Sunday, May 26, 2024

దురదలు... పలు రకాలు - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 26 మే 2024

కం:
తీట గల భాగ్యశాలికి వాటముగా
గోళ్ళు ఉంటే వేణ్ణీళ్ళున్నన్
సాటియె సౌఖ్యము భువిలో
తీటే దేవేంద్ర పదవి తెలియుము నరుడా!
అన్నాడు వెనకటికి ఒక అధిక ప్రసంగి ఐన కవి.
తీటను దురద అని, జిల అని, దూల అని కూడా అంటారు.
రాయలసీమలో మేం దీన్ని నవ్వ అంటాం, ఇంగ్లీషు వాడు దీన్ని ఇచ్చింగ్ సెన్సేషన్ అన్నాడు. రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడే కదా! అందుకే, ఏకం సత్ విప్రాః బహుథా వదన్తి అంటూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మాటలు వేరైనా అరిస్టాటిల్ గారు చెప్పినట్లు దాని ఇంపోర్టు (పరమార్థం) ఒక్కటే. చిన్నప్పుడు నేను ప్రతిదానికీ ఆరాట పడిపోతుంటే మా అమ్మ 'ఈ వెధవకు అతి ఉలగరం!' అని ప్రేమగా విసుక్కునేది. అమ్మలెప్పుడూ ప్రేమగానే విసుక్కుంటారు. కానీ, భార్యలు మాత్రం నిజంగానే విసుక్కుంటారు సుమండీ. ఉబలాటం అనే పదం కూడా దురదకు సమానార్ధకమే తెలుసాండీ!
దురద గుండాకు అని ప్రకృతిలో ఒక దాన్ని దేవుడు సృష్టించాడు. అది పూలు పూయదు. కాయలు కాయదు. కానీ, దాని కొమ్మతో మేని మీద నిమిరితే, ఒళ్ళంతా విపరీతమైన దురదలు పుట్టుకొస్తాయి. మన పాత జానపద సినిమాల్లో ఎన్టీఆర్ అంజిగాడితో కలిసి విలన్లు రాజనాలనో, సత్యనారాయణనో దురదగుండాకు పూసి ఏడిపిస్తుంటారు మారు వేషాలలో! హాల్లోని ప్రేక్షకులందరికీ మారు వేషగాళ్ళు ఫలానా అని తెలుసు. విలన్లకు తప్ప. అదే చలనచిత్ర చమత్కారమంటే!


అసలు విషయం వదిలేసి ఎక్కడికో... వెళ్ళిపోయాను. ఈ రోజు నేను చెప్పదల్చుకున్నది శరీరం మీద వచ్చే దురద గురించి కాదండోయ్! మనసుల్లో వచ్చే దురద గురించి. మొదటిది కాసేపు గోక్కుంటే తగ్గుతుంది. గోక్కోవడం వేరు, గోకించుకోవడం వేరు. మీకు తెలియంది కాదు, వెనకటికి ఒకాయన కొడుకుని అడిగాడట జంధ్యం వల్ల ప్రయోజనం ఏమని? వీపు గోక్కోవడానికి భేషుగ్గా పని చేస్తుంది పితాశ్రీ! అని చెప్పాడట ఆ పుత్ర రత్నం. చక్కగా రోజూ సంధ్య వార్చుకునే శ్రోత్రీయులు నన్ను క్షమించాలి! పెళ్ళితో పాటు వడుగు చేసుకునే నవయువకులు, సంధ్య అంటే అదేదో అమ్మాయి పేరనుకునే నాగరికులకు మాత్రం నో అపాలజీ!! ఇంగ్లీషు వారికి 'సెవెన్ ఇయర్స్ ఇచ్' అని ఉంది లెండి. పెళ్ళయిన ఏడేళ్ళకు భార్యంటే మొహం మొత్తి పక్కచూపులు చూడటాన్ని అలా అంటారు. అదేం పోయే కాలం అని
విస్తుపోతున్నారా? మనలాగ జీవితాంతం ఒక్కరికే కట్టుబడే పవిత్ర వివాహ బంధం కాదు వాళ్ళది. నాతి చరామిలూ, నాతిచరితవ్యాలూ వాళ్ళకు ఉండవు. 'సెవెన్ ఇయర్స్ ఇచ్' మీద చాలా జోక్స్ ఉన్నాయి. నెట్లో చదివి ఎంజాయ్ చేయండి.
కీర్తి కండూతి కూడా దురద కిందికే వస్తుంది. కండూతి అనేది సంస్కృత పదం. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకోవడం, దాని కోసం మీడియాలో అవాకులూ, చవాకులూ వాగడం, డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవడం, డబ్బులిచ్చి పిహెచ్.డి థీసిస్లు రాయించుకోవడం - ఇలాంటివన్నీ అవే.
షాపింగ్‍లు చేసి మాల్స్ వాళ్ళను పోషించడం కూడా ఒక విధమైన తీటే. ఆ పేరుతో అనవసరమైనవన్నీ వాళ్ళు అమ్ముతారు. కొనే వాళ్ళకు ఇంగితం ఉండాలి కదా! దీన్ని కన్యూమరిజం ఇచ్ అని అందామా? ఇఎమ్ఐల కల్చర్ వచ్చి ఈ దురద ఇంకా పెరిగింది. వీకెండ్ ఔటింగ్‍లు సరేసరి! వీటి వల్ల టెక్కీల పర్సులు weakened అవుతూ ఉంటాయి. బంగారంలా ఉన్న కారును ప్రతి మూడు సంవత్సరాలకు మార్చి, ఎక్స్ఛేంజ్ ఆఫర్‍లో కొత్తది తీసుకోవడం ఒక దురద.
జీవితాంతం కార్ లోన్ తీరుస్తుంటే కాని వారికి తోచదు. వారి డబ్బు వారిష్టం. నీకెందుకోయ్? అంటున్నారా? నాదీ ఒక రకమైన దురదేనండి!
దూల అనే దొకటుంది. మన కొత్త సినిమాల్లో రవితేజ, బ్రహ్మానందం లాంటి వారు దూల తీరిందా? అంటూ హాస్యాన్ని పండిస్తుంటారు. బాగా శాస్త్రి అయిందిలే! అని కవి హృదయం. ఇక సెల్లు దూల అని ఒకటి వచ్చింది. తనకు తెలిసినది అవతల వారికి తెలియనిది (ముఖ్యంగా నెగెటివ్ అంశాలు) వెంటనే ఫోన్ చేసి చెబితే గాని ఆ దూల తీరదు. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టుగా ఈయన కల్పనా చాతుర్యం కొంత జోడించి, వండి వారిస్తే గాని కడుపుబ్బు తగ్గదు. "నీకు తెలుసా వదినా! ఆ త్రిపుర సుందరి కొడుక్కి ఆల్రెడీ పెళ్ళయి, రెండేళ్ళ కొడుకున్నాడట. అమెరికాలో! కోడలు కిరస్తానం పిల్లట! ఈమేమో మా వాడికి సంబంధాలు చూస్తున్నామని గొప్పలు చెబుతూ ఉంటుంది". వాళ్ళ కుటుంబం తిప్పలు వాళ్ళు పడతారు! ఈమెకెందుకు చెప్పండి! ఈ 'అట' లు చాలా థ్రిల్‌ను కలిగిస్తాయి. చెప్పేవారికి, వినేవారికీ కూడా! దీన్ని సందేశ దూల అనవచ్చు.
ఉచిత సలహాలు ఇవ్వడం కూడా అలాంటిదే.! నిన్నెవడడిగాడు? అంటే సరి... పరువు పోతుంది. దూల అనేదే లేనివారు సమాజంలో ఉండరు. దాన్ని నియంత్రించుకోవడంలోనే వివేకం ఉంది. పరస్పర ప్రశంసలు కూడాఈ కోవకే వస్తాయి. 'నా వీపు నీవు గోకు. నీ వీపు నేను గోకుతా!' అన్నట్టు అవి సుఖంగా ఉంటాయి. అదన్న మాట!

'మహాప్రవాహం!'-28

వీర దస్తగిరి మింద జెయ్యేసి, “ఒరే, నాకు ఒక దావ సూపిచ్చినావు. తొందరగా పని నేర్చుకోని స్తిరపడల్ల. మా నాయినను అమ్మను సుకపెట్టల్ల” అన్నాడు.
“నీవేం ఎదారుపడగాకు. సిన్నాయన అస్తవాసి మంచిది. ఆ యప్ప కాడ పని నేర్చుకున్నోల్లు, శెడ్లు పెట్టుకోని బాగుపడినారు” అన్నాడు దస్తగిరి.


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-28/


వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం

ఇటీవల తెలుగు కళాసమితి విశాఖ వారు నిర్వహించిన కథానాటిక రచన పోటీల విజేతలకు పురస్కార ప్రదాన సభ తెనాలిలో జరిగింది. ఈ పోటీలలో నాకు తృతీయ బహుమతి లభించింది. ఈ పురస్కారం స్వీకరించేందుకు తెనాలి వెళ్ళి, అక్కడ ప్రసిద్ధమైన వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శించుకున్నాను. 


 ఆ వివరాలను సంచికలో చదవండి.

https://sanchika.com/vaikunthapuram-venkateswara-swamy-aalaya-darshanam-pds/


కథా నాటిక రచనా పోటీలు విజేతలకు పురస్కార ప్రదాన సభ – నివేదిక

తెలుగు కళాసమితి విశాఖ వారు నిర్వహించిన కథానాటిక రచన (కథను నాటికగా మంచి రాయడం) పోటీలలో బహుమతి పొందిన రచయితలకు, తెనాలి దగ్గర కొలకలూరులో, 19 మే 2024 న, పురస్కార ప్రదాన సభ జరిగింది. ఈ పోటీలలో నాకు తృతీయ బహుమతి, పదివేల రూపాయల నగదు పురస్కారం లభించాయి. 

 


ఆ బహుమతి ప్రదాన సభ నివేదిక సంచిక వెబ్ పత్రికలో చదవండి.

https://sanchika.com/kathanatika-poteela-puraskara-pradaana-sabha-nivedika/

Wednesday, May 22, 2024

ప్రజాస్వామ్య ప్రహసనం!

అభ్యదయ రచయితల సంఘం (అరసం) వారి.. 'ఎన్నికల భారతం..' కవితల పోటీలో ఎంపికైన, వారి సంకలనం ప్రచురితమైన, నా కవిత 'ప్రజాస్వామ్య ప్రహసనం' చదవండి. 🙏

 

 

 ప్రజాస్వామ్య ప్రహసనం!


ఎన్నెన్నికలొచ్చినా ఏమున్నది గర్వకారణం!
పాలక జాతి సమస్తం పరదోపిడీ పరాయణత్వం.

ఎన్నికలలో, ఎన్ని కలలో! ఎన్ని కల్లలో!
ప్రజాస్వామ్యం దుప్పటడుగున, ప్రజానేతలు కనే కలలు
స్వార్థమనే పెను కడలి అలలు.

సిగ్గూశరం లేకుండా, చీమూనెత్తురూ లేకుండా
అధికారపార్టీలోకి అవలీలగా ఫిరాయిస్తుంటే
విస్తుబోయి చూస్తోంది, అంబేద్కర్ ఆత్మ.
రాజకీయాల్లో విలువలనే వలువల నెప్పుడో వదిలేసి
నగ్నంగా తిరుగుతున్నారు ప్రజల మధ్యన.

సొంత యింటికొచ్చానని, పైగా ఆత్మవంచన
యాంటీ డిఫెక్షన్ చట్టానికి అందమైన పైడిపూత
ఓటర్లంతా వెర్రిపప్పలనా వీళ్లనుకొంటున్నది?
ప్రజాగ్రహం ప్రవహిస్తే కారా వీరంతా పరాజితులు?
కండువా మారిస్తే దండిగా దండుకోవచ్చనే నీచులు.

‘క్విడ్ ప్రోకో' రూపం మార్చుకుని సంక్షేమ పథకాలయ్యింది.
ఎన్నికల ముందు డబ్బు పంచేవారొకనాడు! అది ఔట్ డేటెడ్!
అధికారంలోకి వచ్చిన్నాటి నుండి అనుచితాల పందేరం
చట్టానికి దొరక్కుండా ఓట్లు కొనే చక్కని వ్యవహారం
శ్రమశక్తిని నిర్వీర్యం చేసి, జనాలను సోమరులను చేసే ఘోరం.

మొదలవుతాయ్ ఎన్నికల ముందు నీతులు, హితోక్తులు
సచ్ఛీలురనే ఎన్నుకోండంటూ, ఓటును అమ్ముకోవద్దంటూ
పైగా అది పవిత్రమైనదంటూ చెప్పడానికి ఏం కష్టం?
దుర్భిణీ వేసి వెతికినా కనబడరే సచ్చీలురు! సత్పురుషులు!
అలాంటప్పుడు ఎందుకీ నీతి చంద్రికలు, సూక్తి ముక్తావళి!

అందుకే 'నోటా' అంటే నాకిష్టం! అదే నా అభ్యర్థి!
ఎదురుగ్గా కొన్ని రాళ్లు పెట్టి, తలకొట్టుకో ఏదో ఒక దానితో!
అదీ ఎన్నికల విధానం. బుద్ధిలేని వ్యవహారం.
“నా కెవరూ నచ్చలేదు” అన్న బటన్ నొక్కితే
చెంపపెట్టు అవుతుందది దుశ్శీలుర జాబితాకు.

దేశసేవ అనేది పెద్ద లాభసాటి కార్యక్రమం
ప్రజాసేవలో తరించడానికెందుకింత తాపత్రయం?
సర్పంచ్ పదవి కోసమే కోట్లు గుమ్మరిస్తున్నవాడు
అంతకు పదిరెట్లు దోచుకోవడానికే కదా చూస్తాడు
డబ్బు కట్ల పాములతో చుట్టబడిన ఎన్నికలవి!

మేధావుల మౌనం జాతికి ఒక శాపం
స్వార్థరహిత, జనహితపర యువతా! రా!
ప్రజాస్వామ్య కదనంలో వారి సింహభాగం
నిజాయితీ, నిస్వార్థం అజాగళస్తనాలవుతున్నప్పుడు
అవినీతి చెదలంటని యువకులు, మేధావులే దేశానికి దివిటీలు.

ఓటు వెయ్యమని డబ్బిచ్చేవాడెంత వెధవో
ఒక్కసారి ప్రజలంతా జూలు విదిల్చిన సింహాల్లా
ప్రజాస్వామ్య రక్షణకై గర్జించాలి! హర్యక్షాలై
నిర్జించాలి నీచ నికృష్ట రాజకీయ ప్రహసనాన్ని.
(ఎన్నికల భారతం, కవితా సంకలనంలో 81-82 పేజీలు)


 

 

 




సర్వరక్షా కవచం... కరావలంబ స్తోత్రమ్!

నృసింహ జయంతి పర్వదినాన, ఆదిశంకరుల కరావలంబ స్తోత్రం నేపథ్యం పై నా లఘు వ్యాసం 🙏
నేటి (22 మే 2024) ఆంధ్ర ప్రభ దినపత్రిక 'చింతన' పేజీలో చదవండి.

Right click on the image and select 'open the link in new tab' option to view in bigger size.
 


Tuesday, May 21, 2024

పెండ్లి కొడుకాయె లే.. నరసింహుడు

నృసింహ జయంతి సందర్భంగా - నరసింహ స్వామి వారి కళ్యాణం పై, నేను వ్రాసి, స్వర పరచి, పాడిన కీర్తన 'పెండ్లి కొడుకాయె లే.. నరసింహుడు'. రాగం తిల్లాంగ్


 

నారసింహుడెవరు?

నృసింహ జయంతి సందర్భంగా నృసింహావిర్భావం, కరావాలంబ స్తోత్ర నేపథ్యం, ఎఱ్ఱన నృసింహ పురాణం, పోతన ప్రహ్లాద చరిత్రం.. తులనాత్మక పరిశీలన.. ఇటువంటి అంశాలతో నా ప్రత్యేక ప్రసంగం.. స్వాధ్యాయ ఛానెల్‍లో.

 


నృసింహ జయంతి శుభాకాంక్షలు



శ్రీ లక్ష్మీ నృసింహ ధ్యానశ్లోకం
~
సత్య జ్ఞాన సుఖ స్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతి ప్రసన్న వదనం భూష సహస్రోజ్వలం
త్ర్యక్షం చక్రపినాకసా భయకరాభి భ్రాణిం కచ్చపిం
చక్రీభూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే

Saturday, May 18, 2024

నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 19 మే 2024

ఛీ నోర్ముయ్! ముందు నీవు ముయ్యి! ఇంతకూ ఎవరి నోరు
వారు మూసుకోవాలా లేక ఎదుటివారి నోరు ముయ్యాలా? చిత్రంగా ఉంటుంది తెలుగు! 'ఏమిటి తల తిరుగుతోందా?', ''తమరిదా... చిత్తం... తిరగడం లేదండీ.. మామూలు గానే ఉంది" ఇలా ఉంటాయి భాషా విన్యాసాలు.. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదండోయ్ ప్రశాంతత. వాగడం ఈజీ గానీ, నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం. అందుకే దాన్ని మన శాస్త్రాలు పరబ్రహ్మతత్వంతో 'సమానం' అన్నాయి. నిశ్శబ్దానికి అంత వెయిట్ ఉందన్న మాట! నిశ్శబ్దానికి బ్రాండ్ అంబాసిడర్స్
పీవీ నరసింహారావుగారు, మన్మోహన్ సింగ్ గారు! ఇద్దరూ కాకలు తీరిన మేధావులు, కానీ అసలు మాట్లాడరు. పివి గారు కింది పెదవిని బిగించుకుని కూర్చుంటారు. మన్మోహన్ గారు పెదవి విప్పితే ముత్యాలు రాలుతాయేమోనని జాగ్రత్తగా ఉంటారు. ఇద్దరూ కలిసి భారతదేశ ఆర్థిక సంస్కరణలకు ఒక గొప్ప ఊపునిచ్చారు మరి!
వాక్కు అనే పదం నుంచి వాగడం పుట్టిందేమో ఖర్మ! వాగాడంబరం అని సంస్కృతంలో ఒక చక్కని పదం ఉంది. అర్థం పర్థం లేకుండా వాగుతూ ఉండేవారిని ఇంగ్లీషులో చాటర్ బాక్సులంటారు. 'స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్' అన్నారు వాళ్ళే. మనవాళ్ళేం తీసిపోయారనుకుంటున్నారా? 'కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా?' అన్నారు కదా!
వాక్చాతుర్యం వేరు, వాగుడు వేరు. తమ మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేస్తారు కొందరు వక్తలు! కొందరికి సేజి మీద ఏదైనా మాట్లాడటమంటే కాళ్ళు వణుకుతాయి. నోరెండిపోతుంది. గొంతు పెగలదు! వీరిని 'సభా పిరికి' అంటారు. ఈ పదం దుష్టసమాసం సుమండి!
'ఊరుకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సుఖం లేద'ని.. మనకో నానుడి ఉంది. దీన్నే ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఆర్ డబ్ల్యు ఎమర్సన్ గారు ఇలా చెప్పారు చమత్కారంగా! 'సైలెన్స్ ఈజ్ పూలిష్, ఇఫ్ యు ఆర్ వైజ్! బట్ వైజ్, ఇఫ్ యూ ఆర్ పూలిష్'. పదాలతో ఆడుకోవడం అంటే ఇదే! దీని అర్థం లోతైనది. "నీవు తెలివైనవాడివైతే, నిశ్శబ్దంగా ఉండటం తెలివితక్కువతనం.. అదే నీవు తెలివితక్కువవాడివైతే నిశ్చబ్దంగా ఉండటమే తెలివైన పని!". అదీ సంగతి.

 



నేను శ్రీకాకుళం జిల్లా పలాసలో లెక్చరర్ పని చేస్తున్నప్పుడు మా కాలేజీకి రెండు కిలోమీటర్ల దూరంలో నెమలికొండ అనే దత్త క్షేత్రం ఉండేది. దాన్ని స్థాపించి అభివృద్ధి చేసిన వారు శ్రీ త్రినాథ యోగి. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రసన్నంగా ఉండేవారు. 'సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్'. భావవ్యక్తీకరణకు నిశ్శబ్దాన్ని మించిన మార్గం లేదు. ఆ ఆశ్రమంలో గోడల మీద రాసిన సూక్తులు 40 సంవత్సరాల తర్వాత కూడా నేను మర్చిపోలేదు. అతి భాష, మతి హాని! మిత భాష అతి హాయి! మితభాషిత్వాన్ని ఇంగ్లీషులో రిటైసెన్స్ అంటారు. గొప్ప పదం అది. నిశ్శబ్దం ఎంత గొప్పదో ఒక కవి ఇలా చెప్పారు.
~
సీ.
నీకు నచ్చని చోట నీవు భేదింపంగ
నిశ్శబ్దమును మించు నేర్పులేదు
నీదు దుఃఖంబును నీవు వ్యక్తముజేయ
తగును నిశృబ్దంబు తానె యెపుడు
మరణించువారికి మంచి సంతాపంబు
నిశ్శబ్ద రూపమై నింపు శాంతి
మొండి వాదనలను దండిగా నెదిరించి
నిశ్శబ్దమే గెలిచి నిలుచు సతము
ఆ.వె.
కాని, మానవ హక్కులు హనన మంద
వసుధ నన్యాయమది చాల వ్యాప్తి చెంద
సాటి మానవులాపద జేబు గనగ
నీవు భజియించు మౌనంబు నేరమగును
~
మన అయిష్టతను వ్యక్తం చేయడానికి, దుఃఖాన్ని ప్రకటించడానికి, మరణానికి సంతాపం ప్రకటించడానికి మొండి వాదనలను ఎదుర్కొనడానికి నిశ్శబ్దమే సరైనదట. కానీ ఎదుటి వారికి అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం నేరమవుతుంది. ఇంతకూ కవి పేరు చెప్పలేదేం? అని అడుగుతున్నారా? కనుక్కోండి చూద్దాం!. అర్ధం చేసుకోవాలబ్బా!
మౌనం అర్ధాంగీకారం, మౌనేన కలహం నాస్తి, ఇలాంటివి లౌక్యంతో కూడిన స్ట్రాటజీలే సుమండి. ఎదుటి వారు ఏం మాట్లడకపోతే సగం అంగీకరించినట్లేనట! కామ్‌గా ఉంటే కలహాలే రావట. దీన్నే రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటారు (స్ట్రేటజిక్ సైలెన్స్), 'నా నోరు మంచిది కాదు., నన్ను కెలకొద్దు' అనే వారితో జాగ్రత్తగా ఉండాలండోయ్!
'పెదవి దాటితే పృథివి దాటుతుంది..', 'ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు'.. అయినా దాపరికం లేమికి మగ, ఆడ తేడాలేదు! సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సమాచార విప్లవం మరి ముదిరింది. ఎదుటివాడు స్పందించకపోతే తెలంగాణలో 'సప్పుడు సేస్తలేడు' అంటారు. రాయలసీమలో 'కుయ్ అనలేదు, కయ్ లేదు' అంటారు. కోస్తాలో 'కిమ్మనకుండా ఉండిపోయాడు' అంటారు. కిం... అంటే 'ఏమిటి'... అని అర్థం. యాసలు వేరైనా భావం ఒకటే!
కాబట్టి మాటలను పొదుపుగా వాడండి. బ్రీఫ్ బట్ ఎఫెక్టివ్, క్లుప్తంగా, ప్రభావవంతంగా ఉండాలి మాటలు. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి మూగది, బ్రహ్మానందంతో పెళ్లయిం తర్వాత ఆమెకు మాటలు వస్తాయి. ఆమె వాగుడును ఆ మొగుడు తట్టుకోలేకపోతాడు. ఇంతకూ సౌండ్ పొల్యూషన్‌కు కారణాలలో అతి వాగుడును కూడా చేర్చవచ్చా? ఆలోచించండి! మౌనంగానే ఎదగమని కదా కవి గారు చెప్పింది! అదన్న మాట!

'మహాప్రవాహం!'-27

“ఇప్పుడు ఎవలయినా ఒకటే. కస్టపడి పనిచేసేది ముక్యము. మనం దూదేకులోల్లము. యానాడయిన దూది ఏకినామా సచ్చినామా!” అని నగినాడు.
“కాని వీండ్ల నాయిన, వీడు బొమ్మిరెడ్డిపల్లెలో ఇంకా కమ్మరి పని చేస్తాండ్రి సిన్నాయనా! కొన్నేండ్లుగా సేద్దాలు గిట్టుబాటు గాక, రైతులు పనుల కోసరము రావడము బాగా తగ్గిపాయ. అందుకని నేనే..”

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-27/


Tuesday, May 14, 2024

ధూమపానోపాఖ్యానం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ 14 మే 2024

"పొగచుట్టకు, సతి మోవికి/తగనుచ్ఛిష్టత లేదని/ఖగవాహన తోడ కాలకంఠుడు పలికెన్/పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్" అంటాడు గురజాడ వారి కన్యాశుల్కంలో, గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో. ఏదైనా దురలవాటు ఉన్నవారు దానిని సమర్థించుకోవడానికి గిరీశంలా పురాణాలను కూడా ఉటంకిస్తారు. ఎంత సమర్థించుకున్నా దురలవాటు ప్రమాదకరమైనదే!
పబ్లిక్ ప్లేస్లలో పొగతాగరాదు, పొగతాగుట నేరము లాంటి బోర్డులుంటాయి. సినిమాల్లో, ఏదైనా పాత్ర పొగతాగే సన్నివేశం వచ్చినప్పుడు పొగతాగుట ఆరోగ్యానికి హానికరం అని తెర దిగువన, ఎవరికీ కనబడకుండా, అతి చిన్న అక్షరాలతో చట్టబద్ధమైన హెచ్చరికను వేసి చేతులు దులుపుకుంటారు. మద్యం సేవించడం కంటే ఇదేమీ అంత ప్రమాదం కాదని వాదించే స్మోకింగ్ కింగ్స్ ఉన్నారండోయ్!
యద్భావం తద్భవతి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. పురాణ కాలక్షేపం అయిన తర్వా త భక్తులారా! భగవంతుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడో అర్థమైంది కదా! అంటే ఒక ఆసామీ లేచి, నాకు బాగా అర్థమైందండి అన్నాడట వినయంగా. ఏమిటని అడిగితే, కాల్చే చుట్ట ఆరిపోతే చెవి సందున పెట్టుకోవడానికి అన్నాట్ట! అలా ఉంటుంది మనతోని.
1964లో విడుదలైన 'రాముడు- భీముడు' సినిమాలో రేలంగి-గిరిజల మీద ఒక పాట చిత్రీకరించారు దర్శకులు తాపీ చాణక్యగారు. పెండ్యాల వారు దానికి స్వరకర్త. సిగరెట్ తాగడాన్ని గ్లోరిఫై చేస్తూ రేలంగి 'పట్టుబట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి ఇది తొలిమెట్టు' అనీ, 'ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడూ...' అనీ అంటే గిరిజ దానికి రిటార్టు ఇస్తుంది. 'కంపు కొట్టు ఈ సిగిరెట్టూ' అంటూ 'కడుపు నిండునా, కాలు నిండునా...' అనీ, ఇక ఆంజనేయుని లంకా దహనాన్ని 'ఎవడో కోతలు కోశాడూ' అనీ, 'ఊపిరి తిత్తుల క్యాన్సర్కిదియే కారణమన్నారు డాక్టర్లూ', అని తిప్పి కొడుతుంది. ఆనాటి సినిమా కాబట్టి సమాజానికి వ్యతిరేక సందేశం వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు. కళకు సామాజిక ప్రయోజనం ఉండాలనేది అప్పటి వారి లక్ష్యం. కాసులు రాల్చేదే కళ అనేది ఇప్పటి వారి గమ్యం. ఇలాంటి పాటలు రాయడంలో కొసరాజు రాఘవయ్య చౌదరిగారు చేయి తిరిగినవారు. పాడటంలో మాధవపెద్ది వారికి మంచి ప్రావీణ్యమున్నదనే గుర్తింపు ఉంది. ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో, నిండా పొగ అలుముకొని ఉండేది. మా చిన్నప్పుడు దాన్ని అతి సహజంగా స్వీకరించేవాళ్ళం. కాలుతున్న సిగెరెట్ మీద ఇంటూ మార్క్ పెద్దగా వేసి పొగ తాగరాదు అనే స్లయిడ్ వేసేవారు మొక్కుబడిగా. ఇప్పుడా పరిస్థితి లేదు లెండి. పబ్లిక్ స్మోకింగ్ చాలా వరకూ తగ్గిపోయింది. కొన్ని చోట్ల స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేసి పొగధీరులకు సౌకర్యం చేశారు.
పొగతాగటంలో కూడా స్టేటస్‌లు ఉన్నాయి. బీడీలు తాగడం లో-క్లాస్, పైప్ పీల్చడం హైక్లాస్, ఇక హుక్కా తాగడం రాజరికం. నేను పలాస ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసినప్పుడు నిష్ఠల సుబ్బారావుగారని మా ప్రిన్సిపాల్.. ఆయన రూమంతా చుట్టకంపు ఉండేది. కానీ ఆయన్నే మనగలం? 'బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్!'.
ప్యాసివ్ స్మోకింగ్ అసలు స్మోకింగ్ కన్నా ప్రమాదమట. అంటే మనం తాగకపోయినా, పక్కవాడు వదిలే పొగని విధిలేక పీల్చాల్సి రావడం. ఇంట్లో తండ్రి స్మోకర్ అయితే, భార్యకూ, పిల్లలకూ ఇది తప్పదు. కొన్ని సమాజాల్లో 'నెసెరీ ఈవిల్స్' ఉంటాయి. స్మోకింగ్ కూడా అలాంటిదే. నాకు మటుకు అంత విచ్చలవిడిగా స్మోక్ చేయడం తగ్గిందనిపిస్తోంది. బహుశా 'పాజిటివ్ థింకింగ్' ఏమో? అదన్న మాట!

Sunday, May 12, 2024

Vote for NOTA - My Story in Women's Era April 2024 issue

My story, Vote for NOTA, on Indian electioneering process, told in lighter vein, has been published in Women's Era April 2024 issue.
Please click on the link, read and respond.

 


https://drive.google.com/file/d/1bDweJR6oOH6rzQU7VgQQbN_vKx_vZFMU/view?usp=sharing 

 

'మహాప్రవాహం!'-26

రెండు నెలల్లోనే పుండరి సామి వాండ్లన్నయ్య పద్మనాబయ్య సామి అని వచ్చినాడనీ, శానా గొప్ప పండితుడనీ, బ్రమ్మాండంగా చేయిస్తాడనీ పేరు వచ్చింది టౌనులో.
పుండరితో పని లేకుండా డైరెక్టుగా సామి దగ్గరికి వచ్చి తమ కార్యక్రమాలను చేయించమని అడగబట్నారు జనము. ఉన్నోల్లనే గాకుండా, బీదోండ్ల యిండ్లకు గుడ్క బోయి చేయిస్తాడని, సంబావన ఇంత యియ్యాల్ల అని ఎవర్నీ అడగడని అనుకోబట్నారు.

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-26/


Tuesday, May 7, 2024

నరసింహస్వామిపై సుప్రసన్న కీర్తనలు 3

శ్రీమాన్ కోవెల సుప్రసన్నచార్యుల వారు, అశువుగా, శ్రీ వేల్పుకొండ నరసింహ స్వామి వారిపై, రచించిన కీర్తనలను, స్వరపరచి, పాడే భాగ్యం కలిగింది. ఇది మూడవది. వరుసగా ఇవి స్వాధ్యాయ యూ ట్యూబ్ లో వస్తాయి. 🙏

 

 


నరసింహస్వామిపై సుప్రసన్న కీర్తనలు 2

శ్రీమాన్ కోవెల సుప్రసన్నచార్యుల వారు, అశువుగా, శ్రీ వేల్పుకొండ నరసింహ స్వామి వారిపై, రచించిన కీర్తనలను, స్వరపరచి, పాడే భాగ్యం కలిగింది. ఇది రెండవది. వరుసగా ఇవి స్వాధ్యాయ యూ ట్యూబ్ లో వస్తాయి. 🙏




డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారి పద్యం

శ్రీయుత డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, నా పై, చి. కోవెల సంతోష్ పై వ్రాసి పంపిన ఆశీః పూర్వక పద్య ద్వయము. స్వర కల్పన, గానం, పరిచయం, చి. పాణ్యం శంకర్ కుమార శర్మ.




Saturday, May 4, 2024

ఎండలంటే నాకిష్టం - ఎందుకో తెలుసా?

అందరూ ఎండలు బాబోయ్ ఎండలు అంటుంటే.. ఈయన మాత్రం 'ఎండలకేం? బంగారుకొండలు' అంటున్నాడు. ఎందుకో.. ఈ కథ చదివి తెలుసుకోండి.


 

https://sanchika.com/endalakem-bangaarukondalu-pds-story/ 

 

'మహాప్రవాహం!'-25

కేదార తండ్రి వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయినాడు. మీనాక్షమ్మ మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. “ఈరోజు కొత్తగా ఆయన నేర్చుకునింది ఏవి లేదురా కేదారా! ఆ పల్లెటూర్లో ఆయనకు తన విద్యత్తు నుపయోగించే అవసరం రాల్యా అంతే” అనింది. పద్మనాబయ్య చిరునవ్వుతో భార్యనూ కొడుకును చూసాడు. ఆ చూపుల్లో నిరహంకారం! అంతా ఆ పరాత్పరుని అనుగ్రహం తప్ప మరేమీ కాదనే ఒకానొక నిర్మమత్వం!


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-25/

 


పప్పు భోగారావు గారి గళంలో నా 'మన్నించు నాన్నా..' కథ

నేను రచించిన 'మన్నించు నాన్నా..' కథని శ్రీ పప్పు భోగారావు గారు కథాస్రవంతి అనే యూట్యూబ్ ఛానెల్‍లో వినసొంపుగా చదివారు.
ఈ కథ నా కథా సంకలనం 'దత్త కథాలహరి'లోనూ, డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన 'కథల లోగిలి' అనే సంకలనంలోనూ ఉంది.
విని ఆనందించండి.


 


Wednesday, May 1, 2024

నా నాటిక 'యత్ర నార్యస్తు పూజ్యంతే'కు తృతీయ బహుమతి

విశాఖపట్టణానికి చెందిన 'తెలుగు కళాసమితి' వారు 2024 సంవత్సరానికి నిర్వహించిన 13వ కథా నాటిక, స్వీయ నాటిక రచనల పోటీలలో నా నాటిక 'యత్ర నార్యస్తు పూజ్యంతే'కు తృతీయ బహుమతి లభించింది. నిర్వాహకులకు ధన్యవాదాలు.


 


శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-1

సంచిక మాస పత్రికలో, శ్రీమతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, ఈ నెల నుండి సీరియల్‌గా వస్తుంది. ఇది మొదటి భాగం. 🙏


~
మాలతీ చందూర్ గారు తన జడ్జిమెంట్సును మన మీద పాస్ చెయ్యరు. Objective గా సంఘటనలను వివరిస్తూ పోతారు. పాత్రచిత్రణ చేస్తారు. ఎవరితో సైడ్స్ తీసుకోరు. జాగ్రత్తగా చదివి, మనకుగా ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునే బాధ్యత మనదే. నవల అంతా ఒక విధమైన non-attachment, రచయిత్రి పరంగా మనకు కనిపిస్తుంది. కాని అవసరం అయినచోట ఆమె కలం కరకుగా మారుతుంది.
~
పూర్తి రచనని సంచికలో చదవండి.

https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-1/