Sunday, October 27, 2024

ముద్దుపేర్ల ముచ్చట - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 27 అక్టోబర్ 2024


“చింటూ! ఎక్కడున్నావు నాన్నా!” అని పిలిస్తే వస్తాడు బుడి బుడి నడకల సంవత్సరంన్నర పిల్లవాడు. వాడి పేరు ‘శిఖివాహన్’ అని పెట్టారు, నామనక్షత్రం ప్రకారం. కానీ ముద్దు పేరు ‘చింటూ!’. ‘చింటూ’కు అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు! మన తెలుగులో ముద్దు పేర్లు చలామణీలో ఉంటాయి, అసలు పేరు మరిచిపోయేటంతగా! కొన్ని వినోదాన్ని కల్గిస్తే, మరికొన్ని విస్మయాన్ని కలిగిస్తాయి. మా ఊర్లో నా చిన్ననాటి మిత్రుడు నజీర్ అహమ్మద్ ఉన్నాడు. తరతరాలుగా వాళ్లకు సోడాల షాపే జీవనం. ఎలా వచ్చిందో తెలియదు గాని, వాడిని మేమంతా ‘పిట్టపిడుగు’ అనేవాళ్లం. ఆ పదానికి వ్యుత్పత్తి మాత్రం నన్ను అడక్కండేం! ముద్దు పేర్లకు మూలాలు వెతుకుతామంటే ఎలా బ్రదర్? ఏమో, ఈ అంశం మీద అల్లాటప్పా విశ్వవిద్యాలయానికి థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ ఎవరైనా పొందినా ఆశ్చర్యం లేదు!
మా నాన్నగారు శతావధాని, పౌరాణిక రత్న, పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రిగారు. కోట్ల విజయ భాస్కరరెడ్డి గారికి ఆయన గురువు. కాని, ఆ పేరు చెబితే మా జిల్లాలో తెలియదు. అందరూ నాన్నను ‘గుండయ్యస్వామి’ అంటారు. అదెలా అంటే.. మా ఊరు వెల్దుర్తి దగ్గర బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఉంది. ధర్మాంగద మహారాజుకు సర్ప రూపం పోయి నిజరూపం వచ్చింది, అక్కడ పుష్కరిణిలో మునిగిన తర్వాతనే అని ఐతిహ్యం. మా నాయనమ్మ, నాన్న చిన్నపుడే చనిపోతే, ఆయన పిన్నమ్మ ఆయన్ను పెంచింది. ఆమె ఆయనను ప్రేమగా ‘ఒరే! గుండయ్యా!’ అని పిలిచేదట. బ్రహ్మగుండేశ్వరుని పేరు. అదే స్థిరపడింది. బంధువులు కూడ ఆయనను వరసను బట్టి “గుండు మామ, గుండు తాత, గుండన్న” అనే పిలిచేవారు. నన్ను ఆయన, “ఒరేయి, పెద్ద వెధవా!” అని పిలిచేవారు. నేను పెద్ద కొడుకును. సరే. అది వేరే!
ముద్దుపేర్లను ఇంగ్లీషులో ‘నిక్ నిమ్స్’ లేదా సింపుల్‌గా ‘నిక్’ అంటారని మీకు తెలుసు. నేను చెప్పే విషయాలన్నీ మీకు తెలిసినవేనని నాకు తెలుసని మీకు తెలుసు మాస్టారు! అయినా, మీరు నా కాలమ్ చదువుతున్నారంటే, నా ‘కాలం’ బాగుందన్నట్లు! 


‘నిక్ నేమ్’, 1303లోనే ‘అదనపు పేరు’గా అటెస్ట్ చేశారు సారు. దీనికి ఓల్డ్ ఇంగ్లీషు పదం ‘eac’ మూలం. దీని అర్థం `కూడా’ (also) అని. 15 శతాబ్దానికల్లా అది ‘నిక్ నేమ్’ అయ్యిందంట. మన దేశంలో, బెంగాలీ సమాజంలో, చాలామందికి రెండు పేర్లుంటాయి. ఒకటి ‘దక్ నామ్’, కుటుంబం, స్నేహితుల కోసం. రెండు ‘భలో నామ్’, అంటే వ్యవహార నామం. ఇంగ్లీష్ సమాజంలో, వారి వృత్తి, లేదా ఇంటిపేరును బట్టి, ‘నాచీ’, ‘డస్టీ’, బన్నీ, చాకీ, ప్యాడీ (ఐరిష్), మిక్ (రోమన్) లాంటి పేర్లుంటాయి. అమెరికన్ ప్రెసిడెంట్ (మాజీ) జిమ్మీ కార్టర్ పేరులో జిమ్మీ ముద్దు పేరేనట. కొన్ని అసలు పేర్లను కొంచెం కురచ చేసి ముద్దు పేర్లుగా మారుస్తారు. ఉదా: మార్గరెట్.. గ్రేటా. దీనికి సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. ‘నామైక దేశే నామగ్రహణం’ (పేరులోని ఒక భాగాన్ని పేరుగా). కవిసమ్రాట్ విశ్వనాథవారు ఈ విధానాన్ని ఒక నవలలో పరిహసించారు. సత్యభామను శ్రీకృష్ణులవారు ‘ సత్యా’ అనేవారో లేదో గానీ, మన వెండితెర కృష్ణుడు యన్‌టిఆర్ గారు మాత్రం అలాగే పిల్చేవారు. ‘రుక్మిణి’ని ‘రుక్కూ’ అని అనలేదు మరి! ఆమె అలాంటివి ఇష్టపడదేమో!
మా ఇంట్లో నా శ్రీమతి పేరు హిరణ్మయి. మా మామగారికి ఎనిమిదిమంది ఆడపిల్లలు! నిజం సుమండీ! మీరు ఆశ్చర్యం నుంచి తేరుకుంటే విషయానికి వస్తా. అష్టలక్ష్ములను కన్నది మా మేనత్త. అందరికీ అమ్మవారి పేర్లే. మా ఆవిడ నంబర్ 8. కాబట్టి ఆమెను ‘చిన్నీ’ అనేవారు. అది స్థిరపడి, నేను కూడా, ఈ వయసులో.. ఆమెను ‘చిన్నీ’ అని పిలుస్తా, ముద్దుగా! ఆమె పలుకుతుంది! నవ్వుతున్నారా? ‘కాకి భార్య కాకికి ముద్దు’, తెలుసాండీ! ఇక బంధువులు ఆమెను ‘చిన్ని పిన్ని’, ‘చిన్ని బామ్మ’, ‘చిన్నక్క’ అనీ అంటారు. అరవైనాలుగేళ్ల ‘చిన్ని’ భార్య నాది!
నా బాల్యమిత్రుడు ఉమామహేశ్వరశర్మ. మా గురువుగారు తాటిచెర్ల కృష్ణశర్మగారి కొడుకు. వాళ్ళు మాకు బంధువులు. అతన్ని మేమంతా ఇప్పటికీ ‘ఉమ్మచ్చి’ అని పిలుస్తాం. సినిమా నటులకు కూడా ముద్దు పేర్లుంటాయి కదా! అల్లు అర్జున్‌కు ‘బన్నీ’ అని, ప్రభాస్‌కు ‘డార్లింగ్’ అనీ.. కానీ బిరుదులు వేరండోయ్! ‘మెగాస్టార్’ అనేది ముద్దు పేరు కాదు.
నక్సలైట్లకు వేరే పేర్లుంటాయి. దాని ముందు ‘అలియాస్’ అని చేరుస్తారు. రాఘవరావు అలియాస్ రఘన్న.. కవులకు రచయితలకు కలంపేర్లుంటాయి. “మీ కలంపేరు ఏమిటండీ?” అనడిగాడు ఒకాయన నన్ను. “రెనాల్డ్ రేసర్ జెల్ సార్!” అన్నా. ఆయన బిత్తరపోయాడు. ఆరుద్ర, ఆత్రేయ, నగ్నముని, శేషేన్,.. ఈ మహనీయుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. రాజమౌళి గారిని ఆప్యాయంగా ‘జక్కన్న’ అని అంటారని విన్నా. బండారు దత్తాత్రేయ గారిని అందరూ ‘దత్తన్న’ అంటారు. ‘దత్తన్నా!’ అని పిలిస్తే చాలు ‘వత్తన్నా’ అంటూ వస్తాడట ఆయన.
ఇప్పుడంటే భార్యాభర్తలు పేరు పెట్టి పిలుచుకొంటున్నారు కాని, ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువయితే, ‘స్వీటీ’, ‘హనీ’, ‘బేబీ’, ‘డియర్’! పాతకాలంలో పెళ్లాన్ని, ‘ఇదిగో.., ‘ఏమేవ్?’, ‘ఒసేయ్’ అనీ, మొగుణ్ని, ‘కాదు...’, ‘విన్నారా...’ అనీ పిలిచేవాళ్లు. అంతమాత్రాన వీళ్ళు పురుషాధిక్యత గలవారనీ, వాళ్లు భార్యావిధేయులనీ అనుకోకండేం! లాల్ బహదూర్ శాస్త్రి గారిని చిన్నప్పుడు ‘నన్హే’ అని అనేవారట. నరేంద్ర మోడీ గారిని ‘నమో’ అంటారు. శారీరికమైన లోపాలను ‘నిక్ నేమ్స్’గా వాడటం క్షమించరాని తప్పు. ‘మున్నీ’, ‘మున్నా’ అనేవి హిందీలో బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇక చాలంటారా? సరే సరే! అదన్నమాట!

ప్రాణం మాకు తృణప్రాయం - కథ లింక్

సంచికలో నేడు నేను రచించిన 'ప్రాణం మాకు తృణప్రాయం' అనే కథ ప్రచురితమైంది. మూస చదువులకు భిన్నంగా, ఇంటర్ తర్వాత సైన్యంలో చేరి దేశసేవలో పాలుపంచుకున్న యువకుడి కథ.
~
కొండల రావన్నాడు “చివరికి ఆర్మీలో కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిందన్నమాట. నాకైతే దీనికి పంపుడు ఇష్టం లేదు.”
“పూర్తిగా వినురా! దీని గురించి కాదు నేను చెప్పేది. మనోడు హైటు, వెయిటు, మస్తుగున్నడు. ఎన్.డి.ఎ.కు పంపిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని యు.పి.ఎస్.సి. వాండ్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్‌ల ఎంట్రన్స్ పెడతారు. తర్వాతే యస్.యస్.బి. ఇంటర్వ్యూ. దాంట్ల సెలెక్టయితే డైరెక్ట్‌గ జూనియర్ కమీషన్డ్ ఆఫీసరవుతాడు”


~
పూర్తి కథని ఈ లింక్ ద్వారా చదవవచ్చు.

https://sanchika.com/praanam-maaku-trunapraayam-pds-story/ 


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 6వ భాగం లింక్

క్షీరాబ్ధిని రమ్యముగా వర్ణించిన తదుపరి దేవశ్రవుండు, శ్రవణ పేయంబుగా, గావలునకు, శ్వేతద్వీపంబు కట్టెదుట నిలుచు భంగి, దాని విశేషంబుల నుడువ దొడంగె -
కం:
క్షీరపయోధికి మధ్యన
నెఱచక్కని శ్వేత ద్వీపమింపును గూర్చున్
అరయగ బహు యోజనవి
స్తారము, రమణీయ దివ్య దృశ్యము లలరున్


---
మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు:

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-6/ 


Saturday, October 19, 2024

అయ్యవారు లేకపోతే! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 20 అక్టోబరు 2024

మా కర్నూలు జిల్లాలో ఒక సామెత ఉందిలెండి, "అయ్యవారు లేకపోతే అమావాస్య ఆగుతుందా?" అని! అమావాస్య ఆగదు, పున్నమ ఆగదు! ఎవరు లేకపోయినా, ప్రపంచం నడుస్తూనే ఉంటుందని దానర్థం. ఒక పెద్ద నాయకుడు చనిపోయినప్పుడు, 'అయ్యో! ఈ దేశం ఏమయిపోతుంది?' అనుకుంటారు. ఏమీ అయిపోదు. ఎంచక్కా సాగిపోతూ ఉంటుంది. 'టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్' అన్నాడు ఇంగ్లీషు వాడు. కాలము, అలలు ఎవరి కోసమూ ఆగవట.
దేశం స్థాయిలో కాకపోయినా, కుటుంబస్థాయిలో, పిల్లలు ఇంకా సెటిల్ కాకముందే, ఇంటిపెద్ద సడన్‌గా మరణిస్తే, ఆ కుటుంబం గతి ఏమయిపోతుందో, పాపం! అని శ్రేయోభిలాషులందరూ ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య దుఃఖానికి అంతం ఉండదు. కానీ, "గ్రీఫ్ ఈజ్ బ్రీఫ్" అన్నారు! 'దుఃఖం క్లుప్తం' అని అనువదించవచ్చు. మరణించిన వెంటనే ఉన్న దుఃఖం అంత్యక్రియల తర్వాత తగ్గుతుంది. “ఈరోజు చస్తే రేపటికి రెండు" అంటుంటారు. ఆ కుటుంబం క్రమంగా కోలుకుంటుంది. అంతవరకు బాధ్యత తెలియకుండా ఉన్న పిల్లలు ఒక్కసారిగా చైతన్యవంతులైపోతారు. 'అసూర్యం పశ్య' (గుమ్మం దాటి బయటకు వెళ్ళని) అయిన ఆ ఇల్లాలు ఏదో ఒక పని చేస్తుంది.
ఒక రాజకీయ పార్టీని స్థాపించి, అచిరకాలంలోనే అధికారంలోకి తెచ్చి, చరిత్ర సృష్టించిన మహానాయకుడుంటాడు. ఆయన మరణిస్తాడు. "ఆ పార్టీ ఆయనతోనే పుట్టింది. ఆయనతోనే పోతుంది" అంటూ నిశ్చయిస్తారు కొందరు ప్రాప్తకాలజ్ఞులు. కానీ దీర్ఘదర్శులు దాన్ని ఒప్పుకోరు. ఎవరో రెండవ తరం నాయకుడు ఆ పార్టీ పగ్గాలు స్వీకరిస్తాడు. పార్టీ మనుగడ సాగిస్తుంది. దట్సల్ యువరానర్!
“మనుషులు మరణిస్తారు కానీ, మనిషి చావడు" అన్నాడొక వేదాంతి. ఇదేమిటి? అంటే, బేసిగ్గా మానవుడు, వాడి ప్రతిభ, నాయకత్వ లక్షణం, సృజనాత్మకత, శాశ్వతంగా ఉంటాయి. వాటికి ప్రాతినిథ్యం వహించే మనుమలు, కాలక్రమాన ఉండరు కాని, వారి స్థానంలో వేరేవాళ్ళు తయారుగా ఉంటారు.
"టైం ఈజ్ ఎ గ్రేట్ హీలర్". కాలం ఎంతటి గాయాన్నైనా మానుపుతుంది. "రెవల్యూషన్ అంటే సడెన్‍గా జరిగేది, ఎవల్యూషన్ అంటే, క్రమంగా పరిణమించేది. మొదటిది రెండో దానిలో భాగమే” అన్నారు జాన్ రస్కిన్. ఇదే ఇతివృత్తంతో రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు ఒక గొప్ప కథ రాశారు. "ఓల్డ్ ఆర్డర్ ఛేంజెత్ ఈల్డింగ్ ప్లేస్ టు ది న్యూ" అంటాడు టెన్నీసన్. దాన్నే మనవాళ్ళు "కొత్తనీరు వచ్చి పాత నీరును తోసేస్తుంది" అంటారు.
ఇక రాచకొండ వారి కథ దానిపేరు ‘ఆఖరి దశ'. 1950లో 'భారతి' మాసపత్రికలో వచ్చింది. దాన్ని ఆయన 'జాస్మిన్' అన్న కలం పేరుతో వ్రాశారు. కథ నాలుగు భాగాలు. మొదట, భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుని తొడల మీద కొట్టి చంపాడనీ, కృష్ణుడే చంపించాడనీ, అధర్మం ప్రబలిందనీ, ప్రపంచానికి పోయేకాలం దాపురించిందనీ ఇద్దరు మాట్లాడుకుంటారు. రెండవది, శంకరాచార్యులు బౌద్ధమతాన్ని ఓడించి, వైదికమత స్థాపన చేస్తున్నప్పుడు, బౌద్ధ భిక్షులు ఇద్దరు “ఇంకేముంది, బౌద్ధం లేకపోతే, సర్వనాశనమే” అనుకుంటారు. మూడోది, ఇద్దరు ముస్లిం మాటలు “ఔరంగజేబు పాదుషా చనిపోయినాడు. మొఘల్ సామ్రాజ్యమే ముగిసిపోతే, ఈ ప్రపంచం పనయిపోయినట్టే". చివరగా, ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు "బ్రిటన్ పాలన అంతం అయింది, భారతదేశం ఏమయితుందో ఇదే ఆఖరిదశ" అనుకుంటారు.  రావిశాస్త్రి గారు ఏమీ వివరించరు. ఒకేమాటతో కథను ముగిస్తారు.
"ప్రపంచం సాగుతూనే ఉంది. ఇన్నివేల సంవత్సరాల నుంచీ ఇన్ని యుగాల నుంచీ!" అదీ విషయం.



నేను ఇంటర్ బోర్డులో 'రీడర్'గా పని చేస్తున్నప్పుడు రాములు గారని నావద్ద సీనియర్ అసిస్టెంట్ ఉండేవారు. ఆయన మంచి పనిమంతుడు. నాకు కుడిభుజంలా పనిచేసేవారు. ఇంటర్నల్ ట్రాన్సఫర్స్‌లో ఆయన్ను పి.ఆర్. సెల్‌కు బదిలీ చేశారు. నేను మా కమీషనర్ బలరామయ్య గారి దగ్గరకు వెళ్ళి, ఆయన్ను మార్చవద్దని వేడుకున్నాను. ఆయన నవ్వి, "శర్మగారూ! ఒకరి వల్ల మాత్రమే ఏ యంత్రాంగమూ నడవదు. రేపు మీరూ ఉండరు. నేనూ ఉండను. బోర్డు మాత్రం ఉంటుంది" అన్నారు. నాకు తత్త్వం బోధపడింది. ఆయనకు సారీ చెప్పాను.
వెనకటికెవరో పెద్దామె, ఊరిమీద అలిగి తన కోడిని తీసుకుని ఊరికి దూరంగా వెళ్ళిపోయిందట. 'నా కోడి కూయకపోతే తెల్లవారదు కదా, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం' అనుకుందా అమాయకురాలు! "నేను రెండ్రోజులు ఊరెళితే సరి, కొంప కిష్కింధే" అని విసుక్కొంటుంది ఇల్లాలు. అదంతా ఉత్తుత్తిదేనండోయ్. “మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫరెవర్" అంటారు ఆల్‌ఫ్రెడ్ టెన్నిసన్ తన 'బ్రూక్' (సెలయేరు) అనే కవితలో.
“నేను లేకపోతే ఈ దత్తవాకు ఎవరు రాస్తారు, ఇంత బాగా!” నవ్వుతున్నారెందుకు? ఇదీ ఒక ఉదాహరణేనండీ బాబూ!
సూర్యకాంతం పాత్ర వేసేవారు లేరని 'గుండమ్మ కథ' రీమేక్ చేయలేదని బాలకృష్ణ గారు చెప్పారు కదా!

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 5వ భాగం లింక్

దేవశ్రవుని చేత నారాయణుని దివ్య కథలను విన్నవాడై, గావలుడు పరమానందమును బొంది ఆయనతో ఇట్లు పలుకుచున్నాడు:
మ:
మునినాథా! కనుగొంటి నెన్నియొ మహా ముక్తిప్రద క్షేత్రముల్
కనినా నెన్నియొ పుణ్యతీర్ధములు నే కాలక్రమాయాతినై
కనలేదెచ్చట నిట్టి తేజ విలసత్కల్యాణ కృద్ధామమున్
వినగా గౌతుక ముద్భవించె మదిలో, వేడ్కన్ నాకెరింగింపరే!
---


మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు;
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-5/

 

‘డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2023’ కథాసంకలనం ఆవిష్కరణ సభ – నివేదిక - లింక్

14 అక్టోబరు 2024న, హైదరాబాదులోని రవీంద్రభారతి సమావేశమందిరంలో డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కార ప్రదానం, ‘మా కధలు 2023’ కథాసంకలన ఆవిష్కరణ ఒకే వేదికపై జరిగాయి. ఇవి గాక మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. సింహప్రసాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. 


 

వివరాలకు ఈ నివేదిక చదవండి.

https://sanchika.com/maa-kathalu-2023-aavishkarana-sabha-nivedika/

Sunday, October 13, 2024

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 4వ భాగం లింక్

ఈ ఎపిసోడ్ ప్రథమాశ్వాసముతో ఆరంభమవుతుంది. కథాప్రారంభములో పలువురు మునులు వచ్చి రోమర్షుడిని సమీపించి, ‘స్వామీ, ఈ భూమిలో ‘మాధవ ధామమని’ మానవులు, దేవతలు, యోగులు, ఏ క్షేత్రాన్ని భావించి, దర్శించి, పునీతులవుతారో చెప్పు’మని అడుగుతారు. 


 

అప్పుడు ఆయనిలా చెప్తాడు:
కం:
నా గురుపాదుడు వ్యాసుడు
ఈ గరిమను జెప్పె నాకు నియ్యది మీకున్
ఆగమ సిద్ధ రహస్యము
వేగమె తెల్పెదను వినుడు విమలపు శ్రద్ధన్
---
మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు.

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-4/


విజయదశమి సందర్భంగా సంచికలో ప్రత్యేక రచన 'శ్రీమద్దేవీ భాగవతం - వ్యాసప్రోక్తం' - లింక్

"శ్రీమద్దేదేవీభాగవతం ఒక శాక్తేయ పురాణం. మార్కండేయ పురాణము లోని దేవీ మహత్మ్యము కూడ అటు వంటిదే. దీని మూలం వ్యాసప్రోక్తమే. దీనిలో 18 వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి."



పూర్తి వ్యాసాన్ని ఈ లింక్‍లో చదవగలరు.
https://sanchika.com/srimaddevi-bhagavatam-vyasaproktam-pds/

దేవీ నవరాత్రుల సందర్భంగా ఆంధ్రప్రభలో నా రచన 'మహాదేవి చరితం... శ్రీదేవీ భాగవతం!'

"మహిషాసుర సంహారం, మనిషిలోని పశు ప్రవృత్తిని అంతమొందించడానికి ప్రతీక. పుసంత్వం, స్వభావ సిద్ధంగా, ప్రవృత్తిని అనుసరించి జీవిస్తుంది. సరీసృపల మెదడు, గట్టి పిడికిలిలా ఉంటుంది. లోపలికి స్త్రీత్వం ప్రవేశించినప్పుడు అది తెరుచుకుంటుంది. దేవి.. మహిషాసురుల ప్రతీక ఇదే!"
పూర్తి వ్యాసాన్ని జోడించిన క్లిప్పింగ్‍లో చదవగలరు.


 Click on the image to view in bigger size

 

తెలుగు జ్యోతి పత్రికలో నా కథ అవ్వ పేరే ముసలమ్మ - లింక్

‘‘సెలీనా, మీపేరు అరుదైనది. దాని అర్థం తెలుసుకోవచ్చా’’ అని అడిగాడు ఆసక్తిగా.
‘‘మీరే కనుక్కోండి ఇంగ్లీష్‌ మాస్టారు!’’ అన్నది ఆ అమ్మాయి అల్లరిగా యండమూరి నవలల్లో హీరోయిన్‌లాగా. అప్పుడయితే సదరు హీరో ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి నానాపాట్లు పడేవాడు. కాని ఇప్పుడు ‘‘గూగులమ్మ’’ ఉందిగా? వెంటనే సెర్చ్‌ చేసి చూశాడు.
సెలీనా అంటే ‘‘మూన్‌ గాడెస్‌’’ అనీ, ప్రపంచంలోని అత్యంత అరుదైన ఇరవై అమ్మాయిల పేర్లలో అదీ ఒకటనీ ఉంది.
‘‘తెలిసిపోయింది మేడమ్‌, మీ పేరుకర్థం ‘‘జాబిలమ్మ’’! అన్నాడు."
పూర్తి కథని ఈ లింక్ ద్వారా చదవగలరు.

Saturday, October 5, 2024

నొప్పింపక-తానొవ్వక... - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 06 అక్టోబర్ 2024

‘ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!”
అన్నారు బద్దెన, సుమతీ శతకకర్త.
ఈయన కాకతీయ సామ్రాజ్యంలో ఒక సామంతరాజు. తిక్కనకు శిష్యుడంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులకు వేలకు వేలు తగలేసి, పాశ్చాత్య దృక్పథాలను నేర్చుకునే యువతరం, మన తెలుగు శతకాలను బాగా స్టడీ చేస్తే, వ్యక్తిత్వ వికాసం బ్రహ్మాండంగా కలుగుతుంది.



ఈ పద్యంలో, 'తప్పించుకు తిరగడం' అంటే 'ఎస్కేపిజం' కాదు మిత్రమా! అవకాశవాదం అసలు కానే కాదు. ఏది అప్పటి కవసరమవుతుందో, దాన్నే మాట్లాడాలి. ఇతరుల మనస్సు నొప్పించకూడదు. తాను కూడ నొచ్చుకోకూడదు. ఇదో స్ట్రాటజీ!
'కమ్యూనికేషన్ స్కిల్స్' ఎలా ఉండాలో ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు? ఈ పద్యాన్ని ఒక కొంటె కవి ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. సరదాగా!
“వాటీజ్ నీడెడ్ నౌ అది
దట్ ఓన్లీ టాకుటాకి అఫెండవకన్
హర్ట్ చేయక హర్టవ్వక
ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ!
(దీంట్లో యతి ప్రాసలు సరిగా ఉన్నాయా, లేదా వెతక్కండి ప్లీజ్)
యుక్తితో బయటపడడం అంత సులువు కాదు. బోలెడు సమయస్ఫూర్తి, బొచ్చెడు లోకజ్ఞానం కావాలి. పానుగంటి వారి 'సాక్షి' వ్యాసాల్లో, ఇంగ్లీషులో 'ది డిక్టేటర్' అనే పత్రికలో వ్యాసాలుండేవి. హాస్యపు గుళికలవి. కానీ, ప్రాపంచిక జ్ఞానాన్ని అద్భుతంగా పంచాయి. వాటిని రాసిన వారు 'అడిసన్ అండ్ స్టీల్' అనే ప్రఖ్యాత రచయిత. అందులో, “సర్ రోగర్ డి కవర్లీ" అనే పెద్దాయన ఉంటాడు. చిలిపితనం, వ్యంగ్యం, హాస్యం, ఎత్తిపొడుపు, ఎగతాళి, ఇవన్నీ కలిస్తే ఆయనవుతాడు. 'ప్రాబ్లం సాల్వింగ్'లో
ఆయన దిట్ట. తన పరిష్కారాన్ని సూచించే ముందు ఆయన ఇలా అనేవాడు. “మచ్ మైట్ బీ సెడ్ ఆన్ బోత్ సైడ్స్!" (ఇరువైపులా ఎంతో చెప్పొచ్చు). నొప్పింపక తానొవ్వక తప్పించుకోవడమంటే ఇదేనండి!
మా కర్నూలు జిల్లాలో 'సిమెంట్ నగర్' అనే ఊరుంది. దాని రైల్వే స్టేషన్ పేరు “బుగ్గా నిపల్లె" గుంతకల్, గుంటూరు లైన్, డోన్, నంధ్యాల మధ్య. ఇదెందుకు చెబుతున్నా నంటే, అక్కడ తగవులు తీర్చే పెద్దలున్నారు. 'కర్ర విరగకుండా, పాము చావకుండా' రాజీ కుదురుస్తారు. ఈ వ్యవహారానికి 'బుగ్గానిపల్లె పంచాయితీ' అని పేరు. బద్దెన గారు బహుశ వారికి ఆదర్శమేమో మరి!
శ్రీకృష్ణ తులాభార నాటకంలో శ్రీకృష్ణునికి ధర్మసంకటం వస్తుంది. రుక్మిణీదేవి బర్త్ డే. ఆమె తన మందిరానికి రమ్మంటుంది. సత్యభామ వెంటనే మెట్టినదినం తనదని తయారు. కుళ్ళుబోతు. 'నారీనారీ నడుమ మురారీ' అయ్యింది అయ్య గారి పని. అప్పుడాయన తెలివిగా, అక్కడికొచ్చిన నారదుల వారిపై తన సమస్య తోసేస్తాడు!
'మెట్టిన దినమని సత్యయు
పుట్టిన దినమంచు భీష్మ పుత్రియున
న్నీ పట్టున బిలుతురు విందుకు”
అని, "నేను ఎటు బోవలయునో దిట్టముగా దెల్పుమయ్య దేవమునీంద్రా!" అంటాడు పరమాత్మ.
తెలివిగా ఎదుటివాడి మీదకు తోసేయడం అంటే ఇదే. ఆయనకు రుక్మిణీదేవే కరెక్టని తెలుసు. కాని నారదుడితో చెప్పిస్తే బెటరు కదా! తర్వాత కావాలంటే "అలిగితివా సఖీ ప్రియా" అని పాట పాడి సత్యాదేవిని ప్రసన్నురాలిని చేసుకోవచ్చు. జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి, మోదీ గారి వరకు మన దేశం 'అలీన విధానాన్ని' అనుసరిస్తూ వస్తూ ఉంది. దీన్ని ఎన్.ఎ.ఎం (నాన్ అలైన్‌మెంట్ మూవ్‌మెంట్) అంటారు. దీనిలో 120 దేశాలుంటాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన పవర్ కేంద్రాలలో దేనిలో ఇవి చేరవు. (అలీన-లీనం కాని) తటస్థ విధానాన్ని అవలంబిస్తాయి. మనం అందరికీ యుద్ధం వద్దనే చెబుతాం. శాంతికాముకులం. అందుకే మనకు అంతర్జాతీయ సమాజంలో ‘పెద్దన్న' అనే పేరుంది. ఇది 'స్ట్రాటజీ' కాదండోయ్! మన పాలసీ!
కానీ, ఎవ్వర్నీ నొప్పించకుండా, తాను నొవ్వకుండా వ్యవహ రించడం అంత వీజీ కాదు. అది కత్తిమీద సామే! ఇద్దరు భార్యలుంటే మరీ కష్టం. 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' క్రింద మంచినే సపోర్ట్ చేద్దామంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నం161 లాగా, మన జీవితాల్లో కుదరదు మాస్టారు! ఒక్కోసారి ఇది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఇతరులు 'హర్ట్' అవడమో, లేదా మనమే 'హర్ట్' అవడమో జరుగవచ్చు. దీనికి 'టాక్ట్' అవసరం.
బయటకు వెళ్తూ, మా ఆవిడను, "వర్షం వస్తుందేమో, గొడుగు తీసుకెళ్ళమంటావా?” అని అడిగాను. "మీరు గొడుగు తీసుకెళితే వర్షం రాదు. ఖచ్చితంగా దాన్ని ఎక్కడో మర్చిపోయి వస్తారు! పోనీ తీసుకోకుండా వెళితే, వర్షం వస్తుంది. చూడండి మరి! తీసు కెళ్తారో, వద్దో!" అన్నదా బద్దెన గారి శిష్యురాలు! ఇంతకూ తీసుకెళ్ళమన్నట్లా, వద్దన్నట్లా? అందుకే, “ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే" అన్నారు పింగళివారు మిస్సమ్మ సినిమాలో.
"నాయనా! ఈరోజు శనివారం. మేమంతా ఉపవాసం. నీవు మామిడిపండు తిని మజ్జిగ తాగుతావా, లేదా కొంచెం ఉప్పుడుపిండి చేయమంటావా?” అనడిగిందట ఒక అత్తగారు అల్లుడిని. "ఉప్పుడుపిండి చేయండత్తయ్యా, అందులోకి వంకాయ కాల్చి బజ్జీ చేయండి. తర్వాత మామిడిపండు తిని మజ్జిగ తాగుతా!"
అదన్నమాట!!
 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము' 3వ భాగం లింక్

ప్రబంధ లక్షణాలలో ముఖ్యమైనది ‘షష్ఠ్యంతములు’. అంటే షష్ఠీవిభక్తి (కిన్, కున్ అను ప్రత్యయములతో అంతమవుతాయి. ఇవి కందపద్యాలుగా ఉంటాయి. కృతిభర్త ఐన నారసింహ దేవుని స్తుతిస్తూ ‘ఆయనకు’ ఈ పద్య కుసుమాలు సమర్పించారు కవి. 


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-3/

Thursday, October 3, 2024

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 6వ భాగం లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 6వ భాగం. 🙏
~
ఇదే మానసిక సంఘర్షణ, వ్యక్తిగత జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన సత్యాగ్రహులందరిలో ఉంటుంది. ఎంత ఉద్యమానికి కట్టుబడినా, వారూ మనుషులే కదా! రెండు ప్రత్యామ్నాయాల మధ్య, సరియైన దానిని ఎంచుకోవడంలో, సందిగ్ధత (dilemma) ఎదురైనపుడు, తనకు నచ్చిన దానిని స్వీకరించినా, మనసు కొన్నిసార్లు పీకుతూనే ఉంటుంది. గోపాలరావు కెదురైనది ఈ సందిగ్ధతే. కాని ఎప్పటికప్పుడు దాన్ని అధిగమించేవాడు.


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-6/

 

విశాఖసాహితి మాసపత్రిక దసరా సింగిల్ పేజీ కథల పోటీలో నా కథ

విశాఖసాహితి మాసపత్రిక దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో నా కథ 'తెలుగోండ్ల పెండ్లి' సాధారణ ప్రచురణకు ఎంపిక అయింది.
సంబంధిత ప్రకటన


 Click on the image to view in bigger size

బ్రహ్మంగారి మఠంలో నా 'శ్రీమద్దేవిభాగవతం ప్రవచనాలు'

దసరా నవరాత్రుల సందర్భంగా బ్రహ్మంగారి మఠం నందు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ వారి ఆహ్వానంతో, 3 అక్టోబర్ 2024 నుంచి 10 అక్టోబర్ 2024 వరకూ - శ్రీ దేవీ భాగవత ప్రవచనములు చెప్తున్నాను. శ్రీ మహా దేవ్యై నమః 🙏🌹
సంబంధిత వార్త


 Click on the image to view in bigger size