Sunday, June 30, 2024

హ్యుమరిజం - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ 30 జూన్ 2024

 అవును! తమరు సరిగ్గానే చదివారు. అప్పు తచ్చు కానే కాదు! ఇదేమిటి, సోషలిజం, కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం లాంటి ఎన్నో ఇజాలను గురించి విన్నాము. కానీ ఈ హ్యూమరిజం ఏమిటి మహాప్రభూ అంటున్నారా? వాటన్నింటికంటే ఇది చాలా పవర్ఫుల్లండీ మాస్టారు! దీన్ని అనుసరించేవారు జనప్రియులవుతారు. రోగాలు, రొష్టులు ఉండవు. లైఫంతా హ్యాపీస్! (హ్యాపీకి బహువచనం ఉంటుందా? అని కదా మీ శంక! 'సినిమా ప్రయోగాణాం సాదు' అంటే సినిమా వాళ్ళు ప్రయోగించిన భాషా ప్రయోగాలు కరక్టే! దీన్నెవ్వరు చెప్పారో నాకు తెల్వద్! గొప్ప రచయితలు, రాజకీయవేత్తలు, చివరికి వేదాంతులు కూడా తమ హాస్య స్పూర్తిని చాటి వారి హాస్యోక్తులతో పాపులర్ అయ్యారు. వాటిని మన కాలమ్‌లో పలుకరించాం, అడపదడపా. ఉప్పుడు నేనే తంతానంతే... మనలాంటి మామూలోళ్ళు గూడా హ్యూమరిజాన్ని చక్కగా పండిస్తారు. నేను పలాస ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేస్తున్న బంగారు కాలం. అప్పుడు మా కొలీగ్స్ చాలా మంది హ్యూమరిస్టులే. తవిటయ్య మా అటెండర్. మా తెలుగు మాస్టారు యల్లమందను "బావూ... టయమెంతయినాదేటీ?" అని అడిగాడొకసారి. ఈయన చేతివాచీ చూసి "యాభై.. తక్కువ మూడు" అన్నాడు గంభీరంగా! అంటే రెండూ పది! తవిటయ్యకి అర్థం కాక బుర్రగోక్కుంటూ "ఏటో ఈ తెలుగు బావు. ఇకట మాట్తాండు నా తోన" అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంఎస్ఎన్ మూర్తిగారు మా కెమిస్ట్రీ మాస్టారు. వికటకవినే ఆటపట్టించగల సమర్థుడు. మాది పెద్ద కాలేజీ. ముగ్గురం ఇంగ్లీషు లెక్చరర్లం. మేం కలిసి వస్తూంటే ఎమ్మెస్సెన్ గారు "అదిగో ఆంగ్లేయులు వస్తున్నారు" అనేవారు. స్టాఫ్ రూంలో ఆయన జోకులు బ్రహ్మాండంగా పేలేవి. నన్ను "ఇంగ్లీషు మాస్టారూ! మీకు ఇంగ్లీషు కంటే తెలుగు బాగా వచ్చటకదా! నాక్కొన్ని డౌట్స్ ఉన్నాయి తీరుస్తారా?" అని అడిగారు. 'చెప్పండి గురువుగారు' అని అన్నా. "'పులిహోర' ఉంది కానీ, 'సింహం హోర' ఎందుకు లేదు?, 'పెరుగు పచ్చడి' ఉంది కానీ, 'పాలపచ్చడి' ఎందుకు లేదు?" అన్నారు. నేను పిచ్చి మొగం వేసి, నాకు తెలియదన్నాను. "మీరే చెప్పండి మాస్టారు" అన్నాను. "నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతా కుర్ర మాస్టారు?" అని నన్నే దబాయించారు. నియోగి బ్రాహ్మణుడాయన. పొట్టనిండా ఇలాంటి ఐడియాలే!



నర్సీపట్నం బాలుర కాలేజీ... మా లెక్కల మాస్టారు బండారు రామకృష్ణగారు. ఇద్దరం బావా అంటే బావా అని పిలుచుకునేంత చనువు. ఆయనా హ్యూమరిజాన్ని ఔపోసన పట్టినవాడే. మామూలుగా ఏదీ చెప్పడు. అంతా హ్యాస్యప్లావితమే. ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తుంటాడు మా బావ. ఒకసారి "బావా! వెళ్ళి పాలప్యాకెట్ తెచ్చుకోపో" అన్నాడు. "ఎందుకు బావా?" అని అడిగితే, "మన పెన్షన్ పడింది, ముఖ్యమంత్రిగారి ఫోటోకు పాలాభిషేకం చేయవా?" అంటాడు. నా రచనకు ఉత్తమ పురస్కారం వచ్చిందని చెబితే "బావా! నీ వొక్క విషయం మాత్రం మరువకు. నేను రాయడం లేదు కాబట్టి నీకు అవార్డులు వస్తున్నాయి!" అన్నాడు. "నిజమే బావా" అన్నాను నవ్వుతూ.
నాంపల్లి ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీగా పని చేసే రోజులు. బషీర్ అహ్మద్ గారని స్పెషల్ ఆఫీసర్. ఉర్దూ హాస్య చతురుడు. ఆయనను అందరం బషీరన్న అనేవాళ్ళం. ఆయన మాత్రం నన్ను దత్తన్నా అని పిలిచేవాడు. పబ్లిక్ రిలేషన్స్, ప్రెస్ రిలేషన్స్, సమాచార హక్కు చట్టం... ఇవన్నీ నేను చూసేవాడిని. "దత్తన్నా అని పిలిస్తే చాలు ఒత్తన్నా అని వచ్చేస్తాడు" అని అనేవాడు నన్ను. మా కమిషనర్ చక్రపాణి గారు హాస్య ప్రియులు. అప్పుడు కమిషనరేటు బోర్డుకు వేర్వేరు -ఐఏఎస్ అధికారులు ఉండేవారు. ఒక సమావేశంలో చక్రపాణిగా రన్నారు. వేదికపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా ఉన్నారు. "మా కమిషనరేట్ శివాలయం, బోర్డు విష్ణాలయం". ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. బోర్డు ప్రైవేటు కాలేజీలను, పరీక్షలను ఫలితాలను పర్యవేక్షిస్తుంది కనుక కాసులు గలగల! కానీ కమిషనరేట్ కేవలం ప్రభుత్వ కాలేజీలనే పర్యవేక్షిస్తుంది. డబ్బులుండవు. చక్రపాణి గారు ఆ విషయం వివరించేసరికి సభలో నవ్వులు. 'వైభోగ ప్రియో విష్ణుః వైరాగ్య ప్రియో శివః' అన్నారు కదా!
బారువ కళాశాలలో పని చేసేటప్పుడు గున్నరాజుగారు మా ప్రిన్సిపాల్. ఫిజిక్స్ ఆయన సబ్జెక్టు. అప్పుడు హైస్కూలు, జూనియర్ కాలేజీ కొన్ని చోట్ల కలిసి ఉండేవి. సహజంగానే ప్రిన్సిపాల్ గారు మా లెక్చరర్లకు కొంత మినహాయింపులిచ్చేవారు. స్కూలు టీచర్లకు అది నచ్చేది కాదు. బెహరా అనే తెలుగు టీచరు టీచర్స్ డే నాడు ప్రసంగిస్తూ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. ఆయనకు వినత కంటే కద్రువ అంటే ఎక్కువిష్టం అన్నారు. అర్ధం అయింది కదా! ప్రిన్సిపాల్ గారి మీద చెణుకు.
పలాసలో మా ప్రిన్సిపాల్ నిష్ఠల సుబ్బారావుగారు డిసిప్లినేరియన్. ప్రేయర్లో ఒక పిల్లవాడు అల్లరి చేస్తుంటే మందలించారు గట్టిగా. వెనుక నుంచి ఒక కుర్రవాడు "సుబ్బారావుకు కోపం వచ్చింది!” అని అరిచాడు. సరిగ్గా అదే పేరుతో ఉన్న సినిమా ఆడుతోంది టౌన్
లో. ఆశ్చర్యం! ప్రిన్సిపాల్ గారికి కోపం రాలేదు సరిగదా హాయిగా నవ్వేశారు. దటీజ్ ది స్పిరిట్! కాబట్టి కామ్రేడ్స్! హ్యూమరిజంలో చేరండి. సంతోషం సగం బలం! అదన్నమాట!

ఉషా పక్షపత్రిక వారి నవలలో పోటీలో నా నవల 'ప్రాచ్యం-పాశ్చాత్యం'కు పదివేల రూపాయల బహుమతి

ఉషా పక్షపత్రిక నిర్వహించిన కీర్తిశేషులు వెలగపూడి సీతారమయ్య స్మారక నవలల పోటీ 2024లో  పదివేల రూపాయల విభాగంలో నా నవల 'ప్రాచ్యం-పాశ్చాత్యం' మొదటి బహుమతి గెలుచుకుంది. వివరాలకు క్రింది ప్రకటన చూడండి. న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.


 

శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-3

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 3వ భాగం. 🙏
~
ఇక్కడ మనం గమనించాల్సింది రచయిత్రి లోని అసాధారణ పాత్ర చిత్రణా సామర్థ్యం. పైన చెప్పిన విషయాలను వేటినీ వాచ్యంగా నవలలో చెప్పదు. పరిస్థితులు, సంఘటనలు, వ్యక్తులు, వారి దృక్పథాలు, సంభాషణలు, చర్యల ద్వారా గోపాలరావు వ్యక్తిత్వం 3-dimensional గా మనముందు రూపుదిద్దుకుంటుంది.
పూర్తి వ్యాసాన్ని సంచికలో చదవండి.


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-3/

 

ఖమ్మంలో జరిగిన పద్యగాన పోటీల విశేషాలు – నివేదిక లింక్

న్యాయనిర్ణేతలు ప్రసంగించి, పద్యగానాలలోని గుణదోష విశ్లేషణ చేశారు. పాణ్యం దత్తశర్మగారు ప్రసంగిస్తూ, అసలు పద్యం పాడతానని వచ్చినందుకే బహుమతి ఇవ్వవచ్చునన్నారు. యువతరం పద్యాలను నేర్చుకొని పాడాలన్నారు. సాజిద్ అన్న 16 సంవత్సరాల కుర్రవాడు చక్కగా గానం చేశాడని అతన్ని ఆశీర్వదించారు. పూర్తి నివేదిక సంచికలో చదవగలరు.



 https://sanchika.com/khammam-padyagaana-potee-nivedika/

 

 

ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ ఆలయ దర్శనం - లింక్

హారతి వెలుగులో నరసింహుడు జాజ్వల్యమానుడైనాడు. తీర్థం, శఠగోపస్పర్శ, ప్రసాదం స్వీకరించి, మహదానంద తరంగిత హృదయంతో వెలుపలికి వచ్చాను. ధన్యోస్మి నృసింహా పరబ్రహ్మ!
పూర్తి రచన సంచికలో చదవగలరు.


https://sanchika.com/sri-stambhadri-lakshminarasimha-aalaya-darshanam-pds/

 

'మహాప్రవాహం!'-33 - లింక్

నెలరోజుల్లో అమ్మకాలు పెరిగినాయి. ఖాజా హుసేను నిదానము, ఆడవాళ్లతో కూడ మర్యాదగ మాట్లాడడం, తాజా సరుకు ఇవ్వడం, ధర వేరేచోట్ల కన్నా కొంచెం తక్కువే అనిపించడం, షాపును కస్టమర్లకు దగ్గర చేసింది.
~
ఖాజా హుసేన్‍ కుటుంబం కొత్త ఊరిలో కొత్త జీవితంలో నిలదొక్కున్న వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.

 

https://sanchika.com/mahaapravaaham-pds-serial-33/

 

Saturday, June 22, 2024

వాస్తు, జ్యోతిష్యం.. మనం! - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 23 జూన్ 2024

మనందరికీ జరగబోయేది తెలుసుకోవాలని 'ఎంతో కొంత' నుంచి 'ఎంతో' వరకు ఉంటుంది. అది సహజం. నేను చెప్పబోయేది ఈ మన బలహీనతను సదరు కుహనా వాస్తు, జ్యోతిష్య పండితులు ఎలా క్యాష్ చేసుకుంటున్నారనే తప్ప, నిజమైన పండితులను విమర్శించడం కాదు.
'ఎవ్వెరీ టుమారో మస్ట్ బి ఎ సస్పెన్స్' అన్నాడు హెన్రీ ఫీల్డింగ్. అంటే ప్రతి రేపూ ఉత్కంఠభరితంగా ఉండాలన్నాడు. అప్పుడే లైఫ్‌లో థ్రిల్ ఉంటుందట. అలా కాకుండా అన్నీ ముందే తెలిసిపోతే. ఇంకేముంది చెప్పండి?
మా నాన్నగారు నాకు తొమ్మిదవ ఏటనే ఉపనయనం చేసి వాస్తు కాదు కానీ, జ్యోతిష్యం నేర్పారు. అంశ చక్రం, రాశి చక్రాలు వేయడం గ్రహస్థితులను బట్టి జాతకాన్నీ, భవిష్యత్ను చెప్పడం.. అలా నాకెందుకో ఆయన నేర్పిన సాహిత్యం పట్టుబడినంతగా జ్యోతిష్యం పట్టుబడలేదు. అందువల్ల ఆయనకు నా మీద కోపం కూడా ఉండేది. ఒకసారి నాన్న లేనప్పుడు కొందరు గ్రామీణులు మంచి రోజు చెప్పించుకోవడానికి మా ఇంటికి వచ్చారు. నాన్న లేరంటే నన్ను చెప్పమన్నారు. ముందే మిడిమిడి జ్ఞానం! ఇంట్లో ముహూర్త దర్పణం, జ్యోతిష్య మార్తాండం వంటి గ్రంథాలు ఉండేవి. ముహూర్త దర్పణం తెచ్చుకుని కూర్చున్నా. శుభకార్యం ఏమిటని అడిగా. "నిసేక మూర్తం పెట్టు సామి" అన్నారు వాళ్ళు.
నిషేక ముహూర్తం అన్న మాట. వధూవరుల నామనక్షత్రాలను లెక్కగట్టి వారం రోజుల్లో ఫలానా రోజున పగలు 11 గంటలకు.. అనబోతున్నాను, వాళ్ళు ఆశ్చర్యానికీ, అయోమయానికీ లోనై చూస్తున్నారు. ఇంతలోమా అమ్మ నన్ను లోపలికి పిలిచి "ఇంగితం లేదేమిరా నీకు? నిషేకం పగలు పెడతారా ఎవరైనా?" అని తిట్టింది. దాని అర్థం తొలిరాత్రి అని చెప్పింది. నాలుక్కరుచుకుని వెళ్లి "రాత్రి 11 గంటలకు" అని చెప్పి మ్యానేజ్ చేశా. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. మరి ఇప్పుడు అంటున్నారా? దానికి ఒక అర్థ శతాబ్దం మీద ఐదు కలపండి. ఇదెందుకు చెప్పానంటే, నా జ్యోతిష్య పరిజ్ఞానం అప్పుడెంతో ఇప్పుడూ అంతే!
జ్యోతిష్యంలో కొన్ని మంచి నియమాలు ఉన్నాయి. చెడు పరిణామాలు చెప్పకూడదని... అలా! అయ్యా తమరికి 42 సంవత్సరాల వయసులో ద్వితీయ కళత్రయోగం ఉంది (అంటే రెండో భార్య వస్తుందని) అని జ్యోతిష్కుడు చెప్పగానే, సదరు జాతకుడు ప్రథమ కళత్రం పరమపదించడానికి ఇంకా ఎంత కాలముంది? అని లెక్కలు వేసుకుంటాడు. తమరికి ముప్పై ఏడేళ్ళు వచ్చే వరకూ ఏ ఉద్యోగమూ రాదు, ఏ వ్యాపారమూ కలిసి రాదు,
అసలు పెళ్ళే కాదు అని చెప్పారనుకోండి. మన వాడు ఇక ఏ పనీ చేయడు. ఇలాంటి జ్యోతిష్యాలు మనకవసరమా? చెప్పండి.
జ్యోతిష్యం ఫలించకపోవడానికి పార్వతీదేవి శాపం అని ఒక కారణం చెబుతూ ఉంటారు. అమ్మవారు ఎందుకలా శాపం పెట్టారో నాకు తెలియదు కానీ, జ్యోతిష్యులు తప్పించుకోవడానికి ఇదో చక్కని మార్గం. వెనకటికి ఒకాయన ఇలా చెప్పాడట - "ఖచ్చితంగా మగపిల్లవాడే పుడతాడు. ఒకవేళ తప్పితే ఆడపిల్ల!" ఇదీ జ్యోతిష్యమేనంటారా? రోడ్డు పక్కన కూర్చుని చిలకజోస్యం చెప్పేవారిని చూస్తే నాకు జాలేస్తుంది. పేదరికం వారి ముఖాల్లో తాండవిస్తూ ఉంటుంది. చిలుక పంజరంలోంచి బయటికి వచ్చి ఒక కార్డు తీసి మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం! అది క్రమశిక్షణా? లేక బానిసత్వమా? నాకు అర్థం కాదు. వాస్తులో వాస్తవం ఎంత? అద్దె ఇంటికి కూడా వాస్తు చూడాలా? యజమానికి ఏ సమస్య వచ్చినా, దానిని వాస్తుతో ముడిపెట్టి ఇల్లును అటూఇటూ మార్పులు, కొండకచో కూలగొట్టడాలు చేయించి అప్పులు పాలు చేస్తుంటారు. గుడ్డిగా నమ్మినవారిదే తప్పంటాను నేను. విదేశాల్లో వారికి వాస్తు తెలియదు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా! అని ఒక వాదన. వారికీ కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి. శుక్రవారం 13వ తేదీ కలిసిరాదనీ, అరచేయి దురద పెడితే అదృష్టమని, గోడకానించి వేసిన నిచ్చెన కిందుగా వెళ్తే అరిష్టమని, అద్దం పగిలిపోతే మంచిది కాదని.. ఇలా ఎన్నో ఉన్నాయి. సైన్స్ పరంగా ఇవేమీ నిలబడవు. శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం, లాజిక్ (తర్కాన్ని) ని అనుసరించడం.

 


 ఇప్పుడున్న సమాజం పూర్తిగా కమర్షియలైజ్ అయిఉన్నది. ప్రతి వారు తమ వృత్తిని ఇతరులను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికే ఉపయోగిస్తారు. 'కాదేదీ దోపిడీకి అనర్హం' అనవచ్చేమో? ఎవరో అరుదుగా మంచివాళ్ళుండచ్చు. వారికి నా పాదాభివందనం. తమాషా ఏమిటంటే - వాళ్ళకు నో డిమాండ్. ఒకసారి హైదరాబాద్, చిక్కడపల్లిలో ఒక సిద్ధాంతిగారి వద్దకు మా మిత్రుడితో వెళ్ళాను. అతని కూతురి వివాహం నిమిత్తం. పంతులు గారు ఎనభైవ పడిలో ఉన్నారు. మానవ రూపం దాల్చిన వాణీదేవీలా ఉన్నారు. ఆయన ఫలానా టైమ్ లోగా పెళ్ళి అవుతుందనీ, రుక్మిణీ కల్యాణం పారాయణం చేయమని చెప్పారు. సంభావన ఇవ్వబోతే, "ద్రవ్యం పుచ్చుకుంటే శాస్త్రం ఫలించదని తెలియదా?" అని కోప్పడ్డారు.
ఆర్ నారాయణ్ గారి హాస్య కథ 'యాన్ అస్ట్రాలజర్స్ డే' చదివే ఉంటారు. పొట్టపోసుకోవడానికి జ్యోతిష్కుని అవతారమెత్తి ఉంటాడు ఒకడు. వాడి దగ్గరకు ఒకడొచ్చి జ్యోతిష్యం చెప్పమంటాడు. వీడిని వాడు(రెండో వాడు) గుర్తించడు. జ్యోతిష్కుడు వీడిని కొట్టి పాడుబడిన బావిలో వేసి వచ్చిఉంటాడు. ఇద్దరిదీ ఒక ఊరే. వాడు బతికినట్టు వీడికి తెలియదు. ఈ గతమంతా వాడికి చెప్పి బ్రహ్మాండంగా చెప్పావనిపించుకుని డబ్బు తీసుకుంటాడు.
వాస్తు, జ్యోతిష్యాలు ఖచ్చితంగా శాస్త్రాలే! కానీ వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే నా బాధ! అదన్న మాట!

'మహాప్రవాహం!'-32 - లింక్

అనుకున్నంతా అయ్యిందని కుంగిపోయినాడు ఖాజా. “మరి మా మాదిరి గరీబోల్ల గతి?” అన్నాడు దీనంగా.
రెండు చేతులెత్తి ఆకాశం సూపించినాడు కాశినాయన.
~
ఖాజా హుసేన్‍కి ఎదురైన కఠిన పరిస్తితులు, వాటిని అధిగమించేందుకు అతను తీసుకున్న నిర్ణయం గురించి ఈ వారం ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.


https://sanchika.com/mahaapravaaham-pds-serial-32/

 


బాలబాట – బాలల నాటక పోటీ విజేతలకు బహుమతి ప్రదాన సభ – నివేదిక - లింక్

‘బాలబాట’ మాసపత్రిక నిర్వహించిన బాలల నాటిక రచనల పోటీ - బహుమతి ప్రదాన సత్కార సభ 16 జూన్ 2024 న విశాఖపట్నంలో జరిగింది. ఈ పోటీలలో నేను వ్రాసిన ‘పరధర్మో భయావహః’ అన్న నాటికకు విశిష్ట బహుమతి లభించింది. బహుమతి ప్రదాన సభ వివరాలు సంచికలో నివేదికలో చదవగలరు.

 


https://sanchika.com/balabata-baalala-naatika-poteela-vijetakalu-bahumati-pradana-sabha-nivedika/


డిటెక్టివ్ కథల సంకలనంలో నా కథ 'అసూయకు సెలవులుండవు'

డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన డిటెక్టివ్ కథల సంకలనంలో ఎంపిక అయిన నా కథ ’అసూయకు సెలవులుండవు' చదవండి 🙏

https://drive.google.com/file/d/1gJPN_ZnA7pjHAhJl2oe6cA9kktPAkuxg/view?usp=sharing 

Saturday, June 15, 2024

సెల్‍తో సేల్స్ - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 16 జూన్ 2024

మొన్నా మధ్య మా వనస్థలిపురంలో ఒక 'పూజా స్టోర్సు’కి వెళ్లాను. దీపారాధన నూనె, వత్తులు వగైరా కొందామని. అందులో విశేషమేముంది? అంటున్నారా? ఉందుంది... అదే ఈ వ్యాసానికి మూలం. కౌంటరుకి అటువైపు ఒక మధ్య వయసు మహిళ కూర్చుని మన అష్టమ వ్యసన సాధకమైన స్మార్ట్ ఫోన్‌ను కెలుకుతూ, చిరునవ్వులు చిందించుకుంటూ 'సెల్ వశ్యం'లో ఉంది. అదేమిటి అంటారా? పారవశ్యంలాగ ఇటీవల 'సెల్ వశ్యం' అని వచ్చిందిలెండి. దాన్ని పొందినవారికి ఇహలోక చింతన ఉండదు... అంటే ఆధ్యాత్మికత అనుకునేరు! శాంతం పాపం! శాంతం పాపం!
'అమ్మా! దీపారాధన నూనె' అంటూ కావ్య ప్రస్తావన చేశాను. ఆమెకు నా పిలుపు వినబడలేదు. తలెత్తి చూడలేదు. కనీసం రక్తమాంసయుతమైన ఒక మానవజీవి (అంటే నేనేనండీ బాబు) అక్కడ నిలబడినట్లు కూడా ఆ సెల్మణి (సెల్వమణి కాదు) గ్రహించలేదు. సరే అనుకొని ఇంకో షాపుకెళ్లాను.
కొందరు షాపులవాళ్లు కొంచెం బెటరండోయ్! ఫోన్లోంచి తలెత్తి చూసి మనం అడిగినది వాళ్ల షాపులో లేదని చెప్పేస్తారు. ఉందంటే ఫోన్ ఆపి ఇవ్వాల్సివస్తుంది కదా!
ఇక ఆటో వాళ్లయితే, స్టార్టయినప్పటినుంచి మనల్ని దింపేంత వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. 'హ్యాండ్స్ ఫ్రీ' గా ఉండేలా ఇయర్ ఫోన్స్‌ని తగిలించుకుంటే కొంత నయం. కానీ కొందరు చిరంజీవులు చెవికి భుజానికి మధ్య ఆ మహత్తర సాధనాన్ని నొక్కిపట్టి, సంభాషణ సాగిస్తుంటారు. పైగా అతివేగం. వెనుక కూర్చున్న నాలాంటి అర్భకులకు గుండెలు దడదడలాడు తుంటాయి. ఒక్కోసారి జీపీఎస్ సరిగ్గా గమనించకుండా దారితప్పిన సందర్భాలూ లేకపోలేదు.

 


 ఇంకో సాయంత్రం, పునుగులో బజ్జీలో తిందామని వెళ్లాను. ఒక చేత్తో ఫోన్‌లో చూస్తూ, మరొక చేత్తో పునుగులు వేస్తున్నాడో నలభీముడు! అవి పూర్తిగా రోస్ట్ అయి, వడియాలుగా మారాయి. ప్లేటులో నాకు కొన్ని పునుగులు వేసి ఇచ్చిందో అమ్మాయి. ఎంత మంచిదో... బంగారుతల్లి! ఎందుకంటున్నానంటే ఆమె వద్ద సెల్ ఫోన్ లేదు. కౌంటరు దగ్గర టోకెన్లు జారీ చేస్తున్న యజమానుల వారికి పునుగుల రూపురేఖలను గురించి సవినయముగా విన్నవించుకున్నా. ఆయన నలభీముడిని మందలించాడు. ఆ యువకిశోరం నిర్లక్ష్యంగా నవ్వేశాడంతే! ఆ నవ్వులో 'నేనింతే' అనే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందంటే నమ్మండి. యజమానులవారు ఇలా సెలవిచ్చారు - 'ఇయ్యాల్రేపు వర్కర్లు దొరుకుతలేరు సార్, మస్తు పరేశాన్ చేస్తున్రు, గా ప్లేట్లు పక్కన బెట్టుండ్రి, మంచిగ ఎయ్యిపిస్త!'. దటీజ్ ది స్పిరిట్! ఏ నైస్ గై! గై అంటే ఫ్రెంచి భాషలో 'వాడు' అని అర్థమని మీలాంటివారే చెప్పారు. నైస్ గై అంటే మంచివాడు. ఫూలిష్ గై అంటే తెలివి తక్కువవాడు (అంటే నేనేనా కొంపదీసి). ఇప్పుడు యువభారత పౌరులు 'హాయ్ గైస్' అని పలకరించుకుంటుంటారు. 2023లో ఒక జాతీయ సంస్థ 'ఎఫెక్ట్ ఆఫ్ సెల్ ఫోన్ ఆన్ రిటయిల్ సేల్స్' (ఈసీఆర్‌ఎస్) అనే ఒక సమగ్ర సర్వే నిర్వహించిందట. దాని ప్రకారం సెల్ ఫోన్ వాడకం వల్ల రిటైల్ అమ్మకాల్లో 30శాతం క్షీణత నమోదు అయ్యిందట. ఏమిటి నవ్వుతున్నారు? 'నమ్ము, నమ్మకపో' శీర్షికన పేపర్లలో... అదేదో సినిమాలో పి.ఎల్. నారాయణ అన్నట్లు పెద్దక్షరాల్లో వేశారు. తమిళంలో సొల్లు అంటే మాట. మాట్లాడటం... అని మంచి అర్థమే ఉంది. కానీ తెలుగులో 'సొల్లు కబుర్లు' అంటే పనికిమాలిన మాటలనే అర్థంతో వాడుతుంటారు. ఈ 'సొల్లు' అనే పదానికి 'సెల్లు' అనే పదానికి ఏమయినా సంబంధం ఉండొచ్చు నంటారా? ఒకసారి సీరియస్‍గా ఆలోచిద్దురూ!'సెల్‌తో సేల్స్' ని కాసేపలా పక్కన పెడితే, సెల్ ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ వంట చేసే వనితామణులు భారతావనిలో ఉన్నారు. ఇంటికి వచ్చిన అతిథులు, ఇంటివాళ్లు ఎవరి సెల్‌లో వాళ్లు తలదూర్చి, వీళ్లెందుకు ఆహ్వానించారో, వాళ్లెందుకు వచ్చారో మరచి సెల్ వశ్యంలో మునిగిపోతుంటారు.
కొంతకాలం కిందటి వరకు (గుడ్ ఓల్డ్ డేస్) రైల్లో, బస్సులో తోటి ప్రయాణీకులతో 'మీరెంత దాకా'తో ప్రారంభించి, కుటుంబవిషయాలను కలబోసుకునే వరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడంత సీనేదీ? పలకరించినా ఎవరూ పలకరు. పైగా మనం తీవ్రవాదులమేమో అన్నట్లు అనుమానంగా చూడటం! ఏతావాతా (దీనికర్థం నాకు తెలియదు) చెప్పొచ్చేదేమిటంటే సెల్ ఫోన్ మన వ్యాపారాలకే ముప్పు తెచ్చేది, మన నిత్య జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాకూడదని నా మనవి. అంతేగానీ, ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. అదన్న మాట.

'మహాప్రవాహం!'-31 - లింక్

నాయినను దీసుకొని పోయినాది మేరీ. ఆపీసులో శానామంది ఉన్నారు. శ్రీపాద సారు దగ్గర రిజల్టు ఉండింది. హాల్ టికెట్టు నంబరును బట్టి, పిల్లల పేర్లు బోర్డు మీద రాసిపెట్నారు. మేరీకి గుండెల్లో ఒక దడ మొదలైనాది. కాల్లు వనుకుతుండగా, పోయి తన నంబరు ఉందో లేదో చూసినాది. దావీదుకు అంత టెనసను లేదు. ‘నా బిడ్డకు రాకపోతే ఎవురి కొస్తాది’ అని ఆ యప్ప నమ్మకము.

 


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-31/

 

 



అహోబిల యాత్రానుభవాలు - లింక్

ఇటీవల నంద్యాల వెళ్ళినప్పుడు - అహోబిలం నృసింహస్వామి దర్శనం చేసుకునే భాగ్యం లభించింది. ఎగువ, దిగువ అహోబిలంలో స్వామి వారి ఆలయాలను దర్శించి స్వామి కృపకు పాత్రుడనయ్యాను. 

ఆ యాత్రా వివరాలు సంచికలో చదవండి.


 https://sanchika.com/ahobila-yaatra-pds/


సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభ - శంకర కుమార్ నివేదిక - లింక్

2023 సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో నా నవల 'శ్రీమద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైన విషయం తెలిసినదే. ది 8 జూన్ 2024 నాడు జూమ్ సమావేశంలో విజేతలకు సన్మాన/అభినందన సభ జరిగింది. నాకు జరిగిన సన్మానం గురించి, నవలపై వక్తల అభిప్రాయాల గురించి శంకర కుమార్ సంచికలో నివేదికలో చదవగలరు.



 

Friday, June 14, 2024

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభ

2023 సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీలో నా నవల 'శ్రీమద్రామారమణ' ఉత్తమ నవలగా ఎంపికైన విషయం తెలిసినదే. ది 8 జూన్ 2024 నాడు జూమ్ సమావేశంలో విజేతలకు సన్మాన/అభినందన సభ జరిగింది. నాకు జరిగిన సన్మానం, నవలపై అభిప్రాయాలు ఈ వీడియోలో చూడవచ్చు.

 




వినిపించే కథలు ఛానెల్‍లో నా కథ 'పెంపకాలు'

ఓ పేదవాడలో చిన్న పిల్ల ఇంటి బాధ్యత అంతా భుజాన వేసుకుని తల్లి తండ్రి ఊర్లో లేకున్నా, తమ్ముణ్ణి, అవ్వని సాకుతుంది. మరో చోట ఓ సంపన్న బాలిక, కొద్దిసేపైనా అమ్మమ్మని చూసుకోలేక ఆవిడని ఆసుపత్రిపాలు చేస్తుంది. లోపం ఎక్కడుంది?
681వ వినిపించే కథ..VK 681 - వెంపటి కామేశ్వరరావు గారి గళం
లో నా కథ 'పెంపకాలు'.. తప్పక వినమని మనవి.




Monday, June 10, 2024

అబద్ధాల రోజు - దత్తవాక్కు ఆంధ్రప్రభ 11 జూన్ 2024

మనకంత లేదు గానీ, పాశ్చాత్యులకు, ప్రతి అంశానికీ ఒక అంతర్జాతీయ దినోత్సవం ఏడ్చింది. కొన్ని మరీ సిల్లీగా ఉంటాయి. ఏప్రిల్ 4వ తేదీన 'టెల్ ఎ లై డే' ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారట. 'ఒక అబద్ధం చెప్పు... దినోత్సవం' అన్న మాట.
అబద్ధం అంటే? బద్ధం కానిది. అంటే కట్టుబడనిది అని అర్థం. అంతేనంటారా? దానికి వ్యతిరేకం నిజం. నిజం నిప్పులాంటిదంటారు. అంటే ఎంతదాచినా దాగదని. అబద్దం ఆడటం అంత వీజీ కాదు మాస్టారు! నిజం చెప్పడానికి పెద్దగా తెలివితేటలక్కరలేదండోయ్! నిజాయితీ ఉంటే చాలు. కానీ, అబద్దం చెప్పడానికి తెగింపు, కల్పనా సామర్థ్యం, సమయస్పూర్తి లాంటి ఎన్నో కావాలి మరి. నిజమా కాదా?ఒకసారి ఆలోచించండి!
ఇది నేను యథా మామూలుగా సరదాగా రాస్తున్నదే తప్ప, అబద్ధాలను, వాటిని చెప్పేవారిని గ్లోరిఫై చేయడానికి గానీ, కనీసం సమర్థించడానికి గానీ, కానేకాదు బాబోయ్! అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలని, గోడకట్టినట్టు (అంటే చాలా ప్లాన్డ్‌గా) ఉండాలని, నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ఆరు లోకాలు చుట్టి వస్తుందని... ఇలా అబద్ధం గురించి ఎన్నో నానుడులున్నాయి.
ఛార్లెస్ పోంజీ అని, ఇటలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఒక అసత్యహరిశ్చంద్రుడు, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, బోలెడు గడించాడట. అదే నండీ డబ్బు... ఆ మహనీయుడు ఎంత గొప్పవాడంటే యూఎస్ ప్రభుత్వం అలాంటి కార్యకలాపాలకు ఫోంజీ స్కీమ్ అని నామకరణం చేసింది. 1940లో డిస్నీ వారు ఒక సినిమా తీశారండోయ్. దాంట్లో పినోకియో అని ఒక కుర్రాడుంటాడు. వాడు అబద్దం చెప్పి నప్పుడల్లా వాడి ముక్కు కొంచెం పెరుగుతూ ఉంటుంది. భలేగా ఉందికదూ.
1997లో 'లయ్యర్, లయ్యర్' అన్న సినిమా వచ్చింది. కామెడీ.. జిమ్ క్యారీ అందులో ప్రధాన పాత్ర పోషించాడు. అందులో ఒక కుర్రవాడు వాళ్ల లాయర్ నాన్నను 24 గంటల పాటు అబద్ధాలు చెప్పొద్దంటాడు. సదరు లాయరు ఆ క్రమంలో ఎన్ని అగచాట్లు పడ్డాడన్నదే సినిమా.
మనోళ్లేం తక్కువ తినలేదులెండి! వంశీ దర్శకత్వంలో 'ఏప్రిల్ 1వ తేదీ విడుదల' అన్న సినిమా వచ్చింది. ఎమ్ కిషన్ అన్న రచయిత రాసిన నవల 'హరిశ్చంద్రుడు అబద్ధమాడితే?' ఆధారంగా దీన్ని తీశారట. ఇలాంటి పాత్రలను అవలీలగా పోషించే హాస్య నట కిరీటి మన రాజేంద్రప్రసాద్ హీరో. శోభన హీరోయిన్. వంశీ సినిమాలన్నింటి లాగే, దీంట్లో చక్కని పాటలున్నాయి. ఇళయరాజా దీనికి సంగీత దర్శకుడు. దీనికి రచనా సహకారం కోలపల్లి ఈశ్వర్, తర్వాత గొప్ప హాస్య నటుడైన కృష్ణభగవాన్ అందించారు. మరో హాస్య నటుడు ఎల్బి శ్రీరామ్ మాటలు.
రాజేంద్ర ప్రసాద్ శోభనను ప్రేమిస్తాడు. అతడిని పెళ్ళాడటానికి ఆమె పెట్టిన షరతు, అతడు ఒక నెలపాటు అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా ఉండాలి! అలా అగ్రిమెంటు ఒకటి పైగా. ఇక దాని పరిణామాలే సినిమా. చక్కని సందేశాన్ని హాస్యంతో మేళవించాడు వంశీ. ఇక రాజకపూర్ 'శ్రీ 420' (1955) కూడా అలాంటి సినిమాయే ఇంచుమించు. డబ్బుసంపాదన కోసం ఎన్నో అబద్ధాలు, మోసాలు చేస్తాడు హీరో. 420 అనేది ఇండియన్ పీనల్ కోడ్‍లో, మోసాలకు సంబంధించిన సెక్షన్. దానికి శ్రీ తగిలించి వ్యంగ్యాన్ని పండించారు.
మన సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు? అయినా అబద్ధం చెప్పలేదు. అందుకే ఏ పురాణ పురుషునికీ లేని 'సత్య' అన్న బిరుదు ఆయనకు ఇచ్చాం. సత్య ధర్మరాజు, సత్య శిబి, సత్య రంతిదేవుడు... అని అనలేదే?

 


అబద్ధం చెప్పేటప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయట. వీటి ఆధారం గానే లై డిటెక్టర్ పని చేస్తుంది. 'మాయాబజార్‍'లో ఆనాడే సాత్యకి దీన్ని ఉపయోగించి శకుని మామ బండారం బట్టబయలు చేశాడు.
శకుంతల దుష్యంతుడు తనను తిరస్కరించినప్పుడు సత్యం యొక్క గొప్పదనాన్ని అతనికి ఇలా చెబుతుంది.
కంః
వెలయంగ నశ్వమేధం
బులువేయును నొక్క సత్యమును నిరుగడలన్
తుల నిడి తూపగ సత్యము
వలననములు సూపు గౌరవంబున బేర్మిన్
వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం ఒక వైపు, ఒక్క నిజాన్ని ఒక వైపు పెట్టి త్రాసులో తూస్తే, ముల్లు నిజం వైపే మొగ్గుతుందట.
శుక్రనీతి కొన్ని మినహాయింపులిచ్చింది.
కం:
వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము పొందరధిప!
ఆ మాత్రం సందిస్తే మన వాళ్ళు అల్లుకుపోరూ? అయినా అబద్ధాలాడి బతికే బతుకు అదీ ఒక బతుకేనా చెప్పండి! నిజం చెబితే వచ్చే నిబ్బరం, దబ్బర (అబద్ధం) చెబితే రాదు, రాదంతే... అదన్నమాట!

'మహాప్రవాహం!'-30

రెస్టారెంటు మధ్యలో ఆరడుగుల రోజ్‌వుడ్డు విగ్రహాన్ని తయారుచేసినాడు వీర. ఆడమనిసి బొమ్మ. నల్లని చెక్కతో చేసినందుకు నిగనిగా మెరుస్తోంది. సక్కగా చీర కట్టుకొని శేతిలో ఒక కలశము పట్టుకుని నిలబడినట్టు, చెక్కను శేపు చేసి, నగిశీలు చెక్కినాడు. ఆ యమ్మ చీర కుచ్చెళ్లు గూడ చెక్కలో మడతలు మడతలుగా వచ్చినాయి. కలశము మాత్రము ఇత్తడిది. వచ్చి నాండ్లందరి కండ్లు ఈ బొమ్మ మీదనే.


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-30/


నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి సమావేశం – నివేదిక

పాణ్యం దత్తశర్మగారి పాటలతో సాగునీటి పంపకాలలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమ పాలిట మిథ్య అయిన తీరును, ఏ.పి. విభజన చట్టంలో రాయలసీమ హక్కులు అమలుకాకపోవటాన్ని వివరించారు. 


https://sanchika.com/rayalaseema-saguneeti-sadhana-samithi-samavesam-nivedika/


Saturday, June 8, 2024

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభకు ఆహ్వానం

అమెరికా లోని డల్లాస్ లోని తెలుగు సాహిత్యసంస్థ 'సిరికోన' వారు నిర్వహించిన కళా రంగ ఇతివృత్త నవలల పోటీలో, ఒక హరికథా విద్వాంసుని ప్రస్థానాన్ని, ఫిక్షన్‌గా మలచి, నేను రాసిన నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా పురస్కారం అందుకున్నది. 

ఆ పోటీ లోని విజేతలకు సన్మాన సభ నేడు అంటే 8 జూన్ 2024 నాడు జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించబడుతుంది.
జూమ్ లంకె:
https://us02web.zoom.us/j/8019817968?pwd=cCNymnnalIg8bsOuKJNP0ZPjKBHwCY.1&omn=88923442973
జూమ్ ఐడి: 8019817968
పాస్ కోడ్: 724484
సమయం భారత్‌లో రాత్రి వేళ ఎనిమిదిన్నరకు; అమెరికాలో పగటి పూట...
అందరికీ సాదర ఆహ్వానం.


కార్యక్రమం:
1.  సభ్యులకు స్వాగతం, పురస్కారాల గురించి పరిచయం (పూర్వ రచనల పరిచయం తో పాటు) : జొ. సుబ్రహ్మణ్యం
2. విజేతల పరిచయం, అభినందన : గంగిశెట్టి లక్షీనారాయణ
3. విజేతల సత్కారం:
      a. పాణ్యం దత్త శర్మ :  —ఎన్.సి.చక్రవర్తి (హైదరాబాద్)
      b. కోసూరిఉమాభారతి : ?
      c. మంథా భానుమతి : –ఎన్.నరసరాజు (హైదరాబాద్)
4. విజేత నవలల అనుశీలన ప్రసంగాలు:
      i) తాటిపాముల మృత్యుంజయుడు
      ii) రాయదుర్గం విజయలక్ష్మి
5.విజేతల స్పందనలు
6. సభ్యుల హర్షాభినందనలు :   జూమ్ లో పాల్గొనే సభ్యులు
7. వందనసమర్పణ: జొ. సుబ్రహ్మణ్యం
*****
వచ్చే ఏడాది నవలారచన పోటీలకు విషయసూచన కూడా చేయబడుతుంది. విషయనిర్ణయంలో, పాల్గొనే సభ్యుల అభిప్రాయం కూడా తీసుకోబడుతుంది.
యూట్యూబ్ లైవ్ ఉంటుంది...  మిత్రులందరూ పాల్గొనవలసిందిగా అభ్యర్థన...

Thursday, June 6, 2024

కథామంజరి జన్మదిన సంచిక 2024 కథల పోటీ ఫలితాలు

కథామంజరి జన్మదిన సంచిక 2024 'పల్లెకు పోదాం' అనే అంశంపై నిర్వహించిన కథల పోటీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పోటీలలో నేను రచించిన 'స్వర్గాదపి గరీయసి' కథ సాధారణ ప్రచురణకు ఎంపికైంది.




చిన్ననాటి గురువుగారికి చిరు సత్కారం

దాదాపు యాభై ఏళ్ళ క్రితం నాకు పాఠాలు చెప్పిన శంకరయ్య సార్‍ను కలిసే అవకాశం ఇటీవల లభించింది. గురువుగారు 90 ఏళ్ళ వయసులోనూ ఉత్సహాంగా ఉండి ఆప్యాయంగా పలకరించారు. ఆనాటి ముచ్చట్లెన్నో గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోగలగడం నా భాగ్యం!


 


అహోబిల స్వామి వారి సన్నిధిలో నా పద్యాలు

ఇటీవల అహోబిలం నరసింహస్వామివారిని సందర్శించుకున్న సందర్భంగా - స్వామి వారిపై నేను వ్రాసున్న పద్య కావ్యం 'శ్రీ లక్ష్మీ నృసింహ మాహాత్మ్యం' లోని పద్యాలను చదివాను. ఆ వీడియో తిలకించండి.


 


కథా స్రవంతి ఛానెల్‍లో నా కథ 'యత్ర నార్యస్తు పూజ్యంతే'

కథా స్రవంతి ఛానెల్‍లో పప్పు భోగారావు గారు నా కథా సంపుటి 'దత్త కథాలహరి' నుంచి ఎంచుకుని 'యత్ర నార్యస్తు పూజ్యంతే' కథను శ్రవణానందకరంగా చదివి వినిపించారు. వారికి నా ధన్యవాదాలు. నా కథని వారి గళంలో వినండి.


 

 

 


Sunday, June 2, 2024

మాటలకు 'ఊతం'గా - దత్తవాక్కు - ఆదివారం ఆంధ్రప్రభ - 2 జూన్ 2024

మొన్న యూ ట్యూబ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయాలను ప్రత్యేకంగా ప్రసారం చేసే ఒక ఛానెల్ చూశాను. ఆ వీడియోకారుడు ఇలా చెబుతున్నాడు... 'ఒక తాజా సమాచారమైతే ఇప్పుడైతే వచ్చింది. ప్రభుత్వమైతే ఒక డిఎనైతే విడుదల చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లయితే సంబరాలు చేసుకుంటున్నారు. దీని బకాయిలనైతే...' ఇలా ఒక్క వ్యాక్యంలో ఏడు 'ఐతే'లు, అవసరమా చెప్పండి?
ఏదైనా విషయాన్ని చెప్పే క్రమంలో చాలామంది కొన్నిరకాల ఊతపదాలను వాడుతుంటారు. అది సహజం. మధ్యలో ఆలోచించుకోవడానికి ఇవి పనికొస్తాయి. వీటిని 'గ్యాప్ ఫిల్లర్స్' (ఖాళీలను పూడ్చేవి?) అనవచ్చు. కానీ ఊతలు శృతిమించితే విసుగు పుట్టిస్తాయి. ఈ మధ్య అందరూ ఎక్కువగా వాడే ఊతపదం 'ఏదైతే ఉందో'. ఇంగ్లీషులో 'దట్ విచ్'తో మొదలయ్యే ఒక 'సబార్డినేట్ క్లాజ్' ఉంది. నిర్వచించడానికి దీనిని వాడతారు. తెలుగు భాష నేటివిటీలో ఆ విధానం లేదు. ‘ఈ అవినీతి ఏదైతే ఉందో...' అని మొదలుపెట్టి 'అది సమాజాన్ని నాశనం చేస్తుంద'ని అంటాడొకాయన. 'ఈ అవినీతి సమాజాన్ని...' అని చెబితే చాలదా? ఈ ప్రయోగం ముఖ్యంగా వక్తల్లో ఎక్కువగా కనబడుతుంది.
'పోతే' అనే పదం ఒకటుంది. తర్వాత అంశాన్ని సూచించడానికి దీనిని వాడతారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం పాత్ర ద్వారా దీనిని వెక్కిరించారు. వేదిక మీద బ్రహ్మానందం ముఖ్య అతిథి రామబ్రహ్మం గారు... పోతే... ఆత్మీయ అతిథి రాజశేఖరం గారు... పోతే... అనుకోని అతిథి శేషాచలం గారు... పోతే...' అని చెబుతుంటాడు. ఇంకో అర్థం రాలేదూ?! సంస్కృతంలో 'తు, హి, వై పాదపూరణీ!" అని ఒక సూత్రం ఉంది. ఛందస్సులో ఒక మాత్ర తక్కువైతే 'గ్యాప్ ఫిల్లర్స్' గా వీటిని వేసుకోవచ్చు. 'ఖలు' అని ఒకటుంది. ఇవన్నీ అవ్యయాలు. 'ఖలు' అంటే 'కదా' అని అర్థం. 'శరీర మాధ్యం ఖలు ధర్మసాధనమ్!' ఇలాంటి వాటికి కొంత శాస్త్రీయ ప్రమాణం ఉంది. 'జాతస్య ‘హి' ధృవం మృత్యు?', 'ఆత్మా 'వై' పుత్రనామాసి', 'భవభూ తిస్తుపండితః'... తెలుగు ఛందస్సులో ఈ సులువు లేదు. 


నేను 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజేస్' (సిఐఇఎఫ్ఎల్)లో పిజిడిటిఇ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ది టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్) అనే కోర్సు చేశార్లెండి. చాలామంది నన్ను తెలుగు పంతులనుకుంటారు కానీ, నేను ఇంగ్లీషు మాస్టర్నే సుమండీ! అప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ ఒకాయన 'ఫొనెటిక్స్' అనే సబ్జక్టుకి వచ్చేవారు. తను లెక్చరిచ్చిన గంటసేపట్లో 'అఫ్‌కోర్స్' అనే మాటని పదేపదే వాడుతుండేవారు. ప్రతి వాక్యంలో మినిమం రెండు అఫ్‌కోర్సులు. ఒక రోజు నేను మా ఫ్రెండ్ ఉదయకుమార్ జాగ్రత్తగా వాటిని లెక్కపెట్టాము. మొత్తం 187 తేలాయి. ఇంతకీ 'అఫ్‌కోర్స్' అంటే అర్థమేమిటో? 'పాఠకులకు బాగా తెలిసినదే, వేరే చెప్పాల్సిన పని లేదు' అని కవి హృదయం.
మా నాన్నగారికి ఒక ఊతపదం ఉండేది. మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో 'దేవుడు మేలుచేస్తే' అనేవారు. మా ఇంటికి చెరుకుల పాడు సిద్దాంతి అని ఒకాయన వచ్చేవారు. ఆయన ఊతపదం 'అంజెప్పి' (అని చెప్పి). 'స్వామీ పనిమీదంజెప్పి వెల్దుర్తికి వచ్చినాను. మిమ్మల్ని చూసి పోదామంజెప్పి ఇట్లా రావడమైంది. నిన్న దుర్గాష్టమంజెప్పి ఖడ్గమాల పారాయణం చేసినాను. అమ్మవారి కుంకుమ మీకు ఇస్తామంజెప్పి...' ఇలా సాగేదాయన వాక్ప్రవాహం.
సినిమాల్లో కూడా ఈ ఊత పదాలు అలరించాయి. అదేమిటో గాని, ఆర్ నాగేశ్వరరావుకు ఎప్పుడూ దుశ్శాశనుని పాత్రే. మాయా బజార్ లోనో, మరి దేంట్లోనో 'అదే మన తక్షణ కర్తవ్యం' అనే ఒకే ఒక్క డైలాగు ఆయనకుంటుంది. దానినే ప్రతిచోటా వాడతాడు. 'మహా మంత్రి తిమ్మరుసు' అనే సినిమాలో లింగమూర్తి అనే గొప్ప నటుడుంటాడు. తనికెళ్ల భరణి గారికి ఆయన అభిమాన నటుడు. ఈ విషయం భరణిగారే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు. లింగమూర్తి అందులో విలన్. ‘జగన్నాధ! జగన్నాధ!' అని మాటిమాటికీ అంటుంటాడు. అట్లే 'పరమానందయ్య శిష్యుల కథ'లో ముక్కామల గారు, ఆయనా గొప్ప నటుడే. ఆయనా అందులో విలనే. 'మహాదేవ, మహాదేవ' అనేది ఆయన ఊతపదం. లింగమూర్తి, ముక్కామల వాటిని ఎన్నోరకాలుగా, విభిన్న షేడ్స్ ఆఫ్ మీనింగ్ చెబుతూ అభినయిస్తూంటే ప్రేక్షకులకు వినోదంతో పాటు ఆశ్చర్యం! 'ఆ ఒక్కటీ అడక్కు'లో రావుగోపాలరావు 'సపోజ్, పర్ సపోజ్' అంటూ ప్రతివాక్యాన్ని ప్రారంభిస్తారు.
ఊత అంటే సపోర్టు. పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్లుంది కదండీ! దాన్ని మన మాటల్లో వంటల్లో ఉప్పులా జాగ్రత్తగా వాడాలని నా ఉద్దేశం. ఉప్పెక్కువైతే తినలేం! ఊతమెక్కువైతే వినలేం! ఈ ఊతపదం ఏదైతే ఉందో... ఇదేమిటి, నాకూ అంటుకున్నట్లుంది. మరైతే, నేనైతే, ఉంటానైతే! అదన్నమాట.

'మహాప్రవాహం!'-29

“పిన్నమ్మ జరం మనిసి గదా, సులబంగ అరుగుతాదని పాలకూర జేస్తి” అన్నాడు. వాని తల నిమిరి శిన్నాయన అన్నాడు “మా దస్తగిరి గాడంటే సొంత అన్న కొడుకు. యా తల్లి గన్నబిడ్డవో, మా యింటిమనిషివై పోయినావు, జీతే రహో బేటా!”


https://sanchika.com/mahaapravaaham-pds-serial-29/


Saturday, June 1, 2024

శతసహస్ర నరనారీ హృదయనేత్రి భరత ధాత్రి!-2

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 2వ భాగం. 🙏
~
జ్ఞానానికి, సేవాభావానికి, దేశభక్తికి, సమదర్శనానికి, కులంతో సంబంధం లేదని, నందయ్య త౦డ్రి, కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ గారు, జానకమ్మ గారు, రాముడత్తయ్య గారు, వాసుదేవరావు గారు ఇంకా అలాంటి గొప్ప మనసున్న వారి ద్వారా మాలతిగారు తన హృదయనేత్రి నవలలో నిరూపించారు.
~
పూర్తి రచనని సంచికలో చదవండి


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-2/


మధుమంజీరాలు పుస్తక సమీక్ష

“ఈ కథలు మానవీయ విలువల ఉన్నతీకరణే” అనే విహారి గారి ప్రశంస ఎంతైనా సముచితం. డా. ఎమ్. సుగుణ రావు రాసినట్టు, “మిగతా సాహిత్య ప్రక్రియల కన్నా త్వరితగతిన పాఠకులకు చేరుతుంది కథ”. 

శైలజ కథలు పాఠకులను చేరడమే కాదు, వారి మనస్సులలో నిలిచిపోతాయి.
పూర్తి సమీక్షని సంచికలో చదవండి


https://sanchika.com/madhumamjeeraalu-book-review-pds/

సిరికోన-జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ విజేతల సన్మాన సభకు ఆహ్వానం


అమెరికా లోని డల్లాస్ లోని తెలుగు సాహిత్యసంస్థ 'సిరికోన’ వారు నిర్వహించిన కళా రంగ ఇతివృత్త నవలల పోటీలో, ఒక హరికథా విద్వాంసుని ప్రస్థానాన్ని, ఫిక్షన్‌గా మలచి, నేను రాసిన నవల 'శ్రీ మద్రామారమణ' ఉత్తమ నవలగా పురస్కారం అందుకున్నది. ఆ పోటీ లోని విజేతలకు సన్మాన సభ 8 జూన్ 2024 నాడు జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించబడుతుంది.
జూమ్ ఐడి: 8019817968
పాస్ కోడ్: 724484

సమయం భారత్‌లో రాత్రి వేళ ఎనిమిదిన్నరకు; అమెరికాలో పగటి పూట...

అందరికీ సాదర ఆహ్వానం