Saturday, February 1, 2025

నా కథ 'నిజంగా మాది ప్రేమే!' లింక్

సంచిక - డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నా కథ 'నిజంగా మాది ప్రేమే!'
ఈ లింక్ ద్వారా చదవండి.

 https://sanchika.com/nijamgaa-maadi-preme-pds-story/

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 13వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 13వ భాగం సంచికలో చదవండి.
~
దస్తగిరిసారు ఒక కాయితం తీసినాడు. దాని మీద ‘చెల్లుచీటి’ అని పైన రాసి ఉంది. క్రింద రూపాయ రెవెన్యూ స్టాంపు అతికించి ఉంది. కోనేటయ్య, పూర్తిగా శేషశయనారెడ్డి బాకీ, వడ్డీతో సహా చెల్లించినట్లు రాసి ఉంది. ఎడమపక్క సాక్షి సంతకాలు.
అయిష్టంగానే పెదరెడ్డి స్టాంపు మీద సంతకం చేశాడు. సాక్షి సంతకం దస్తగిరి సారు చేశాడు. రామా౦జులు, సహదేవుడు ‘నిశాని’లు వీశారు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/srimadramaramana-pds-serial-13/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 20వ భాగం లింక్

కం.:
పుట్టిన ప్రతి జీవి యునటు
గిట్టక తప్పదుర యసుర! కించిత్తయినన్
ఇట్టిది సాధ్యము కాదని
గట్టిగ తెలిసియను నడుగ గా తగునె నిటుల్

వచనము:
కావున వేరు వరము లేవైన కోరుకొనుము, ఇచ్చెద. 'నిర్మృత్యుపదము జీవులకు దుర్లభము' అని సృష్టికర్త పలికెను. అంత నసుర విభుండు కొంత సేపు మనములో వితర్కించి, ఇట్లు వేడెను.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-20/

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 10వ భాగం లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 10వ భాగం. 🙏
~
‘ఉద్యోగినం న దూర భూమిః’ అన్నాడు హితోపదేశకర్త. ప్రయత్నపరుడైన వానికి దూర దేశమనిది ఉండదు. గోపాల రావు మాలతీ చందూర్ భావాలకు Spokesman. నవలలోని Protagonist గా అతని ద్వారా, ఆమె విశ్వజనీనమైన ఎన్నో విషయాలను నిష్పక్షపాతంగా, నిర్ణయంగా వ్యక్తీకరించగల మేధావి. అవి ఏదో theoretical గా, statements లా కాకుండా, సజీవమైన పాత్రల సంభాషణల్లో పొందుపరచి, వాటికి credibility ని, authenticity ని కల్పిస్తుంది. ఆ మహా రచయిత్రి నిస్వార్థ ఉద్యమస్ఫూర్తికి పరాకాష్ట!
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-10/

అదేం బ్రహ్మవిద్యా? దత్తవాక్కు ఆంధ్రప్రభ

ఏదయినా ఒక పనిని గురించి చెప్పేటప్పుడు, “అంత కష్టమైందేమీ కాదు, ఎవరైనా చేయవచ్చు” అనే అర్థంలో, “అదేమంత బ్రహ్మవిద్యేమీ కాదు!” అంటూంటారు. అసలీ బ్రహ్మవిద్య అంటే ఏమిటి? త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవునికి దీనికి సంబంధం లేదండోయ్. ఆయన బ్రహ్మ. ఇది బ్రహ్మము! చాలా తేడా! అన్నింటికంటే గొప్పది, దాని కంటే మరొక గొప్పది ఏది లేదో అదే బ్రహ్మము. సర్వకారణము, సర్వాధారము, సృష్టంతా వ్యాపించింది, పొందతగినది, సత్ చిత్ ఆనంద లక్షణమై ఉన్నదే బ్రహ్మము.
కఠోపనిషత్ సంబంధ భాష్యం (1) లో “పూర్వోక్త విశేషణాన్యా ముముక్షూన్పరం, బ్రహ్మగమయతీతి చ...” అంటూ బ్రహ్మవిద్యను నిర్వచించారు. మరీ లోతుకు వెళ్లకుండా, మనకు తెలిసిన పరిధిలో దీన్ని చూద్దాం. ‘బృహ్’ అనే ధాతువు నుండి ‘బ్రహ్మ’ శబ్దం ఏర్పడింది. ‘బృహ్’ అంటే పెరగటం. మన చుట్టూ ఉన్న చరాచర వస్తువులన్నీ ‘దేశపరిచ్ఛిన్నములే’ (లిమిటెడ్ ఇన్ స్పేస్). కానీ బ్రహ్మము దీనికి అతీతం. దీన్ని మనం చూడలేము. కాని పొందగలం. ఎలా?
‘యోగః కర్మసు కౌశలం’ అని గీతా వాక్యం. మరీ వేదాంతాల లోతులకు వెళితే మనలాంటి వాళ్ళం ఉక్కిరిబిక్కిరవుతాం. “నేర్చుకునేంత వరకు బ్రహ్మవిద్య, నేర్చుకున్న తర్వాత కోతివిద్య” అని నానుడి. ‘కోతి విద్య’ అని ఎందుకన్నారంటే, కోతి అవలీలగా ఎలా విన్యాసాలు చేస్తుందో అలా, హేలగా.. అని! కుర్రవాడు సైకిల్ తొక్కడం నేర్చుకునేటపుడు చూడాలి వాడి పాట్లు. బ్యాలెన్స్ కుదరదు. ఒక వైపు లాగేస్తుంటుంది. క్రిందపడి మోకాళ్ళు మోచేతులు దోక్కుపోతుంటాయి. నిజంగా బ్రహ్మవిద్యా అనిపిస్తుంది. తనకసలు పట్టుబడుతుందా అని అనుమానం కూడా వస్తుంది. ఒకసారి దాని ‘కిటుకు’ తెలిసింతర్వాత చూడాలి వాడి ఫీట్లు! రెండు చేతులూ హ్యండిల్ వదిలేసి కూడా రయ్యి రయ్యిమని తొక్కుతూ వెళుతుంటే చూడాలి! అదీ సెన్స్ ఆఫ్ అచీవ్‌మెంట్ అంటే!
మా చిన్నతనంలో, ఎండాకాలం సెలవుల్లో, యాగంటయ్యగారని సారు, మాకు ఈత నేర్పేవారు. మునగ చెట్టు కొమ్మలకు బెరడు తీసి, అడుగున్నర పొడవు కట్ చేసి, నాలుగయిదు కలిపి కట్టగా కట్టేవారు. దాన్ని మా నడుముకు కట్టి, పొలాల్లోని పెద్ద దిగుడు బావిలోకి తోసేవారాయాన. ముందు రయ్యిన నీటిలోకి వెళ్లి, సర్రున పైకి తేలేవాళ్ళం. మునగ కర్రలను ‘బెండ్లు’ అనేవారు. అవి మనల్ని మునగనివ్వవు. చేతులు కాళ్లు ఆడిస్తూ ఈత కొడుతూంటే భయమేసేది. ఆయనకు (మాకు కాదు) కాన్ఫిడెన్స్ వచ్చింతర్వాత, ఆ బెండ్ల మోపు కట్టకుండా, ఏమరుపాటుగా ఉన్న మమ్నల్ని బావిలోకి తోసేవారు యాగంటయ్య సారు. ముందు కొంచెం భయపడినా చక్కగా ఈదేవాళ్లం. మా సారు నీళ్ళ మీద నిశ్చలంగా పద్మాసనంలో కూడా ఉండగలిగేవాడు. కొన్ని వందల మందికి ఈత నేర్పిన మహానుభావుడు. కేవలం పర హితమే తప్ప అందులో ఆయనకు పిసరంత స్వార్థం లేదండోయ్! ఇది బ్రహ్మవిద్య కాదంటారా, చెప్పండి?


పరబ్రహ్మతత్త్వాన్ని గురించి, అన్నమాచార్యుల వారు చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేదనిపిస్తుంది నాకు. ‘కందువగు హీనాధికము లిందులేవు’ అంటాడాయన. ‘అందరికి శ్రీహరే అంతరాత్మ’ అంటాడు. రాజుకు బంటుకు నిద్ర ఒకటే అంటాడు. ‘బ్రాహ్మణుడైనా, పంచముడైనా చేరేది చివరకు ఒకే భూమి’ అంటాడు. దేవతలకు, పశువులకు కామసుఖం ఒకటేనట. శిష్టాన్నానికైనా, దుష్టాన్నానికైనా ‘ఆకలి’ ఒకటే! దుర్గంధం మీద, పరిమళం మీద వీచే గాలి ఒక్కటే! ఏనుగు మీద కుక్క మీద కాసే ఎండ; పుణ్యాత్ములను పాపాత్ములను రక్షించే ఏడుకొండల రాయుని నామమొకటేనని ముగిస్తాడు అన్నమయ్య. అక్కినేని నాగార్జున గారు ఈ భావాలను అద్భుతంగా అభినయించి, ఎఎన్ఆర్ గారి పేరు నిలబెట్టారు! దీన్ని బట్టి ఏం తెలుస్తూంది? సర్వత్ర సమదర్శనమే బ్రహ్మము! దాని వల్ల వచ్చే ఆనందమే బ్రహ్మానందము.
ఒక రమణ మహర్షి, ఒక షిరిడీ సాయి. ఒక మదర్ తెరీసా, ..వీరి నవ్వు చూడండి! అలౌకికమైన నవ్వది. దాన్నే ఇంగ్లీషులో ‘బ్లిస్’ అంటారు, దాన్ని పొందింతర్వాత ఇంకేవీ అవసరం లేదు. వృత్తిని నిజాయితీగా చేస్తూ, దాంట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం కూడా బ్రహ్మవిద్య అంటాను నేను. మా మాతామహులు రామయ్యగారు. అప్పట్లో అధిక సంతానం, పేదరికం. అవి ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానానికి అవరోధాలు కాలేదు. నిరంతరం ప్రసన్నంగా ఉండే ఆయన వదనం నాకు గుర్తుంది. మా నాన్నగారికి ఆయన పిల్లనిచ్చిన మామ మాత్రమేకాదు. ఆధ్యాత్మిక గురువు కూడా.
వారి కుమారుడు, మా మేనమామ శ్రీ క్రిష్టిపాటి సీతారామ శాస్త్రిగారు. ఆయన ఉద్యోగ ప్రస్థానం ఒక కేస్ స్టడీ అవుతుంది. స్కూల్ ఫైనల్‌లో వచ్చిన మార్కులతో, ఆర్.ఎమ్.ఎస్. సార్టర్‌గా చేరాడాయన. మైసూరు పోస్టల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజ్ ఫ్యాకల్టీగా ఎదిగాడు. డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్ (పోస్ట్ మాస్టర్ కాదండోయ్!) గా రిటైరైనాడు. సార్టర్‌గా ఎలా ఉండేవాడో, డి. పి. ఎమ్. జి. గా కూడా అంతే. అదే ఆహార్యం, అదే స్వచ్ఛమైన మనస్సు. మా అత్తయ్యను చూస్తే నాకు ‘వండనలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి’ అన్న అల్లసాని వారి పద్యపాదం గుర్తుకువస్తుంది. నన్ను ‘దత్తుడూ! బాగున్నావా!’ అంటూ దగ్గరకు తీసుకుంటుంది. ఆమె పేరు, మా అమ్మ పేరు ఒకటే. మా అమ్మ తర్వాత అంత ప్రేమగా నేను కౌగిలించుకునేది మా అత్తయ్యనే. ఆమె నవ్వితే వేయి మల్లెలు విరిసినట్లుంటుంది. అప్పుడు ఎర్ర బస్సుల్లో తిరిగినా, ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నా, వాళ్ల దృక్పథాలు మారలేదు! 50 సంవత్సరాల నుండి చూస్తున్నా మరి!
సెంచరీ చేసినప్పుడూ, పది పన్నెండు రన్స్ చేసి ఔట్ అయినపుడూ, సచిన్ టెండూల్కల్ ఒక్క లాగే నవ్వుతాడు, పసిపాపలా! ‘కష్టములకు క్రుంగని, సుఖములతో పొంగ’ని వారు వాళ్లంతా! బ్రహ్మ విద్య అంటే అదేనండీ బాబూ! ఎప్పుడూ ఒక్కలా ఉండటం! భగవద్గీతకు బ్రహ్మ విద్య అని పేరుంది మాస్టారు. అదేదో కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమనే మోటివేషనల్ స్పీచ్ కాదు సార్! మనందరికీ కరదీపిక. కళ్ళు, ముక్కు మూసుకుని (చెవులు కుదరవు లెండి) కూర్చుంటే బ్రహ్మవిద్య రాదండోయ్! “అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్, ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్” అన్నాడు హితోపదేశ కర్త. దాన్ని పాటించడమే బ్రహ్మవిద్య అంటాన్నేను. పైన పేర్కొన్న వారంతా అలాంటి వారే! అది అలవర్చుకోవటం మాత్రం బ్రహ్మవిద్యే! అదన్న మాట!