Sunday, October 13, 2024

తెలుగు జ్యోతి పత్రికలో నా కథ అవ్వ పేరే ముసలమ్మ - లింక్

‘‘సెలీనా, మీపేరు అరుదైనది. దాని అర్థం తెలుసుకోవచ్చా’’ అని అడిగాడు ఆసక్తిగా.
‘‘మీరే కనుక్కోండి ఇంగ్లీష్‌ మాస్టారు!’’ అన్నది ఆ అమ్మాయి అల్లరిగా యండమూరి నవలల్లో హీరోయిన్‌లాగా. అప్పుడయితే సదరు హీరో ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి నానాపాట్లు పడేవాడు. కాని ఇప్పుడు ‘‘గూగులమ్మ’’ ఉందిగా? వెంటనే సెర్చ్‌ చేసి చూశాడు.
సెలీనా అంటే ‘‘మూన్‌ గాడెస్‌’’ అనీ, ప్రపంచంలోని అత్యంత అరుదైన ఇరవై అమ్మాయిల పేర్లలో అదీ ఒకటనీ ఉంది.
‘‘తెలిసిపోయింది మేడమ్‌, మీ పేరుకర్థం ‘‘జాబిలమ్మ’’! అన్నాడు."
పూర్తి కథని ఈ లింక్ ద్వారా చదవగలరు.

Saturday, October 5, 2024

నొప్పింపక-తానొవ్వక... - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 06 అక్టోబర్ 2024

‘ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!”
అన్నారు బద్దెన, సుమతీ శతకకర్త.
ఈయన కాకతీయ సామ్రాజ్యంలో ఒక సామంతరాజు. తిక్కనకు శిష్యుడంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులకు వేలకు వేలు తగలేసి, పాశ్చాత్య దృక్పథాలను నేర్చుకునే యువతరం, మన తెలుగు శతకాలను బాగా స్టడీ చేస్తే, వ్యక్తిత్వ వికాసం బ్రహ్మాండంగా కలుగుతుంది.



ఈ పద్యంలో, 'తప్పించుకు తిరగడం' అంటే 'ఎస్కేపిజం' కాదు మిత్రమా! అవకాశవాదం అసలు కానే కాదు. ఏది అప్పటి కవసరమవుతుందో, దాన్నే మాట్లాడాలి. ఇతరుల మనస్సు నొప్పించకూడదు. తాను కూడ నొచ్చుకోకూడదు. ఇదో స్ట్రాటజీ!
'కమ్యూనికేషన్ స్కిల్స్' ఎలా ఉండాలో ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? ఈ పద్యాన్ని ఒక కొంటె కవి ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. సరదాగా!
“వాటీజ్ నీడెడ్ నౌ అది
దట్ ఓన్లీ టాకుటాకి అఫెండవకన్
హర్ట్ చేయక హర్టవ్వక
ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ!
(దీంట్లో యతి ప్రాసలు సరిగా ఉన్నాయా, లేదా వెతక్కండి ప్లీజ్)
యుక్తితో బయటపడడం అంత సులువు కాదు. బోలెడు సమయస్ఫూర్తి, బొచ్చెడు లోకజ్ఞానం కావాలి. పానుగంటి వారి 'సాక్షి' వ్యాసాల్లో, ఇంగ్లీషులో 'ది డిక్టేటర్' అనే పత్రికలో వ్యాసాలుండేవి. హాస్యపు గుళికలవి. కానీ, ప్రాపంచిక జ్ఞానాన్ని అద్భుతంగా పంచాయి. వాటిని రాసిన వారు 'అడిసన్ అండ్ స్టీల్' అనే ప్రఖ్యాత రచయిత. అందులో, “సర్ రోగర్ డి కవర్లీ" అనే పెద్దాయన ఉంటాడు. చిలిపితనం, వ్యంగ్యం, హాస్యం, ఎత్తిపొడుపు, ఎగతాళి, ఇవన్నీ కలిస్తే ఆయనవుతాడు. 'ప్రాబ్లం సాల్వింగ్'లో
ఆయన దిట్ట. తన పరిష్కారాన్ని సూచించే ముందు ఆయన ఇలా అనేవాడు. “మచ్ మైట్ బీ సెడ్ ఆన్ బోత్ సైడ్స్!" (ఇరువైపులా ఎంతో చెప్పొచ్చు). నొప్పింపక తానొవ్వక తప్పించుకోవడమంటే ఇదేనండి!
మా కర్నూలు జిల్లాలో 'సిమెంట్ నగర్' అనే ఊరుంది. దాని రైల్వే స్టేషన్ పేరు “బుగ్గా నిపల్లె" గుంతకల్, గుంటూరు లైన్, డోన్, నంధ్యాల మధ్య. ఇదెందుకు చెబుతున్నా నంటే, అక్కడ తగవులు తీర్చే పెద్దలున్నారు. 'కర్ర విరగకుండా, పాము చావకుండా' రాజీ కుదురుస్తారు. ఈ వ్యవహారానికి 'బుగ్గానిపల్లె పంచాయితీ' అని పేరు. బద్దెన గారు బహుశ వారికి ఆదర్శమేమో మరి!
శ్రీకృష్ణ తులాభార నాటకంలో శ్రీకృష్ణునికి ధర్మసంకటం వస్తుంది. రుక్మిణీదేవి బర్త్ డే. ఆమె తన మందిరానికి రమ్మంటుంది. సత్యభామ వెంటనే మెట్టినదినం తనదని తయారు. కుళ్ళుబోతు. 'నారీనారీ నడుమ మురారీ' అయ్యింది అయ్య గారి పని. అప్పుడాయన తెలివిగా, అక్కడికొచ్చిన నారదుల వారిపై తన సమస్య తోసేస్తాడు!
'మెట్టిన దినమని సత్యయు
పుట్టిన దినమంచు భీష్మ పుత్రియున
న్నీ పట్టున బిలుతురు విందుకు”
అని, "నేను ఎటు బోవలయునో దిట్టముగా దెల్పుమయ్య దేవమునీంద్రా!" అంటాడు పరమాత్మ.
తెలివిగా ఎదుటివాడి మీదకు తోసేయడం అంటే ఇదే. ఆయనకు రుక్మిణీదేవే కరెక్టని తెలుసు. కాని నారదుడితో చెప్పిస్తే బెటరు కదా! తర్వాత కావాలంటే "అలిగితివా సఖీ ప్రియా" అని పాట పాడి సత్యాదేవిని ప్రసన్నురాలిని చేసుకోవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి, మోదీ గారి వరకు మన దేశం 'అలీన విధానాన్ని' అనుసరిస్తూ వస్తూ ఉంది. దీన్ని ఎన్.ఎ.ఎం (నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్) అంటారు. దీనిలో 120 దేశాలుంటాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన పవర్ కేంద్రాలలో దేనిలో ఇవి చేరవు. (అలీన-లీనం కాని) తటస్థ విధానాన్ని అవలంబిస్తాయి. మనం అందరికీ యుద్ధం వద్దనే చెబుతాం. శాంతికాముకులం. అందుకే మనకు అంతర్జాతీయ సమాజంలో ‘పెద్దన్న' అనే పేరుంది. ఇది 'స్ట్రాటజీ' కాదండోయ్! మన పాలసీ!
కానీ, ఎవ్వర్నీ నొప్పించకుండా, తాను నొవ్వకుండా వ్యవహ రించడం అంత వీజీ కాదు. అది కత్తిమీద సామే! ఇద్దరు భార్యలుంటే మరీ కష్టం. 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' క్రింద మంచినే సపోర్ట్ చేద్దామంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నం161 లాగా, మన జీవితాల్లో కుదరదు మాస్టారు! ఒక్కోసారి ఇది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఇతరులు 'హర్ట్' అవడమో, లేదా మనమే 'హర్ట్' అవడమో జరుగవచ్చు. దీనికి 'టాక్ట్' అవసరం.
బయటకు వెళ్తూ, మా ఆవిడను, "వర్షం వస్తుందేమో, గొడుగు తీసుకెళ్ళమంటావా?” అని అడిగాను. "మీరు గొడుగు తీసుకెళితే వర్షం రాదు. ఖచ్చితంగా దాన్ని ఎక్కడో మర్చిపోయి వస్తారు! పోనీ తీసుకోకుండా వెళితే, వర్షం వస్తుంది. చూడండి మరి! తీసు కెళ్తారో, వద్దో!" అన్నదా బద్దెన గారి శిష్యురాలు! ఇంతకూ తీసుకెళ్ళమన్నట్లా, వద్దన్నట్లా? అందుకే, “ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే" అన్నారు పింగళివారు మిస్సమ్మ సినిమాలో.
"నాయనా! ఈరోజు శనివారం. మేమంతా ఉపవాసం. నీవు మామిడిపండు తిని మజ్జిగ తాగుతావా, లేదా కొంచెం ఉప్పుడుపిండి చేయమంటావా?” అనడిగిందట ఒక అత్తగారు అల్లుడిని. "ఉప్పుడుపిండి చేయండత్తయ్యా, అందులోకి వంకాయ కాల్చి బజ్జీ చేయండి. తర్వాత మామిడిపండు తిని మజ్జిగ తాగుతా!"
అదన్నమాట!!
 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 3వ భాగం లింక్

ప్రబంధ లక్షణాలలో ముఖ్యమైనది ‘షష్ఠ్యంతములు’. అంటే షష్ఠీవిభక్తి (కిన్, కున్ అను ప్రత్యయములతో అంతమవుతాయి. ఇవి కందపద్యాలుగా ఉంటాయి. కృతిభర్త ఐన నారసింహ దేవుని స్తుతిస్తూ ‘ఆయనకు’ ఈ పద్య కుసుమాలు సమర్పించారు కవి. 


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-3/

Thursday, October 3, 2024

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 6వ భాగం లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 6వ భాగం. 🙏
~
ఇదే మానసిక సంఘర్షణ, వ్యక్తిగత జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన సత్యాగ్రహులందరిలో ఉంటుంది. ఎంత ఉద్యమానికి కట్టుబడినా, వారూ మనుషులే కదా! రెండు ప్రత్యామ్నాయాల మధ్య, సరియైన దానిని ఎంచుకోవడంలో, సందిగ్ధత (dilemma) ఎదురైనపుడు, తనకు నచ్చిన దానిని స్వీకరించినా, మనసు కొన్నిసార్లు పీకుతూనే ఉంటుంది. గోపాలరావు కెదురైనది ఈ సందిగ్ధతే. కాని ఎప్పటికప్పుడు దాన్ని అధిగమించేవాడు.


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-6/

 

విశాఖసాహితి మాసపత్రిక దసరా సింగిల్ పేజీ కథల పోటీలో నా కథ

విశాఖసాహితి మాసపత్రిక దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో నా కథ 'తెలుగోండ్ల పెండ్లి' సాధారణ ప్రచురణకు ఎంపిక అయింది.
సంబంధిత ప్రకటన


 Click on the image to view in bigger size

బ్రహ్మంగారి మఠంలో నా 'శ్రీమద్దేవిభాగవతం ప్రవచనాలు'

దసరా నవరాత్రుల సందర్భంగా బ్రహ్మంగారి మఠం నందు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ వారి ఆహ్వానంతో, 3 అక్టోబర్ 2024 నుంచి 10 అక్టోబర్ 2024 వరకూ - శ్రీ దేవీ భాగవత ప్రవచనములు చెప్తున్నాను. శ్రీ మహా దేవ్యై నమః 🙏🌹
సంబంధిత వార్త


 Click on the image to view in bigger size


Sunday, September 29, 2024

ఏడో ఏడు ఏడుపు - దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ ఆదివారం 29 సెప్టెంబర్ 2024

'మొహం మొత్తడం' అని మన తెలుగులో ఒక ప్రయోగం ఉందిలెండి. పెళ్ళయిన కొంత కాలానికి, భార్యకు భర్త మీద మొహం మొత్తుతుందట. అంటే, మోజు తగ్గి, అయిష్టత మొదలవడం! ఇది అందరికీ వర్తించదులెండి! ఆదర్శ దంపతులు నన్ను కోపగించుకోకండేం! అలా అని అందరూ 'బడిపంతులు' సినిమాలో ఎన్.టీ.ఆర్. అంజలీ దేవిలాగా "నీ నగు మోము నా కనులార.. కననిండు!" అని పాడుకుంటూ పరవశిస్తూ ఉండరండోయ్!
ఈ మొహం మొత్తడాన్నే ఇంగ్లీషువాళ్ళు "సెవెన్ యియర్స్ ఇచ్” అన్నారు. 'ఇచ్' అంటే ఇరిటేషన్. పిల్లి అంటే మార్జాలం అన్నట్లుంది కదూ! ఒక విధమైన తీట! సరేనా? పెళ్ళయిన ఏడేళ్ళకు సరిగ్గా ఇది మొదలవుతుందట వాళ్ళకు. కరెక్ట్‌గా అంత 'టైమ్ ఫ్రేమ్' ఎందుకో? మనకలా ఉండదు. మన సనాతన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఎంత అయిష్టత ఉన్నా, ఎన్ని గొడవలు పడినా, వివాహ బంధానికి కట్టుబడి, కలిసే ఉంటాము. విడాకుల వరకు అసలు వెళ్ళం! కానీ, ఈమధ్య మన యువతరం కొంచెం ముందడుగు వేసి, వ్యక్తిత్వం అని, ఇగో అని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుంటున్నారనుకోండి. వారి సంఖ్య చాలా తక్కువ సుమండీ! ఇదంతా ఎందుకని కొందరు ఔత్సాహికులు 'సహజీవనం' అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. మరింత సుందరంగా ఆంగ్లంలో... “లివ్ ఇన్ రిలేషన్‌షిప్". పిల్లల్ని కనరట. ఎప్పుడు పడితే అప్పుడు నీ జట్టు కటీఫ్! ఎవరి సంపాదన వారిదే! 'ఈవెంట్సు' ఏవయినా ఉంటే ఖర్చు చెరి సగం! పెళ్ళిమంత్రాల్లో 'నాతి చరామి', 'నాతిచరితవ్యా'లు వీళ్ళకు వర్తించవు. ‘సెవెన్ యియర్స్ ఇచ్' వీళ్ళకు సెవెన్ మంత్స్‌కే వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర లేదు.


ఈ 'ఏడేళ్ళ ఏడుపు'కు కొంత సైకలాజికల్ బ్యాకింగ్ ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ 'సెవెన్ యియర్స్ ఇచ్' అన్న పద బంధాన్ని మొట్టమొదట తన నాటకానికి శీర్షికగా వాడుకొన్నవాడు 'జార్జ్ యాక్సెల్ రాడ్' అన్న
రచయిత. దానినే 1955లో సినిమాగా తీశారు. మార్లిన్ మన్రో అందులో హీరోయిన్. టామ్ ఎవెల్ హీరో, మార్లిన్ మన్రో 1950లలో, తొలి 1960లలో వచ్చిన శృంగార విప్లవానికి ఆద్యురాలు. ఆమెను సెక్స్ సింబల్ అని పిలిచేవారు. పాపం 36 ఏళ్ళకే ఆ శృంగార రసాధిదేవత మరణించింది. ఆమె చేసుకున్న పెళ్ళిళ్ళు విఫలమై, విడాకులయ్యాయి. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆమె జీవించింది. జీవించదూ మరి? ఏడేళ్ళ వరకు సంసారం సజావుగానే సాగుతుందట. తొలి సంవత్సరాలలో శృంగారం పరస్పర అవగాహనను డామినేట్ చేస్తుందంటారు 'బొనామీ
డొబ్రీ' అన్న విమర్శకుడు. తర్వాత ఒకరి బలహీనతలను ఒకరు గుర్తించడం మొదలవుతుంది. అసూయా, అసహనం, అహంకారం వివాహ బంధాన్ని తూట్లు పొడిచే కత్తులు. ఇదంతా ఖచ్చితంగా 7 సంవత్సరాలకు జరుగుతుందని అనడానికి, నాకు తెలిసి, శాస్త్రీయ ప్రమాణత ఏమీ లేదు.
రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు 'దావత్' అనే కథ రాశాడు. పెళ్ళి విందులో తనకు పలావు ముక్కలు అసలు పడలేదని ఆ ఇంటల్లుడు తన భార్యను, ఆ యింటి ఆడ పడుచును, పెళ్ళి పందిట్లోనే బూతులు తిడుతూ చావబాదుతాడు! ఆమె కిక్కురుమనదు! "ఏడుస్తూనే సూటుకేసు తీసుకుని బిడ్డను చంకనెత్తుకుని అతడి వెంట నడిచింది" అంటాడు ఖదీర్. అబీదా భర్త మీద మనకు కోపం వచ్చినా, ఆమె సహనం పట్ల మనకు జాలి, గౌరవం కలుగుతాయి. అన్ని మతాలూ భార్యాభర్తల అన్యోన్య తను అనుబంధాన్ని గ్లోరిఫై చేస్తాయి.
"ఖుర్-ఆన్, సూర4 (ఆన్. సీసీ) ఆయ4"లో ఇలా ఉంది. "ప్రేమ దయ అనేవి నిక్కాలో భాగాలు కావాలి. భార్యకు భర్త ఒక ఆభరణము. భర్తకు భార్య కూడ అంతే ఆభరణము!"
భీష్మ పితామహుడు ధర్మరాజుతో భార్యాభర్తల బంధాన్ని గురించి ఇలా చెపుతున్నాడు. “నాస్తి భార్యాసమోబంధుః నాస్తి భార్యాసమం సుఖం, నాస్తి భార్యాసమంలోకే, నరస్య అర్తస్య ఔషధం” “సంతుష్టో భార్యయా భద్రార్యాతదైవచ” 'ప్రేమ దేశం' అనే సినిమాలో హీరోయిన్ ఇలా అంటుంది - “స్నేహితుడు భర్త అయితే ఎంత హ్యాప్పీ!". నేనంటాను, పెళ్ళయింత ర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా మారాలి! "బి డివోటెడ్ టు వన్ అనదర్ ఇన్ లవ్. ఆనర్ వన్ ఆనదర్ ఎ అబోవ్ యువర్ సెల్ఫ్" (రొమాన్స్-12-10) అంటున్నది బైబిలు. (ప్రేమలో ఒకరికి ఒకరు అంకితమవండి. మీకంటే ఎక్కువగా మీ భాగస్వామిని గౌరవించండి")
కాబట్టి కామ్రేడ్స్, "సెవెన్ యియర్స్ ఇచ్‌లు ఫైవ్ యియర్స్ పిచ్‌లు మనకు వద్దు. సమాజంలోని ఒక అత్యున్నత కౌటింబిక వ్యవస్థ వివాహం. బంధాన్ని నిలబెట్టుకు
ఉంచుకోవడం కష్టం. తెగతెంపులు చేసుకోవడం ఎంతసేపు? భార్యాభర్తలు దేవతలు కాదు. అన్ని బలహీనతలున్న మనుష్యులు. వాటిని పరస్పరం సహిస్తే, హ్యాప్పీస్!
అదన్నమాట!!