Saturday, August 31, 2024

మేధో ప్రదర్శన - దత్తవాక్కు - 01 సెప్టెంబరు 2024

మనిషి తన మేధస్సును ఎన్నో రకాలుగా ప్రదర్శిస్తాడు. అష్టావధానులు, శతావధానుల జ్ఞాపకశక్తి, పాండిత్యం చూస్తే అబ్బురం అనిపిస్తుంది. క్రికెట్లో వంద పరుగులు చేసి, ఔట్ కాకుండా నిలిచిన క్రీడాకారుడు కూడా మేధావే. ఉపగ్రహాలను అవలీలగా అంతరిక్షంలోకి పంపే శాస్త్రవేత్తలు, తమ నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమా నటులు, రాజకీయాలను ఒక మలుపు తిప్పి, ప్రజలకు మేలు చేసే నాయకులు, చివరికి యూట్యూబ్‌లో వంటలు చూపేవారు, వీళ్ళంతా తమ తమ రంగాల్లో మేధావులే.
అయితే ఏమిటిష? అంటున్నారా? వీళ్ళందరితో నాకేమీ పేచీ లేదు మిత్రమా! మిడిమిడి జ్ఞానంతో, తనకేమీ తెలియకపోయినా, అవాకులు, చవాకులు (వీటి అర్థం మాత్రం నాకు తెలియదు మహాశయా!) వాగుతుంటారు, చూడండి, వాళ్ళతోనే నాకు పేచీ!
పూర్వం 'పిట్టలదొర'లని వచ్చేవారు.. ఒక పాత కోటు ధరించి, టోపీతో, అనర్గళంగా అతిశయోక్తులను చెప్పేవారు. “పోయిన వారం ముఖ్యమంత్రి ఇంటికి భోజనానికి వెళ్ళాను. మహేశ్ బాబు నిన్న ఫోన్ చేసి, తన సినిమా ఎలా ఉందని అడిగాడు. కార్లో వెళ్ళేటపుడు వినడానికి మంచి పాటల కలెక్షన్ రెడీగా ఉంచా. ఇక కారు కొనడమే లేటు!" ఇదీ మేధో ప్రదర్శనే గాని, ప్రమాదకరం కాదండోయ్! అందంగా, వినోదం కోసం అల్లిన అబద్ధాలివి. అదీ పొట్టకూటి కోసం కాబట్టి.



ఒకసారి పలాసలో మా కాలేజీలో గురుపూజోత్సవం జరుగుతూంది. కమిటీ వారు నియమించుకొన్న ఒక తెలుగు లెక్చరర్ ఇలా ప్రసంగించాడు. “ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే కారణం మా గురువులే! (అంతవరకు బాగుంది) వాళ్ళకూ గురువులుంటారు, 'గుగ్గురువులు'. (ఇదెక్కడి దిక్కుమాలిన ప్రయోగం?) 'తేజస్వినావధీ తమస్తు!' అంటే తెలుసా? తేజస్వి అనే నావ ఎప్పుడూ మునగదు!" - 'ఓరి అవివేకశిఖామణీ, వేదోక్తిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వివరించావేమిరా అజ్ఞాన చూడామణీ!' అనుకొన్నాను. తర్వాత అతనితో, “తేజస్వినౌ+అవధీతమస్తు కదా మాస్టారు, ఈ 'నావ' ఎక్కడిది?" అంటే, "మీ సబ్జెక్టు ఇంగ్లీషు కదా మాష్టారు. పిల్లలకర్థం కావాలని సింపుల్‌గా చెప్పాను, అయినా, యూనివర్శిటీలో మాకు ఈ విషయాన్ని మా ప్రొఫెసర్ నాగభైరవ కోటేశ్వర రావు గారే చెప్పారు" అన్నాడు. ఔరా! వీడి తెలివితక్కువతనాన్ని ఎంత బాగా సమర్థించుకున్నాడు! పైగా మహా పండితుడు, ఆయన్ను కూడా లాగాడు! ఇలాంటి మేధో ప్రదర్శనంటే నాకు చిరాకు!
మనం ఏదైనా కొత్త చోట, దారి వెతుక్కుంటూ "ఎలా వెళ్ళాలి?" అని అడిగితే, సదరు మేధావి, తనకు తెలియకపోయినా, ఏదో ఒకటి చెప్పి తప్పుదారి పట్టిస్తాడు. కొందరు గొప్పవారి సూక్తులను, వేరే వారు చెప్పి నట్లు 'మిస్ కోట్' చేస్తారు. ఆ మధ్య రవీంద్రభారతిలో ఒక పుస్తకావిష్కరణ సభకు విశిష్ట అతిథిగా వెళ్ళాను. ప్రత్యేక అతిథి, ఆత్మీయ అతిథి, వీళ్ళంతా మాట్లాడిన తర్వాత, అనుకోని అతిథి ఒకాయన వేదికనెక్కి, “దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు మన గురజాడ!” అన్నాడు. ఇంకోసారి ఒకాయన విశ్వనాథ వారికి జ్ఞానపీఠ్ వచ్చింది, వేయిపడగలకు అంటాడు. "జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసి" అన్నది దాసరి గారంటాడు ఇంకో మేధావి!
మన బంధుమిత్రుల్లో కూడ చిత్రమైన మేధావులుంటారు. సామాజిక, రాజకీయ విషయాలపై వారి 'వాగుడు' వింటుంటే మనకు మతిపోతుంది. మా బంధువొకాయన, “మెట్రో రైలు వేస్టు, పైకి వెళ్ళి రైలు ఎక్కడం పెద్ద పని. మామూలు రైలు నేలమీద ఉంటుంది. యాక్సిడెంట్ అయినా, ఫరవాలేదు. అదే మెట్రో రైలు? అంతెత్తు నుంచి క్రిందపడితే ఇంకేమైనా ఉందా?” అన్నాడు. ఇంజినీరింగ్ చదివి, టెక్కీలుగా పని చేస్తుంటారు కొందరు. వారికి లోకజ్ఞానం ఉండదు. పేపరు చదవరు. న్యూస్ చూడరు. ఒకసారి మా అమ్మాయి ఫ్రెండ్ అన్నదట “నరేంద్ర మోడీ మన రాష్ట్రపతి అయింతర్వాత బాగుంది” అని.  బాగుంది కాని తల్లీ, రాష్ట్రపతికీ ప్రధానికీ తేడా తెలియని నీవు.. ఇంజినీరింగ్ ఇవన్నీ ఉంటాయా నా పిచ్చిగాని.
"తెలిసినవానికి తెలుపందగు
తెలియనివానికిని గూడ తెలుపగ వచ్చున్
తెలిసీ తెలియని మూర్ఖుని
తెలుపగ వివరింప బ్రహ్మదేవుని వశమే!”
అన్నారు పెద్దలు.
“సైలెన్స్ ఈజ్ పూలిష్ ఇఫ్ యు ఆర్ వైజ్, అండ్ వైజ్, ఇఫ్ యూ ఆర్ పూలిష్" (నీవు తెలివైన వాడివైతే నిశ్శబ్దంగా ఉండడం తెలివితక్కువతనం, కాని తెలివితక్కువ వాడివైతే నిశ్శబ్ధంగా ఉండడం తెలివైన పని). మాటలతో ఆడుకోవడం అంటే ఇదే. దీన్ని మనం సదరు మేధో శిఖామణులకు చెప్పామనుకోండి. వెంటనే “అవును నాకెందుకు తెలియదు? దీన్ని చెప్పింది షేక్‌స్పియరే కదా!” అంటారు. "దాన్ని చెప్పింది షేక్‌స్పియర్ కాదురా మొద్దూ, 'చార్లెస్ క్యాలెబ్ కాల్టన్' అన్న రచయితరా", అని వాడికి చెప్పగలమా? కుందేటి కొమ్మునైనా సాధించ వచ్చు గాని, మూర్ఖుల మనసును రంజింపలేమన్నారు కదా!
ఇక యూట్యూబ్, వాట్సాప్‍లలో మేధావులు చేసే మేధో ప్రదర్శన, బాబోయ్, దాన్ని తట్టుకోలేం. దానికి రుజువులు, ప్రమాణాలు ఉండవు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై నోటికొచ్చినట్టు పేలతారు. దీన్ని నియంత్రించలేమా? ఏమయినా అంటే భావప్రకటన స్వేచ్ఛ అంటారు. వేంకటేశ్వర సుప్రభాతంలో అశ్లీలముందని ఒకడు, మిస్ ఇండియా పోటీల్లో రిజర్వేషన్లుండాలని ఇంకొకడు, ఇదే అమెరికాలో అయితేనా.. అని మరొకడు, చచ్చిపోతున్నామండీ బాబు! ఓ గాడ్! సేవ్ మై కంట్రీ ఫ్రమ్ ది సోకాల్డ్ మేధావులు! అదన్నమాట!

శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-5 లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 5వ భాగం. 🙏
~
గోపాలరావు ఆలోచనల లోని పరస్పర విరుద్ధమైన ఉభయ పార్యాలను మన ముందుంచడం ద్వారా రచయిత్రి, ఉద్యమ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఉన్న తేడాను చూపారు. ఒక ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసేవారెవరికైనా ఈ మానసిక సంఘర్షణ తప్పదు.


శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-5

‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

మర్నాడు పొద్దున కేదారను పిలిచి, “నిశ్చలానంద మహారాజ్ గారూ!” అని సంబోధించినాడు. కేదార ఆశ్చర్యపోలేదు. తండ్రి మానసిక పరిపక్వత అతనికి తెలుసు. తల్లి కూడ అంగీకరించింది. తానిక అపరాధభావన అనేది లేకుండా తానెన్నుకున్న పథములో సాగిపోవచ్చు. తల్లిదండ్రుల పాదాలకు ప్రణమల్లి ఇల్లు దాటినాడు కేదార. కాదు, కాదు, నిశ్చలానంద మహరాజ్! మమత్వాన్ని దాటినాడు!
#
కేదార సన్యాసం స్వీకరించి 'నిశ్చలానంద మహరాజ్'గా ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించడం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.


‘మహాప్రవాహం’ 42వ భాగం లింక్

 

 



మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ – శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు – నివేదిక - లింక్

29 ఆగస్టు 2024న మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు పాల్గొని శర్మగారి ఆంగ్ల రచన 'The First Book of Apologues' పై పత్రసమర్పణ చేశాను. వివరాలు శంకర్ కుమార్ నివేదిక సంచికలో చదవండి.


మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ – శ్రీ టి.ఆర్.ఎస్. శర్మగారి సాహిత్యంపై జాతీయ సదస్సు – నివేదిక

చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ - నివేదిక లింక్

29 ఆగస్టు 2024న చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభలో ముఖ్య అతిథిగా ప్రధానోపన్యాసం చేశాను. ఆ వివరాలు గోట్ల యోగానంద స్వామి నివేదిక సంచికలో చదవండి.


చెన్నై హిందూ కళాశాల మాతృభాషాదినోత్సవ సభ - నివేదిక

 

Wednesday, August 28, 2024

టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం - జాతీయ సదస్సు

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నేడు నిర్వహిస్తున్న 'టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం' అనే జాతీయ సదస్సులో మూడవ సమావేశంలో (మ. 2. గం నుండి 3 గం.) నా ప్రసంగం, పత్రసమర్పణ ఉంటాయి.
వివరాలకు ఈ లింక్ చూడగలరు.

'టి.ఆర్.ఎస్. శర్మ - సాహిత్యం: అవలోకనం' జాతీయ సదస్సు కార్యక్రమం 

సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన - స్వాధ్యాయ ఛానెల్‍లో- యూట్యూబ్ లింక్

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను గానం చేసిన సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన
స్వాధ్యాయ ఛానెల్‍లో. 




Saturday, August 24, 2024

యావత్ తైలం, తావత్ వ్యాఖ్యానం! - దత్తవాక్కు - ఆంద్రప్రభ 25 ఆగస్టు 2024

వెనకటికి ఒక పౌరాణికుడు ప్రవచనం చెబుతున్నాడట. రాత్రి, చాలా పొద్దుపోయింది. ఈయన ఆపడం లేదు. శ్రోతలకు ఆవలింతలు వస్తున్నాయి. కొందరైతే మెల్లిగా జారుకున్నారు కూడా. ఉండబట్టలేక ఒక భక్తుడు పండితుల వారిని అడిగాడు "స్వామీ ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని. ఆయన ఇలా అన్నాడు - "నాయనా! యావత్ తైలం, తావత్ వ్యాఖ్యానం" అంటే, దీపంలో నూనె ఉన్నంత వరకు చెబుతానని. నూనె అయిపోయి, దీపం ఆరిపోతే ప్రవచనం ఆపేస్తాడు. అంతవరకు వినక తప్పడు.
సాధ్యమైనంత వరకు లాగడం మంచిదే కాని, ఇతరులకు అది సౌకర్యంగా ఉందో, లేదో చూసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. కొంచెం తేడాతో, ఉదా. 'పిండి కొద్దీ రొట్టె'. ఉన్న వనరులను బట్టే ఫలితముంటుందని ఈ నానుడి సూచిస్తుంది. 'మంచం పొడుగును బట్టే కాళ్ళు చాపుకోవాలి' - ఏదైనా ఒక పరిమితికి లోబడి ఉంటుంది. ఇంగ్లీషులో 'మేక్ హే వైల్ ది సన్ సైన్స్' అనే సామెత ఉంది. 'హే' అంటే పశుగ్రాసం, పంట నూర్పిడి ఐన తర్వాత, ఆ గడ్డిని ఎండ ఉన్నప్పుడే అరబెట్టాలట. 'దీపముండగానే యిల్లు చక్కబెట్టుకోవడం' కూడా ఇలాంటిదే. 

 


ఇప్పుడంటే కరెంటు, అది పోయినపుడు ఇన్వర్టర్లు వచ్చాయి గానీ, మా చిన్నప్పుడు కరెంటు ఉండేది కాదు. లాంతర్లే. సాయంత్రం లాంతరు చిమ్నీని, మెత్తని ముగ్గు పొడితో తోమి, వత్తిని బయటకు తీసి, చివర నలిచి, కట్ చేసి, ట్యాంకులో గుడ్డనూనె (కిరోసిన్) పోసి, వెలిగించి చురుకున్న వంపు కడ్డీకి తగిలించేవారు. ఇంట్లో కిరసనాయిలు నిండుకుంటే అంతే సంగతులు. ఈలోపే ఇంటి పనులు పూర్తి చేసుకోవాలి.
ఈ విషయానికి సమయ పాలనకు (టైం మేనేజ్మెంట్) సంబంధం ఉందేమో అనిపిస్తుంది నాకు. మోకాలికి బోడిగుండుకీ ముడి వేసినట్లుందంటారా? సభల్లో చూస్తూంటాం. కొందరు మైకు పట్టుకుంటే వదలరు. అధ్యక్షుడు క్లుప్తంగా రెండు మూడు నిముషాలలో ముగించాలని కోరినా, సదరు మైకాశ్రయుల వారు పట్టించుకోరు. వేదిక మీది అతిథులందరినీ పేరు పేరునా చెప్పడానికే ఐదు నిముషాలు, అసలు సభ ఎందుకు జరుగుతుందనే దానికి రెలెవెన్స్(పొందిక) లేకుండా ఏదేదో చెబుతారు. దీనిని 'బీటింగ్ అబౌట్ ది బుష్' అన్నారు. అంటే, పొద లోపల ఏముందో తెలియకుండా దాన్ని అదే పనిగా బాదడం.
ఒకసారి, బెంగళూరు సి.పి. బ్రౌన్ సేవా సమితి వారు నాకు ఎన్.టి.ఆర్. స్మారక పురస్కారం ఇచ్చారు. వక్తల్లో ఒకాయన "ఎన్.టి.ఆర్. గారి సినిమాలు చూడలేదు, 'లవకుశ' ఒక్కటి చూశానంతే", అని మొదలు పెట్టి, అరికెలు, కొర్రలు, సామలు తినాలని, బియ్యం అసలు తినకూడదని, ఆడపిల్లలు సముర్తాడడం లేట్ కాకూడదంటే ఏం చేయాలో, ఇలా ఏకరువు పెడుతున్నాడు. ఇవన్నీ ఎన్.టి.ఆర్. శత జయంతి ఉత్సవాలకు అవసరమా? నిర్వాహకుడొకాయన ఆయన దగ్గరకు వెళ్ళి, చెవిలో ఏదో చెప్పాడు. ఆయన తన గంభీరోపన్యాసం ఆపాడు. "చెప్పింది చాలు, ఇక వచ్చేయండి" అని చెప్పి ఉంటాడు. అసెంబ్లీలో ఐతే ఇలాంటి వారికి స్పీకరు మైకు కట్ చేస్తాడు. సాహిత్య, ఇతర సభల్లో ఆ అవకాశం లేదే!
కాలం చాలా విలువైనది. దాన్ని పనికిమాలిన విషయాల కోసం వృథా చేయకూడదు. "అవకాశం ఉన్నంత వరకు అందర్నీ సతాయిస్తా" అంటే ఎలా? నేను విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేసేటపుడు, మాకొక ప్రిన్సిపాల్ గారుండేవారు. ఆయన ఉపన్యాస కేసరి. ప్రతిరోజూ ఉదయం పదిగంటలకు ప్రేయర్. పిల్లలందరూ సమావేశమయ్యేవారు. ఈయన గంభీరోపన్యాసం, ఎండలో నిలబడలేక కొందరు అర్భకులు సొమ్మసిల్లి పడిపోయినా ఆయన ఆపడు. మొదట పీరియడ్‍లో పావుగంట ఆయనే తినేసేవాడు.
కామ్రేడ్స్, సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. డబ్బును వృథా చేసినా పరవాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలాన్ని వృథా చేస్తే అది క్షమించరాని నేరం. "కాలోహిత దురతిక్రమః" అని కదా ఆర్యోక్తి. "యు మే డిలే, బట్ టైం విల్ నాట్" అన్నారు. అబ్రహం లింకన్ ఇలా అన్నారు, "నాకు చెట్టు కొమ్మలను ముక్కలుగా నరకడానికి ఆరు గంటలు టైం ఇస్తే మొదటి గంట అంతా, నా గొడ్డలికి పదును పెడతా". ఇందులో ఎంత భావం ఉందో మీరే ఆలోచించండి!
బద్దెన గారు ఇలా అన్నారు.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికామాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
అదీ సరైన విధానం. కొందరు ప్రయాణాల్లో ఎంతకీ తెమలరు. ఆఖరికి ఆ రైలో, బస్సో వెళ్ళిపోతుంది. అయినా వారికా ధ్యాస ఉండదు. 'ఇన్ టైం' అంటే 'ముందే' అని, 'ఆన్ టైం' అంటే సరిగ్గా సమయానికని, 'బిహైండ్ టైం' ఆలస్యం కావడమని! అదన్నమాట!

'మహాప్రవాహం!'-41 - లింక్

చాలాసేపు నిద్ర పట్టలేదు కేదారకు. అర్ధరాత్రి దాటుంటుందేమో. స్వప్నావస్థ మాదిరి ఉంది. ప్రభుదత్త మహరాజ్ మంచం పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంది. ఏదో చెబుతున్నాడు. అర్ధం కావడం లేదు. జాగ్రత్తగా విన్నాడు - “దిసీజ్ నాట్ యువర్ కప్ అఫ్ టీ” అంటున్నాడు. “డోన్ట్ ఎన్‍టాంగిల్ యువర్ సెల్ఫ్ ఇన్‍టు ఎర్తీ థింగ్స్! యు హావ్ టు ఫుల్‌ఫిల్ నోబ్లర్ టాస్క్. యు ఆర్ ఎన్‌లిస్టెడ్ బై ది ఆల్మైటీ!”. 



~
కేదారకి దత్తప్రభు మహరాజ్ చేసిన పథనిర్దేశం గురించి ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

https://sanchika.com/mahaapravaaham-pds-serial-41/

'ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాప్రాభవము'- వ్యాసం లింక్

తెలుగు మాతృభాష కాని, భారతదేశంలోని, ఇతర రాష్ట్రాలలో సైతం తెలుగు భాష తన ప్రాభవాన్ని చాటుకుంటూ ఉంది. తెలుగువారు దేశమంతా స్థిరపడినవారు. వారు ఎక్కడ ఉన్నా, తమ భాషా సంస్కృతీ మూలాలను మరచిపోరు. వారి కృషి వల్ల చాలా ఇతర రాష్ట్రాలలో మన తెలుగు ఎలా వెలుగుతూ ఉందో ప్రామాణికంగా వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ఈ వ్యాసాన్ని సంచికలో చదవగలరు.

https://sanchika.com/itara-raashtralalo-telugu-bhaasha-praabhavam-essay-pds/ 

 
 

పొద్దుటూరులో నా ధార్మిక ప్రవచనాలు – నివేదిక'- లింక్

ఇటీవల ప్రొద్దుటూరులో నేను చేసిన ఆధ్యాత్మి, ధార్మిక ప్రవచనాలపై గోట్ల యోగానంద స్వామి నివేదిక సంచికలో చదవండి.

 


https://sanchika.com/prodduturulo-panyam-dattasarma-dharmika-pravachanaalu-nivedika/
 

Thursday, August 22, 2024

తెలుగు భాషా దినోత్సవ ప్రత్యేక ప్రసంగం

తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా చెన్నై లోని తెలుగు భాషా సమితి వారి ఆధ్వర్యంలో హిందూ కాలేజీలో జరగనున్న కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఆహ్వానపత్రిక, నా పరిచయ వివరాలు ఇక్కడ చూడవచ్చు.

 


 


 Click on image to view in bigger size

 

 

తెలుగు వికీపీడియాలో నా పేజీ

తెలుగు వికీపీడియాలో నా పేజీ ఏర్పాటయింది.
నా వ్యక్తిగత వివరాలు, సాహితీకృషి సంక్షిప్తంగా ప్రస్తావించబడినాయి.
తెలుగు వికీపీడియాలో నన్ను చేర్చినందుకు బాధ్యులైన వారికి, వారి బృందానికి నా ధన్యవాదాలు.
https://w.wiki/AyVD
పై లింక్‍లో - తెలుగు వికీపీడియాలో నా వివరాలు లభ్యం.


 

Sunday, August 18, 2024

పెరటి చెట్టు వైద్యం! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ - 18 ఆగస్టు 2024

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు! ఎందుకంటే, అది మన పెరట్లోనే ఉండడం వల్ల, దాన్ని అంతగా పట్టించుకోము. అదే చెట్టు గురించి ఏ ప్రకృతి వైద్యుడో యూట్యూబ్‌లో వచ్చి, దాని గొప్పతనం గురించి చెప్పి, అది క్యాన్సర్లను కరిగిస్తుందనీ, డయాబెటీస్‌ను ఢమాల్ చేస్తుందనీ, బీపీని అయిపు లేకుండా చేస్తుందనీ, ఊదర గొట్టాడనుకోండి, మనకు దాని మీద ఎక్కడ లేని గౌరవం కలుగుతుంది.
"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అంటారు కాని, అదంత వీజీ కాదండోయ్! "ఇంట్లో ఈగల మోత, బైట పల్లకీ మోత" అన్నట్లు, "విద్వాన్ స్వగృహే న పూజ్యతే" అంటాను నేను. ఘనత వహించిన రచయితల రచనలు వాళ్లింట్లో వాళ్లు చదవరని, ఒక సర్వేలో తేలింది. ఆ సర్వే ఎవరు చేశారు. ఎప్పుడు చేశారు? అనే డౌటనుమానం వచ్చేసిందా, అప్పుడే మీకు? "సంశయాత్మా వినశ్యతి" కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పాడు! అదేదో సినిమాలో రావు గోపాలరావంటూ ఉంటాడు, “చరిత్ర అడక్కు, చెప్పింది విను!”


కళారంగాలలో రాణిస్తున్న వారి భార్యలకు వారిపై 'అంత' గొప్ప అభిప్రాయం ఉండదట. మా స్నేహితుడొకాయన బాగా పేరున్న కవి, విమర్శకుడు. ఒకసారి వాళ్లింటికి వెళ్లాను (పిలిస్తేనే లెండి!). ఆయన భార్య, కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. "అమ్మా, మావాడు గొప్ప సృజన గల కవి. ఇతడు నాకు స్నేహితుడవడం నాకు గర్వంగా ఉంటుంది" అన్నా. అందులో వంద శాతం నిజముంది కూడా! అప్పుడా ధర్మపత్ని అంది కదా, "ఏమిటో అన్నయ్య గారు! జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలుతుందని, (ఆ రెండో జోగి నేనేనని నాకర్థమయింది లెండి). కవిత్వాలు, ఆవిష్కరణలు, సమీక్షలు అని ఉన్నదంతా తగలేశారు మీ ఫ్రెండు! మా మరిది గారయితే రియల్ ఎస్టేటు చేసి లక్షలు గడించాడు. ఈయన కంటే పదేళ్ళు చిన్నవాడు. అయినా, ఇప్పడను కొని ఏం లాభం? ఖర్మ!" మా ఫ్రెండు కోపగించుకోలేదు! నవ్వుతూ ఆమె వైపు చూశాడు! స్థితప్రజ్ఞుడు!
సోక్రటీసు గొప్ప వేదాంతి. వేల సంఖ్యలో శిష్యులుండే వారాయనకు. ఆయన భార్య పేరు 'జాంతిపీ' (xanthippe). ఆయన ఆమెను తన యాభయ్యవ ఏట పెండ్లి చేసుకొన్నాడట. ఆయన కురూపి. బండ ముక్కు. లావు పెదవులు. రోజూ స్నానం చేయడట. ఒక చిరిగిన కోటుతో తిరుగుతాడంట. ఆయన భార్య గయ్యాళి అని అంటారు. ఆయన్ను నిత్యం సాధించి, అగౌరవ పరచేదట. కానీ ఆయన పట్టించుకొనేవాడు కాదట. ఆయనే ఇలా అన్నాడట "ప్రతి మగవాడు పెండ్లి చేసుకోవాలి. పెళ్లాం అనుకూలవతి ఐతే సుఖపడతాడు. గయ్యాళి అయితే, ఇదిగో, నాలాగా 'వేదాంతి' అవుతాడు!". ఆయనలా అన్నాడు గాని, పెళ్లి కాకముందే ఆయన వేదాంతేనండీ బాబూ!
మీ దగ్గర దాచడం ఎందుకు? నా 'దత్తవాక్కు' మా యింట్లో వాళ్లు ఎవరూ చదవరు, నిజం! నమ్మండి! నాకు వచ్చే బహుమతులు, అవార్డులు, సన్మానాలను సీరియస్‌గా తీసుకోరు. నేను చెప్పబోతే 'అదోలా' చూస్తారు! పెరటి చెట్టు సూత్రం..!
"అతి పరిచయాత్ అవజ్ఞా సంతతగమనాత్ అనాదరో భవతి" అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. బాగా పరిచయం ఎక్కువయి, సాన్నిహిత్యం పెరిగితే అంత గౌరవం ఉండదట. రోజూ వెళితే ఆదరణ తగ్గుతుందట.
నిజమే! ఒక సూపర్ స్టార్ ఉన్నాడనుకోండి, ఆయన్ను తెరమీద చూస్తే అభిమానులు గంగవెర్రులెత్తిపోతారు. కానీ, రోజూ ఆయనతో ఉండే ఆయన కారు డ్రైవర్‍కు అంత 'ఎక్సయిట్‌మెంట్' ఎందుకుంటుంది. 'సరేలే, మన సారే కదా!' అనుకుంటాడంతే! ఆయన భార్యకు ఆయన పట్ల అంత 'హీరో వర్షిప్' ఉంటుందా చెప్పండి? దే టేక్ హిం ఫర్ గ్రాంటెడ్! (దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో జుట్టు పీక్కున్నా తోచి చావలేదు. సారీ!)
కొడుకో, కూతురో ఎంత ఎత్తుకు ఎదిగినా, తల్లిదండ్రులకు 'అంత' అనిపించదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా! కాని పెరటి చెట్టు ఫార్ములా ఇక్కడ పనికిరాదు.
"పొరుగింటి పుల్లకూర చాలా రుచి'. పక్కింటామె ఇచ్చిన కూరను మెచ్చుకొంటే... ఆ మగనికి మూడినట్లే!
మా యింట్లో నా రచనలు చదవరన్నానని నవ్వుకోకండి! ప్రతి కళాకారుడికి, ఇది తప్పదండోయ్! కానీ, మా పెరట్లో డాబా మీద, మా ఆవిడ బోలెడు మొక్కలు కుండీల్లో పెంచుతుంది. వాము మొక్కలున్నాయి. వామాకు వాడతాం. 'రణపాల' ఆకు ఒక కుండీలో పెరుగుతుంది. అది అద్భుతమైన పెయిన్ కిల్లర్. 'అలొవెరా' కూడా పెంచుతుంది. ఆకుకూరలు సరే సరి. ఈ లెక్కన “పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదు" అంటే కుదరదు. నా రచనలు పనికి రాకపోవచ్చు. కానీ ఇవన్నీ చక్కగా పనికి వస్తాయి.
'మీ గురించి అలా చెప్పుకుంటారేం?' అనుకుని ఆశ్చర్యపోకండి! దీన్నే 'సెల్ప్ మాకరీ' (self mockery) అంటారు. నిజానికి, ఇంట్లోవాళ్ళు, రోజూ పొగడుతూ ఉంటారేమిటి? మనసులో ఉంటుంది లెండి, పాపం! గొప్ప సైకాలజిస్టు, హ్యూమర్ రీసర్చర్ డా. ఆర్నీ క్యాన్ గారు “వన్ హూ కెన్ లాఫ్ అట్ వన్‌సెల్ప్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ" అన్నారు. తన మీద తానే జోకులు వేసుకొనేవాడు ఆరోగ్యంగా ఉంటాడట. ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, చార్లీ చాప్లిన్ ఇలా అన్నాడు, "క్లోజప్‌లో చూస్తే జీవితం ట్రాజెడీ! కాని లాంగ్ షాట్లో అది కామెడీ!" సో, దూషణ భూషణలకతీతంగా, సరదాగా, తనను చూసి తానే నవ్వుకుంటూ ముందుకు వెళితే సరి! అదన్నమాట!

'మహాప్రవాహం!'-40 - లింక్

మహరాజ్ కొనసాగించారు - “విశ్వకవి టాగోర్ మాటలు ఇక్కడ గుర్తు చేసుకుందాము. ఎందుకంటే ఆయన చెప్పాడంటే మీకు మరింత విలువగా అనిపిస్తుంది..” అని నవ్వినారు.
“ఎవర్నిపూజిస్తున్నావు ఆ చీకట్లో?
దేవుడు అక్కడ లేడను సంగతి తెలియదా?
రోడ్డు వేయడం కోసం రాళ్లు పగలకొట్టే కూలీలో
నాగలి పట్టి భూమిని దున్నే రైతులో,
వాండ్లు చిందించే చెమట చుక్కల్లో
ఆయనను దర్శించండి!”
~
కేదారని ప్రభావితం చేసిన ఆధ్యాత్మికవేత్త గురించి ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

 

https://sanchika.com/mahaapravaaham-pds-serial-40/

 

Thursday, August 15, 2024

వరలక్ష్మీ దేవి పై నేను వ్రాసి, స్వరపరచి, పాడిన కీర్తన

వరలక్ష్మీ దేవి పై నేను వ్రాసి, స్వరపరచి, పాడిన కీర్తన 🙏

 


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో నేను వ్రాసి పాడిన ప్రత్యేక పాట..

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో నేను వ్రాసి పాడిన ప్రత్యేక పాట.. 


 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా కవిత ఆంధ్రప్రభ దినపత్రికలో

వరభారతదేశము మాది - కవిత

ఆంధ్రప్రభ పేపర్ క్లిప్పింగ్.

Click on the image to view in bigger size

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో నా ధార్మిక ప్రవచనాల కార్యక్రమంపై వార్త

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో 13 ఆగస్టు 2024 నుంచి 18 ఆగస్టు 2024 వరకు ధార్మిక ప్రవచనాలు చేసే అవకాశం కల్పించారు ఆలయ సహాయ కమీషనర్, ఆలయ చైర్మన్. సంబధిత వార్త ఆంధ్రప్రభ పేపర్ క్లిప్పింగ్.



Click on the image to view in bigger size.

Monday, August 12, 2024

'మహాప్రవాహం!'-39 - లింక్

పెండ్లి సంబంధాలు శానా వచ్చినాయి. పాప బాగుంది. లెక్చరరు, గెజిటెడ్ ర్యాంకని వచ్చినారు. కాని మేరీ షరతు ఏందంటీ, మా అమ్మా నాయినా గూడ నా దగ్గరే ఉండాల. అందుకొప్పుకుంటేనే పెండ్లి అని. ఇది నచ్చక శానా మంది ఎనిక్కిబోబట్నారు.

 


~
తల్లిదండ్రులను సంతోషపరుస్తూ, పెళ్ళి చేసుకుని మేరీ జీవితంలో స్థిరపడిన వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-39/
 


'ప్రముఖ పుణ్య క్షేత్రం బ్రహ్మంగారి మఠం సందర్శన' లింక్

కడపజిల్లా, బ్రహ్మంగారి మఠం (బి.మఠం), శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం లోని ముఖమంటపంలో 25-7-24 నుండి తేది 30-7-24 వరకు (6 రోజులు) ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశాను. ఆ సందర్భంగా బ్రహ్మంగారి మఠం, ఆలయాలు సందర్శించి, రాసిన వ్యాసం చదవండి. 


 

https://sanchika.com/brahmamgari-matham-sandarshana-pds/ 

చదువు – అన్వీక్షికి – ఉగాది నవలల పోటీ (2023) విజేతల సన్మానసభ – నివేదిక - లింక్

చదువు అన్వీక్షికి ప్రచురణ సంస్థ నిర్వహించిన 2023 ఉగాది నవలల పోటీలో నా నవల 'ఆపరేషన్ రెడ్' బహుమతి పొందిన సంగతి తెలిసినదే. విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం 4 ఆగస్టు 2024న జరిగింది. శంకర్ కుమార్ ఆ నివేదికని అందించారు.


 

https://sanchika.com/chaduvu-anvikshiki-ugadi-navalala-potee-2023-vijetala-sanmana-sabha-nivedika/ 

రచయిత సంపత్ పార్దుతో ముఖాముఖి

నేను అనువదించిన 'అంతరిక్షంలో మృత్యునౌక' అనే సైన్స్ ఫిక్షన్ మూల రచయిత సంపత్ పార్దుతో ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడవచ్చు. సంపత్ పార్దు రాసిన Redemption of the Century ని నేను అనువదించగా, సంచిక మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది.




Saturday, August 3, 2024

పెంపకాల ఇంపులు - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 04 ఆగస్టు 2024

 మొన్నా మధ్య ముఖపుస్తకంలో, అదేనండి బాబూ, ఫేస్‌బుక్‍లో ఒక పోస్టు చూశాను. నాకు అది తెగ నచ్చేసింది. మీరు కూడా మెచ్చుకుంటారని మీకు చెబుతున్నా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినట్టు, మీరు మీ పిల్లలను పెంచాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఆ ప్రపంచం ఇప్పుడు లేదు కనుక, ఎంత నిజం! జనరేషన్ గ్యాప్ అనేదుంది చూశారూ, అదో తప్పనిసరి వ్యవహారమండీ మాస్టారు.
మా చిన్నప్పుడు, ఒక రకంగా గాలికి పెరిగాం. మా అమ్మా, నాన్నా మమ్మల్ని పట్టించుకునేవారు కారు. ఎక్కువ మందిమి. కిలోన్నర బొంబాయి రవ్వ ఉప్మా చేస్తే, నాక్కావాలి, నాక్కావాలని కొట్టుకునే వాళ్ళం. మా అమ్మకు మిగిలేది కాదు. మా నాన్న విసుక్కునే వాడు - 'కంచాల్లో కుంభాలు తోడితే గాని చాలదు ఈ వెధవలకు'. ఇదంతా మా అన్నదమ్ముల మీదే. ఆడపిల్లలనేమీ అనేవాడు కాదాయన. మా అమ్మ మాత్రం "నా కుందిలెండి" అనేది నవ్వుతూ. ఉందో, లేదో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలకు ఉప్మా పెడితే తింటారా? స్విగ్వీలో బర్గర్ కావాలంటారు.
కానీ ఇంటికి వచ్చిన వాళ్లకు నమస్కరించడం, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు చెంబుతో తెచ్చిచ్చి, తుడుచుకోవడానికి కాశీ తువ్వాలు ఇవ్వడం... ఇలాంటివి మాకు నేర్పారు. "ఒరేయ్ చిన్నోడా! పెదనాన్నకు నీకొచ్చిన పద్యం ఒకటి చెప్పు" అని అమ్మ చెబితే, మా తమ్ముడు నాలుగేళ్ల వెధవ, వెంటనే 'శ్రీరాముని దయచేతను నారూఢిగా
సకల జనులు ఔరా యనగా' అంటూ జంకూ గొంకూ లేకుండా పద్యం చదివేవాడు. చదివి మా నాన్న వైపు చూసేవాడు భయంగా. సదరు పెదనాన్న, "భేష్ గట్టివాడవురా భడవా.." అని మెచ్చుకుంటే, సిగ్గుపడి, మా అమ్మ చీరకుచ్చెళ్ల వెనుక దాక్కునే వాడు.
మరి ఇప్పుడో? చెంబులూ లేవు, కాళ్లు కడుక్కోవడాలూ లేవు, "మున్నీ, అంకుల్‍కు వైఫై కనెక్టుచేసి ఇవ్వు, బేబీ! చార్జింగ్ పెట్టివ్వాలేమో అడుగు" అని చెబుతున్నారు ఇప్పటి మమ్మీలు, డాడీలు. ఆధునిక అతిధి సత్కారం ఇదే మరి.
పిల్లలను పెంచడం ఆషామాషీ వ్యవహారం కాదు బాబోయ్! ఆషామాషీ ఏమిటని అడక్కండి. నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి! సైకాలజిస్టు డయానా బామ్రిండ్ గారు పిల్లల పెంపకంలో మూడు పద్దతులను సెలవిచ్చారు. అవి 1) అథారిటేటివ్ పేరెంటింగ్ 2) అథారిటేరియన్ పేరెంటింగ్ 3) పర్మిసివ్ పేరెంటింగ్. మొదటిది పిల్లలకు సంయమనంతో ప్రేమగా చెప్పి ఒప్పించడం, పిల్లల మనోభావాలను గుర్తించడం, రెండవది ఒక రకంగా నియంతృత్వం. కఠినమైన క్రమశిక్షణను వారిపై రుద్ది, తల్లిదండ్రులంటేనే భయపడేలా ప్రవర్తించడం, దీనినే 'వర్జీనియా వూల్ఫ్ 'పేరంటల్ టైరనీ' అని చెప్పారు. 'తల్లిదండ్రుల దుర్మార్గం' అని అనువదించవచ్చు. ముప్పాళ్ళ రంగనాయకమ్మగారైతే 'దొంగ తల్లిదండ్రులున్నారు జాగ్రత్త!' అని నవలే రాసేశారు ఏకంగా. అటువంటి తల్లితండ్రులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతాం. ఉంటారు సుమండీ! కానీ, చాలా తక్కువ మంది ఉంటారు. తల్లిదండ్రుల గొప్పదనాన్ని సూచించే ఎన్నో కొటేషన్లు మనకున్నాయి. కానీ, ఒకటి గుర్తుంచుకోవాలి. 


వాళ్ళూ మనుషులే. బలహీనతలు వారికీ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తలు నిత్యం పోట్లాడుకుంటుంటే దాని ప్రభావం పిల్లలపై ఉండదా చెప్పండి? నాన్న వ్యసనపరుడైతే పిల్లలు సరిగ్గా పెరగరు. 'ఆవు చేనిలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?' 'యథా మాతా పితా, తధా సుతాః' పిల్లలను కొట్టడం అసలు పెంపకమే కాదు!
ఇక మూడవది పర్మిసివ్ పేరెంటింగ్. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. మన అభిరుచులు వారిపై రుద్దకూడదు. వాడు చక్కని సంగీతవేత్త కావాలనుకుంటే మనం పట్టుబట్టి నారాయణ ఐఐటి అకాడమీలో చేర్పించకూడదు. పిల్లలతో మంచి సాహిత్యం చదివించాలి. గరిపెల్లి అశోక్, ఆర్.సి. కృష్ణస్వామి రాజు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, వేంపల్లె షరీఫ్, కూచిమంచి నాగేంద్ర గారల వంటి రచయితలు ఎంతో మంది పిల్లల కోసం పుస్తకాలు రాశారు. అప్పుడు చంద్రమామ పత్రిక అన్ని భారతీయ భాషల్లో వెలువడేది (ఇంచుమించు). ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చి చదివే అలవాటును మింగేసింది.
సాందీపని మహర్షి, కృష్ణునికి, కుచేలునికీ, బలరామునికి చదువు నేర్పాడు. ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉజ్జయినిలో ఉంది. పిల్లలను గురుకులాల్లో పెట్టి చదివించడం ఏనాటి నుంచో ఉంది. ప్రహ్లాదుని గురువులు చండా మార్కులు. హిరణ్యకశిపునికి పాపం పేరెంటింగ్ తెలియక, వారి దగ్గరకు పంపితే, ప్రహ్లాదుడు వారికీ కొరకరాని కొయ్య అవుతాడు. అందరూ శ్రీరామునిలా తండ్రి మాట వింటారా? ఇప్పుడు పిల్లలకు ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువ. ఐక్యూ కూడా ఎక్కువే. దానికి తగ్గట్టు వాళ్ళను తీర్చిదిద్ద కపోతే... డేంజర్. మా మనవడు ఏడేళ్ళ వాడు నన్నడిగాడు... "తాతా! నీకు స్కూల్ లేదు. హోం వర్క్ లేదు కదా, ఎప్పుడూ రాసుకుంటూ ఉంటావెందుకు?" అని. నేను నిస్సహాయంగా చూశాను. మా కోడలన్నది "తాత, నాన్న లాగ వర్క్ ఫ్రం హోం చేస్తారురా". అది వాడికి తెలుసు, అదన్నమాట!

ద్రౌపది ఏకపాత్రాభినయం లింక్

తన గురించి హేళనగా మాట్లాడేవారి గురించి ద్రౌపది ఏమనుకుంటుందో ఈ ఏకపాత్రాభినయం పాఠ్యంలో చదవండి.

https://sanchika.com/draupadi-ekapaatraabhinayam-pds/

'మహాప్రవాహం!'-38 - లింక్

“మీరు..” అని దావీదు అంటుండగానే, “నేను మేడంగారి వద్ద బాటనీ లెక్చరర్‌గా పని చేస్తున్నానండి. నా పేరు శశాంక్. ఆమె శానా మంచిదండి. గందరగోలంగా ఉన్న ఈ కాలేజీని ఒక దావకు తీసుకచ్చినారు మేడం” అని చెప్పి, నమస్కారము చేసి ఎల్లిపోయినాడు.
~
మేరీ కాలేజీ ప్రిన్సిపాల్‍గా ఎదిగిన వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.


https://sanchika.com/mahaapravaaham-pds-serial-38/

బ్రహ్మంగారి మఠంలో నా ధార్మిక ప్రవచనాల కార్యక్రమంపై నివేదిక

కడపజిల్లా, బ్రహ్మంగారి మఠం (బి.మఠం), శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం లోని ముఖమంటపంలో 25-7-24 నుండి తేది 30-7-24 వరకు (6 రోజులు) ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశాను. సంబంధిత నివేదిక సంచికలో చదవండి.

 


https://sanchika.com/brahmamgari-mathamlo-panyam-dattasarma-dharmika-pravachanalu-report/

ఉషా పక్షపత్రికలో నా కథ

ఉషా పక్షపత్రిక తాజా సంచికలో నా కథ 'మా తుఝే సలామ్' ప్రచురింపబడింది.

https://docs.google.com/document/d/16lZ4a_yI4pM4laehrGjV0wjoB0DYdFTTQz0FkZB3WzA/edit?usp=sharing

ఈ లింక్ ద్వారా కథ చదివి మీ అభిప్రాయం తెలుపండి 🙏

రవళి పత్రికలో నా కథ

రవళి ఆగష్టు సంచికలో నా కథ 'మొదలెడదాం మార్పు మనతోనే' ప్రచురింపబడింది.

https://online.fliphtml5.com/cqrre/hccf/index.html#p=36

ఈ లింక్ ద్వారా కథ చదివి మీ అభిప్రాయం తెలుపండి 🙏

కీ. శే. గోవాడ మల్లీశ్వరి స్మారక నాటిక రచనలో పోటీలో నా నాటికకు ప్రశంసా బహుమతి

గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్స్ వారు నిర్వహించిన కీ. శే. గోవాడ మల్లీశ్వరి స్మారక నాటిక రచనలో పోటీ 2024- లో నేను రచించిన 'కుమాతానభవతి' అనే నాటికకి ప్రశంసాబహుమతి లభించింది. సంబంధిత ప్రకటన దిగువన చూడగలరు.



 Click on images to view in bigger size


Thursday, August 1, 2024

శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-4

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 4వ భాగం. 🙏
~
మాలతమ్మకు ‘మీన్స్ అండ్ ఎండ్స్’ గురించి, గాంధీగారి మార్గం గురించి పూర్తి అవగాహన ఉంది. పాఠకులకు విసుగు వచ్చేలా, నవలలో, వాటిని గురించి ఆమె సుదీర్ఘంగా చెప్పుకుంటూ వెళ్లరు. ఆమె ఏ విషయంలో నైనా Judgmental గా తనను తాను ఆవిష్కరించుకోదు. అంతా ‘కథ’లోనే ఉంటుంది.
~
పూర్తి రచనని సంచికలో చదవండి.


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-4/


ఉషా పక్షపత్రిక వారి కథల పోటీలో సాధారణ ప్రచురణకు నా కథ ఎంపిక

ఉషా పక్షపత్రిక నిర్వహించిన 'తటవర్తి భారతి స్మారక ప్రపంచ స్థాయి కథల' పోటీలో నా కథ 'బహుపత్నీవ్రతుడు' సాధారణ ప్రచురణకు ఎంపికైంది. న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.
సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇతర కథల జాబితాను ఈ ప్రకటనలో చూడవచ్చు.