాలు ‘అపౌరుషేయములు’ అంటారు. అంటే మానవులు రాసినవి కాదు. అట్లే పవిత్ర ఖుర్-ఆన్ కూడా. భగవంతుడు మౌఖికంగా, మహమ్మదు ప్రవక్తకు చెప్పినది అంటారు. ఆ గ్రంథం క్లాసికల్ అరబిక్ భాషలో ఉంది. ‘ఖుర్-ఆన్’ అన్న పదం, ఆ గ్రంథంలో 70 సార్లు వస్తుంది. ప్రవక్త కేవలం గుర్తుపెట్టుకుని, తన శిష్యులకు చెబితే, వారు దాన్ని గ్రంథస్థం చేశారు. వారినే scribes అంటారు. అన్నిమత గ్రంథాలకు లాగే ఖుర్-ఆన్‌కు కూడా ప్రక్షిప్తాలు, చేరికలు ఉన్నాయి. మనకు తాళపత్రాలు (తాటాకులు) కూడా లేని కాలంలో కూడ సాహిత్యం, మత వాఙ్మయం ఉన్నాయి. ఇప్పుడు రకరకాల బాల్, జెల్ పెన్నులు, నాణ్యమైన తెల్ల కాగితాలు ఉన్నా, మనం రాన్రాను ‘రాయని భాస్కరులం’ అవుతున్నాం. అంతా సిస్టమ్‌లో టైప్ చేయడమే. ‘కాగిత రహిత’ (Paperless) సమాజం కోసం ఎదురుచూస్తున్నాం. “అవ్వ పేరే ముసలమ్మ” అన్నట్లు, టైప్ చేయడం కూడా ఒక విధంగా రాయడమేనంటాను. కాదంటారా? ‘రాయడం’ అనకూడదు, ‘వ్రాయడం’ అనాలి, అంటున్నారా? సరే! బైబిల్, ఖుర్-ఆన్, గీత-వేదములు, ఆదిగ్రంథం (సిక్కులది) ఇవన్నీ మతగ్రంథాలయినా, వాటిలో సాహిత్య విలువలు పరిమళిస్తుంటాయి. వ్యక్తిత్వ వికాసానికి కావలసిన బోలెడు విషయాలుంటాయి. మనమేమో బోలెడు డబ్బు తగలేసి ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ క్లాసులకు వెళతాం.
కావ్యప్రబంధాల కాలంలో ‘వ్రాయసకాండ్రు’ (వ్రాసే సిబ్బంది) అని ఉండేవారు. వారు తాళపత్రాల నుండి, కొత్తవాటిపై వివిధ గ్రంథాలను ‘కాపీ’ చేసేవారు. ఆ ఉద్యోగాన్ని తక్కువగా చూసేవారట. ఎందుకంటే సృజనాత్మకత లేని పని అని! కవిపండితులంతా ఓరల్ గానే సాహిత్యాన్ని సృష్టించేవారట. అంతెందుకు? విశ్వనాథ వారు ‘వేయి పడగలు’ నవలను ఆశువుగా చెబుతుండగా, వారి సోదరుడు వెంకటేశ్వర్లుగారు వ్రాశారని మనకు తెలిసిన విషయమే. 999 అరఠావులు వచ్చిందట. 29 రోజులు పట్టిందట. అంటే సగటున రోజుకు 35 పేజీలు. వ్యాస భారతాన్ని వినాయకులవారు రాశారని ప్రసిద్ధం. తిక్కన భారతాన్ని గురునాథుడనే ఆయన శిష్యుడు, ఆయన చెబుతుంటే రాశాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో భారత యుద్ధాన్ని వివరిస్తున్నపుడు, తిక్కన కాసేపు ఆగాడట; భావం తోచక! అప్పుడు “ఏమి సెప్పుదును గురునాథ!” అన్నాడట దృతసంధి ప్రకారం, ‘కురునాథ’ కూడా అవుతుంది. శిష్యుడితో అన్నా, కురురాజుకు కూడా వర్తించి, ఔచిత్యం భంగం కాలేదు. బహుశా మహమ్మదు ప్రవక్త కూడ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటాడు.
బైబిల్ ‘ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్’ అంటుంది. హిందూమతం ‘సర్వస్యశరణాగతి’ అంటుంది. “అగోచరాల తాళంచెవులు అల్లాహ్ వద్దనే ఉన్నాయి” అంటుంది ఖుర్-ఆన్. ‘అగోచరం’ అంటే abstract, కంటికి కనబడనిది. అంటే ఆధ్యాత్మికానుభూతి. మనం భగవంతుని నిరాకారుడిగానే భావిస్తాము. విగ్రహారాధన కేవలం మనకు ఆయనపై ఏకాగ్రత కుదరటం కోసమే. “కొంచెమైనను తగపంచి కుడుట మేలు” అన్నా,” లవ్ థై నైబర్ యాజ్ థైసెల్ఫ్” అన్నా, “పొరుగువారు పస్తులుంటే తాను మాత్రం తినేవాడు విశ్వాసి (ముస్లిం) కాలేడు” అన్నా, అన్నిటి పరమార్గం ఒకటే.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే, మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. Secularism (లౌకికవాదం) మనకు శ్రీరామరక్ష! అన్ని మతాల్లో చెడ్డవారు, మంచివారు ఉంటారు. మనుషులు మంచివాళ్ళు కాకపోయినా మతం ఏదైనా మంచిదే అయి ఉంటుంది. మంచినే బోధిస్తుంది. “సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి”. “దేవుడనే వాడుంటే లోకంలో ఇంత అన్యాయం ఎందుకుంది?” అనేవారూ ఉన్నారు. మతం, దేవుడు అనే భావన, ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణను, పాపభీతిని కలిగిస్తుంది. ఏ మతం ఏమి చెప్పినా, అది మానవాళి బాగు కోసమే! అదన్నమాట!

'తెలుగు కథా పూదోట' ఆవిష్కరణ సభ - ఆహ్వానం

TLCA, న్యూయార్క్ వారి ఉగాది కథల పోటీలో నా కథకు బహుమతి వచ్చింది. దాని పేరు పుంసవనం. ఆ పోటీలో ఎంపికైన కథల సంకలనం 'తెలుగు కథా పూదోట' ఆవిష్కరణ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆగష్టు 2 న జరుగుతోంది. వీలైతే మీరు రావాలన్నది నా కోరిక! 🙏 🙏
వివరాలకు దిగువన ఉన్న ఆహ్వానపత్రిక చూడండి.

 

Click on the image to view in bigger size

 

Wednesday, July 16, 2025

నానా అటాచ్‌మెంట్స్!- దత్తవాక్కు- ఆంధ్రప్రభ

నాన్-అటాచ్‌మెంట్ ఉంది, డిటాచ్‌మెంట్ ఉంది. మరి ఇదేమిటి? అని అనుకుంటున్నారా? ‘నానా’ అంటే ‘రకరకాల’ అని అర్థం. నాన్‌స్టాప్ బస్ సర్వీసుకు పల్లెవెలుగు బస్ సర్వీస్‍కు తేడా అదే. రెండవది ‘నానా స్టాప్’ అన్నమాట.
‘నాన్-అటాచ్‌మెంట్’ అన్న మాటలో ఆధ్యాత్మిక సుగంధాలున్నాయి. దాన్ని ‘నిస్సంగత్వం’ అని తర్జుమా చేయవచ్చు. అది చాలా గొప్ప సుగుణం. ఆచరించడానికి గహనం కూడా. ఆదిశంకరాచార్యుల వారు తమ ‘భజగోవిందం’ స్తోత్రంలో దీన్ని ఎలా సాధించాలో చెప్పారు.
‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, 
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః 
భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం మూఢమతే!’

అన్నాణా పరివ్రాజక శ్రేష్ఠుడు. 
సంబోధనను గమనించండి. ‘ఓ మూఢమతే!’ అని. ‘నాన్-అటాచ్‌మెంట్’ ను సాధించడం ఎలాగో ఒక క్రమానుగతశ్రేణిని శంకరులు బోధిస్తున్నారు. సత్పురుషుల సహవాసం చేస్తే నిస్సంగత్వం లభిస్తుంది, దాని వల్ల మోహం నశిస్తుంది. మోహం ఎప్పుడయితే దూరం అవుతుందో అప్పుడు నిశ్చలతత్తం అలవడుతుంది. అది జీవన్ముక్తికి దారి తీస్తుంది.
‘డిటాచ్‌మెంట్’ అనేది వైరాగ్యానికి సమానార్థకం కాదు అని నా అభిప్రాయం. ఒక రకంగా అది నెగెటివ్ టర్మ్. రోమ్ నగరం తగలడిపోతుంటే ఆయనెవరో, నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడని... అంటారు. దీన్ని డిటాచ్‌మెంట్ అందామా? నాన్ అటాచ్‌మెంట్ అయితే కాదు.
మన జీవితంలో ‘నానా’ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. అవి మనల్ని వదలవు. మనమే వదిలించుకోవాలి. అలాగని అన్నింటినీ త్యజించి సన్యాసం తీసుకోకూడదు. అలా బలవంతంగా సన్యాసం తీసుకొంటే ఏమవుతుందో, ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలో, రేలంగి పాత్ర ద్వారా 1959 లోనే చూపించారు చక్కగా. ఆ పాటను పింగళి వారు వ్రాయగా, (ర)సాలూరు రాజేశ్వర రావుగారు స్వరపరిచారు. ఘంటసాల మాస్టారు పాడారు. బైటికి హస్యం అనే చక్కెర అద్దినా, అంతర్లీనంగా నిజమైన నాన్-అటాచ్‌మెంట్‌ను పింగళి పలికించారు, రేలంగి “కాశీకి పోయాను, గంగతీర్థమ్ము తెచ్చాను” అంటే, గిరిజ “కాశీకి పోలేదు, అవి ఊరి కాల్వలో నీళ్లండి” అంటుంది. అలా అతని ప్రతి మాటకూ ఆమె ఇచ్చే రిటార్టులో ఎంతో అర్థముంది. కుహనా సన్యాసత్వం ఎంత హాస్యాస్పదమో తెలుస్తుంది.
“టు బి యాన్ ఐడియల్ హౌస్ హోల్డర్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దేన్ టు బి ఎ సన్యాసి” అన్నారు స్వామి వివేకానంద. అందుకే మహర్షుల్లో చాలా మంది గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తూనే, నిస్సంగత్వం పొందగలిగారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దీనికి చక్కని ఉదాహరణ.


కుటుంబంలో ఉంటూ, బాధ్యతలు నెరవేరుస్తూనే, వాటికి అతీతంగా ఉండాలి. సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరించాలి. శ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారు తమ అనుగ్రహ భాషణంలో ఒక కథ చెప్పారు. ఒక ఊర్లో ఒక సన్యాసి సత్రంలో మకాం. ఆ ఊరి భూస్వామి కొడుకు, ఒక పేద అమ్మాయిని నమ్మించి, గర్భవతిని చేశాడు. తన పేరు చెబితే ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. భయపడి, తల్లిదండ్రులకు, తన ఈ స్థితికి కారణం సత్రంలోని సన్యాసి అని చెప్పింది! అందరూ వెళ్లి ఆ సన్యాసిని చితక్కొట్టారు. దుర్భాషలాడారు. ఆ అమ్మాయిని ఆయన వద్దే వదిలేశారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆమెను తీసుకొని వేరే ఊరికి వెళ్లి, భిక్షాటన చేసి, ఆ అమ్మాయిని పోషిస్తూ కంటికి రెప్పలా చూసుకొంటున్నాడట. ఆమె పశ్చాత్తాపపడి, వెళ్లి, తన వారికి నిజం చెప్పింది. వాళ్లంతా వచ్చి, సన్యాసి కాళ్ల మీద పడి, పూలు పండ్లు సమర్పించి, క్షమించమన్నారు. అప్పుడూ ఆయనేం మాట్లాడలేదట. అదే అసలు సిసలు నాన్-అటాచ్‌మెంట్! ఆ స్థాయికి మనం చేరలేకపోయినా, ప్రతిదానికీ అతిగా స్పందించకపోతే బెటర్. దీన్ని కృష్ణపరమాత్మ “దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః” అని స్థితప్రజ్ఞులను నిర్వచించాడు. ‘తామరాకుపై నీటి బొట్టు’ దీనికి మంచి పోలిక. తామరాకుపై నీటిబొట్టు నిలవదు. ముత్యంలా జారిపోతుంది. ఆకుకి తడి అంటదు. వివేకానంద కూడా దీన్ని ఉదహరించారు.
సచిన్ టెండూల్కర్ చూడండి. సెంచరీ చేసినా, నాలుగైదు రన్స్ చేసినా, డక్ ఔట్ ఐనా ఒకేలా ఉండేవాడు. అబ్దుల్ కలామ్ గారిని, “మీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయింతర్వాత ఏం చేస్తారు?” అని అడిగితే “పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను!” అన్నారట. పరిణతి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అదే సంయమనంతో ఉంటారు. “పలికించెడివాడు రామభద్రుండట” అని పోతన, “నాహం కర్తా, హరిః కర్తా” అని మధ్వాచార్యులవారు తమ నిస్సంగత్వం చాటారు. దట్సాల్ యువరానర్!





కథా మంజరి మాస పత్రిక వారి కథల పోటీలో నా కథ 'బ్రెయిన్ గెయిన్' సాధారణ ప్రచురణకు ఎంపిక

కథా మంజరి మాస పత్రిక వారు జన్మదిన సంచిక 2025 కోసం నిర్వహించిన కథల పోటీలలో నా కథ  'బ్రెయిన్ గెయిన్' సాధారణ ప్రచురణకు ఎంపికయింది.
సంబంధిత పత్రికా ప్రకటన దిగువన చూడవచ్చు. 🙏


Click on the image to view in bigger size

Monday, July 7, 2025

భావ దారిద్ర్యం - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

పూర్వం నిద్రాదరిద్రుడనే ఒక కవిగారుండేవారు. ఆయన రాసింది ఒకే శ్లోకం. కాని దానికి చాలా పేరొచ్చిందట. ఆ శ్లోకం ఇది.. 
“ధనహీనమపి జీవితం తు సవ్యమ్/గుణహీనమపి జీవితం తు భావ్యమ్/నిశాంతునిద్రా దరిద్రోహం నిత్యం/ఏతత్ దుస్సహం మమ దుర్భరం చ.” 
జీవితంలో డబ్బులు లేకపోయినా సహించవచ్చు. గుణం లేని జీవితం కూడా ఉండచ్చు. కాని, రోజూ రాత్రి నాకు నిద్రా దరిద్య్రం పట్టింది. అది చాలా దుస్సహం, దుర్భరం. నిజమే సుమండీ! నిద్ర పట్టకపోవడం ఒక జబ్బు. దాన్ని ఇంగ్లీషులో ‘ఇన్‌సోమ్నియా’ అంటారని మీకు తెలుసు. ఇంట్లో అందరూ గాఢంగా నిద్దరోతూంటే, మనం మాత్రం గుడ్లగూబలా కళ్ళు తెరుచుకొని మేలుకొని ఉంటే, అది నరకం కాక మరేంటి? కొందరు లక్కీ భాస్కర్లుంటారు. బస్సు లేదా రైలు లేదా విమానం, ఏదెక్కినా, కదిలిన మరుక్షణం నిద్రలోకి జారుకుంటారు. వారికి నా లేజీ సలామ్!
ఎక్కడికో... వెళ్లిపోయాననుకుంటున్నారు కదూ! వస్తున్నా వస్తున్నా! మీ జేబు లోంచి పది రూపాయలు మిమ్మల్ని అడక్కుండా నేను తీసుకున్నా పర్లేదండి. కాని మీ భావాన్ని నేను నాదని చెప్పుకుంటే మటుకు అది చాలా పెద్ద తప్పు. దీన్ని భావ చౌర్యం అంటారు. ప్లాజియరిజమ్ అన్న మాట. ‘గ్రామర్‌లీ’ అని ఒక భావ చౌర్య పత్తేదారు వచ్చిందట. అదేనండీ బాబూ, ప్లాజియరిజమ్ చెకర్! అది కృత్రిమ మేధతో పని చేస్తుందట. ఏడ్చినట్లుంది!
మనం తరచుగా చూస్తూంటాం - “ఫలానా సినిమా కథ నాది, నాకు తెలియకుండా దాన్ని సినిమా తీశారు” అని రచయిత/త్రులు కోర్టుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవలను దాసరిగారు ‘గోరింటాకు’ సినిమాగా తీసినప్పుడు ఇదే వివాదం. ఇటీవల ‘శ్రీమంతుడు’ సినిమా కథ కూడ తనదేనని శరత్‌చంద్ర గారు కోర్టుకెళ్లారు. సాహసికులు భావచోరులను కోర్టుకీడుస్తారు. అంత సీన్ లేనోళ్ళు గమ్మునుంటారు! అయినా నాకు తెలిసే అడుగుతానండీ, అన్నన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి తగలేసే సదరు నిర్మాతలకు, దర్శకులకు ఏం రోగం? రచయిత ఎవరో తెర మీద వేసి, ఆయనకు సముచితమైన పారితోషికం ఇస్తే మర్యాదగా ఉంటుంది కదా! ఆయనేమైనా ‘హీరో’ కిచ్చినంతమ్మని అడగడు కదా! సృజనశీలురెప్పుడూ అల్ప సంతోషులేనండోయ్!
ముఖపుస్తకంలో భావచోరులు చెలరేగిపోతున్నారట. “‘నా గోడ’ మీద (అదేనండి ఎఫ్.బి. వాల్) నేను పెట్టిన పోస్టును (అది చక్కని కోట్ కావచ్చు. కవిత కావచ్చు. ఇంకోటి కావచ్చు) ఇంకోడెవడో తన పేరు మీద వాడి గోడ మీద పెట్టేసుకున్నాడు” అని కొందరు వాపోతుంటారు. అదేం ఖర్మమో? ‘కాపీయింగ్’ అంత సులభమైపోయింది సాంకేతికత వల్ల! ఆ మధ్య ప్రముఖ రచయిత, సంపాదకులు, శ్రీ జగన్నాథశర్మ గారంతటి వారే, “నా కధలను నన్నడక్కుండా షార్ట్ ఫిల్ములు తీసేసుకుంటున్నారు, నా పేరు లేకుండా నా కథలను, వ్యాసాలను షేర్ చేస్తున్నారు. దీని వల్ల నా కథలపై పరిశోధన చేసే రీసెర్చి స్కాలర్లు అయోమయానికి గురవుతారు. ఇది చట్టరీత్యా నేరం. వారిపై నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను” అని ముఖపుస్తకంలోనే హెచ్చరించారంటే, భావ దారిద్ర్యం, చౌర్యంగా ఎంత దారుణంగా మారిందో అర్థం కావడం లేదూ!


కొందరు తమ కథలకు నవలలకు పేర్లు పెడుతూంటారు. వారి రచనలు, వాళ్లిష్టం అనుకోండి! కాని ఆ పేర్లు సినిమా పాటలలోని పల్లవులలో ఒక భాగం లేదా, ప్రసిద్ధ సినిమా డైలాగులోని ఒక ముక్క అయిఉంటాయి. అంత చక్కని రచన చేసి, దానికి సొంతంగా పేరు పెట్టలేరా? నాకెందుకో అలాంటి పేర్లు చూస్తే, మనస్సు చివుక్కుమంటుందండి! నన్ను సమీక్షా ప్రసంగానికి పిలిస్తే, ఈ విషయాన్ని చెబుతుంటా. సినిమా పేర్లు, సీరియళ్ల పేర్లు కూడ అలాగే, ఏదో పాట లోని ముక్కలు! అది తప్పనను కాని, భావదారిద్ర్యం క్రిందికి వస్తుందేమో మరి!
దాదాపు 30 సంవత్సరాల క్రిందటి సంగతి. నేను అప్పుడు పలాసలో ఇంగ్లీష్ లెక్చరర్‌ని. నేను, మరో లెక్చరర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్) లో, పి.జి.టి.టి.యి చేస్తున్నాం, డిస్టన్స్ మోడ్‍లో! మాకు కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చేవారు. అవి పూర్తి చేసి సీఫెల్‌కి పంపాలి. వాటికి గ్రేడ్స్ ఇస్తారు. ఒకసారి ‘క్రిటికల్ ఇంటర్‌ప్రిటేషన్’ (విమర్శనాత్మక వివరణ) లో ‘రాయ్ క్యాంప్‌బెల్’ అన్నకవి వ్రాసిన ‘ది జులు గర్ల్’ అన్న పద్యాన్నిచ్చారు. అద్భుతమైన కవిత అది. అందులో ఒక పేద అమ్మాయి, బాలింత, ఎర్రటి ఎండలో పని చేస్తుంటాంది. తన నెలల పిల్లవాడిని ఒక చెట్టు నీడన, గుడ్డ ఉయ్యాలలో పడుకోబెడుతుంది. పిల్లవాడు లేచి ఏడుస్తాడు. ఆమె వాడికి తన స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, పాలుండవు. ఆమెకు తిండి ఉంటే కదా! ఈ నేపథ్యం దక్షిణాఫ్రికాది. ఆమె కన్నీరు కారుస్తుంది. ఇంకా చాలా ఉంది కాని, పద్యంలోని ఇమేజరీ (భావసామగ్రి), మెటఫర్ (రూపకం) ఇవన్నీ వివరిస్తూ అసైన్‌మెంట్ వ్రాసి పెట్టుకున్నా.
ఎప్పుడు చూసాడో, నా కొలీగ్, దాన్ని యథాతథంగా కాపీ చేసి, తన పేరున అసైన్‌మ్ంట్ సీఫెల్‌కు పంపేశాడు! తర్వాత కొన్ని రోజులకు నేను పంపాను. అతనికి ‘ఎక్సలెంట్!’ అని, ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఇచ్చారు. నాకు ‘E’ గ్రేడ్ ఇచ్చి, “రీ డూ” (మళ్లీ చెయ్యి రా వెధవా!) అని రాశారు. అది చాలక, “నీవు నీ అసైన్‌మెంట్ వేరే అభ్యర్థి దాన్లోంచి కాపీ కొట్టినట్లుంది. ఈసారి జరిగితే ఖబడ్దార్!” అని మార్జిన్‌లో హెచ్చరిక! “ఏంటి బాబూ ఇలా చేశావు?” అని మావాడినడిగితే, “సారీ, బ్రదర్” అని ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయాడు! భావచోర్! 
నా మటుకు నేను అన్ని జోనర్ లతో రచనలు చేస్తుంటా. వివిధ విషయాలను ఉటంకిస్తూ ఉంటా. కాని అవి ఎవరు చెప్పారో, రాశారో తప్పనిసరిగా చెబుతా! మనది కాని దాన్ని మనదిగా చెప్పుకోవడం ఆత్మహత్యా సదృశం అంటా నేను! “నాకు రాదు, నీవు రాసియ్యి!” అంటే కొంత నయం! భావదరిద్రులకు నా శత కోటి మొట్టికాయలు! అదన్నమాట!



‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం ఆవిష్కరణ మహోత్సవము - నివేదిక

నేను రచించిన ‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం 30 జూన్ 2025న హైదరాబద్ నల్లకుంట లోని డి.డి. కాలనీలోని అహోబిలమఠంలో ఆవిష్కరించబడింది.
సంబంధిత నివేదిక సంచికలో ప్రచురితమైంది.

కవి తన కావ్యములోని పద్యములను శ్రావ్యముగా గానం చేస్తూ వాటిని వివరించినారు. నృసింహావిర్భావ ఘట్టమును దత్తశర్మ వివరిస్తూండగా, సభికులు భక్తిపరవశులైనారు. వారు ప్రసంగం మొదట ఆలపించిన నృసింహ ధ్యాన శ్లోకము భక్తులను విశేషముగా ఆకట్టుకున్నది. నరసింహ ప్రభువు, భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాద కుమారుని దగ్గరకు తీసుకొని, లాలించి ఆశీర్వదించగా, ఆ బాలుడు “పరమాత్మా! రక్తంతో తడిసిన నీ నాలుకను చూసి కరాళ దంష్ట్రలను చూసి, నేను అందరివలె భయలేదు స్వామీ! కానీ
తేగీ: 
భయము గల్గును సంసార బంధములను
భయము గల్గును కర్మాను భవము వలన 
భయము గల్గును షడ్వర్గ భావనములను 
అట్టి భయమును తొలగించు ఆదిపురుష!”
అని వేడుకొన్నాడని, కవి ఆలపించగా, సభికులు పులకించిపోయారు. 
~
(పూర్తి నివేదికని సంచికలో చదవగలరు)

 


 


https://sanchika.com/srilakshminrusimhamaaahtymaym-book-release-event-report/

 

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 15వ (చివరి) భాగం

సంచిక మాస పత్రికలో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తోంది. ఇది 15వ  (చివరి) భాగం. 🙏
~
అక్కడి పరిస్థితిని మాలతమ్మ ఇలా వర్ణించారు.
“క్యూరియాసిటీ.. కుతూహలం - ఎమర్జెన్సీ పెట్టి ఇన్ని ఘాతుకాలు చేసిన వ్యక్తి ఎలా ఉంటుందో - ఏం మాట్లాడుతుందో చూద్దామని వచ్చి ఉంటారు.” 
“అది మానవ నైజంలో ఒక భాగం. ఖైదీకి గాని, నేరస్థునికి గాని బేడీలు వేసి తీసుకొని వెళుతుంటే, రోడ్డు మీద జనం ఆగిపోయి విచిత్రంగా చూస్తారు.”
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-15/

'ధర్మబోధ' పుస్తకంపై సమీక్ష

 శ్రీ శంకర్ నారాయణ గారు 'ది ప్రాఫెట్'కు స్వేచ్ఛానువాదం చేసి ప్రచురించిన 'ధర్మబోధ' అనే పుస్తకంపై నా సమీక్ష సంచికలో ప్రచురితమైంది.
"కావ్యమంతటా, కవిగారి ‘Non-attachment’ మనకు గోచరిస్తూ ఉంటుంది. వెరసి ‘ధర్మబోధ’ ఒక చక్కని అనువాద రచన." 
(పూర్తి సమీక్షని సంచికలో చదవండి)
~

 


 https://sanchika.com/dharmabodha-book-review-pds/