Sunday, November 24, 2024

ఛందో బందోబస్తు - దత్తవాక్కు - ఆంధ్రప్రభ ఆదివారం - 24 నవంబర్ 2024

“ఛందో బందోబస్తులన్నీ బంద్” అని శ్రీశ్రీ గారంటే, “ఛందస్సు వద్దని ఛందస్సులోనే చెప్పాడు పాపం!” అన్నారట విశ్వనాథ వారు. ఛందోబద్ధంగా కవిత రాసేవారంతా పండితులనీ, వచన కవిత రాసేవారు కాదనీ పాతకాలంలో ఒక అపోహ! ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నాడు విశ్వనాథ లాక్షణికుడు. ఇక జగన్నాథ పండితరాయలు ఒకడుగు ముందుకు వేసి, “రమణీ యార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్” అన్నాడు. మనోహరమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దమైనా సరే కావ్యమట. మరెందుకీ సిద్ధాంతరాద్ధాంతాలు? ఏ కవిత్వం గొప్పదని? అన్నీ గొప్పవే!
ఛందస్సుతో ఉన్న కఠిన నియమాలు (rigid rules) భావవ్యక్తీకరణకు అడ్డు వస్తాయన్నది కొంతవరకు నిజమే అంటాను నేను. దీనివల్ల ప్రాచీన కవులు కూడా ఇబ్బంది పడ్డారు. పోతన గారి ఈ ప్రసిద్ధ పద్యం చూడండి!
“ఓ యమ్మ నీ కుమారుడు/మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా/పోయెదమెక్కడి కైనను/మాయన్నల సురభులాన, మంజులవాణీ!”
పద్యం చివర్లో ఈ సంబోధన చూడండి! కేవలం ‘యతి’ స్థానం కోసమేనా? గోపకాంతలు కృష్ణుని మీద కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చారు. కోపంగా ఉన్నారు. వారు యశోదమ్మను మంజులవాణీ (మనోహరమైన పలుకులు పలికేదానా!) అని ఎందుకు పిలుస్తారు? యతి కోసమే కదా! పోతన్నగారికి నా క్షమాపణలు, పాదాభివందనాలు! పోతన్నగారే కాదు. ఇతర ప్రాచీన కవులందరూ యతుల స్థానంలో ఏదో ఒక సంబోధన వేసుకున్నవారే! అది తప్పని నా అభిప్రాయం కాదండోయ్! వారంతా మహాకవులు! వారిని విమర్శించ గల స్థాయి నాకేదీ? నవయుగ కవిచక్రవర్తి శ్రీ గుర్రం జాషువ గారు “కావ్య శిల్పమున కన్న నభిప్రాయ ప్రకటనమే నా పరమావధి” అన్నారు. పద్యాన్ని కొత్తపుంతలు తొక్కించి, అనన్యసామాన్యంగా మలచి పద్యానికి చెలికాడయ్యాడు ఆయన. అంతటివాడు, ఛందస్సు కవులనెలా సతాయిస్తుందో చెపుతున్నాడు చూడండి! తన ‘నా కథ’లో!
సీ:
గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ, తగ్గవో యని యతిస్థాన మురుము/యతిని మచ్చికజేసి యడుగు ముందుకుసాగ ప్రాసంబు కుత్తుక బట్టి నిలుపు/ప్రాస వేదన దాటి పయనంబు సాగింప, భావంబు పొసగ కిబ్బంది పెట్టు/భావంబు పొసగించి పద్యంబు ముగియింప రసలక్ష్మి, కినిసి మారాము సేయు
తే.గీ.:
ఇట్టి ప్రతిబంధకంబుల నెల్ల గడచి/గట్టు కెక్కుదమన్న, వ్యాకరణ శాస్త్ర/మాదరింపదు శబ్ద మర్యాద గాన/రాక కవి గాని బ్రతుకు, రామ రామ!
పద్యం ఛందస్సులో ఉంది. కాని ఛందో కష్టాలను రమ్యంగా వివరించింది. మళ్ళీ నేను వ్యాఖ్యానం చేయాల్సిన పని లేదు. సుబోధకం! దటీజ్ జాషువా!
మా సోదరులు, డా. జోస్యుల కృష్ణబాబు గారు మహాపండితులు. పెద్దాపురం కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా చేశారు. ఆయన పద్య వైభవాన్ని వివరిస్తూ ఆ మధ్య ఒక చక్కని, ఆలోచింప చేసే వ్యాసం వ్రాశారు. అన్నా, నీ కోసం టోపీలు తీస్తున్నాం! (హ్యాట్సాఫ్‌కు వచ్చిన అవస్థ!). ఆయన మహాసహస్రావధాని, డా. గరికపాటి నరసింహారావుగారు పద్యాన్ని గురించి చెప్పిన ఒక పద్యాన్ని ఉదహరించారు.
తే.గీ.:
పద్యమన్నది వేయేండ్ల పసిడిపంట,/ పద్యమన్నది తెలుగింటి పాడిపంట/ తెలుగు పద్యమె పాడుము తెలుగుబాల!/ తెలుగు తేజమ్ము వెలయంగ దిశలమ్రోల!/‘గరికపాటి వారు గడుసువారు!’ ఈ పాదం తేటగీతేనండోయ్! నేనే వ్రాశా!
మా అన్నయ్య, జోస్యుల కృష్ణబాబుగారు ‘పద గతౌ’ అన్న సంస్కృత ధాతువు నుండి ‘పద్యం’ అనే పదం పుట్టిందన్నారు. పద్యమంటే, నియమబద్ధమైన నడక గలది! భాష గుర్రమైతే, భావం రథం. కవి సారథిగా ఉండి, భావరథానికి భాష అనే గుర్రాన్ని పూన్చి, ఛందరాజ మార్గంలో హేలగా నడిపించడమే పద్యం అంటారాయన. ఆయనంత బాగా నేనెక్కడ చెప్పగలనుగాని, పద్యరచన గుర్రపుస్వారీ అయితే వచన కవిత్వ రచన గేర్‌లెస్ స్కూటరు నడపడం లాంటిదంటాను నేను. వచన కవితలు రాసేవారప్పుడే కనుబొమలు ముడివేస్తున్నారు! వారికి నా శతకోటి వందనాలు! వారూ గొప్పవారేనని ముందే విన్నవించా, సవినయంగా!


వచన కవిత్వంలో కొత్త కొత్త ఛందస్సులు వస్తున్నాయి. వచన కవిత్వంలో ఛందస్సా? అని అనుకోకండి! అంతవరకెందుకు సార్, మనం రోజూ మాట్లాడుకునే మాటల్లో కూడా ఛందస్సుంది! “ఏమోయ్! కొంచెం కాఫీ ఇస్తావా?”, “ఇస్తానుండండి! కాస్త ఆగాలి మరి!” ఏం ఇది ఛందస్సు కాదా? “ఒక్కటిచ్చానంటే, గూబ గుయ్యిమంటుంది! నీ దిక్కున్న చోట చెప్పుకో!” ఇది ఛందస్సు కాదా! పద్యకవులు రాసే పద్యాలు సామాన్యుల కర్థం కావని వచన కవులు అంటుంటారు. వచన కవితలు కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా రాసే మహాకవులున్నారండీ బాబు! దాన్ని కవిత్వంలో ‘అస్పష్టత’ అన్నారు (obscurity). ‘Obscurity for obscurity’s sake’. అస్పష్టత కోసమే అస్పష్టతను ఆవిష్కరించే ఘనులున్నారు. వారికి నా లాల్ సలామ్! “హృదయాన్ని పేల్చుకుని, పేల్చుకుని, చీల్చుకుని, చీల్చుకుని, తిమిరంను ఛేదించు”. మీకేమయినా బోధపడిందా? అయితే నాకు ఫోన్ చేసి దానర్థం చెప్పండి, దయచేసి!
నానీలనీ, హైకూలనీ, కానీలనీ, టూకీలనీ, సెవెన్ లింగులనీ, ప్రపంచకాలనీ, సమ్మోహనాలనీ వ్యంజకాలనీ, అబ్బో! ఎన్నో మినీ కవితాప్రక్రియలు సృష్టించి, సుసంపన్నం చేస్తున్నారు ఆధునిక వచన కవులు. కాదేదీ కవితకనర్హం! ‘పద్యం బూర్జువా సంస్కృతికి దర్పణం’ - అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకాయన చాలా కాలం క్రిందట అంటే, నేను నా నిరసన పత్రికాముఖంగా తెలియచేశా లెండి! ఆయన మేరువు, నేనేమో రేణువుని. నన్నెవరు పట్టించుకొంటారు? ఏది రాసినా, మనసుకు హత్తుకోవాలి, పద్యమైనా కవిత ఐనా, లేకపోతే హాస్యనటి శ్రీలక్ష్మి ఏదో సినిమాలో అన్నట్లు అది ‘తవిక’ అవుతుంది! అదన్నమాట!
 

నా గళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన

కార్తీక సోమవార పర్వదినాన, త్యాగరాజ స్వామి వారి కీర్తన, "శంభో! మహా దేవ! శంకర! గిరిజా రమణ!" పాడాను.
కామవర్ధినీరాగం, రూపక తాళం. 




నేటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా నవల 'ఆపరేషన్ రెడ్' గురించి

ఇవాల్టి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా క్రైమ్, సస్పెన్స్ నవల 'ఆపరేషన్ రెడ్' గురించి ఇచ్చారు. అన్వీక్షికి పబ్లిషర్స్ దానిని ప్రచురించి మార్కెటింగ్ చేస్తున్నారు. అమెజాన్‍లో ఉంది.

https://amzn.in/d/0qhXBAQ

పేపర్‍లో పబ్లిషర్స్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. కావలసినవారు తెప్పించుకోండి.

Click on image to view in bigger size

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 3వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 3వ భాగం సంచికలో చదవండి.
~
అంజనేయశర్మగారు ఆ స్తోత్రంలోని ఎనిమిది శ్లోకాలనూ రాగయుక్తంగా గానం చేస్తూ ఉంటే, దస్తగిరి సారు హార్మనియం మీద అనుసరిస్తూ ఉంటే, ఓబులేశయ్య మృదంగం మీద లయ విన్యాసం చేస్తూ ఉంటే, చెన్నకేశవుల దేవళమంతా శివనామ సంకీర్తనతో మారుమోగింది. భక్తులు పరవశులై ఊగిపోయినారు.


https://sanchika.com/srimadramaramana-pds-serial-3/


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 10వ భాగం లింక్

వారిని ప్రేమతో లేవనెత్తి, పరమాత్ముండైన కేశవుండు, కరుణా పూరిత వాక్కులతో నిట్లు పలికె “ఓ జయవిజయులారా! సనక సనందనులు కోపించి శపించినను, మీరు ఎంతో సహనము వహించి,  మాటలాడక, స్థిరచిత్తముతో నిలిచినారు. ఇది ప్రశంసనీయము. మునుల శాపంబు మరలింప నాకును శక్యము గాదు. తపశ్శాలురు, విశ్వకల్యాణకాములునగు యోగిపుంగవుల ఆగ్రహమును సైతము అనుగ్రహము గానే భావించవలెను. ఏలయన..”
ఉ:
యోగులు మౌనిసత్తములు, ఊర్జిత దివ్య తపోనిధానులున్
ఆగమ సర్వశాస్త్ర విదులందరి మేలును కోరువారు, నే
భోగములన్ చరింపరు విమోహ విదూరులు, జ్ఞానపూర్ణులున్
ఈ గతి మీరు పొందుటకు నేపరమార్థము గోరి యల్గిరో?
---


మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు:
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-10/  

నర్సీపట్నం శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో 'కార్తీక వైభవం' ప్రవచనం

కార్తీక మాస సందర్భముగా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ ప్రాంగణములో
(కోనేరు వద్ద, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా)
తేది 25-11-2024 సోమవారం ఉదయం 10గం.లకు నాచే “కార్తీక వైభవం” - ప్రవచనం నిర్వహించబడును.
కావున ఆధ్యాత్మిక, సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.
~
వక్తలు:
1. శ్రీ వడలి రామచంద్రరావు గారు
2. శ్రీ ఉప్పల శ్రీరామ్మూర్తి మాష్టారు గారు
3. శ్రీ అయ్యగారి భీమ శంకరం మాష్టారు గారు
~
ఆహ్వానం:
శ్రీ చిటిమోజు బాబూరావు గారు
సభాధ్యక్షులు: శ్రీ మంతెన శ్రీరామరాజు గారు
ముఖ్య అతిథి: శ్రీ వర్రి గజ్జాలమ్మ గారు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
వందన సమర్పణ: శ్రీ జెట్టి యల్లమంద గారు
ఇట్లు:
జ్ఞాన సరస్వతీ సేవా ట్రస్టు పెదబొడ్డేపల్లి, సెల్: 9703987377
అందరూ ఆహ్వానితులే


 Click on the image to view in bigger size


Sunday, November 17, 2024

అండర్ ప్లే, ఓవర్ ప్లే! - ఆదివారం ఆంధ్రప్రభ - 17 నవంబర్ 2024

‘ప్లే’ అంటే ఆడుకోవడం, ఆడడం అని తెలుసు కదా మాస్టారు! కాని, ‘ప్లే’ అంటే నాటకం/సినిమాలలో ఒక పాత్ర పోషించడం కూడా. ఇంగ్లీషు నాటకాలు రాసేవాళ్లను ‘ప్లేరైట్’ (playwright) అంటారు. సోషియల్ మీడియా వచ్చింతర్వాత, ఏదైనా వీడియోను చూడడాన్ని ‘ప్లే’ చేయడం అంటారు. ఉదాహరణకు ఎఫ్.బి.లో ఒక వీడియోను 50 మంది చూశారనుకోండి.. 50 Plays.. అని వస్తుంది.
అవసరానికి మించి పాత్రను పోషించడం ఓవర్ ప్లే. బాగా తగ్గించి పోషించడం అండర్ ప్లే. మన సినిమా రంగంలో చాలా మంది గొప్పనటులు ఓవర్ ప్లే చేసి ప్రఖ్యాతులైనారు. దానిని వారు పండించారు కూడా. తమిళ సినిమారంగంలో ఓవర్ ప్లే ఎక్కువ అని అంటుంటారు. మన హస్యనటులను చూడండి. పాత తరం వారు ఓవర్ ప్లే చేసేవారు కారసలు. ఇప్పటి హాస్యనటులదంతా ఓవర్ ప్లేనే! గొణుగుతున్నట్లుగా డవిలాగులు చెప్పి, అండర్ ప్లే చేసి, సూపర్ స్టార్ లైనోళ్లు కూడా మనకు ఉన్నారండోయ్! ఒకప్పటి హీరో, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు ఒకాయనను మా చిన్నప్పుడు “పావలా ఇస్తే, రూపాయి యాక్షన్ చేస్తాడు” అని అనేవారు! అతి సర్వత్ర వర్జయేత్! మితి సర్వత్ర జయేత్! ఇదెక్కడుంది? అనుకోకండి. నేనే సృష్టించా.
పాత్రకు తగినంత భావోద్వేగాన్ని ప్రదర్శించకపోయినా, తక్కువ ప్రదర్శించినా, రెండూ ప్రేక్షకులను మెప్పించలేవు. చార్లీ చాప్లిన్ మూకీ సినిమాలు చూసే ఉంటారు. మొత్తం ఓవర్ ప్లే ఉంటుంది. కానీ అవన్నీ కళాఖండాలు కాదంటారా చెప్పండి? ‘సత్యహరిశ్చంద్ర’ పాత్రను యస్.వి.రంగారావు, యన్టీఆర్ గార్లు ఇద్దరూ పోషించారు. చాలా బ్యాలెన్స్‌డ్‌ గా ఉంటుంది నటన. ఓవర్/అండర్ ప్లేలు అసలుండవు. ‘విప్రనారాయణ’లో అక్కినేని గారి నటన కూడా అలాంటిదే. గుమ్మడి గారు కూడా అలాంటి నటులే.
మా ఊర్లో ఒక ఆర్.ఎం.పి. డాక్టరుగారుండేవారు. ఆయనకు నాటకాల పిచ్చి. ‘దుర్యోధన’ ఏకపాత్రాభినయం మా నాన్నగారి వద్ద నేర్చుకునేవారు. మయసభలో “అదిగో ఆ కనబడు ద్వారము నుండి నిష్క్రమించెద గాక!” అంటూ వెళితే అక్కడ ద్వారం ఉంటే కద! లేదనుకుని ఇంకో దారిలో వెళితే, ద్వారబంధం కురురాజుకు తలకు తగిలి, నొప్పి పెడుతుంది. డాక్టరుగారు అప్పుడు “అబ్బా...” అని దీర్ఘం తీశారు చాలాసేపు. మా నాన్న “అంత పొడుగెందుకురా వెధవా!” అంటే, అయన “అబ్బ!” అని మరీ క్లుప్తంగా అన్నారు. “మొదటిది అతివృష్టి ! రెండోది అనావృష్టి” అని నవ్వారు మా నాన్నగారు! ఆయన దుర్యోధన పాత్రను ‘కురుక్షేత్రం’లో పోషించారట. నేనప్పటికి పుట్టలేదట! రాయలసీమరత్నం, వెల్దుర్తి వెంకట నర్సునాయుడు నాన్నగారి శిష్యులే. ‘గయోపాఖ్యానం’ నాటకంలో అర్జున పాత్రకు ఆయన ప్రసిద్ధి. షణ్ముఖి ఆంజనేయరాజు గారేమో శ్రీ కృష్ణుడు. వారి నటనకు ప్రజలు జేజేలు పట్టారు!
నటనలోనే కాదండోయ్, మన దైనందిన జీవితంలో కూడా అండర్ ప్లే, ఓవర్ ప్లే చేసేవాళ్ళు బోలెడుమంది. పలాసలో నేను ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసేటప్పుడు ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు. ఆయన పేరు జి.ఎస్.ఎన్. ఎవరైనా ఆయనతో ఏదైనా గొప్పగా చెబితే, వెంటనే ఆయన “అందులో గొప్పేముంది?”, “మొదట్నించీ ఉన్నదే కదా!”, “ఇలాంటివి చాలా చూశాను” ఇలా ఆ విషయాని కనిష్టీకరించేవారు. పదం బాగులేదనుకుంటా! అదేనండీ downplay!


ఒకసారి మా ఊర్లో ఒక బంధువింటికి బోజనానికి పిలిచారు. ఆ ఇల్లాలు నాకు వరుసకు మరదలు అవుతుంది. చివర్లో పెరుగు వడ్డిస్తూ, “బావా! ఇంత మంచి పెరుగు మీరు జన్మలో తిని ఉండరు తెలుసా!” అన్నదామె. ఆ పెరుగు పుల్లగా, నీళ్లగా, దరిద్రంగా ఉంది! ఓవర్ ప్లే!
ప్రగల్బాలన్నీ ఓవర్ ప్లే కిందికి వస్తాయి. ‘కన్యాశుల్కం’ లో గిరీశం డైలాగులన్నీ ‘ఓవర్ ప్లే’ కిందికి వస్తాయి. ఆయన కేంబ్రిడ్జిలోనో, ఆక్స్‌ఫర్డ్ లోనో లెక్చరిచ్చే సరికి అక్కడి ప్రొఫెసర్లు అంతా డంగై పోయారట. ఓవర్ ప్లే గిరీశం క్యారెక్టర్‌కు అతికినట్లు సరిపోయింది. సినిమాల్లో యన్.టి.ఆర్. గిరీశం పాత్రను మన కళ్లముందు నిలబెడతారు. ఎ గ్రేట్ అండ్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ పెర్మార్మెన్స్ ఇన్ హిజ్ కెరీర్! ఇదేమిటండోయ్ ఇంగ్లీషు వచ్చేస్తుంది? ఎక్కువైతే మా ఎడిటర్ గారు కోప్పడతారండి బాబూ!!
‘అతి దానాత్ హతః కర్ణః అతి లోభాత్ సుయోధనః
అతికామాత్ దశగ్రీవః అతి సర్వత్ర వర్షయేత్!’
అతిగా దానాలు చేయడం వల్ల కర్ణుడు, అతి లోభంవల్ల దుర్యోధనుడు, అతి కామముతో రావణుడు నశించారు. కాబట్టి ‘అతి’ని అన్నిచోట్లా విడనాడాలని ‘నరసింహ సుభాషితం 85’ చెబుతూ ఉంది. నటులు ఓవర్ ప్లే, అండర్ ప్లే చేసినా నష్టం లేదు. జీవితాల్లో ఇవి రెండూ చేయకూడదు సుమండీ! అనవసరంగా ‘బోలెడు’ ‘హాచ్చర్యపోతుంటారు కొందరు. కొందరు ‘కాష్టకుడ్యాశ్మసన్నిభులు’ (కర్ర, గోడ, రాయితో సమానులు) స్పందించాల్సినంతగా స్పందించరు! ప్రతిదానికీ, “దేశంలో ఎక్కడా లేని విధంగా” అని తగిలిస్తుంటారు కొందరు. “ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!” అన్నారు త్యాగరాజస్వామి! ఎవర్నీ ఏమి అనలేని కాలం! కోపాలెలిపొస్తాయి! అదన్న మాట!