Saturday, December 28, 2024

జీవన్ భద్రాణి పశ్యతి! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

సంస్కృత భాషలోని సూక్తుల్లో ఇది ఎంతో గొప్పది. బ్రతకడం అనేది ఎంత విలువైందో తెలియచేస్తుంది. ఇది ‘శ్రీమద్రామాయణం’ లో వాల్మీకి మహర్షి, ఆంజనేయస్వామి వారి చేత చెప్పిస్తాడు. సుందరకాండలోని 13వ సర్గలో వస్తుంది. సీతాన్వేషణలో తాను విఫలమైనానని మారుతి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ‘అమ్మవారు దొరకలేదని శ్రీరామచంద్రునితో ఎలా చెప్పగలను? ఆ మహనీయునికి నా ముఖం ఎలా చూపించగలను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అనుకుంటాడు పవనపుత్రుడు. కాని వెంటనే తనను తాను సంబాళించుకొని, ఈ శ్లోకం చెబుతాడు. శ్లోకం లోని ఒక భాగమే యథాప్రకారం ప్రసిద్ధం. మిగతాది..
శ్లో: వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, ధృవో జీవిత సంగమః
సాక్షాత్తు శివాంశ సంభూతుడు అమిత బలపరాక్రమసంపన్నుడు, మహాజ్ఞాని, హనుమంతుల వారినే ‘వైఫల్యం’ క్రుంగదీసి ఆత్మహత్యకు పురికొల్పిందే, ఇక సామాన్యుల సంగతేమిటి?
టెంత్, ఇంటర్ పరీక్షా ఫలితాల తర్వాత, పిల్లలు, తాము ఫెయిల్ అయినామనో, ఎమ్‍సెట్, నీట్ లాంటి ప్రవేశపరీక్షల్లో, తామాశించిన ర్యాంక్ రాలేదనో, ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. ఆ మేరకు వార్తలు చూస్తుంటాం. వాళ్లు దుర్బలమనస్కులని మనస్తత్వ శాస్త్రవేత్తలు సెలవిస్తుంటారు. మళ్లీ, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి పరీక్షా ఫలితాల తర్వాత ఈ ధోరణి అంతగా కనబడదు. అంటే దౌర్బల్యం తగ్గినట్లా? లేక, వయోపరిపాకం వల్ల కొంత రియలైజేషన్ వచ్చినందుకా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయి! 15-29 వయస్సుగల వారిలో ఈ టెండెన్సీ అధికమట. ప్రతి సంవత్సరం 7,20,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆత్యహత్యలు చేసుకొంటున్నారట. 73 శాతం మధ్య తరగతి వారే ఇందులో ఉన్నారట.
తమ పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చేయాలని, యు.ఎస్.లో ఎం.ఎస్. చేసి, అమెరికాలో ఆకుపచ్చ కార్డు పొందాలని, తల్లితండ్రులు మొదట్నించి వారి చిన్న బ్రెయిన్‌లో ‘స్లో పాయిజన్’లా ఎక్కిస్తుంటారు. దాన్ని సాధించలేకపోతే వారి, వీరి జీవితాలు వ్యర్థం అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితం నెగెటివ్ అయితే సూయిసైడ్ లకు దారితీస్తుంది. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అన్న గీతావాక్యం వీళ్ల తలకెక్కదు.
కేవలం పిరికివాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారంటే నేనసలు ఒప్పుకోను. తనను తాను చంపుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? పాతాళ భైరవి సినిమాలో, ‘రాణిగారి తమ్ముడు’ రేలంగి, తనను రాకుమారి పెళ్లాడకుండా తోటరాముడిని పెళ్లాడుతూందని, అడవికి వచ్చి, ఒక చెట్టుకొమ్మకు ఉరివేసుకోబోతాడు. ఉరితాడు మెడకు గుచ్చుకుంటుంటే, మెడకు తాడుకు మధ్య ఒక మెత్తని వస్త్రం పెట్టుకొని ట్రై చేస్తాడు. అప్పుడు చూడాలి రేలంగి గారి హావభావాలు. “చావడం అంటే ఇంత కష్టమనుకోలేదు! చచ్చే చావులా ఉంది!” అంటాడు.
ఏదయినా ఒక అకృత్యాన్ని చేయబూనినపుడు ‘అది ఆత్మహత్యా సదృశ్యం’ (సూయిసైడల్) అంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటామని ఊరికే బెదిరిస్తుంటారు. కాని చావరు! దాన్నే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అంటారు. తెలుగులో ఏమంటారో మరి? ‘భావోద్వేగ బెదిరింపు’ సరిపోతుందా? ఒక జోక్ చూడండి. 


 

“నేనిక భరించలేను, రైలు కింద పడి చచ్చిపోతా” అని మగడు బయలుదేరుతుంటాడు. భార్య “ఇప్పుడు బొకారో ఎక్స్‌ప్రెస్సేగా ఉంది? అదెప్పుడు కరెక్టు టైమ్‍కి వచ్చి చచ్చింది? ఒకవేళ లేటుంటే, రెండు కట్టలు కొత్తిమీర, పావుకిలో మిర్చి, వంద గ్రాముల అల్లం, మన రైతు బజార్లో తెచ్చి ఇచ్చి వెళ్ళండి. గోపాలపట్నం దగ్గర చావకండి. కష్టం. జనాలు తిరుగుతుంటారు. కొత్తవలస దగ్గరైతే బెటరేమో ఆలోచించండి” అంటూ ఉంటుంది నవ్వుతూ! ఆయన ఎలాగూ చావడని ఆమెకు తెలుసు! ‘లైట్’ తీసుకొందని అర్థం.
‘ఇద్దరు అమ్మాయిలు’ సినిమాలో అనుకుంటాను, డి.వి నరసరాజుగారు సంభాషణలు. ఆయన చాలా హాస్యచతురుడు. సూర్యకాంతం “నేను నూతిలో దూకి చచ్చిపోతా” అంటుంది. ఆమె కూతురు రమాప్రభ. “అమ్మా! నీవు నూతిలో దూకి చావద్దే!” అంటుంది గోముగా. “నా తల్లే, నా తల్లే! నేనంటే ఎంత ప్రేమో?” అంటుంది సూర్యకాంతమ్మగారు. “అదేం కాదే! నీవు దూకితే, నూతిలోని కప్పలన్నీ చచ్చిపోతాయే!” అంటుంది రమాప్రభ. ఇలాంటి జోక్‌లు ఎందుకు రాశానంటే ‘ఆత్మహత్య’ అన్న భయంకర కాన్సెప్ట్‌ను హాస్యం కలిపి పలుచన చేద్దామని.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం చాగంటి కోటేశ్వరరావు గారిని, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సంస్కారం లాంటివి చెబుతారట. చక్కని ఆలోచన. ఆయనంతటి జ్ఞాన సంపన్నులు చెపితే, పిల్లలు తప్పక వింటారు. ఈ ఆత్మహత్యలు ఎంతటి అర్థం లేనివో ఆయన పిల్లలకు వివరించాలని నా సవినయ మనవి. చెప్పేవారిని బట్టి కదా ఆచరణ ఉంటుంది! ఆ విషయంలో, చాగంటి వారిని మించిన వారెవరు?
ప్రజాఉద్యమాల్లో పాల్గొని, నిరాశతోనో, ఉద్యమానికి మరింత స్ఫూర్తి నివ్వాలనో, కొందరు ‘ఆత్మాహుతి’ చేసుకుంటుంటారు. వారు నిజంగా గొప్పవారు. కాని, అది ఉద్యమ విజయానికి దోహదం చేయదని వారికి చెప్పేవారెవరు? గర్ల్ ఫ్రెండ్ తనను ప్రేమిస్తానని చెప్పకపోతే, వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి చస్తానని బెదిరిస్తుంటారు, భావి భారత యువకులు! ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోసేవారి కంటే, కత్తితో గొంతు కోసేవారి కంటే వీరు చాలా చాలా బెటర్. ‘వద్దు దూకవద్ద’ని పోలీసులు, హ్యాండ్ మైకులో అరుస్తూ సదరు అమరప్రేమికుడిని కాపాడి జాగ్రత్తగా క్రిందికి దింపి తీసుకు రావాలని నానాపాట్లు పడుతుంటారు పాపం! ఏమొచ్చినా, పోలీసుల చావుకే వస్తుంది. ‘బ్రతికి యుండిన శుభములబడయవచ్చు’ కదా! “బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చు” అన్నారు! ఈ బలుసాకును రైతుబజారులో ఎప్పడూ చూడలేదు. సి.పి. బ్రౌన్ గారు దీన్ని ‘రెచ్చెడ్ డైట్’ అన్నారు. దరిద్రపు తిండి! కనీసం దాన్నైనా తిని బ్రతకమని! అదన్నమాట.
 

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 8వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 8వ భాగం సంచికలో చదవండి.
~
“స్వామి! ఒక సందేహం!” అన్నాడు శిష్యుడు. వాడి ముఖంలో అడగవచ్చునో లేదో అన్న వ్యగ్రత.
“చెప్పు నాయనా.”
“దేవతార్చన చివర, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అన్నారు కదా! అవన్నీ లేని పూజ పూజ అవుతుందా?”
శర్మగారు కాసేపు మౌనం పూనారు.
“నాయనా నీ ప్రశ్నలో చాలా లోతైన వేదాంతం ఉంది. జాగ్రత్తగా విను.”


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/srimadramaramana-pds-serial-8/

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 15వ భాగం లింక్

మరియును, నీవు పరమాత్మయైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉన్నావు. ఆ పరాత్పరుండు,
మ.కో.:
ఆది అంతము లేని దేవుడు ఆత్మరూపుడు శౌరియే
వేదవేద్యుడు బ్రహ్మకైనను విశ్వపూజ్యుడు విష్ణుడే
ఆదిలక్ష్మికి ప్రాణనాథుడు అంబుజాక్షుడు శ్రీహరిన్
పాదపద్మము లాశ్రయించితి ప్రాపు నీకవె నిత్యమున్
~


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-15/ 

 

నా యాత్రా రచన 'అన్నవరం – పాదగయ – అంతర్వేది – క్షీరారామ దర్శనం-1' - లింక్

ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలను సందర్శించాను. ఆ యాత్రానుభవాల రచన మొదటి భాగం సంచికలో చదవండి.

 


https://sanchika.com/annavaram-padagaya-anatarvedi-ksheeraaramam-darshanam-pds-1/


డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి అవధాన కార్యక్రమం - ఆహ్వానం

05 జనవరి 2025 నాడు నల్లకుంట లోని శృంగేరీ శంకరమఠంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి అష్టావధాన కార్యక్రమానికి నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. అవధానాలపై ఆసక్తి ఉన్నవారు హాజరు కాగలరు.


 Click on the image to view in bigger size

 

Sunday, December 22, 2024

దంతసిరి - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

బాగా తిని జీర్ణించుకోగల శక్తి ఉన్నవారిని, వీడికి ‘దంతసిరి’ దండిగా ఉందంటారు ఉత్తరాంధ్రలో. అన్ని చోట్లా దీనికి ‘తిండిపుష్టి’ అని పేరు. ఇంగ్లీషులో వీళ్లను ఫుడీ (Foody) లంటారు. అలా అంటే నాకు ‘ఫెడీల్మని’ అన్న మాట గుర్తుకొస్తుంది. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. పదాల సౌండ్‌లో సామ్యం! అంతేనండి మాస్టారు!
‘ఆహార నిద్రాభయ మైథునం చ సామాన్యమే తత్పశుభిర్న రాణాం’ అంటున్నది సుభాషితం. శ్లోకం ఇంకా ఉంది కాని, మన టాపిక్‌కు ఇంత వరకు చాలండోయ్! తిండి, నిద్ర, భయం, శృంగారం, పశువులకు మనుషులకు సమానమైన లక్షణాలంటున్నాడు సుభాషితకర్త. కాని నేనొప్పుకోనంటే ఒప్పుకోను! మిగతావి ఇప్పుడొద్దు గాని, ఆహారాన్నే తీసుకుందాం. జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి. కడుపులో అనీజీగా ఉంటే తినడం మానేస్తాయి. మరి మనమో! ఆలోచించండొకసారి! ‘కడుపు నిండిన అమ్మకు గారెలు చేదు’ అని సామెత. ఆమె ఎవరో, ఆమెకెందుకు చేదో గాని, నా మటుకు నాకు అలా లేదండి. కడుపు నిండినా, మాంఛి కరకరలాడే అలసంద (బొబ్లర్లు) వడలు, ఎవరయినా బలవంతం చేస్తే, రెండు తినేస్తా!
దీనినే ‘కక్కుర్తి’ అంటారండి! ఇది మంచిది కాదని తెలిసినా, ‘జిహ్వచాపల్యం’ అనేదొకటుంది కదండి! దాన్ని గెలవడం మహామహులకే చేతకాదు. మనమెంత? విశ్వామిత్రుడంతటివాడు ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్నాడని ఐతిహ్యం. ‘క్షుద్బాధ’ ఎంతో భయంకరమైనది. ‘జఠరాగ్ని’ అని ఒకటుంది. అదీ ఆకలి అనే అగ్ని. అది నిరంతరం పొట్టలో ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.


తిన్నది అరగడం ఒక గొప్ప వరం. జీర్ణశక్తి లోపిస్తే తినడాన్ని ఎంజాయ్ చెయ్యలేము. ఎంజైములు ఊరకపోతే ఎంజాయిలుండవండోయ్! కొందరికి జీర్ణశక్తి అద్భుతం. నేను పలాసలో పనిచేసేటప్పుడు మా కొలీగ్, ఫిజికల్ డైరెక్టర్, మల్లికార్జున అని ఉండేవాడు. ఆయన మంచి తిండిపుష్టి గలవాడు. ఆయనకు మా సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ తుంబనాధం గారు ‘దంతసిరి వస్తాదు’ అని పేరుపెట్టారు. యస్.వి. యూనివర్సిటీ వాలీబాల్ ఛాంపియన్. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ చేసి, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వెళ్లాడు. నాకు మంచి మిత్రుడు. పాపం చిన్నవయసులో చనిపోయాడు. అజీర్ణం వల్ల కాదులెండి, హార్ట్ ఎటాక్. ఒకసారి మా ఇంకో కొలీగ్, ఇతనితో పందెం కట్టగా మా పి.డి.గారు యాభై అరటికాయ బజ్జీలు అవలీలగా తిని, వంద రూపాయలు గెల్చుకొన్నాడు. 1984లో నండి! వందంటే మాటలా? మా జీతాలే వందల్లో ఉండేవి! ఆ అరటికాయ బజ్జీలు నిలువుగా తరిగి చేసేవారు. పెద్దవి!
‘దంతసిరి’ అనేసరికి నాకు మా నాన్నగారి మిత్రులు తిమ్మాభొట్లుగారు గుర్తొస్తారు. ఆయనను మేం ‘పెదనాన్నా’ అనేవాళ్లం. సన్నగా ఉండి కడుపు లోపలికి అంటుకుపోయి ఉండేది. నాకప్పుడు పదేళ్లుండొచ్చు. నాన్న ఆయనను ‘వృకోదరా’ అనేవారు. ‘వృకం’ అంటే ‘కడుపులో రగిలే అగ్ని’ అని ప్రముఖ భాషాశాస్త్ర పరిశోధకులు తిరుమల రామచంద్రగారు చెప్పారు. మా తిమ్మాభొట్లు పెదనాన్న గారికి పొట్టలో వృకం ఉంది. ఆయన లైఫ్ స్టైల్ కూడా విభిన్నం. భీమసేనుడికి ఆ పేరుంది. కానీ శారీరికంగా ఆయనెక్కడ? ఈయనెక్కడ? మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో రామళ్లకోట అనే ఊర్లో ఆయన నివాసం. మధ్యలో బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అక్కడ లలితా పరమేశ్వరి గుడిలో ఆయన అర్చకులు. చుట్టు పక్కల ఊర్లలో పౌరోహిత్యం. అంతా నడకే, చెప్పులు వేసుకునేవాడు కాదు.
మా ఊరు (వెల్దుర్తి)లో ఏదైన పౌరోహిత్యం పని ఉంటే, ముందు మా యింటికి వచ్చి, మా అమ్మతో, “లక్ష్మీనర్సు తల్లీ! ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంట్లోనే చేయి కడుగుతా, అమ్మా!” అని చెప్పి వెళ్లేవారు. చేయి కడగటం అంటే భోంచేయడం. అమ్మకు ఆయన భోజన పరాక్రమం తెలుసు కాబట్టి ‘తగినంత’ వండేది. ఆయన నన్ను ‘దత్తప్రభూ’ అని పిలిచేవారు ప్రేమగా. నేనూ, మా తమ్ముళ్ళు, చెల్లి ఆయన తింటుంటే చూడడానికి చేరేవాళ్లం. ముగ్గురు నలుగురు తినేంత భోజనం కావాలి. తద్దినాలకు ఆయన భోక్తగా వస్తే వడలు ఎక్కువ చేయాలి. నెయ్యి అరచేతి నిండా పోయాలి. పప్పు, వంకాయకూర కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి తినేవారు మా తిమ్మాబొట్లు పెదనాన్న. అలా తిన్నా కొంచెమైనా పొట్ట రాలేదు. రోజూ 16 కిలోమీటర్లు నడిస్తే ఇంకేం వస్తుంది చెప్పండి? భోంచేసి, కాసేపు కునికి, మళ్లీ నడుచుకుంటూ రామళ్లకోటకు వెళ్ళేవారు. ధన్యజీవి మా పెదనాన్నగారు.
ఇప్పటి తరానికి నాజూకుతనం, తిండిలో! రెండిడ్లీ, సింగిల్ వడ తింటే ఆపసోపాలు! మా చిన్నతనంలో ‘సింగిలిడ్లీ బకెట్ సాంబార్’ అనే నానుడి ఉండేది. అదేదో సినిమాలో సునీల్ కోసం బేసిన్ నిండా రెండు డజన్ల ఇడ్లీలు తెస్తాడు సర్వర్ సుందరం. “మనిషన్న వాడెవడయినా అన్ని యిడ్లీలు తింటాడా? ఒకటి తీసెయ్!” అంటాడు సునీల్! “తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్!” అన్నారు కదా గురజాడ! కాబట్టి కామ్రేడ్స్, బాగా తినండి! తర్వాత పడుకోకుండా కష్టపడండి. ‘ఈసురోమని’ ఉండద్దు! అదన్న మాట!


నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 7వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 7వ భాగం సంచికలో చదవండి.
~
పెదరెడ్డి అన్నాడు “ఆయన అట్ల రాసినాడు గాని, అందరూ ఒకటే.. ఎట్లా అయితారు? యాడుందే వాండ్లు ఆడ ఉండాల”
అల్లుడు జాలిగా మామవైపు చూశాడు. ఏదో అనబోతూంటే కౌసల్య కళ్ళతోనే వారించి ఇలా అంది ఇంగ్లీషులో
“ఫర్ జనరేషన్స్, దే హ్యావ్  బీన్ విత్ దట్ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్. మహీ! బెటర్ నాట్ టు ఆర్గ్యూ విత్ దెమ్.”
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/srimadramaramana-pds-serial-7/