Sunday, September 29, 2024

ఏడో ఏడు ఏడుపు - దత్తవాక్కు - ఆంధ్ర ప్రభ ఆదివారం 29 సెప్టెంబర్ 2024

'మొహం మొత్తడం' అని మన తెలుగులో ఒక ప్రయోగం ఉందిలెండి. పెళ్ళయిన కొంత కాలానికి, భార్యకు భర్త మీద మొహం మొత్తుతుందట. అంటే, మోజు తగ్గి, అయిష్టత మొదలవడం! ఇది అందరికీ వర్తించదులెండి! ఆదర్శ దంపతులు నన్ను కోపగించుకోకండేం! అలా అని అందరూ 'బడిపంతులు' సినిమాలో ఎన్.టీ.ఆర్. అంజలీ దేవిలాగా "నీ నగు మోము నా కనులార.. కననిండు!" అని పాడుకుంటూ పరవశిస్తూ ఉండరండోయ్!
ఈ మొహం మొత్తడాన్నే ఇంగ్లీషువాళ్ళు "సెవెన్ యియర్స్ ఇచ్” అన్నారు. 'ఇచ్' అంటే ఇరిటేషన్. పిల్లి అంటే మార్జాలం అన్నట్లుంది కదూ! ఒక విధమైన తీట! సరేనా? పెళ్ళయిన ఏడేళ్ళకు సరిగ్గా ఇది మొదలవుతుందట వాళ్ళకు. కరెక్ట్‌గా అంత 'టైమ్ ఫ్రేమ్' ఎందుకో? మనకలా ఉండదు. మన సనాతన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదంటే, ఎంత అయిష్టత ఉన్నా, ఎన్ని గొడవలు పడినా, వివాహ బంధానికి కట్టుబడి, కలిసే ఉంటాము. విడాకుల వరకు అసలు వెళ్ళం! కానీ, ఈమధ్య మన యువతరం కొంచెం ముందడుగు వేసి, వ్యక్తిత్వం అని, ఇగో అని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుంటున్నారనుకోండి. వారి సంఖ్య చాలా తక్కువ సుమండీ! ఇదంతా ఎందుకని కొందరు ఔత్సాహికులు 'సహజీవనం' అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. మరింత సుందరంగా ఆంగ్లంలో... “లివ్ ఇన్ రిలేషన్‌షిప్". పిల్లల్ని కనరట. ఎప్పుడు పడితే అప్పుడు నీ జట్టు కటీఫ్! ఎవరి సంపాదన వారిదే! 'ఈవెంట్సు' ఏవయినా ఉంటే ఖర్చు చెరి సగం! పెళ్ళిమంత్రాల్లో 'నాతి చరామి', 'నాతిచరితవ్యా'లు వీళ్ళకు వర్తించవు. ‘సెవెన్ యియర్స్ ఇచ్' వీళ్ళకు సెవెన్ మంత్స్‌కే వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర లేదు.


ఈ 'ఏడేళ్ళ ఏడుపు'కు కొంత సైకలాజికల్ బ్యాకింగ్ ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ 'సెవెన్ యియర్స్ ఇచ్' అన్న పద బంధాన్ని మొట్టమొదట తన నాటకానికి శీర్షికగా వాడుకొన్నవాడు 'జార్జ్ యాక్సెల్ రాడ్' అన్న
రచయిత. దానినే 1955లో సినిమాగా తీశారు. మార్లిన్ మన్రో అందులో హీరోయిన్. టామ్ ఎవెల్ హీరో, మార్లిన్ మన్రో 1950లలో, తొలి 1960లలో వచ్చిన శృంగార విప్లవానికి ఆద్యురాలు. ఆమెను సెక్స్ సింబల్ అని పిలిచేవారు. పాపం 36 ఏళ్ళకే ఆ శృంగార రసాధిదేవత మరణించింది. ఆమె చేసుకున్న పెళ్ళిళ్ళు విఫలమై, విడాకులయ్యాయి. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆమె జీవించింది. జీవించదూ మరి? ఏడేళ్ళ వరకు సంసారం సజావుగానే సాగుతుందట. తొలి సంవత్సరాలలో శృంగారం పరస్పర అవగాహనను డామినేట్ చేస్తుందంటారు 'బొనామీ
డొబ్రీ' అన్న విమర్శకుడు. తర్వాత ఒకరి బలహీనతలను ఒకరు గుర్తించడం మొదలవుతుంది. అసూయా, అసహనం, అహంకారం వివాహ బంధాన్ని తూట్లు పొడిచే కత్తులు. ఇదంతా ఖచ్చితంగా 7 సంవత్సరాలకు జరుగుతుందని అనడానికి, నాకు తెలిసి, శాస్త్రీయ ప్రమాణత ఏమీ లేదు.
రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు 'దావత్' అనే కథ రాశాడు. పెళ్ళి విందులో తనకు పలావు ముక్కలు అసలు పడలేదని ఆ ఇంటల్లుడు తన భార్యను, ఆ యింటి ఆడ పడుచును, పెళ్ళి పందిట్లోనే బూతులు తిడుతూ చావబాదుతాడు! ఆమె కిక్కురుమనదు! "ఏడుస్తూనే సూటుకేసు తీసుకుని బిడ్డను చంకనెత్తుకుని అతడి వెంట నడిచింది" అంటాడు ఖదీర్. అబీదా భర్త మీద మనకు కోపం వచ్చినా, ఆమె సహనం పట్ల మనకు జాలి, గౌరవం కలుగుతాయి. అన్ని మతాలూ భార్యాభర్తల అన్యోన్య తను అనుబంధాన్ని గ్లోరిఫై చేస్తాయి.
"ఖుర్-ఆన్, సూర4 (ఆన్. సీసీ) ఆయ4"లో ఇలా ఉంది. "ప్రేమ దయ అనేవి నిక్కాలో భాగాలు కావాలి. భార్యకు భర్త ఒక ఆభరణము. భర్తకు భార్య కూడ అంతే ఆభరణము!"
భీష్మ పితామహుడు ధర్మరాజుతో భార్యాభర్తల బంధాన్ని గురించి ఇలా చెపుతున్నాడు. “నాస్తి భార్యాసమోబంధుః నాస్తి భార్యాసమం సుఖం, నాస్తి భార్యాసమంలోకే, నరస్య అర్తస్య ఔషధం” “సంతుష్టో భార్యయా భద్రార్యాతదైవచ” 'ప్రేమ దేశం' అనే సినిమాలో హీరోయిన్ ఇలా అంటుంది - “స్నేహితుడు భర్త అయితే ఎంత హ్యాప్పీ!". నేనంటాను, పెళ్ళయింత ర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా మారాలి! "బి డివోటెడ్ టు వన్ అనదర్ ఇన్ లవ్. ఆనర్ వన్ ఆనదర్ ఎ అబోవ్ యువర్ సెల్ఫ్" (రొమాన్స్-12-10) అంటున్నది బైబిలు. (ప్రేమలో ఒకరికి ఒకరు అంకితమవండి. మీకంటే ఎక్కువగా మీ భాగస్వామిని గౌరవించండి")
కాబట్టి కామ్రేడ్స్, "సెవెన్ యియర్స్ ఇచ్‌లు ఫైవ్ యియర్స్ పిచ్‌లు మనకు వద్దు. సమాజంలోని ఒక అత్యున్నత కౌటింబిక వ్యవస్థ వివాహం. బంధాన్ని నిలబెట్టుకు
ఉంచుకోవడం కష్టం. తెగతెంపులు చేసుకోవడం ఎంతసేపు? భార్యాభర్తలు దేవతలు కాదు. అన్ని బలహీనతలున్న మనుష్యులు. వాటిని పరస్పరం సహిస్తే, హ్యాప్పీస్!
అదన్నమాట!!


నిర్గుణమఠం – గాణగాపుర యాత్ర - లింక్

గాణగాపుర దత్తక్షేత్రంలో గర్భాలయం ఓపన్‍గా ఉండదు. గోడలో ఒక అడుగున్నర ఉన్న కంత ఉంటుంది. తల వంచి చూసి, స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి మూడు ముఖాలు పసుపు రంగులో మెరుస్తూ దివ్య దర్శనమిచ్చాయి. వాటి ముందు వారి దివ్యపాదుకలు.

https://sanchika.com/nirguna-matha-ganugapura-yaatra-pds/
 


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 2వ భాగం లింక్

ఎర్రనార్యుని తనకు మార్గదర్శిగా ప్రకటించుకున్నారు కవి. ఆయన ‘నృసింహపురాణ ప్రబంధం’ తనకు స్ఫూర్తి అని, కథ, కథనక్రమం అంతా ఎర్రన మార్గంలోనే తాను నడిపించాననీ. తాను అల్పవిషయజ్ఞుడననీ, అలఘు పాండిత్య గరిమంబు లేనివాడననీ, కాబట్టి శంభుదాసుడైన ఎర్రననే తన గురువుగా స్వీకరించానని, కవి వినయంగా చెప్పుకొన్నారు. 


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-2/

‘శ్రీమద్భగవద్గీత – జీవన తత్త్వగీత – విశ్వజన సంహిత’ గ్రంథావిష్కరణ సభ – నివేదిక - లింక్

శ్రీ పాణ్యం దత్తశర్మ, అధ్యక్షుని తొలి పలుకులతో ‘సాధక గీత’ గురించి చెప్పారు. గీత, వేదార్థసారసంగ్రహమని, దానిలో 4 యోగాలున్నా అవి రెండేనని, లోతుగా ఆలోచిస్తే, జ్ఞాన, భక్తియోగాలు ఒకటేననీ అన్నారు. ‘ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి’. ఆత్మ, అనాత్మ, వివేచన సాంఖ్యమని దత్తశర్మ వివరించారు.


పూర్తి నివేదికని సంచికలో చదవగలరు.
https://sanchika.com/srimadbhavadgita-jeevana-tatva-gita-viswajana-samhita-book-release-event-report/

జాషువా జయంతి సందర్భంగా నా ప్రత్యేక ప్రసంగం - యూట్యూబ్ లింక్

విశ్వనరుడు జాషువా 129 వ జయంతి సందర్భంగా నా ప్రత్యేక ప్రసంగం
స్వాధ్యాయ ఛానెల్‍లో




జాషువా జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రికలో నా వ్యాసం

విశ్వనరుడు జాషువా 129 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రికలో నా వ్యాసం.

Click on the image to view in bigger size.
 


ఉషా-తానికొండ నాగయ్య స్మారక కథల పోటీలో నా కథకు విశిష్ట బహుమతి

ఉషా-తానికొండ నాగయ్య స్మారక కథల పోటీలో నేను వ్రాసిన 'విద్యుత్ వీరుడు' కథకు విశిష్ట బహుమతి ₹ 1000/- లభించింది. వివరాలు ఈ ప్రకటనలో.

Click on the image to view in bigger size
 


Saturday, September 21, 2024

కారాలు - మిరియాలు! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 22 సెప్టెంబర్ 2024

'కారాలు-మిరియాలు' అంటే మీకు తెలుసు కదా! చాలా కోపంగా ఉండటమని. దానికీ ఈ శీర్షికకూ సంబంధం లేదండి మాస్టారు! ‘మరెందుకు పెట్టావు?' అంటే... నేను చెప్పే కారాలు వేరండీ! మనకు త్రీమేంగోస్ కారం, స్వస్తిక్ కారం, ఆశీర్వాద్ కారం, ఎం.టీ.ఆర్. కారం... ఇలా బోలెడు కారం పొడులు తెలుసు. కానీ నేనివాళ చెప్పదలచుకొన్నది వాటి గురించి కాదు! పాయింటుకు రావయ్యా... అంటున్నారా? వస్తున్నా!
జీవితంలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి రెండు కారాలు. ఒకటి అహంకారం, రెండు మమకారం. అహంకారానికి తమ్ముళ్ళే గర్వం, పొగరు, స్వాతిశయం, వగైరా! సరే, మమకారంతో మనకేం ఇబ్బంది? అంటే ఉంది!
'అహం' అంటే సంస్కృతంలో 'నేను'కు సంబంధించిన తత్త్వమే 'అహంకారం'. ఈ 'నేను' అనేదుంది చూశారూ, అన్ని అనర్థాలకూ అదే మూలం. అది మనిషిని ఎదగనివ్వదు సరికదా, ఆలోచించనివ్వదు. ఇతరులను గౌరవించనివ్వదు. ఇంగ్లీషులో దీన్ని 'ఇగో' అంటారు. ఇది 'ఐ' అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఈ పదాన్ని ఇంగ్లీషు పదాలలో మొదట చేర్చినవాడు, మనస్తత్వ శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అహంకారం కేవలం ధనవంతులకు, సెలబ్రిటీలకు ఉంటుందనుకుంటే మనం 'సూపు'లో కాలేసినట్టే. దానికి క్యాడర్, స్టేటస్, వెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనితో సంబంధం లేదు. అడుక్కునే వాళ్ళల్లో కూడ అంతరాలుంటాయండోయ్! ఇప్పుడు బిచ్చగాళ్ళు టెన్ రుపీస్ అన్నా ధర్మం చేయకపోతే మనల్ని లోకువగా చూస్తారు. ఆ మధ్య ఒక జోక్! 'చిల్లర లేదు' అని ధర్మం చేసేవాడంటే, “ఫోన్ పే చేయండి సార్! లేదా కార్డు స్వైప్ చేయండి అదీ ఉంది నాకాడ" అన్నాడట స్వీకరించే మహానుభావుడు. ఆ స్థాయిలో అడుక్కునేవాడుంటే వాడికి ఆ మాత్రం అహంకారముండదా చెప్పండి!
'బ్రహ్మ కుమారీస్' వారు ఇలా అంటారు - "అహంకారం కంటే దృఢత్వాన్ని ఎంచుకోవడంతో, సామరస్యంగా వ్యవహరించడంతో అందరూ మీతో కలిసి ఉండడానికి, మరియు మీతో పనిచేయడానికి సౌకర్యంగా ఉంటారు. మీరు వారిని గౌరవిస్తారు కాబట్టి, వారు మిమ్మల్ని గౌరవిస్తారు!” ఎంత నిజం..? పరస్పర గౌరవాభిమానాలే ప్రపంచాన్ని సజావుగా నడిపిస్తాయి గాని, అహంకారాలు కాదు.
ఈ అహంకారాలు చిత్రంగా ఉంటాయి. ఒక బిచ్చగాడు ఒక ఇంటివద్ద నుంచి, నిరాశగా వస్తున్నాడు. ఆ యింట్లో అత్తాకోడళ్ళున్నారు. అత్త గుడినుంచి వస్తూ అతన్ని చూసి, "ఏం అబ్బాయి? మా ఇంటినుంచేనా?" అంది.
“అవునమ్మగారు. మీ కోడలు గారు బిచ్చం వెయ్యలేదు”
“అదెవరు అలా చెప్పడానికి? రా నా వెంట" అని వాడిని తనతో తీసుకుని వెళ్ళి, గుమ్మంలో నిలబడి “ఆ! ఇప్పుడు వెళ్ళు! బిచ్చం లేదు!" అన్నదట ఆ మహాతల్లి! ఏ నిర్ణయమైనా తనే తీసుకోవాలన్నమాట! దీన్నే 'కారం' అనాలో మరి.
'మమకారం' కూడా ఇంచుమించు అలాంటిదే గాని, కొంచెం తక్కువ ప్రమాదకరం! కొడుకులను, కూతుళ్ళను తమ రంగంలో వారసులను చెయ్యాలని అందరూ తహతహలాడతారు, సదరు సంతానానికి టాలెంటు ఉన్నా, లేకపోయినా! అలా మన నెత్తి మీద రుద్దబడిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. మితిమీరిన ప్రేమతో, అతి గారాబంతో పిల్లలను పాడు చేసే వాళ్ళు లేరా చెప్పండి? వేదాంతంలో ఈ మమకారానికి లోతైన అర్థం వుంది. 'మమత్వం' అంటారు దీన్ని వేదాంతులు. 'మమ' అంటే సంస్కృతంలో 'నా యొక్క' అని అర్థం. 'నమమ' 'నమమ' అంటాయి శృతులు. 'నాది కాదు' అని అర్థం. పురోహితులు ఏదైనా పూజ లేదా క్రతువు చేయించేటప్పుడు, కర్తను 'మమ' అనుకోమంటారు. సంకల్పఫలితం దానివల్ల వస్తుంది. “ఏదో మమ అనిపించుకుని వెళితే బాగుంటుంది” అంటుంటారు. ఫార్మాలిటీ!
అహంకార మమకారాలను విసర్జించడం కేవలం యోగులకే సాధ్యం అంటారు కాని, సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉండి నిరహంకారులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. డా. దివాకర్ల వెంకటావధాని గారి వినయశీలాన్ని నేను స్వయంగా చూశాను.
అబ్దుల్ కలాం గారు, కర్పూరీ ఠాకూర్, లాల్ బహదూర్ శాస్త్రి గారు, త్రిపుర సి.ఎం. మానిక్ సర్కార్ గారలు, ఇలా ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!
'ధిషణాహంకారం' కొందరికి శోభనిస్తుంది. నిజంగా ‘ధిషణ' ఉన్నప్పుడే సుమండీ. కవిసమ్రాట్ విశ్వనాథ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. వారి 'అహంకారం' వారికి సహజాలంకారం. ఏ గొప్పా లేకపోయినా అహంకారాన్ని ప్రదర్శిస్తారు కొందరు. వారిని చూస్తే నాకు కోపం రాదు. జాలేస్తుంది.



నానేతంతానంతే బావూ... అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టేంత గొప్పవాళ్ళం మనం కాదు గానీ, ఎదుటి వారిని కించపర్చకుండా ఉంటే చాలు. అహంకారం కంటే 'స్వోత్కర్ష' మనకు వినోదాన్ని కలిగిస్తుంది. విజయం వల్ల వినయం రావాలి గాని, గర్వం రాకూడదు సార్!
అహమున జిక్కిన మనుజులు
బహుపూజ ఫలితమెల్ల బూదినిగలయున్
ఇహపరముల జెడిపోదురు
మహనీయతనందబోరు
మహిలో సత్యా!
అన్నారొక కవి.
అదన్నమాట!

సహరి వారపత్రికలో నా కథ

సహరి వారపత్రిక 20 సెప్టెంబర్ 2024 నాటి సంచికలో నా కథ 'అతని కంటే ఘనుడు' ప్రచురితమైనంది. క్రింద ఐదు పేజీలలో కథని చదవచ్చు.






 Click on the image to view it in bigger size


‘మహాప్రవాహం’ 45వ భాగం లింక్

"కాలము నిరంతర గమనశీలమైనది. మార్పు దానికి అతి సహజము. దాన్ని స్వీకరించడం తప్ప మనము చెయ్యగలిగిందేమో లేదు. మనిషి పురోగమనము అదంతట అదే జరుగుతుందా, మన తెలివితేటలు, కృషి, ప్రయత్నము ఇవేవీ అవసరము లేదా అనే ప్రశ్న వస్తుంది. అవన్ని ఉన్నాయి. ఉంటాయి. కాని వీటన్నిటిని మించి కాలమనే ఒక బలీయశక్తి మన జీవితాలను నిర్దేశిస్తూ ఉంటుంది."


సీరియల్ చివరి ఎపిసోడ్ సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-45/


వడపళని – తిరువళ్ళూరు – తిరుత్తణి ఆలయ దర్శనం - లింక్

తిరువళ్ళూరులో వీరరాఘవస్వామివారు వెలసి ఉన్నారు. గుడి ముందు పెద్ద పెద్ద స్తంభాలతో కూడిన ఆవరణ, దానిలో రెండు కళాత్మకమైన మంటపాలు. అవి దాటి లోపలకి ప్రవేశిస్తే కళ్ళు చెదిరి శిల్పసంపద! భక్తల రద్దీ లేదు. వీరరాఘవస్వామివారు రంగనాథ స్వామి వలె చేయి తలకింద పెట్టుకొని పవళించి ఉన్నారు సుందరమైన నల్లరాతి విగ్రహం.. అర్ధనిమీలిత నేత్రుడై యోగనిద్రలో ఉన్నాడు పరమాత్మ. 


https://sanchika.com/vadapalani-tiruvallur-tiruttani-temples-visit-pds/


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 1వ భాగం లింక్

అమ్మవారు “స్వామీ! నన్ను మీ మేన సగం చేసుకొని నాకు ఒక ఐడెంటిటీ లేకుండా చేసినారు” అని నిష్ఠూరం చేయగా, “దేవీ! ఎంతమాట! మనిద్దరం ఒకటే! నిన్ను పరాశక్తిగా సేవిస్తాను” అన్నాడట. అర్ధనారీశ్వరతత్త్యంలోని చమత్కారం. 



https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-1/

‘గోవాడ క్రియేషన్స్’ వారి ‘నాటిక నైవేద్య’ సభ – నివేదిక - లింక్

గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్స్ నిర్వహించిన 'కీ. శే. గోవాడ మల్లీశ్వరి స్మారక నాటిక రచన పోటీ 2024'లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన సభ 13 సెప్టెంబర్ 2024 న, హైదరాబాదులోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది. వివరాలు నివేదికలో చదవండి.


https://sanchika.com/govada-creations-natika-naivedya-sabha-report/

Sunday, September 15, 2024

పదార్థాలు - పదాల అర్థాలు - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 15 సెప్టెంబర్ 2024

తెలుగు భాష చాలా పురాతనమైనది, గొప్పది. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న పదాలలో సింహ భాగం సంస్కృత పదాలే. అన్నట్లు, సింహభాగం అన్న పదం కూడా సంస్కృతమేనండోయ్. విశేషం, విచిత్రం ఏమిటంటే, మనకు సంస్కృత పదాలతో ఉన్నంత సాన్నిహిత్యం, తెలుగు పదాలతో లేదు. నా ఉద్దేశ్యం, అచ్చ తెలుగు పదాలతో!
'పదార్థం' అంటే ఒక వస్తువు, దినుసు కావచ్చు (Substance). పదానికి అర్థం కూడ. మనం కొన్ని పదాలను, ప్రఖ్యాత కవులు ఉపయోగించినవి, వాటి అర్థం తెలియకుండానే విని, పాడి, ఆనందిస్తుంటాం! "అజ్ఞానమే ఆనందం" అన్నారు. Robert Lyndon అనే రచయిత Pleasure of Ignorance అనే వ్యాసమే రాశాడు. తెలియకపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమిటి? అని మీరు అనుకోవచ్చు. నష్టం ఏమీ లేదు, భాషకు! పదం అర్థాన్ని తెలుసుకుంటే వచ్చే ఆనందం వేరు!
'భక్త తుకారాం' సినిమాలో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గొప్ప పాట రాశారు. "ఘనాఘన సుందరా!". ఈ పాట తెలియనివారెవరు? పాటల పోటీలలో ఎక్కువగా పాడుతుంటారు. సరే, బాగానే ఉంది, 'ఘనా' అంటే ఏమిటని చాలామందిని అడిగాను. తెలియదని ఎవరూ అనలేదు. “చాలా గొప్ప” అని చెప్పారు. కానీ, “ఘనాఘనము" అంటే మేఘం. అది సంస్కృత పదం. మేఘం వలె సుందరుడని కవి భావం.
పోతన గారు, 'శారద నీరదేందు ఘనసార పటీర' అన్న ప్రసిద్ధ పద్యం రాశారు. 'శారద' అంటే శరదృతువు. 'నీరద' అంటే 'మేఘం' మరి 'ఘనసారం?' 'గొప్పసారం కలది' అని కాదు. ఘనసారం అంటే కర్పూరమండీ బాబు!
'నేటిభారతం' సినిమాలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో...." అనే పాట ఉంటుంది. గొప్ప పాట. దీనిని వేటూరి సుందరరామమూర్తి గారు వ్రాశారు. అందులో 'మరో మహాభారతం', 'ఆరవ వేదం' అంటారు వేటూరి. 'ఆరవ వేదం' అంటే ఏమిటబ్బా..! మొత్తం నాలుగు వేదాలు. అవి మనకు తెలుసు. మహాభారతాన్ని 'పంచమవేదం' అంటారు. వేటూరి గారిది 'మరో' మహాభారతం. అందుకే 'ఆరవ వేదం'. 


 తెలుగు పదాలు స్థూలంగా ఐదు రకాలు మాస్టారు.
1) తత్సమాలు: అంటే, సంస్కృత పదానికి 'డూ, మూ, వూ, లూ' చేరి తెలుగు పదాలై కూర్చుంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్! రామః రాముడు, ధేనుః ధేనువు, కార్యః కార్యము, శాస్త్రాః శాస్త్రాలు. అలా అని అన్ని చేయడం కుదరదు మిత్రమా!
2) తత్భవాలు: సంస్కృత, ప్రాకృత భాషలలో నుండి కొంచెం మార్పుతో ఏర్పడతాయి. తామరసం: తామర, దేవ, దేవర, రథం, రదము, యజ్ఞం, జన్నము.
3) దేశ్యములు: తెలుగు వారి స్వంత పదాలు: ఊరు, పేరు, చెట్టు, పుట్ట, తల్లి, తండ్రి.
4) అన్యదేశ్యములు: ఇతర భాషల నుండి వచ్చినవి. రోడ్డు, కారు, టికెట్టు, బస్సు, రైలు, దస్తావేజు, పరవా (పరవాలేదు అంటాం గాని, పరవా ఉంది అనం ఎందుకో), రైలు అంటే అసలు 'పట్టా' అని అర్థం. రైల్వే, పట్టాలదారి.
5) గ్రామ్యములు: వ్యాకరణం లెక్క లోకి రావు కాని ప్రజలు సహజంగా మాట్లాడే మాటలు. మాండలీకాల్లో (యాసల్లో) ఉంటాయి. చూస్తిమి, లెగు, కూకో, జిమ్మడ.. జిమ్మ అంటే జిహ్వ. నీ నాలుక పడిపోను! అని అర్థం. బాబోయ్! తెలుగు, తెనుగు, ఆంధ్రము అన్నీ ఒకటే. అచ్చ తెలుగు పదాలతోనే పేచీ! గురువు అంటే అందరికీ తెలుసు “ఒజ్జ' అంటే ఏమోనబ్బా! గురువు! అది అచ్చ తెనుగు. అన్నమయ్య కొన్ని పదాలను వేరే అర్థంలో వాడతాడు. "నగుమోము గనలేని నా 'జాలి' తెలిసీ” అన్న కీర్తనలో 'జాలి' అంటే ఆయన లెక్క ప్రకారం 'నిస్సహాయత'. అలా ఎలా? అంటే, 'నిరంకుశాః కవయః' అన్నారు. కవులకా స్వతంత్రం ఉంది మరి. నన్నయ గారి కవిత్వం అంతా తత్సములే. తిక్కన్న గారి కవిత్వంలో అచ్చ తెలుగు పదాలెక్కువ.
అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత నిజరూపాల్లో విరాటుని కొలువుకు పాండవులు బయలుదేరుతున్నారు. అప్పుడాయన, “వేడ్క తొడి, పూసి, కట్టి" అంటారు. అర్థమైంది కద! అన్నమయ్య గారు ఒగి, వెక్కసపు అవ్వల, ఇవ్వల, నడుమ, తుది (ఎరుక తుది: జ్ఞానానికి పరాకాష్ట) ఇలాంటి పదాలు వాడతారు. అన్నీ అచ్చ తెలుగే. “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాలో “ఎకిమీడా” అన్న పాట ఉంది. దాన్ని సిరివెన్నెల రాశారు. ఎకిమీడు అంటే ప్రియుడు, చెలికాడు అని అర్థం. పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడితే.." ఇది చాల యక్కరం, వడారం ఆణియ పదాలనే వాడవలె. లేదా మన నుడి చచ్చును." (వడారం: కేవలం, ఆణియ: తెలుగు, నుడి: భాష) ఎలా ఉంది మహాశయా? 'అచ్చ' అంటే 'అసలైన' అని. ‘టూకీగా', 'భేషుగ్గా', 'శభాష్', ‘లగాయతు', 'బేకారు', 'నిఖార్సయిన'... ఇవన్నీ తెలుగు పదాలేనంటారా? త్వరలో పుస్తక ప్రదర్శన “షురూ!" ఇది ఉర్దూ. భాష ఒక సముద్రం. ఎన్నో ఇతర భాషల నదులను తనలో కలిపేసుకుని 'తొణక్కుండా' ఉంటుంది. అదన్నమాట!

‘మహాప్రవాహం’ 44వ భాగం లింక్

ఫ్యాక్షనిసుల కుటుంబాన్ని కాల మహా ప్రవాహము డాక్టర్లుగా ఇంజనీర్లుగా మార్చి పారేసినాది. ఎవరికీ అంతుపట్టనివి దాని పోకడలు చూడాల మరి, ఇంకా ఏం చేయబోతున్నాదో!
#
రుక్మాంగద రెడ్డి కదిలిపోయినాడా మాటలకు. “తల్లీ! నీ మంచితనమే మనల్నందర్నీ ఇయ్యాల ఇంత బాగుండేటట్లు చేసింది. ల్యాకపోతే వాండ్లను మేమూ, మమ్ముల్ను వాండ్లూ సంపుకోని సస్తాంటమి. తప్పకుండా పిలుద్దాము. ఆయప్ప నాకంటె రెండేండ్ల చిన్నాడు. ఇంకా వైరాలు పెట్టుకోని ఏం జేస్తాము” అన్నాడు.



https://sanchika.com/mahaapravaaham-pds-serial-44/


ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-2వ భాగం లింక్

ప్రొద్దుటూరు సమీపంలోని పుష్పగిరి క్షేత్రం (పీఠం), రామేశ్వరం, కన్యతీర్థం, గండి క్షేత్రం, అమృతేశ్వరం మొదలగు క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలతో రాసిన రచన.
"చాలా పెద్ద ఆవరణ. భక్తులకు ఎండ తగలకుండా కళాత్మకమైన సామియానాలు వేశారు. చలువపందిళ్ల కాలం పోయినట్లేనా? ఆవరణ మధ్యలో పంచముఖ అంజనేయ స్వామివారి 150 మీటర్ల ఎత్తున్న విగ్రహం ధవళకాంతులనీనుతూ నిలిచి ఉంది."



పూర్తి ఆర్టికల్ ఈ లింక్‍లో సంచికలో చదవగలరు.
https://sanchika.com/prodduturu-aalayaala-sandarshana-pds-2/

సంచికలో 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' ధారావాహిక - ప్రకటన లింక్

వచ్చే ఆదివారం నుంచి నా పద్యప్రబంధము 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' సీరియల్‌గా సంచికలో ప్రారంభమవుతోంది.
ఈ మేరకు కొత్త సీరియల్ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన ఈరోజు సంచికలో.



https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-padyakaavyam-annoucement/

Saturday, September 7, 2024

‘మహాప్రవాహం’ 43వ భాగం లింక్

కాలానికి దుక్కాన్ని మాన్పించడమే గాదు, ప్రేమలను గూడ మరిపిస్తాది. ఉన్న బందాల కోసరం కొత్త బందాలను తగిలిస్తాది. బతుకులను సర్దుబాట్లతో నడిపిస్తాది.
#
ఖాదర్ మియా జీవితంలో విషాదం నింపిన కాలం, తిరిగి తానే ఎలా కుదుటపరిచిందో ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

‘మహాప్రవాహం’ 43వ భాగం

ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-1వ భాగం లింక్

 ప్రొద్దుటూరు సమీపంలోని పుష్పగిరి క్షేత్రం (పీఠం), రామేశ్వరం, కన్యతీర్థం, గండి క్షేత్రం, అమృతేశ్వరం మొదలగు క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలతో రాసిన రచన.
"ఆమె పూజారిణి. పూజారిగారు లేకపోతే ఆమే ఆలయంలో పూజలు చేస్తుందట. ఆమె కూడా చాలా త్రిపురసుందరిలాగే ఉంది. శివుడికి లఘున్యాస అష్టోత్తరాలతో, అమ్మవారికి శ్రీసూక్తంతో అర్చన చేసింది, సుస్వరంగా. స్త్రీలకు వేదాధికారం లేదని ఎవరు చెప్పారని, వారు కూడా వేదపఠనానికి అర్హులే అని ఆదిశంకరాచార్యులన్న మాట నాకు గుర్తుకు వచ్చింది. ఆమె వాక్శుద్ది, మంత్రం పలికే తీరు చక్కగా ఉంది."
పూర్తి ఆర్టికల్ ఈ లింక్‍లో సంచికలో చదవగలరు.



ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-1వ భాగం

అత్రాగచ్చ జగత్వంద్య

వినాయక చవితి సందర్భంగా 07 సెప్టెంబరు 2024 నాటి ఆంధ్ర ప్రభ దినపత్రికలో నా రచన పేపర్ క్లిప్పింగ్.
"ఆయనకు ఈసారి పెద్దగా కుడుములు, ఉండ్రాళ్ళు దొరకలేదు. దొరికినవి మూషికునకి పెట్టాడు. "స్వామీ! మరి మీకు?"
"నువ్వు తిను ముందు, నన్ను మోయాలి కదా!"
అదీ స్వామి ప్రేమ.



Click on the image to view in bigger size

గురవే నమః

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 05 సెప్టెంబరు 2024 నాటి ఆంధ్ర ప్రభ దినపత్రికలో నా వ్యాసం పేపర్ క్లిప్పింగ్:
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అచిరకాలంలోనే అభివృద్ధి చేసిన రాధాకృష్ణన్ గురించి రామన్ ఇలా అన్నారు: "1934లో, అరేబియన్ నైట్స్ లోని ఒక కథలా జరిగింది. రాధాకృష్ణన్ గారు చేయి ఊపంగానే, అంతే! చక్కని భవనాలతో, సిబ్బందితో, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్తయింది!"



Click on the image to view in bigger size

కథామంజరి సెప్టెంబర్ 2024 సంచికలో నా కథ 'స్వర్గాదపి గరీయసీ' - లింక్

శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి సంపాదకత్వంలో వెలువడే కథామంజరి మాసపత్రిక సెప్టెంబర్ 2024 సంచికలో నా కథ 'స్వర్గాదపి గరీయసీ' ప్రచురితమైనది.
క్రింది లింక్ ద్వారా నా కథని, ప్రచురితమైన మరో 9 కథలని చదవచ్చు. నా కథ 6-11 పేజీలలో ఉంది. 


కథామంజరి సెప్టెంబర్ 2024 సంచిక