Sunday, July 28, 2024

ప్రకటనల ప్రహసనం - దత్తవాక్కు - 28 జూలై 2024 ఆదివారం ఆంధ్రప్రభ

వ్యాపార ప్రకటనలు జనాల్ని ఎలా ముంచెత్తుతున్నాయంటే వాళ్లు ఉక్కిరిబిక్కిరై ఏది కొనాలో, ఏది కొనకూడదో తెలియక సతమతమవుతున్నారు. ప్రకటన నిర్వచనం 'ఒక ఉత్పత్తిని గాని, ఒక బ్రాండ్‌ని గాని, సేవను గాని ప్రమోట్ చేసే భావ వ్యక్తీకరణ సాధనం.' దాని ద్వారా వీక్షకులకు, పాఠకులకు దగ్గరయ్యే సులభమార్గం. వారిలో ఆసక్తిని రేకెత్తించి యాడ్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నదాన్ని కొనాలనిపింప చేసే మార్గం. ఓకేనండీ... అంత వరకు బాగానే ఉంది. అడ్వర్టయిజ్‍మెంట్‌ను కుదించి యాడ్ అంటున్నారు. వేల కోట్ల రూపాయలతో వ్యవహారం ఇది. దాంతో నాకేమీ పేచీ లేదు మాస్టారు. వాటిల్లో మనకు కాస్త వినోదం దొరుకుతుందేమో చూద్దామని..
ఒకప్పటి ఋతురాగాలు, అంతరంగాలు, మొగలిరేకులు, చక్రవాకం లాంటి బహుళ జనాదరణ పొందిన సీరియల్స్ నుండి ఈనాటి కార్తీకదీపం, ఎన్నెన్నో జన్మల బంధం వరకు అసలు కంటెంట్ కంటే యాడ్స్ కంటెంట్ ఎక్కువై వీక్షకులకు విసుగు కలిగిస్తోంది. ఇప్పుడు ఓటీటీల్లో వాటిని కొంతవరకు స్కిప్ చేసే ఆప్షన్ ఉంటున్నది. కానీ రెగ్యులర్ టీవీ ఛానళ్లలో మటుకు చచ్చినట్టు యాడ్స్‌ని భరించాల్సిందే. మా అబ్బాయి ప్రహ్లాద్ ఏడాది పిల్లవాడిగా ఉన్నపుడు... టీవీలో యాడ్స్ వస్తున్నట్టు వాడికి ఎలా తెలిసిపోయేదో గానీ, పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడి మరీ వాటిని అతి శ్రద్ధగా చూసేవాడు. ఛానల్ మారుస్తే ఏడ్చేవాడు. మళ్లీ సీరియల్ రాగానే ఆడుకోడానికి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు వాడు 'ఫ్రాంచైజీ ఇండియా'కు చీఫ్ కన్సల్టెంటు. మార్కెటింగ్ స్ట్రేటజిస్టు కూడా. 'పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది' అంటే ఇదేనేమో. సర్లెండి... కాకిపిల్ల కాకికి ముద్దు!
'మీ టూత్ పేస్టులో ఉప్పుందా' అని అడుగుతూ మైక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది ఒక అందమైన చిన్నది. ఎక్కడలేని మూలికలన్నీ వాళ్ల పేస్టులో కలిపేశామని కొందరు ఊదరగొడుతుంటారు. మా చిన్నపుడు సుమండీ... నీళ్లు కాచుకునే హండా (గంగాళం) కింద వరిపొట్టు బూడిదగా మారితే దానికి కొంచెం ఉప్పును, కొంచెం పచ్చ కర్పూరాన్ని కలిపి టూత్ పౌడర్‌గా వాడే వాళ్లం. బ్రష్‌లంటే మాకు తెలియదు. వేలితో పళ్లు తోముకోవడమే. ఇలా పాతకాలం టెక్నిక్ లను ఆధునీకరించి, సొమ్ము చేసుకుంటున్నారు. అన్నం వార్చిన గంజిని, చల్లార్చిన తర్వాత ముఖానికి మసాజ్ చేసుకుంటే ముఖానికి కాంతి వస్తుంది. దాన్ని 'రైస్ వాటర్' అని, జెల్‍గా మార్చి ఊరికే దొరికేదానికి వందల్లో వసూలు చేస్తారు, యాడ్స్ ప్రమోట్ చేసి.
ఒకామె ఎలక్ట్రానిక్ కుక్కర్ యాడ్‍లో 'క్యారట్ హల్వా... అరగంటలో' అని గొప్పగా చెబుతుంది. క్యారట్ హల్వాను బయట పొయ్యిమీద చేసినా పది నిముషాలకంటే పట్టదు! యాడ్స్ వాళ్లు కనిపెట్టిన విశ్వసత్యాలు కొన్ని ఉన్నాయి. 'మరక మంచిదే' అంటారు. ఎందుకంటే మంచిపని చేసేటప్పుడు పడింది కాబట్టి. నిజమే కదా... ఇంకొకరు సంస్కారవంతమైన సోప్ అంటూ వస్తారు. సోప‌ని వాడేవారు సంస్కారవంతులవుతారని చెప్పాలి గాని, సోపే సంస్కారవంతురాలు ఎలా అవుతుందో మరి. ఇంట్లో దూరి టాయిలెట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తుంటారు. నాకు తెలిసి అలా ఇంటికి ఎవరూ రారు. వాక్యూం క్లీనర్ సేల్స్‌మెన్ మాత్రం అలా వస్తుంటారు. వాళ్లను ఒక సినిమాలో ఆటపట్టించారు. శుభలేఖ సుధాకర్ ఆ పాత్రలో వచ్చి ఇల్లంతా చెత్తపోసి క్షణంలో దీన్నంతా క్లీన్ చేస్తా చూడండని వాక్యూం క్లీనర్ని ఆన్ చేస్తాడు. కానీ అది కిమ్మనదు. ఎందుకంటే కరెంట్ పోయింది!
యాడ్స్ కొండొకచో కవితాత్మకంగా కూడా ఉంటాయి సారు. చాలాకాలం క్రిందటి సంగతి. 'విల్స్' అనే సిగరెట్ కంపెనీవారు పెద్ద పెద్ద హోర్డింగులను పెట్టేవారు. దానిమీద మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని పెద్ద అక్షరాలతో ఉండేది. ఒక అందమైన జంట నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది. ఇంతకీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్లు కాదండీ బాబూ... ‘టొబాకో అండ్ ఫిల్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్డ్'. అదీ సంగతి. హోర్డింగ్ కింద కనీకనబడకుండా 'సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ఉండేది. 'అశ్వత్థామ హతః' అని గట్టిగా అని 'కుంజరః' అని ఎవరికీ వినబడకుండా ధర్మరాజు అన్నట్లు. ప్రకటనల్లో నటించే నటీనటుల్లో కూడా కొంతమంది ప్రతిభావంతులు ఉంటారు. కొందరు వెర్రి మొహాలేసుకుని ఏ భావమూ పలకకుండా ఉంటారు. 'సెన్సిటివ్ టీత్' యాడ్‌లో ఒకాయన ఐస్‍క్రీం తిని పళ్లు జివ్వుమనటాన్ని అభినయించడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. మీకు వెయ్యదా? సరే... నాకు!

'మహాప్రవాహం!'-37 - లింక్

“ఫుడ్ అంటే తెలుసు, తిండి అని! మరి కోర్టు అని ఎందుకు బెట్నారు?” అన్నాడు ఇంకొక ఆయన.
“మనం హైదరాబాదుకు పోయేటప్పుడు, షాద్‌నగర్ దాటిన తర్వాత ఒక ధాబా తగుల్తాది. దాని పేరు చూసి మన దానికి బెట్టినా, కోర్టు అంటే ఆవరనమని గుడ అర్థముందంట. కనుక్కున్నాలే” అన్నాడు మాదవ.
~
మాదవ, చలమేశు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగిన వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.



https://sanchika.com/mahaapravaaham-pds-serial-37/

‘ధర్మపురి – కొండగట్టు – దర్శనం' లింక్

ఇటీవల ధర్మపురి నృసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం సందర్శించాను. ఆ యాత్రానుభవాలు సంచికలో

 


 https://sanchika.com/dharmapuri-kondaguttu-darshanam-pds/


బ్రహ్మం గారి మఠంలో నా ప్రవచనాలు - న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్

బ్రహ్మం గారి మఠంలో ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రవచనాలు చెప్పే అవకాశం నాకు దక్కింది. ఈ నెల 25 నుండి 31వ తారీఖు వరకు ఈ ప్రవచనాలు కొనసాగుతాయి. సంబంధిత ప్రెస్ క్లిప్పింగ్స్.



 





 

Monday, July 22, 2024

'మహాప్రవాహం!'-36 - లింక్

ఎ.పి.ఆర్.జె.సి పరీచ్ఛల గూడ మంచి ర్యాంకు వచ్చింది. కృష్ణా జిల్లా నిమ్మకూరు కాలేజీలో సీటు వచ్చింది. ఎం.పి.సి. గ్రూపు తీసుకున్నాడు. మల్లా పార్వతీశం సారే పోయి చేర్పించి వచ్చినాడు.
సాజంగా శానా తెలివైనోడు ప్రదీపు. ఎ.పి.ఆర్.జె.సి లల్లో ఆ కాలంలో చదువు శానా బాగా చెప్పేవాండ్లు.
~
ముదిమిలో సంజన్న గౌడ్, విమలమ్మ వృద్ధాశ్రమంలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

 


https://sanchika.com/mahaapravaaham-pds-serial-36/ 

రామాయణ ధర్మవచనములు సూక్తులు పుస్తకావిష్కరణ సభ - నివేదిక

డా. వైరాగ్యం ప్రభాకర్ రచించిన 'రామాయణ ధర్మవచనములు సూక్తులు' అనే పుస్తకం 13 జూలై 2024 నాడు కరీంనగర్‍లోని వాగీశ్వరీ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించబడింది. ప్రధాన వక్తగా నేను ఉపన్యసించాను. సంబంధిత నివేదిక సంచికలో.

 

https://sanchika.com/ramayanamu-dharmavachanamulu-sooktulu-book-release-event-report/
 

Saturday, July 13, 2024

త్వం నాళం - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 14 జూలై 2024

ఇదేమిటి? సంస్కృతం... అంటున్నారా? యూ ట్యూబ్‍ని సంస్కృతీకరించానన్నమాట! ముఖం అదోలా పెట్టారేమిటి? బాగులేదా? నిజమేలెండి! కొన్ని ఇంగ్లీషులోనే ఉంటే బాగుంటాయి. అనువాదం చేస్తే అదోలా ఉంటాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వర కూ సుందోపసుందుల్లా, నివాతకవచుల్లా మనల్ని పట్టి పీడించేవి ఈ రెండూ నండోయ్! అవే త్వం-నాళం, ముఖ పుస్తకం! అంటే, యూ ట్యూబు, ఫేస్‍బుక్కు అన్న మాట. ఆహార నిద్రా భయ మైథునముల తర్వాత అత్యంత అవసరమైనవి అయి కూర్చున్నాయివి. మళ్ళీ మాట్లాడితే వాటికంటే ఎక్కువ అవసరమైనవి!
ఇంతకీ ఈ యూ ట్యూబ్ కథాకమామిషూ (దీనర్థం నాకు తెలియదు బాబోయ్!) ఏమిటిష? గూగుల్ తల్లి సంతానమేనట ఈ గొట్టం! ఆన్‍లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారం అన్న మాట. ఫిబ్రవరి 14, 2005 నాడు దీన్ని మొదలెట్టారు కాలిఫోర్నియాలో. దీన్ని రూపొందించిన స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావెద్ కరీమ్ గారలు ఎంత పనిచేశారండీ బాబూ! దానికి అడిక్ట్ అయిపోయి, మాకంటూ సొంత అభిప్రాయం లేకుండా అయిపోయాం! గూగుల్ సెర్చ్ తర్వాత అధిక సంఖ్యాకులు దర్శించేది ఈ గొట్టమే. 2.5 మిలియన్ల ఉత్సాహవంతులు, రోజూ ఒక బిలియన్ గంటల పాటు దీన్నే చూ....స్తూ ఉంటారట. నిమిషానికి 500-600 గంటల కంటెంట్ వీడియోల రూపంలో అప్‌లోడ్ అవుతూందట. మళ్ళీ దీనిలో యూ ట్యూబ్ కిడ్స్, యూ ట్యూబ్ మ్యూజిక్, యూ ట్యూబ్ ప్రీమియం, ఇలా దాని పిల్లలు.
మనం పైసా కట్టక్కర్లేదు కదా. ఆ గొట్టం వాళ్లకు (వేరే ఉద్దేశ్యం లేదండీ బాబు) ఆదాయం ఎలా? అంటే ప్రకటనల ద్వారా. అబ్బే! మాకు ప్రకటనలు లేకుండా గొట్టాన్ని ప్రదర్శించండి అన్నామనుకోండి. దానికి వేరే రుసుము వసూలు చేస్తారు.
యూ ట్యూబులో 'అన్నీ' ఉంటాయి. రాజకీయాల నుంచి రాసలీలల వరకు. వీడియో పెట్టిన వారికి, దాన్ని ఎంతమంది చూస్తే అన్ని డబ్బులొస్తాయట. రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు యూ ట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని వారి వారి సొంత అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఎవరిది కరెక్టో తెలియక జుట్టు పీక్కోవాల్సింది మనం. ఎన్నికల ఫలితాలప్పుడు చూడాలి... 'మచ్ అడో అబౌట్ నథింగ్' అన్న సామెత గుర్తొస్తుంది. నాకు. ఢంకా భజాయించి, బల్లగుద్ది ఫలానా పార్టీకి ఇన్నిసీట్లు వస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ ఉంటారు. ఫలితాలు వచ్చిన తర్వాత చేపలు బయటపడి వీరి విశ్వరూపాలు వికృతరూపాలని తెలిసి పోతుంది మనకు. 


యూ ట్యూబ్ వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు హాయిగా పైసా ఖర్చులేకుండా చూసేయవచ్చు. స్మార్ట్ టీవీ ఉంటే చక్కగా పెద్ద తెర మీదే యూ ట్యూబ్‍ను చూడొచ్చు. శాస్త్రీయ సంగీతం, పాత సినిమా పాటల వీడియోలు చూడవచ్చు. యూ ట్యూబ్‍లో లేనిది లేదు. 'కలడంబోధి, కలండు గాలి, కలడాకాశంబునన్, కుంభినన్' అని ప్రహ్లాదకుమారుడు హరిని గురించి తన తండ్రితో చెప్పినట్టు సర్వం ఉంటాయి. మనం సెర్చ్ స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేసినా, దానికి సంబంధించింది ఒకటి ప్రత్యక్షమవుతుంది.
'అపియరెన్సెస్ ఆర్ ది డిసెప్టివ్' అన్నాడు మహాకవి షేక్‌స్పియర్. 'మెరిసేదంతా మేలిమి కాదు' అన్నది దీనికి అనువాదం. పైన 'ముఖ్యమంత్రిపై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు...' అని ఉంటుంది. మనకు ముందే జిజ్ఞాస ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ కదా! ఓపెన్ చేస్తే ఆ మహేష్‍బాబు ముఖ్యమంత్రిని ఏదో రొటీన్‌గా పొగిడి ఉంటాడు. 'బాగా పేరున్న నటుడు అకాల మరణం, షాక్ లో టాలీవుడ్...' అని ఉంటుంది. తీరా చూస్తే, ఆయన మనం అనుకున్నవాడయి ఉండడు. అదే పేరు కొంత కలిసిఉన్న ఒక అనామక నటుడు. ఇక మా ఉద్యోగ పెన్షనర్ల సంఘాల వాళ్ళు పెట్టే క్యాప్షన్లు మరీ టూమచ్! 40 శాతం ఫిట్‌మెంట్‍కు సిఎం అంగీకారం? చివర ఆ క్వశ్చన్ మార్కులోనే ఉంటుంది కీలకం. తీరా ఓపెన్ చేసి చూస్తే అది ఆ యూట్యూబ్‌దారుని సొంత పైత్యం. సుప్రీంకోర్టు ఇవ్వని తీర్పులు కూడా ఇచ్చేస్తారు వీళ్ళు.
యూ ట్యూబ్‍లో వంటలు చేసి చూపించేవాళ్ళే పాపం నిజాయితీపరులనిపిస్తుంది నాకు. వాళ్ళల్లో లక్షలు సంపాదించే వాళ్ళున్నారట. పళని స్వామి అనే ఆయన దట్టంగా వీభూతి రేకలు, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని కందా బచ్చలికూర, శివంగి పులుసు, ఉప్పుడు పిండి లాంటి వంటలు చేసి చూపిస్తుంటాడు. ఆయన భాష శిష్టవ్యావహారికం. ఆయనకు లక్షల్లో వ్యూస్! ఒంగోలు గంగాళం ఉప్మా ఎలా చేయాలో ఓ అమ్మడు వివరిస్తుంది. కడప కారం దోసె ఎలా వేయాలో ఓ కుర్రవాడు నేర్పిస్తాడు. ఉరవకొండ ఉగ్గాని బజ్జి, ఇలా... ఎన్నో. ఇంతకీ నాకో డౌటనుమానం... ఇవన్నీ చూసి మనం ఇంట్లో చేస్తే అలాగే కుదురుతాయంటారా?
యూ ట్యూబ్ సోషల్ మీడియాలో ఒక భాగమే. అది రెండు వైపులా పదునున్న కత్తి. మంచి, చెడు రెండూ ఉన్నాయి. యూ ట్యూబ్ కిడ్స్‌లో పరమ పాశవికమైన, హ్యూమన్ ఎలిమెంట్ అసలు లేని జుగుప్సాకర వీడియోలుంటాయి. పిల్లలు అవి చూస్తుంటారు. వారిని నియంత్రించే టైము తల్లితండ్రులకు ఉండదు. యూ ట్యూబ్ విశ్లేషణలను ఏకపక్షంగా చూసి చూసి, వీరాభిమానాలు, వీరావేశాలు పెంచుకుని, బంధు మిత్రులతో వైరాలు తెచ్చుకున్న వారున్నారు! అంత సీను అవసరమా చెప్పండి!
సమాచారం సదాచారం కావాలి కానీ, అనాచారం కాకూడదండి. ఏ ట్యూబయితే ఏమి తలపగల గొట్టుకోవడానికి అన్నట్టు... అతీతంగా ఉండాలి. అదన్న మాట.


'మహాప్రవాహం!'-35 - లింక్

సల్మాన్ ఖాన్ కూడా రిసార్టు లోని చెక్క కలాఖండాలను చూసి నివ్వెరబోయినాడు. “యా అల్లా! బహుత్ ఖూబ్!” అన్నాడు. వీరకు షేక్ హ్యాండిచ్చినాడు.
“వీర్ జీ! ఆప్ బొంబాయి ఆయియే. ఫిల్మోం మే ఆర్ట్ డైరెక్టర్ బనావూంగా ఆప్కో” అన్నాడు. వీరకివన్నీ యిష్టం లేదు. తొందరగా పనులు ముగించుకోని ఇండియాలో అమ్మానాయినల దగ్గరికి బోయి ఉండాలని వాని తపన.
~
దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన వీరబ్రహ్మం జీవితంలో కుదురుకున్న వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-35/

రామాయణ ధర్మవచనములు పుస్తకావిష్కరణ - వార్త

డా. వైరాగ్యం ప్రభాకర్ రచించిన 'రామాయణ ధర్మవచనములు సూక్తులు' అనే పుస్తకం 13 జూలై 2024 నాడు కరీంనగర్‍లోని వాగీశ్వరీ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించబడింది. ప్రధాన వక్తగా నేను ఉపన్యసించాను. 

సంబంధిత వార్త - ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికల నుంచి.



 Click on Image to view in bigger size


Sunday, July 7, 2024

అంత అవసరమా? - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 07 జూలై 2024

అవసరం అంటే కావాల్సింది అని అర్థం కదండీ! దీన్ని నేను మూడు భాగాలుగా విభజించాను. అవసరం, అత్యవసరం, అనవసరం! ఒకరికి అవసరం అయినది ఇంకొకరికి అనవసరం కావచ్చు. మరొకరికి అత్యవసరం కావచ్చు. ఈ కాన్సెప్ట్ మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంటుంది. మన కావ్యాల్లో, ప్రబంధాలలో దీన్ని 'సమయం' అనే అర్థంలో వాడుతుంటారు కవులు. శ్రీకృష్ణుడు తన చెలికాండ్రతో చల్దులారగించునవసరమున అంటే ఆరగించే సమయంలో అని.
ఈ అవసరాలు వస్తువులకే గాదు, మనం మాట్లాడే మాటలకు, చేతలకు... వేయేల? అన్నింటికీ వర్తిస్తాయి. 'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికామాటలాడి' అన్న పద్యం పైకి అవకాశవాదంలా కనిపించినా అందులో ఎంతో నిజముంది. అవసరాన్ని ఇంగ్లీషులో నీడ్ అనీ, నెసిసిటీ అనీ అంటారు. అవసరమే పరిశోధనకు కారణం. 'నెసిసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్'. ఈ సామెత అందరికీ తెలిసినదే. బీసీఈ 6వ శతాబ్దం మధ్యలోనే ఈసప్ అనే మహానుభావుడు ఫేబుల్స్ (చిన్న నీతి కథలు) రాసాడు. 'కాకి ఒకటి నీళ్లకు, కావుకావుమనుచును' అన్న పాట తెలుసుకదా!
'ది క్రౌ అండ్ ది పిచ్చర్' (కాకి, కుండ) అనే ఈసఫ్ ఫేబుల్లో ఉంది ఈ మాట. కుండ అడుగున ఉన్న నీళ్ళు తాగాలి కాకి, దానికి చాలా దాహంగా ఉంది. నీరు అత్యవసరం కానీ అది అందదే? సో దానికి ఒక సూపర్ ఐడియా వచ్చింది. గులక రాళ్ళను ముక్కుతో తెచ్చి కుండలో వేసి నీరు పైకి వచ్చేలా చేసి, తాగింది! అమ్మ కాకిశ్రీ! నీకెంత తెలివే? కాబట్టి మనకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మార్గాలు వెతుకుతాం. అదే పరిశోధనకు దారితీస్తుంది. ప్రపంచంలో కనిపెట్టబడినవన్నీ అలాంటివే! ప్రఖ్యాత గ్రీకు వేదాంతి ప్లేటో 'రిపబ్లిక్' అనే గొప్ప గ్రంథం రాశారు. దాంట్లో ఆయన 'అవర్ నీడ్ విల్ బి ది రియల్ క్రియేటర్' అంటాడు. మనం కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు గానీ, మన అవసరాలు మాత్రం రానురాను చిత్రాతిచిత్రంగా మారుతున్నాయి. ఉదాహరణకు తిండినే తీసుకుందాం. 'ఈట్ టు లివ్, లివ్ టు ఈట్' అన్న మాట చూడండి. బతకడానికి తినడం, తినడానికే బతకడం. కడుపు నిండా తిండి దొరకని నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు. వారికి తిండి అత్యవసరం. 'కడుపు నిండినమ్మకు గారెలు చేదు' అన్నట్టు ఫంక్షన్లలో అవసరం లేనివన్నీ వడ్డించుకుని తిన్నంత తిని ఎంతో ఆహారాన్ని వృథాగా పారేస్తుంటారు. అది అవసరమా? చెప్పండి!



అవసరం ఒక్కోసారి వ్యసనంగా మారొచ్చు. 'ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం' అంటాడు హితోపదేశ కర్త. ఆధునిక సమాజం వీటిని అవసరానికి మించి వాడుకుంటున్నది. మాటలు మన స్పందన కంటే అనవసరం ఐనవి కాకూడదు. ఈ మధ్య ఒక వాట్సప్ గ్రూప్‌లో ఒకామె (టీచర్) తనకు వేరే స్కూలుకు బదిలీ అయిందని పెట్టింది. ఇక చూడండి ఆమె బంధువులు, ఫ్రెండ్స్, రెచ్చిపోయి అభినందనలు తెలిపారు. ఆమెకేం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రాలేదు కదా! బదిలీ అనేది ప్రభుత్వోద్యోగికి తప్పనిది. అదేదో ఘన విజయంలాగా దానికి అభినందనలెందుకు? కనీసం ప్రమోషన్ ఐనా కాదు! సోషల్ మీడియాలోని జాడ్యాల్లో ఇదొకటి! అనవసరంగా, అతిగా స్పందించడం.
కొన్నేళ్ళ క్రిందటి సంగతి. మా బంధువు ఒకామె వచ్చింది. ఏసీ లేకుండా ఎలా బ్రతుకుతున్నారని తెగ హాశ్చర్యపోయింది. చెప్పాను కదా! మన విలాసాలను కనీసావసరాలుగా చూపిస్తూ, ఇతరులను కించపర్చకూడదు. ఒకప్పుడు మా పల్లెల్లో సైకిల్ ఒక స్టేటస్ సింబల్. మరి ఇప్పుడు? 'సెకెండ్ ఏసీ కోచ్‍లో గానీ మేం ప్రయాణం చేయలేమండీ' అంటూంటారు గొప్పగా. డబ్బు అవసరాలను పెంచుతుంది. వాటికి అంతేలేదు. కానీ, డబ్బుందని బంగారం బిస్కెట్లను తినలేం కదా! 'లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారుమ్ము మ్రింగబోడు' అన్నాడు కదా శేషప్ప! ‘గొంతెమ్మ కోరికలు' అన్న మాట వినే ఉంటారు. ఇక్కడ గొంతెమ్మ అంటే కుంతీ దేవండోయ్! కర్ణుడిని పాండవుల వైపు వచ్చేలా చేయమని ఆమె కృష్ణుణ్ణి కోరుతుంది. అది సాధ్యమయ్యే పనికాదు. 'ఆకలి తీరడం' అనేది అవసరం. రోడ్డు పక్క టిఫిన్ బండివాడు మన కళ్ళ ఎదురుగా ఇడ్లీ వాయ తీసి పొగలు కక్కే ఇడ్లీలు, రెండు చట్నీలతో ఇస్తాడు, ముఫై రూపాయిలతో మహాదానందం! అలా తినాలంటే కొందరికి నామోషీ. పేరున్న హోటళ్లకు వెళ్లి రెండు ఇడ్లీలకు 150 రూపాయిలు ఖర్చు పెట్టి ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ క్రీమ్ లాంటి చద్ది చట్నీతో తింటే గానీ వారికి రుచించదు. ఫాల్స్ ప్రిస్టేజ్ ఒక్కోసారి అవసరాన్ని విలాసంగా మార్చి అభాసు పాలు చేస్తుంది. ఇక 'ఎమర్జెన్సీ' అంటే అత్యవసర పరిస్థితి. అలాంటివి ఎలా ఉంటాయో చూశాం. 'ఎమర్జెన్సీ కేర్' అని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకుంటాయో అందరికీ తెలుసు. నార్మల్ డెలివరీ అవసరం. సిజేరియన్ అత్యవసరం అని అనవసరంగా చేసి డబ్బు దండుకుంటున్న సందర్భాలను చూస్తున్నాం. చిన్న పిల్లలకు 'ఐఐటి ఓరియంటేషన్' అనే అనవసరమైనది తగిలించి వారిని సతాయిస్తూ ఉంటారు. ముళ్ళపూడి వారి అప్పారావు 'ఓ ఫైవుంటే కొట్టుగురూ!' అంటుంటాడు. ఐదు రూపాయలు అతడికి అవసరం. నెలవారీ కంతులు కడితే విమానాన్నైనా కొనవచ్చు. అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బుంటే దాని మీద థ్రిల్ పోతుంది. ఇక రాజకీయాల్లోకి రావాలనిపిస్తుంది. అవసరాన్ని ఉప్పులా వాడాలి. లేకపోతే ఇంతే సంగతులు! చిత్తగించవలెను! అదన్న మాట.

'మహాప్రవాహం!'-34 - లింక్

“తొందరగా స్నానం చేసిరా నాన్నా, టిఫను చేద్దువుగాని” అన్నాడు కొడుకు. “నీవు చెప్పకపోతే తినడా?” అనింది కోడలు. ముసలాయప్ప మనసు చివుక్కుమనింది. కొడుకు “గుడ్ జోక్!” అని భార్యను మెచ్చుకున్నాడు.
~
కొడుకు హయాంలో, కోడలి అదుపాజ్ఞలలో బతుకీడుస్తున్న కొండారెడ్డి దురవస్థ ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-34/

 



Thursday, July 4, 2024

'ఆపరేషన్ రెడ్' నవల బ్లర్బ్

చదువు - అన్వీక్షికి పబ్లికేషన్స్ వారి ఉగాది 2024 నవలల పోటీలో క్రైమ్ అండ్ సస్పెన్స్ విభాగంలో విశేష బహుమతి పొందిన నా నవల 'ఆపరేషన్ రెడ్' త్వరలో విడుదల కానున్నది.
ప్రచురణకర్తలు రూపొందించిన కవర్ పేజీ, వెనుక అట్ట మీద బ్లర్బ్ మీతో పంచుకుంటున్నాను.
***
తెలుగు సాహిత్యంలో సీరియల్ కిల్లర్ నేపథ్యంతో వచ్చిన నవలలు అరుదు. ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ ఫిక్షన్‍లో సీరియల్ కిల్లర్ కథనాలు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, దత్తశర్మ రాసిన 'ఆపరేషన్ రెడ్' ఒక విలక్షణమైన ప్రయత్నం.

 
ఈ నవలలోని హంతకుడు సాధారణ సీరియల్ కిల్లర్ల నుండి భిన్నంగా, సమాజాన్నే మార్చాలనే ఒక విచిత్రమైన సిద్ధాంతంతో హత్యలు చేస్తాడు. అతని హత్యల తీరు, బాధితుల ఎంపిక పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. సీరియల్ కిల్లర్ల మనస్తత్వం వారి చుట్టూ ఉన్న సమాజపు ప్రతిబింబమని, వారి నేరాలు సామాజిక అసమానతలు, వివక్ష, సాంస్కృతిక ఒత్తిళ్ల నుండి జనించిన అసంతృప్తిని సూచిస్తాయని ఈ నవల చెబుతుంది.

 
'ఆపరేషన్ రెడ్' కేవలం ఉత్కంఠభరితమైన క్రైమ్ నవల మాత్రమే కాదు. ఇది సమాజంలోని లోతైన సమస్యలకు దర్పణం పడుతుంది. మన నాగరికతపై ప్రశ్నలు లేవవెత్తుతుంది. న్యాయం, ప్రతీకారం మధ్య సంఘర్షణను చిత్రిస్తూ, పాఠకులను ఆలోచింపజేస్తుంది. చివరి పేజీ వరకు ఉత్కంఠను నిలబెట్టే ఈ నవల, తెలుగు క్రైమ్ ఫిక్షన్‌కు కొత్త ఒరవడిని అందిస్తుంది.
***