Saturday, January 4, 2025

అలవాటు... మేనరిజమ్! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

‘అవ్వ పేరే ముసలమ్మ’ అనుకుంటున్నారా తవురు గోరు? అక్కడే సాంబారులో కాలేశారు! రెండూ వేరు వేరండీ బాబు! అలవాటుకు హ్యాబిట్ అని అర్థం చెప్పుకోవచ్చు. పిల్లి అంటే మార్జాలము అని చెప్పినట్లుంది కదూ! “ఏదై నా ఒక పనిని మళ్లీ, మళ్లీ, అది పనిగా చేస్తూ ఉండే ప్రవర్తన” అని దాన్ని నిర్వచించారు. ఎవరు? ఎవరో వల్లకాట్లో రామనాథాయ! కొంపదీసి అన్నింటినీ అలా నిర్వచించడం ఆయన అలవాటేమో?
ఈ ‘అలవాటు’ లో సదరు వ్యక్తి ప్రమేయం లేకపోవచ్చునని మనస్తత్త్వశాస్త్రవేత్తలు వాక్రుచ్చారు! అంటే దేంతోనో గట్టిగా క్రుచ్చలేదు! చెప్పారని.. కవి హృదయం! బయటికి కనబడుతుంది కాని, అలవాటు ‘మానసికం’ అట.
‘పచ్చిబియ్యం తినడం’ ఒక దురలవాటు. దానివల్ల రక్తహీనత, నీరసం వస్తాయట. ‘పొగ త్రాగడం’ ఉండనే ఉంది. అయినా, నాకు తెలియక అడుగుతా, పొగ త్రాగడం ఏమిటండి? అదేమైనా పానీయమా? పొగ పీల్చడం అంటే సరిపోతుందా? ఆలోచించండి. దీన్ని ఒక ఫాషన్, ప్యాషన్‌గా చేసుకుంటారు కొందరు (అ)నాగరికులు. ముక్కులోంచి, నోట్లోంచి (రింగులు రింగులుగా) వదులుతుంటారు పైగా. చెవుల్లోంచి రాదేమో? రోజుకెన్ని. ఆ లెక్కన నెలకెన్ని, సంవత్సరానికెన్ని సిగరెట్లు తాగుతాడో, మొత్తం ఖర్చు లక్షల్లో తేలి, ఎంత నష్టపోతున్నాడో చెప్పి, ఆ అలవాటు మానేయమన్నాడట ఒకాయన. ‘అలా లెక్కలేసుకుంటే బ్రతకలేమండీ!’ అనేది జవాబు! అలవాట్లకు శాస్త్రప్రమాణాలు చూపే ఘనులున్నారు.
“రావణ యుద్ధం బందున/బావనుడగు లక్ష్మణుండు పడి మూర్ఛి లినన్/
ఆవల బొగ చెట్టుండిన/బావని సంజీవి కేల పరుగెత్తు నృపా”
రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే, అక్కడ పొగాకు మొక్క ఉండి ఉంటే. ఆంజనేయుడు సంజీవని కోసం ఎందుకు పరిగెత్తుతాడు? అలా ఉంటాయి! 


ఇక మ్యానరిజమ్ అంటే, విభిన్నమైన వ్యవహారశైలి. అదొక లక్షణం, విధానం. అది మాటల్లో గాని, ప్రవర్తనలోగాని ద్యోతకం అవుతుంది. మళ్లీ, ‘మ్యానర్స్’ వేరు! ఈ మ్యానరిజమ్ కళల్లో కూడ ఉంటుంది. లియొనార్డో డావిన్సీ, రాఫెల్, మైకేల్ యాంజిలో, రవివర్మ, వడ్డాది పాపయ్యలాంటి వారి శైలి వారిని ఇట్టే గుర్తించేలా చేస్తుంది. రచనా శైలిని బట్టి, ఆ రచయిత ఎవరో సులభంగా తెలిసిపోతుంది. “అది శోభనపు గది. సాలంకృతము. అసలు శోభనమన్న నేమి? ఈ ప్రపంచకము విచిత్రమైనది. శోభతే ఇతి శోభనమ్ అని విశ్వ నిఘంటుకారుడు చెప్పియున్నాడు...” ఇది ఎవరు రాశారు చెప్పుకోండి చూద్దాం? ఇంకెవరు? కవిసమ్రాట్ విశ్వనాథ!
ఈ పదం, ‘మ్యానియెరా’ అన్న ఇటాలియన్ పదం నుంచి వచ్చిందట. దీన్నే స్టయిల్ అంటారు. నటులు ఒక్కొక్కరు ఒక్క మ్యానరిజమ్‌ను పండించి, ప్రసిద్ధులవుతారు. రజనీకాంత్ స్టైల్, ప్రభాస్ స్టైల్, యన్టీఆర్ స్టైల్, ఎయన్నార్ స్టైల్. యస్వీఆర్ స్టైల్... అబ్బో! ఎన్ని స్టైల్లో? వాటిని అనుకరించి పొట్టపోసుకునే వారున్నారు. వారిని మిమిక్రీ ఆర్టిస్టులంటారు. అదీ గొప్ప కళే. ఒక విషయం గమనించారా మాస్టారు? వాళ్ళు మిమిక్రీ చేస్తుంటే మనకు నవ్వొస్తుంది కాని, ఒరిజినల్ వ్యక్తుల మ్యానరిజమ్ వల్ల రాదు! హీరో వర్షిష్ కూడా!
ప్రముఖుల విచిత్ర అలవాట్లు చూడండి. మైకేల్ యాంజిలో స్నానం చేసే వాడు కాదట. మా మాతామహుడొకాయన ఉండేవారు. ఆయన కూడ స్నానం చేసేవాడు కాదు, జంధ్యాలు మార్చుకునేవాడు కాదు. అవన్నీ కలిసి పెద్ద మోకులా ఉండేవి. దీన్ని వైరాగ్యం అనొచ్చా? లేక బద్ధకమా? ఫ్రాన్సిస్ బేకన్‌కు ‘హ్యాంగోవర్’తో పని చేయడం ఇష్టం ఆట! మద్యపాన ప్రియులకు హ్యాంగోవర్ అంటే తెలుసు బాగా! ఒకాయన విమాన ప్రయాణం చేసి వచ్చాడట. ఎవరో ఫోన్ చేస్తే, తాను హ్యాంగోవర్‌లో ఉన్నానన్నాడట! ఇతనికి తాగే అలవాటు లేదు కదా! ఇదేమిటి అని సదరు పృచ్ఛకుడు నివ్వెరపోయాడు. ‘జెట్‌లాగ్’ కు వచ్చిన అవస్థ! పదం తెలుసు కదా అని వాడి ఉంటాడు!
‘అగథా క్రిస్టీ’ అపరాధ పరిశోధన నవలలకు పెట్టింది పేరు. ఆమె బాత్ టబ్‍లో కూర్చుని, యాపిల్స్ తింటూ రచనలు చేసేదట. సల్మాన్ ఖాన్‌కు సబ్బులు సేకరించే అలవాటు ఉందట. జాన్ అబ్రహం, కాలు కదిలిస్తూ ఉంటాడట. ఆయనకు డాన్సు రాదు! అమితాబ్, తన పిల్లలు విదేశాలతో ఉంటే రెండు చేతి వాచీలు పెట్టుకుంటాడు. రెండు టైమ్‌ జోన్‌లు తెలియాలని!
పోసాని కృష్ణమురళి మాట్లాడేటప్పుడు మాటిమాటికీ షర్ట్ సర్దుకుంటుంటాడు. అది ఆయన మ్యానరిజమ్. తనను వృద్ధాప్యంలో ప్రజలు చూస్తే తట్టుకోలేరని శోభన్‌బాబు లేటు వయస్సులో బయటకు వచ్చేవాడు కాదు.
‘ఎడంచేతివాటం’ అని ఒకటుంది. వాళ్ళు ఎడంచేత్తోనే అన్ని పనులూ చేస్తారు. సూర్యకాంతం గారు, సచిన్ టెండూల్కర్, రతన్ టాటా, బరాక్ ఒబామా, ఐన్‌స్టీన్ కొన్ని ఉదాహరణలు. మళ్లీ ‘లెఫ్టిస్ట్స్’ వేరండోయ్. వారు వామపక్షవాదులు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నారు సీనియర్ సముద్రాల. అక్కినేని వారు ఆ పాటలో జీవించారు. ఆ పాటలో లోతైన ఆధ్యాత్మిక పరిమళాలున్నాయి.
మా గురువుగారు తాటిచెర్ల కృష్ణశర్మ గారు. ఆయన మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ముందు ఇద్దరిని పిలిచి, సంచిలోంచి చిన్న సీసా తీసి, వారి చేతుల్లో నాలుగు చుక్కలు వేసి, అటువైపొకరు, ఇటు వైపొకరు కణతలు రుద్దుతూ ఉంటే, అద్భుతంగా పాఠం చెప్పేవారు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించనంతవరకు అలవాటయినా, మ్యానరిజమైనా మంచిదే! మీ ప్రమేయం లేకుండా, మీకలాంటివేమయినా ఉన్నాయా? చెక్ చేసుకోండి! అదన్నమాట!


నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 9వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 9వ భాగం సంచికలో చదవండి.
~
“స్వామీ! నాయకుల్లో ప్రతివారికి ‘ధీర’ అనే శబ్దం ఎందుకు ఉంది? లలితుడు, ఉదాత్తుడు, శాంతుడు, ఇలా అంటే సరిపోయేది కదా!”
సదాశివశర్మగారు చికితుడైనాడు.
“నాయనా! మంచి ప్రశ్న! ఇలాంటి విషయాలు ఎలా తోస్తాయి రా నీకు?” అని వాడిని మెచ్చుకొని, ఇలా వివరించారు.
“శాంతం, లాలిత్యం, ఉదాత్తత, ఔద్ధత్యం ఇవన్నీ విభిన్న వ్యక్తిత్వాలు. కానీ ధీరగుణం అందరిలో ఉండాలి. ధీరత్వం అంటే చెక్కు చెదరని నిబ్బరం. అప్పుడే ఆయా వ్యక్తిత్వాలు సంపూర్ణమవుతాయి.”
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/srimadramaramana-pds-serial-9/ 

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 16వ భాగం లింక్

అని దేవేంద్రుండు పలుక, అప్సరోత్తమ యైన తిలోత్తమ ఇట్లనియె.
సుగంధి:
వాలు చూపు నేను జూడ వాలిపోవు దైత్యుడే!
ఆలకించి తేనెలొల్కు నాదు పల్కు సోలడే!
నీలవేణి తోడగొట్ట నేలవాలి మొక్కడే!
మేలమాడ యోగి యైన బ్రీతి లొంగిపోవడే!
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-16/

 

నా యాత్రా రచన 'అన్నవరం – పాదగయ – అంతర్వేది – క్షీరారామ దర్శనం-2' - లింక్

ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలను సందర్శించాను. ఆ యాత్రానుభవాల రచన రెండవ, చివరి భాగం సంచికలో చదవండి.

https://sanchika.com/annavaram-padagaya-anatarvedi-ksheeraaramam-darshanam-pds-2/
 

 

నా నవల 'ఆపరేషన్ రెడ్' పై ఓ పాఠకుని అభిప్రాయం

విజయవాడకి చెందిన కృష్ణ ప్రకాష్, నా నవల 'ఆపరేషన్ రెడ్' చదివి, ఇలా స్పందించారు.
ప్రస్తుతం విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియమ్ లో జరుగుతున్న 35వ పుస్తక ప్రదర్శనలో అన్వీక్షికి పబ్లిషర్స్ వారి స్టాల్స్ 17, 208లో ఈ పుస్తకం లభిస్తుంది.

 



 Click on the image to view in bigger size