Saturday, December 28, 2024

జీవన్ భద్రాణి పశ్యతి! - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

సంస్కృత భాషలోని సూక్తుల్లో ఇది ఎంతో గొప్పది. బ్రతకడం అనేది ఎంత విలువైందో తెలియచేస్తుంది. ఇది ‘శ్రీమద్రామాయణం’ లో వాల్మీకి మహర్షి, ఆంజనేయస్వామి వారి చేత చెప్పిస్తాడు. సుందరకాండలోని 13వ సర్గలో వస్తుంది. సీతాన్వేషణలో తాను విఫలమైనానని మారుతి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ‘అమ్మవారు దొరకలేదని శ్రీరామచంద్రునితో ఎలా చెప్పగలను? ఆ మహనీయునికి నా ముఖం ఎలా చూపించగలను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అనుకుంటాడు పవనపుత్రుడు. కాని వెంటనే తనను తాను సంబాళించుకొని, ఈ శ్లోకం చెబుతాడు. శ్లోకం లోని ఒక భాగమే యథాప్రకారం ప్రసిద్ధం. మిగతాది..
శ్లో: వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, ధృవో జీవిత సంగమః
సాక్షాత్తు శివాంశ సంభూతుడు అమిత బలపరాక్రమసంపన్నుడు, మహాజ్ఞాని, హనుమంతుల వారినే ‘వైఫల్యం’ క్రుంగదీసి ఆత్మహత్యకు పురికొల్పిందే, ఇక సామాన్యుల సంగతేమిటి?
టెంత్, ఇంటర్ పరీక్షా ఫలితాల తర్వాత, పిల్లలు, తాము ఫెయిల్ అయినామనో, ఎమ్‍సెట్, నీట్ లాంటి ప్రవేశపరీక్షల్లో, తామాశించిన ర్యాంక్ రాలేదనో, ఆత్మహత్యలు చేసుకొంటుంటారు. ఆ మేరకు వార్తలు చూస్తుంటాం. వాళ్లు దుర్బలమనస్కులని మనస్తత్వ శాస్త్రవేత్తలు సెలవిస్తుంటారు. మళ్లీ, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి పరీక్షా ఫలితాల తర్వాత ఈ ధోరణి అంతగా కనబడదు. అంటే దౌర్బల్యం తగ్గినట్లా? లేక, వయోపరిపాకం వల్ల కొంత రియలైజేషన్ వచ్చినందుకా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు చూస్తే విస్తుపోయేలా ఉన్నాయి! 15-29 వయస్సుగల వారిలో ఈ టెండెన్సీ అధికమట. ప్రతి సంవత్సరం 7,20,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆత్యహత్యలు చేసుకొంటున్నారట. 73 శాతం మధ్య తరగతి వారే ఇందులో ఉన్నారట.
తమ పిల్లలు ఇంజనీరింగో, మెడిసినో చేయాలని, యు.ఎస్.లో ఎం.ఎస్. చేసి, అమెరికాలో ఆకుపచ్చ కార్డు పొందాలని, తల్లితండ్రులు మొదట్నించి వారి చిన్న బ్రెయిన్‌లో ‘స్లో పాయిజన్’లా ఎక్కిస్తుంటారు. దాన్ని సాధించలేకపోతే వారి, వీరి జీవితాలు వ్యర్థం అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఫలితం నెగెటివ్ అయితే సూయిసైడ్ లకు దారితీస్తుంది. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అన్న గీతావాక్యం వీళ్ల తలకెక్కదు.
కేవలం పిరికివాళ్లే ఆత్మహత్యకు పాల్పడతారంటే నేనసలు ఒప్పుకోను. తనను తాను చంపుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? పాతాళ భైరవి సినిమాలో, ‘రాణిగారి తమ్ముడు’ రేలంగి, తనను రాకుమారి పెళ్లాడకుండా తోటరాముడిని పెళ్లాడుతూందని, అడవికి వచ్చి, ఒక చెట్టుకొమ్మకు ఉరివేసుకోబోతాడు. ఉరితాడు మెడకు గుచ్చుకుంటుంటే, మెడకు తాడుకు మధ్య ఒక మెత్తని వస్త్రం పెట్టుకొని ట్రై చేస్తాడు. అప్పుడు చూడాలి రేలంగి గారి హావభావాలు. “చావడం అంటే ఇంత కష్టమనుకోలేదు! చచ్చే చావులా ఉంది!” అంటాడు.
ఏదయినా ఒక అకృత్యాన్ని చేయబూనినపుడు ‘అది ఆత్మహత్యా సదృశ్యం’ (సూయిసైడల్) అంటారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటామని ఊరికే బెదిరిస్తుంటారు. కాని చావరు! దాన్నే ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అంటారు. తెలుగులో ఏమంటారో మరి? ‘భావోద్వేగ బెదిరింపు’ సరిపోతుందా? ఒక జోక్ చూడండి. 


 

“నేనిక భరించలేను, రైలు కింద పడి చచ్చిపోతా” అని మగడు బయలుదేరుతుంటాడు. భార్య “ఇప్పుడు బొకారో ఎక్స్‌ప్రెస్సేగా ఉంది? అదెప్పుడు కరెక్టు టైమ్‍కి వచ్చి చచ్చింది? ఒకవేళ లేటుంటే, రెండు కట్టలు కొత్తిమీర, పావుకిలో మిర్చి, వంద గ్రాముల అల్లం, మన రైతు బజార్లో తెచ్చి ఇచ్చి వెళ్ళండి. గోపాలపట్నం దగ్గర చావకండి. కష్టం. జనాలు తిరుగుతుంటారు. కొత్తవలస దగ్గరైతే బెటరేమో ఆలోచించండి” అంటూ ఉంటుంది నవ్వుతూ! ఆయన ఎలాగూ చావడని ఆమెకు తెలుసు! ‘లైట్’ తీసుకొందని అర్థం.
‘ఇద్దరు అమ్మాయిలు’ సినిమాలో అనుకుంటాను, డి.వి నరసరాజుగారు సంభాషణలు. ఆయన చాలా హాస్యచతురుడు. సూర్యకాంతం “నేను నూతిలో దూకి చచ్చిపోతా” అంటుంది. ఆమె కూతురు రమాప్రభ. “అమ్మా! నీవు నూతిలో దూకి చావద్దే!” అంటుంది గోముగా. “నా తల్లే, నా తల్లే! నేనంటే ఎంత ప్రేమో?” అంటుంది సూర్యకాంతమ్మగారు. “అదేం కాదే! నీవు దూకితే, నూతిలోని కప్పలన్నీ చచ్చిపోతాయే!” అంటుంది రమాప్రభ. ఇలాంటి జోక్‌లు ఎందుకు రాశానంటే ‘ఆత్మహత్య’ అన్న భయంకర కాన్సెప్ట్‌ను హాస్యం కలిపి పలుచన చేద్దామని.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం చాగంటి కోటేశ్వరరావు గారిని, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సంస్కారం లాంటివి చెబుతారట. చక్కని ఆలోచన. ఆయనంతటి జ్ఞాన సంపన్నులు చెపితే, పిల్లలు తప్పక వింటారు. ఈ ఆత్మహత్యలు ఎంతటి అర్థం లేనివో ఆయన పిల్లలకు వివరించాలని నా సవినయ మనవి. చెప్పేవారిని బట్టి కదా ఆచరణ ఉంటుంది! ఆ విషయంలో, చాగంటి వారిని మించిన వారెవరు?
ప్రజాఉద్యమాల్లో పాల్గొని, నిరాశతోనో, ఉద్యమానికి మరింత స్ఫూర్తి నివ్వాలనో, కొందరు ‘ఆత్మాహుతి’ చేసుకుంటుంటారు. వారు నిజంగా గొప్పవారు. కాని, అది ఉద్యమ విజయానికి దోహదం చేయదని వారికి చెప్పేవారెవరు? గర్ల్ ఫ్రెండ్ తనను ప్రేమిస్తానని చెప్పకపోతే, వాటర్ ట్యాంక్‌పై నుండి దూకి చస్తానని బెదిరిస్తుంటారు, భావి భారత యువకులు! ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోసేవారి కంటే, కత్తితో గొంతు కోసేవారి కంటే వీరు చాలా చాలా బెటర్. ‘వద్దు దూకవద్ద’ని పోలీసులు, హ్యాండ్ మైకులో అరుస్తూ సదరు అమరప్రేమికుడిని కాపాడి జాగ్రత్తగా క్రిందికి దింపి తీసుకు రావాలని నానాపాట్లు పడుతుంటారు పాపం! ఏమొచ్చినా, పోలీసుల చావుకే వస్తుంది. ‘బ్రతికి యుండిన శుభములబడయవచ్చు’ కదా! “బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చు” అన్నారు! ఈ బలుసాకును రైతుబజారులో ఎప్పడూ చూడలేదు. సి.పి. బ్రౌన్ గారు దీన్ని ‘రెచ్చెడ్ డైట్’ అన్నారు. దరిద్రపు తిండి! కనీసం దాన్నైనా తిని బ్రతకమని! అదన్నమాట.
 

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 8వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 8వ భాగం సంచికలో చదవండి.
~
“స్వామి! ఒక సందేహం!” అన్నాడు శిష్యుడు. వాడి ముఖంలో అడగవచ్చునో లేదో అన్న వ్యగ్రత.
“చెప్పు నాయనా.”
“దేవతార్చన చివర, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అన్నారు కదా! అవన్నీ లేని పూజ పూజ అవుతుందా?”
శర్మగారు కాసేపు మౌనం పూనారు.
“నాయనా నీ ప్రశ్నలో చాలా లోతైన వేదాంతం ఉంది. జాగ్రత్తగా విను.”


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/srimadramaramana-pds-serial-8/

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 15వ భాగం లింక్

మరియును, నీవు పరమాత్మయైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉన్నావు. ఆ పరాత్పరుండు,
మ.కో.:
ఆది అంతము లేని దేవుడు ఆత్మరూపుడు శౌరియే
వేదవేద్యుడు బ్రహ్మకైనను విశ్వపూజ్యుడు విష్ణుడే
ఆదిలక్ష్మికి ప్రాణనాథుడు అంబుజాక్షుడు శ్రీహరిన్
పాదపద్మము లాశ్రయించితి ప్రాపు నీకవె నిత్యమున్
~


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-15/ 

 

నా యాత్రా రచన 'అన్నవరం – పాదగయ – అంతర్వేది – క్షీరారామ దర్శనం-1' - లింక్

ఇటీవల అన్నవరం, పాదగయ, అంతర్వేది, క్షీరారామ క్షేత్రాలను సందర్శించాను. ఆ యాత్రానుభవాల రచన మొదటి భాగం సంచికలో చదవండి.

 


https://sanchika.com/annavaram-padagaya-anatarvedi-ksheeraaramam-darshanam-pds-1/


డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి అవధాన కార్యక్రమం - ఆహ్వానం

05 జనవరి 2025 నాడు నల్లకుంట లోని శృంగేరీ శంకరమఠంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి అష్టావధాన కార్యక్రమానికి నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. అవధానాలపై ఆసక్తి ఉన్నవారు హాజరు కాగలరు.


 Click on the image to view in bigger size

 

Sunday, December 22, 2024

దంతసిరి - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

బాగా తిని జీర్ణించుకోగల శక్తి ఉన్నవారిని, వీడికి ‘దంతసిరి’ దండిగా ఉందంటారు ఉత్తరాంధ్రలో. అన్ని చోట్లా దీనికి ‘తిండిపుష్టి’ అని పేరు. ఇంగ్లీషులో వీళ్లను ఫుడీ (Foody) లంటారు. అలా అంటే నాకు ‘ఫెడీల్మని’ అన్న మాట గుర్తుకొస్తుంది. దానికి దీనికి సంబంధం లేదనుకోండి. పదాల సౌండ్‌లో సామ్యం! అంతేనండి మాస్టారు!
‘ఆహార నిద్రాభయ మైథునం చ సామాన్యమే తత్పశుభిర్న రాణాం’ అంటున్నది సుభాషితం. శ్లోకం ఇంకా ఉంది కాని, మన టాపిక్‌కు ఇంత వరకు చాలండోయ్! తిండి, నిద్ర, భయం, శృంగారం, పశువులకు మనుషులకు సమానమైన లక్షణాలంటున్నాడు సుభాషితకర్త. కాని నేనొప్పుకోనంటే ఒప్పుకోను! మిగతావి ఇప్పుడొద్దు గాని, ఆహారాన్నే తీసుకుందాం. జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి. కడుపులో అనీజీగా ఉంటే తినడం మానేస్తాయి. మరి మనమో! ఆలోచించండొకసారి! ‘కడుపు నిండిన అమ్మకు గారెలు చేదు’ అని సామెత. ఆమె ఎవరో, ఆమెకెందుకు చేదో గాని, నా మటుకు నాకు అలా లేదండి. కడుపు నిండినా, మాంఛి కరకరలాడే అలసంద (బొబ్లర్లు) వడలు, ఎవరయినా బలవంతం చేస్తే, రెండు తినేస్తా!
దీనినే ‘కక్కుర్తి’ అంటారండి! ఇది మంచిది కాదని తెలిసినా, ‘జిహ్వచాపల్యం’ అనేదొకటుంది కదండి! దాన్ని గెలవడం మహామహులకే చేతకాదు. మనమెంత? విశ్వామిత్రుడంతటివాడు ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్నాడని ఐతిహ్యం. ‘క్షుద్బాధ’ ఎంతో భయంకరమైనది. ‘జఠరాగ్ని’ అని ఒకటుంది. అదీ ఆకలి అనే అగ్ని. అది నిరంతరం పొట్టలో ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది.


తిన్నది అరగడం ఒక గొప్ప వరం. జీర్ణశక్తి లోపిస్తే తినడాన్ని ఎంజాయ్ చెయ్యలేము. ఎంజైములు ఊరకపోతే ఎంజాయిలుండవండోయ్! కొందరికి జీర్ణశక్తి అద్భుతం. నేను పలాసలో పనిచేసేటప్పుడు మా కొలీగ్, ఫిజికల్ డైరెక్టర్, మల్లికార్జున అని ఉండేవాడు. ఆయన మంచి తిండిపుష్టి గలవాడు. ఆయనకు మా సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్ తుంబనాధం గారు ‘దంతసిరి వస్తాదు’ అని పేరుపెట్టారు. యస్.వి. యూనివర్సిటీ వాలీబాల్ ఛాంపియన్. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ చేసి, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా వెళ్లాడు. నాకు మంచి మిత్రుడు. పాపం చిన్నవయసులో చనిపోయాడు. అజీర్ణం వల్ల కాదులెండి, హార్ట్ ఎటాక్. ఒకసారి మా ఇంకో కొలీగ్, ఇతనితో పందెం కట్టగా మా పి.డి.గారు యాభై అరటికాయ బజ్జీలు అవలీలగా తిని, వంద రూపాయలు గెల్చుకొన్నాడు. 1984లో నండి! వందంటే మాటలా? మా జీతాలే వందల్లో ఉండేవి! ఆ అరటికాయ బజ్జీలు నిలువుగా తరిగి చేసేవారు. పెద్దవి!
‘దంతసిరి’ అనేసరికి నాకు మా నాన్నగారి మిత్రులు తిమ్మాభొట్లుగారు గుర్తొస్తారు. ఆయనను మేం ‘పెదనాన్నా’ అనేవాళ్లం. సన్నగా ఉండి కడుపు లోపలికి అంటుకుపోయి ఉండేది. నాకప్పుడు పదేళ్లుండొచ్చు. నాన్న ఆయనను ‘వృకోదరా’ అనేవారు. ‘వృకం’ అంటే ‘కడుపులో రగిలే అగ్ని’ అని ప్రముఖ భాషాశాస్త్ర పరిశోధకులు తిరుమల రామచంద్రగారు చెప్పారు. మా తిమ్మాభొట్లు పెదనాన్న గారికి పొట్టలో వృకం ఉంది. ఆయన లైఫ్ స్టైల్ కూడా విభిన్నం. భీమసేనుడికి ఆ పేరుంది. కానీ శారీరికంగా ఆయనెక్కడ? ఈయనెక్కడ? మా ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో రామళ్లకోట అనే ఊర్లో ఆయన నివాసం. మధ్యలో బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అక్కడ లలితా పరమేశ్వరి గుడిలో ఆయన అర్చకులు. చుట్టు పక్కల ఊర్లలో పౌరోహిత్యం. అంతా నడకే, చెప్పులు వేసుకునేవాడు కాదు.
మా ఊరు (వెల్దుర్తి)లో ఏదైన పౌరోహిత్యం పని ఉంటే, ముందు మా యింటికి వచ్చి, మా అమ్మతో, “లక్ష్మీనర్సు తల్లీ! ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంట్లోనే చేయి కడుగుతా, అమ్మా!” అని చెప్పి వెళ్లేవారు. చేయి కడగటం అంటే భోంచేయడం. అమ్మకు ఆయన భోజన పరాక్రమం తెలుసు కాబట్టి ‘తగినంత’ వండేది. ఆయన నన్ను ‘దత్తప్రభూ’ అని పిలిచేవారు ప్రేమగా. నేనూ, మా తమ్ముళ్ళు, చెల్లి ఆయన తింటుంటే చూడడానికి చేరేవాళ్లం. ముగ్గురు నలుగురు తినేంత భోజనం కావాలి. తద్దినాలకు ఆయన భోక్తగా వస్తే వడలు ఎక్కువ చేయాలి. నెయ్యి అరచేతి నిండా పోయాలి. పప్పు, వంకాయకూర కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి తినేవారు మా తిమ్మాబొట్లు పెదనాన్న. అలా తిన్నా కొంచెమైనా పొట్ట రాలేదు. రోజూ 16 కిలోమీటర్లు నడిస్తే ఇంకేం వస్తుంది చెప్పండి? భోంచేసి, కాసేపు కునికి, మళ్లీ నడుచుకుంటూ రామళ్లకోటకు వెళ్ళేవారు. ధన్యజీవి మా పెదనాన్నగారు.
ఇప్పటి తరానికి నాజూకుతనం, తిండిలో! రెండిడ్లీ, సింగిల్ వడ తింటే ఆపసోపాలు! మా చిన్నతనంలో ‘సింగిలిడ్లీ బకెట్ సాంబార్’ అనే నానుడి ఉండేది. అదేదో సినిమాలో సునీల్ కోసం బేసిన్ నిండా రెండు డజన్ల ఇడ్లీలు తెస్తాడు సర్వర్ సుందరం. “మనిషన్న వాడెవడయినా అన్ని యిడ్లీలు తింటాడా? ఒకటి తీసెయ్!” అంటాడు సునీల్! “తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్!” అన్నారు కదా గురజాడ! కాబట్టి కామ్రేడ్స్, బాగా తినండి! తర్వాత పడుకోకుండా కష్టపడండి. ‘ఈసురోమని’ ఉండద్దు! అదన్న మాట!


నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 7వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 7వ భాగం సంచికలో చదవండి.
~
పెదరెడ్డి అన్నాడు “ఆయన అట్ల రాసినాడు గాని, అందరూ ఒకటే.. ఎట్లా అయితారు? యాడుందే వాండ్లు ఆడ ఉండాల”
అల్లుడు జాలిగా మామవైపు చూశాడు. ఏదో అనబోతూంటే కౌసల్య కళ్ళతోనే వారించి ఇలా అంది ఇంగ్లీషులో
“ఫర్ జనరేషన్స్, దే హ్యావ్  బీన్ విత్ దట్ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్. మహీ! బెటర్ నాట్ టు ఆర్గ్యూ విత్ దెమ్.”
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/srimadramaramana-pds-serial-7/


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 14వ భాగం లింక్

అయినను అణుమాత్రము చలింపక, దానవేశ్వరుండు తన తపస్సును కొనసాగించుచుండె.
తే.గీ.:
నీటిధారలు తెరలుగా ధాటి జుట్ట
మేఘగర్జంబు లవి లోక భీకరముగ
వాటి రాపిడి మెరుపులు భాసురిల్ల
నిశ్చలాత్ముడు దైత్యుడు నిలిచెనచట
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-14/


నా గళంలో నారాయణ తీర్థుల తరంగం

శ్రీ నారాయణ తీర్థ తరంగం, నీలాంబరి రాగం, 'మాధవ! మామవ! దేవ!, స్వాధ్యాయ వారి యూట్యూబ్ ఛానెల్‍లో.


 


రాయలసీమ సాంస్కృతిక సమితి వారి మహా సభలో నా ప్రసంగం - సన్మానం

అనంతపురం, SSBN కళాశాల ఆడిటోరియం. రాయలసీమ సాంస్కృతిక సమితి వారి మహా సభ. అందులో శ్రీమాన్ తిరుమల రామచంద్ర గారిపై నా పద్య ప్రసంగం. నన్ను సన్మానిస్తూ ఉన్న, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు శ్రీ బొజ్జా దశరథ రామి రెడ్డి, ప్రముఖ రచయిత శ్రీ బండి నారాయణ స్వామి మొదలగు వారు.


 


Sunday, December 15, 2024

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 6వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 6వ భాగం సంచికలో చదవండి.
~
సరిగ్గా ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. వైనతేయ వంగపండు రంగు ధోవతి ధరించాడు. అది వదులవకుండా నడుముకు మెత్తని, ఎర్రని ఉత్తరీయం బిగించాడు. నుదుట తిరునామం దిద్దుకున్నాడు. మెడలో రుద్రాక్షమాల. వక్షం అనచ్ఛాదితం. కనకాంబరాలు, జాజులు, మరువము, చిట్టి చేమంతులతో అల్లిన కదంబమాల మెడలో వేసుకున్నాడు. కాళ్లకు చిరుగజ్జెలున్న పట్టీలు కట్టుకున్నాడు. ఎడమ చేత చిడతలు. దశ వర్ష ప్రాయుడైన ఆ బాల హరిదాసు సాక్షాత్తు ప్రహ్లాద కుమారునిలా ఉన్నాడు.


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/srimadramaramana-pds-serial-6/ 



పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 13వ భాగం లింక్

“మహాపరాక్రమశీలురైన మీరు, విజృంభించి, లోకముల మీద పడి, శిష్ట శిక్షణంబు సేయుడు. యజ్ఞయాగాదుల ధ్వంసము గావించుడు. మునీశ్వరుల వధి౦పుడు. మునిపత్నుల చెరబట్టుడు. బ్రాహ్మణులను గోవులను హత్య గావింపుడు. వేదపఠనము జరుగుచోట, ఆ వేదములను పఠించువారిని తగులబెట్టుడు” అని దానవేశ్వరుండగు హిరణ్యకశివుండు ఆనతి నివ్వ
శా.:
దైత్యుల్ జృంభిత క్రోధ ద్వేషమదముల్ ధర్మాతి రిక్తంబులై
అత్యాచారము చేయసాగిరి; మునుల్ అత్యంత నిష్ఠాత్ములై
నిత్యాగ్నుల్ జ్వలియించు యాగములపై, నిర్దోషులౌ వారిపై
కృత్యాకృత్యము వీడి పీడనములన్ క్రుంగంగ సర్వుల్ కడున్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-13/

 
 

‘స్మరించుకుందాం’ పుస్తకావిష్కరణ సభ - నివేదిక - లింక్

‘స్మరించుకుందాం’ అన్న నూరవ ప్రచురణను ప్రముఖ సినీ గేయరచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ హాస్యావధాని, హాస్యబ్రహ్మ, శ్రీ శంకరనారాయణ గారు హాజరై, తన ప్రసంగంతో, సభోద్యానంలో నవ్వుల పువ్వులు పూయించారు. పాణ్యం దత్తశర్మ గారి ప్రసంగం తనను ఎంతో ఆకట్టుకొన్నదని, ఈ రోజునుంచి, ఆయన పేరును ‘నాణ్యం దక్షశర్మ’గా మారుస్తున్నానని చెప్పి, అందర్నీ నవ్వించారు. 



పూర్తి నివేదికని సంచికలో చదవండి.

https://sanchika.com/smarinchukundaam-book-release-event-report/
 

న్యాయానికి అన్యాయం - దత్తవాక్కు- ఆంధ్రప్రభ

‘జస్టిస్ చౌదరి’ సినిమా చూశారా? చూసే ఉంటారు! అందులో వేటూరిగారు ఒక అద్భుతమైన పాట రాశారు. ‘చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో...’ అన్న పల్లవితో ప్రారంభమవుతుంది. చరణాలు తూటాల్లా పేలతాయి. ‘కఠినమైనదీ ధర్మం, కన్నులేనిదీ న్యాయం, మనసు లేనిదీ చట్టం’ అంటారు వేటూరి. “ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపుతీపికి కట్టబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిదీ తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా?” అని ఆవేశంగా ప్రశ్నిస్తారు మహా నటులు ఎన్.టి.ఆర్. అప్పుడు థియేటర్‍లో ప్రేక్షకులకు ‘గూస్‌బంప్స్’ వస్తాయి! వేటూరిగారి అభిప్రాయం, చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు అనిపిస్తుంది నాకు. హరిశ్చంద్రుని ప్రస్తావన కూడా ఈ పాటలో తెచ్చారు రచయిత. బీటు పాటల చక్రవర్తి గారు స్వరపరచిన చక్కని పాటల్లో ఇది ఒకటి. బహు కంఠస్వర గాన గంధర్వులు బాలు గారి గాత్రం, సాహిత్యానికి ప్రాణం పోసింది.
అప్పట్లో, అంటే ‘గుడ్ ఓల్డ్ డేస్’లో, సినిమాలు అలా ఉండేవి. ‘భారతీయుడు’ సినిమాలో సీనియర్ కమలహాసన్ తన అవినీతి కొడుకు చిన్న కమల్‌ను చంపడానికి కూడా వెనుదీయడు. ఈ మధ్య వచ్చిన ‘దేవర’లో హింస ఎక్కువైనా, మెయిన్ థీమ్, సముద్రంలో జరిగే స్మగ్లింగ్‌ను నాయకుడు ఎదుర్కొని నిలవరించడమే. కాని చాలా సినిమాల్లో స్మగ్లర్‌లను, డాన్‌లను హీరోలను చేసి చూపిస్తున్నారు. అదే మన దౌర్భాగ్యం. “పత్రములు గాని సాక్ష్యములు గాని లేని అప్పు కోసం భార్యను అమ్ముకుంటున్నావా? అమాయకుడా!” అని అంటాడు కాలకౌశికుడు. “మా యిరువురి హృదయములే పత్రములు, అంతరంగములే సాక్ష్యములు” అంటాడు సత్యశీలుడైన హరిశ్చంద్రుడు. కాలకౌశికుడి పాయింట్‌లో ‘చట్టం’ ఉంటే, హరిశ్చంద్ర చక్రవర్తి పాయింట్‌లో ‘ధర్మం’ ఉంది.
సాహిత్యంలో ‘పొయటిక్ జస్టిస్’ అనే అమూల్యమైన సిద్ధాంతం ఉంది. Virtue is rewarded and misdeeds are punished (సద్గుణాలు గౌరవింపబడాలి, తప్పులు శిక్షింపబడాలి) సాహిత్యం నైతికవిలువలను పునరుద్ధరించాలని దానర్థం. ఈ మాట తొలిసారి వాడినవారు, 17వ శతాబ్దంలో, థామస్ రైమర్ అనే సాహిత్య విమర్శకుడు. ఇదే పేరుతో 1993లో ఒక అమెరికన్ రొమాంటిక్ డ్రామా గల సినిమా వచ్చింది. దాని దర్శకుడు జాన్ సింగిల్టన్. జానెట్ జాక్సన్ కథానాయకుదు. గన్ వయొలెన్స్‌లో మరణించిన తన స్నేహితుడి కేసులో న్యాయం కోసం పోరాటమే ఈ సినిమా. మంచివారు సంతోషంగా ఉండాలి. చెడ్డవారు శిక్ష అనుభవించాలి. చట్టం ప్రకారం న్యాయం జరగనప్పుడు, న్యాయానికి అన్యాయం జరుగుతుందని ఆవేదనతో, చట్టాన్ని తమ ‘చేతుల్లోకి తీసుకొని’ (ఈ మాట సినిమావాళ్ళదే) తామే దోషులను, రక్త సంబంధాన్ని కూడా చూడకుండా, కొందరు చంపేయడం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం.
ఇటీవలే నేను ‘ఆపరేషన్ రెడ్’ అన్న సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్ నవల వ్రాశాను. ‘మీలో ఈ కళ కూడా ఉందా మహాశయా?’ అని అనుకొంటున్నారా? అన్వీక్షికి పబ్లిషర్స్ వారు నిర్వహించిన 2024 ఉగాది నవలల పోటీలో దానికి బహుమతి వచ్చింది. దాన్ని వారే ప్రచురించారు. ‘అమెజాన్’లో దొరుకుతుంది. మాన్యులు తనికెళ్ల భరణి, దర్శకులు వంశీ గార్ల చేతుల మీదుగా ఆ పురస్కారం అందుకున్నా. ‘స్వోత్కర్ష’ చాలు గానీ, ఇక విషయానికి రండి అంటున్నారా? సారీ! వస్తున్నా. మన భారతీయ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ, దానిపై విషప్రచారం చేసే కుహనా మేధావులను, సూడో సెక్యులరిస్టులను, తెలివిగా వ్యూహం పన్ని, ఒక పెన్నుతో చంపేస్తుంటాడు నా హీరో, ‘కాశినాయన’. ఆ పెన్ను అలాంటిది. నవల తెప్పించుకొని చదవండి ప్లీజ్!


నేను శ్రీకాకుళం జిల్లాలో పని చేస్తున్నాను అప్పుడు, ‘కోటబొమ్మాళి’ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా! టెక్కలి రెవెన్యూ డివిజనల్ హెడ్ క్యార్టర్స్. అక్కడ ఒక మెజిస్ట్రీటు గారుండేవారు. ఒక కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించడానికి వెళ్లాము. ఆయన సున్నితంగా తిరస్కరించారు. “నేను, నా కుటుంబసభ్యులు కూడా, వ్యక్తిగత బంధాలకు, సమాజంతో క్లోజ్‌గా ఉండకపోవడానికీ ప్రాధాన్యత ఇస్తాము. అవి నా తీర్పులను ప్రభావితం చేస్తాయని...” అన్నారా న్యాయమూర్తి. న్యాయం మూర్తీభవిస్తే ఆయనలా ఉంటుంది మరి! పదవి దిగిపోయింతర్వాత, ప్రభుత్వంలో ఇంకో పదవి స్వీకరించేవారిని ఇప్పుడు చూస్తున్నాం!
ఇక, కథలు, నవలలు, కవితల పోటీల్లో విజేతలను ఎంపిక చేసే వాళ్లను న్యాయనిర్ణేతలంటారు! ఆయా పోటీల నిర్వాహణలకు వారు ప్రామాణికులు కావచ్చు. కొంతకాలంగా బహుమతులు పొందుతున్నవారు ప్రతి జాబితాలో కొందరే ఉంటున్నారు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు తొమ్మిదో కవిని రానివ్వకుండా ఉండేవారట! ప్రతి పోటీలో వీళ్లే విజేతలు! అదెలా సాధ్యమో మరి! న్యాయనిర్ణేతల whims and fancies కొన్నిసార్లు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఒక పోటీలో రిజెక్ట్ అయిన రచనకు వేరొక పోటీలో బహుమతి వస్తుంది! నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది. క్రింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టేసినట్లన్నమాట! మా గురువుగారు, సహస్రకథానికా చక్రవర్తి ‘వాణిశ్రీ’ గారు (సి.హెచ్. శివరాంప్రసాద్ గారు) “బహుమతులు వస్తే మంచిదే, రాకపోతే మరీ మంచిది. రాయడమే మన పని!” అని సెలవిచ్చారు. వాట్సాప్ గ్రూపులు వచ్చాక ఈ బహుమతుల విషయంలో వాదోపవాదాలు కూడా మొదలయ్యాయి. “న్యాయం వెంటనే జరగాలి. ఆలస్యమైతే, న్యాయం జరగనట్లే!” అన్నారు ఒకప్పటి బ్రిటిష్ ప్రధాని విలియమ్ గ్లాడ్‌స్టోన్. ఎంత గొప్ప మాట! అదన్న మాట!

Monday, December 9, 2024

స్వాతి వారపత్రిక తాజా సంచికలో నా నవల 'ఆపరేషన్ రెడ్' సమీక్ష

స్వాతి వారపత్రిక తాజా సంచికలో నా క్రైమ్, సస్పెన్స్ నవల 'ఆపరేషన్ రెడ్' గురించి చక్కని సమీక్ష ఇచ్చారు. అన్వీక్షికి పబ్లిషర్స్ దానిని ప్రచురించి మార్కెటింగ్ చేస్తున్నారు. అమెజాన్‍లో ఉంది.
https://amzn.in/d/0qhXBAQ
సమీక్షలో పబ్లిషర్స్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. కావలసినవారు తెప్పించుకోగలరు.




నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 5వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 5వ భాగం సంచికలో చదవండి.
~
“వీడు ఉండటానికి బాలుర సంక్షేమ వసతిగృహం ఏదైనా..” అని దస్తగిరి సారు అంటుండగానే శర్మగారు కలుగజేసుకొని “ఎంత మాటన్నావు నాయనా, వాడు హాస్టల్లో ఉంటే నా వద్ద విద్య నేర్చుకునేదెప్పుడు? ఈ రోజు నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు. మేం తిన్నదే తింటాడు. పెరట్లో ఒక కొట్టుగది నిరుపయోగంగా ఉంది. మొన్ననే దానిని మా వల్లి శుభ్రం చేయించి పెట్టింది. అందులోనే వాడుండబోతున్నాడు. రెండేళ్లు ఎంతలో గడుస్తాయి దస్తగిరీ! తర్వాత తిరుపతికి వెళ్లాల్సిందేనాయె” అన్నారాయన. ఆయన విశాల దృక్పథం తెలియక హాస్టలు ప్రస్తావన తెచ్చినందుకు దస్తగిరి సారు పశ్చాత్తాప పడినాడు. శర్మగారు కొంచెం మనసు నొచ్చుకున్నట్లనిపించిది.
“క్రమించండి, స్వామి! మహోన్నతమైన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినాను” అన్నాడు.


(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/srimadramaramana-pds-serial-5/


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 12వ భాగం లింక్

నిరంతర హరిద్వేష జ్వలిత మానసుండైన హిరణ్యకశిపుండు, తన ప్రియ సోదరుండు మాధవు చేత హతుడైన కతంబున, అగ్నికి అజ్యము తోడైన రీతిని మండుచుండెను. అప్పుడు అసురగురుండు, దానవ సంక్షేమాభిలాషి, శుక్రుడేతెంచి, నిలింపవైరి చక్రవర్తితో నిట్లు
పలికె.
కం:
బలమే యన్నిట గెలవదు
బలయుతుడగు సోదరుండు మరణించె గదా!
నిలువుము దానవ శేఖర!
తెలిపెద నీ శత్రు గెలుచు తీరును వినుమా!


~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-12/ 


Wednesday, December 4, 2024

ఆధునిక యక్ష ప్రశ్నలు-2 - దత్తవాక్కు - ఆంధ్రప్రభ

ఇంతకు ముందు ఈ శీర్షికన చదివినట్లు అనిపిస్తుంది కదూ! నిజమేనండోయ్! కానీ, ప్రక్కనే ‘2’ పెట్టాను కదా! అలా చూస్తారేంటి? బాహుబలి-2, పుష్ప-2 లు ఉన్నప్పుడు... ఇది ఎందుకుండకూడదు? చెప్పండి!
అప్పుడు, ధర్మరాజు తమ్ముళ్లందర్నీ యక్షుడు బంధించి, వాళ్లను విడిపించుకోడానికి ఆయన్ను కొన్ని ప్రశ్నలడిగాడు. ధర్మరాజుకు తెలియని విషయాలుండవు కదా! అవలీలగా సమాధానాలు చెప్పేసి, తమ్ముళ్ళను వెంటబెట్టుకొని చక్కాపోయాడు! తర్వాత ‘ఏండ్లును పూండ్లును గడిచె’. పూండ్లంటే ఏమిటని మాత్రం అడక్కండేం! భారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు కౌరవ సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రతీహారి వచ్చి, “ఎవరో పెద్దాయన, మహా తేజశ్శాలి, మీ దర్శనం కోసం వచ్చియున్నారు, ప్రభూ!” అని విన్నవించాడు.
‘ఎవరై ఉంటారబ్బా!’ అని ఆలోచించాడు అజాతశత్రువు. ఆయన్నలా అంటారు గాని, కౌరవులంతా ఆయన శత్రువులే గదండి! ఏమంటే భీమసేన మహారాజులాగా భీషణ ప్రతిజ్ఞలు చెయ్యడు. కామ్‌గా చేయాల్సింది చేస్తాడు. అందుకే సంజయుడు ఆయనను “మెత్తని పులి ధర్మజుండు” అన్నాడు. పెద్దాయన వచ్చి రాజుగారికి నమస్కరించి, “నన్ను గుర్తుపట్టావా ధర్మజా?” అని అడిగాడు.
“పట్టకేం మహాశయా! తమరు యక్షవర్యులు కదా! చాలాకాలం క్రిందట మా తమ్ముళ్లను...”.
యక్షుడన్నాడు “అవును కుంతీ సుతాగ్రజా! అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో పెను మార్పులు! నాకు ఎన్నో సందేహాలు! తీరుస్తావా?”.
“అవశ్యం! అడగండి మరి! చెప్పలేకపోతే తల పగిలిపోవడం లాంటి కండిషన్స్ ఏవీ లేవు కదా యక్షహర్యక్షా?”.
“అబ్బే! లేవులే! కేవలం కుతూహలం” అని చెప్పి, “రచనలను మదింపు చేయడం, వడపోత, న్యాయనిర్ణేతలు, ప్రచురణ, బహుమతులు ఇలాంటి జంజాటం ఏమీ లేకుండా, ఎవరైనా, ఏదైనా రాసుకొని వేసుకొనే వెసులుబాటు?”.
“దాన్ని ఫేస్‌బుక్ అంటారు. వేదాంతం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు, కవిత్వం నుంచి కథల వరకు, అతి చౌకబారు బూతు పురాణాల వరకు, ఏదైనా ఓ.కె. నో ప్లాబ్లం”. 


“గుడ్. అయాచితంగా బోలెడు శుభాకాంక్షలు మోసుకొచ్చేది, గ్రూపులుగా ఏర్పడి, స్వోత్కర్షలు, పరవిమర్శలు చేసుకునేది?”.
“ఇంకేది? వాట్సాప్! మనకొచ్చేవి డిలీట్ చేయడానికి ఈ జీవిత కాలం చాలదు!”.
“ఎవరి గొట్టం వారు ఊదుకుంటా, ప్రామాణికత లేని అవాకులూ చవాకులూ వాగే అవకాశం ఇస్తున్న అద్భుత మాధ్యమం?”
“మీ ప్రశ్న లోనే ఉంది జవాబు! యూట్యాబ్! నీ గొట్టం! రాజకీయ విశ్లేషణల దగ్గర్నుంచి వంటల వరకు, రైలు ప్రయణాలు, వాస్తు, జోతిష్యం, పండుగల వివాదాలు, వైద్యం - మనకు తెలియకపోయినా తెలిసినట్లు ఎవరి గొట్టంలో వాళ్ళు చెప్పొచ్చు”.
“ఏమి సెపితిరి? ఏమి సెపితిరి? ఒకరి మీద ఒకరు బురద చల్లుకోడానికని, పోస్టులు, కౌంటర్ పోస్టులు పెట్టుకుంటారు. ఎవరిది కరెక్టో అర్థమై చావదు. ఏమిటది?”.
“ఇంకేమిటి? ట్విట్టర్! నోటికొచ్చింది పెట్టేయవచ్చు యక్షరాజా!”
“శుక్రాచార్యుల వారు సప్తమ వ్యసనాలను పేర్కొన్నారు. ఇప్పుడు ఏదో అష్టమ వ్యసనమట?”.
“ఆహా! భేషుగ్గా! స్మార్ట్‌ఫోన్ ఆ ఎనిమిదో దురలవాటు. అది లేనిదే మానవ జీవితం లేదు”.
“రాత్రంతా హాయిగా పడుకోని వెళ్లడానికి నాలుగు వందల రూపాయలయితే, ఎనిమిది గంటలు కూర్చోబెట్టి, పిచ్చిపిచ్చి స్నాక్స్ ఇచ్చి, తెల్లవారుజామున స్టేషన్ చేరడానికి, అర్ధరాత్రి ఇంటికి చేరడానికి అష్టకష్టాలు పడేలా చేసి, నాలుగింతలు, అంటే 1600 రూపాయలు వసూలు చేసే ప్రయాణ సాధనం. ఉష్ కాకి మన ధనం, నడుంనొప్పి అదనం! ఏమిటి అది?”
ధర్మరాజు నవ్వాడు! “మీదాకా వచ్చిందీ? అదే వందే భారత్ రైలు!”
“ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలో అందని మానిపండ్లు ఏవి?”
“జనరల్ కంపార్టుమెంట్లు. ప్యాసెంజర్ రైళ్ళు! ప్రయాణాలు సామాన్యులకు పెను వ్రణాలు!”   
“ముష్టాముష్టీ, బాహాబాహీ! కచాకచీ.. దీనికి ప్రత్యక్ష నిదర్శనం చెప్పు భూవరా?”
“ఇంతకు ముందు యుద్ధాలు! ఇప్పుడు చట్టసభలు!”
“అడగకపోయినా వచ్చి వాలేది?”
“ప్రభుత్వ సలహాదారు పదవి”
“మూడో ప్రపంచయుద్ధం వస్తుందంటావా, పాండవాగ్రజా!”
“చచ్చినా రాదు! ఎందుకంటే అందరూ ఛస్తారు! కాబట్టి ధైర్యం చేయరు..”
“ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిహీనమైన సంస్థ?”
“ఐక్యరాజ్యసమితి!”
“అదేమిటి అంత మాట అనేశావు?”
“అవును మరి! అది ఉద్ధరిస్తూన్నదేముంది చెప్పండి?”
“మానవుడికి అందరికంటె, అన్నింటికంటె ప్రియతమమైనది?”
“తానే! తన తర్వాతి ఎవరైనా, ఏదైనా! సర్వేస్వార్థం సమీహతీ!”
“శభాష్! మనుషుల కడుపుకొట్టి, అభివృద్ధి పేర ముంచుకొస్తూన్నది..?”
“కృత్రిమ మేధ! కావలసినన్ని మానవ వనరులను ఉపయోగించకుండా, సహజ మేధను తొక్కేయబోతోంది! ఆల్‌రెడీ తొక్కేసింది!”
“చివరి ప్రశ్న! బ్రహ్మపదార్థం కంటే గహనతరమైన సిద్ధాంతం?”
“భారతదేశంలో లౌకికవాదం. ఎవరిష్టమొచ్చినట్లు వారు దాన్ని నిర్వచించుకోవచ్చు. చిన్న డిస్‌క్లెయిమర్. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే! కొంపదీసి ఈ వ్యవహారాన్నంతా మీ ‘యక్షలోకం’ ఈ-మ్యాగజైన్‌లో ‘ధర్మరాజుతో ముఖాముఖి’ అని ప్రచురించరు కదా; కొంపలంటుకుంటాయి!”
యక్షుడు నవ్వాడు! “లేదులే ధర్మ స్వరూపా! నావి కూడ వ్యక్తిగత సందేహాలే! అయినా, భావప్రకటనా స్వేచ్ఛ అంటూ ఒకటి ఏడ్చింది కదా! మరేం ఫర్వాలేదు! నీ జ్ఞానం అపారం!”
“అదేం లేదు! ఇవన్నీ అందరికీ తెలిసినవే!”
అదన్నమాట!
 

డా. వైరాగ్యం ప్రభాకర్ గారి 100వ పుస్తకావిష్కరణ సభ - ఆహ్వానం

భవాని సాహిత్య వేదిక ఆధ్వరంలో కరీంనగర్ లో 8 డిసెంబర్ 2024న ఆత్మీయ సోదరులు డా. వైరాగ్యం ప్రభాకర్ గారి 100వ పుస్తకం ఆవిష్కరణ సభ జరుగుతోంది.
వంద పుస్తకాలు ప్రచురించడం ఒక చారిత్రాత్మక విజయం. ఆ అరుదైన సభలో ప్రధాన వక్తగా నాకు ఆహ్వానం. అది నాకొక గౌరవం 🙏🌹 

Click on image to view in bigger size
 

Sunday, December 1, 2024

'అవధాన విద్యా సర్వస్వం' లో మా నాన్నగారి గురించి వ్యాసం

మా నాన్నగారు, అవధానరత్న, పౌరాణికరత్న, బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి గురించి, డా. రాపాక ఏకాంబరాచార్యుల వారు సంకలనం చేసిన ఉద్గ్రంథం, 'అవధాన విద్యా సర్వస్వం' లోని వ్యాసం.
ఆ మహనీయుని కడుపున పుట్టినందుకే, ఈ మాత్రం పాండిత్యం నాకు అబ్బింది.
నాన్నా! నమోస్తుతే 🙏🌹
నాకు ఆయన తండ్రే కాదు, గురువు కూడా. "తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!". అటువంటి తండ్రి మా నాన్న!🙏


Click on the image to view in bigger size
 

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 4వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 4వ భాగం సంచికలో చదవండి.
~
శర్మగారు వారి పట్ల చూపుతున్న ఆదరణను చూసి, నీలకంఠ దీక్షితులుగారి ముఖం అప్రసన్నంగా మారింది. ఆయన నిరంతరం చెన్నకేశవుని సేవతో ఉన్నా, పరమాత్మ ప్రవచించిన ‘సర్వత్ర సమ దర్శన యోగం’ ఆయనకు వంటబట్టలేదు.
‘యానాదుల పిల్లవానికి దూదేకుల వాడు గురువు! సరిపోయింది. వాళ్లేదో మహా విద్వాంసులైనట్లు ఈయన వాళ్ల అడుగులకు మడుగులొత్తడం!’ అనుకున్నాడు.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

https://sanchika.com/srimadramaramana-pds-serial-4/



పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 11వ భాగం లింక్

ఇవ్విధంబున దేవశ్రవ మునీంద్రుండు గాలవ మహర్షికి వెల్లడించె. ఆ జయవిజయులే, హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా దితి గర్భంబున నుదయించిరని ఎఱింగించెను.
మాలిని:
సకల మహిమ భాసా, సర్వ ధర్మ ప్రకాశా
చకిత దివిజ కీర్తీ, సత్య వాక్యానువర్తీ
సుకవి వినుతనామా, సుందరానంద శ్యామా
వికసకమలనేత్రా, విశ్వసమ్మోహ గాత్రా!

---
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)



https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-11/

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 8వ భాగం లింక్

సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 8వ భాగం. 🙏


~
“భారత రాజధాని నవ్వటం మర్చిపోయింది. ఎక్కడ చూసినా శోకం, భయం” (పుట 109)
ఈ రెండు వాక్యాలు చాలు, Post-Independence India పరిస్థితిని చెప్పడానికి. హిందూ ముస్లింల సయోధ్య కోసం మహాత్ముడు నిరాహర దీక్ష ప్రారంభించాడు. కోట్లాది భారతీయులు ‘నిస్సహాయంగా’, ‘దూరంగా’, ‘దానిని’ ‘చూస్తూ’ ఉండేవారు.
ఈ పై వాక్యంలో ‘నిస్సహాయంగా’ అనే పదంతో చాలా ‘వెయిట్’ పెట్టారు మాలతి. అలా చూస్తున్నవారిలో గోపాల రావు కూడా ఉన్నాడు. నవలకు అతడు Protagonist (ముఖ్యపాత్ర) అయినా, దేశ పరిస్థితుల్లో అతడూ కోట్లాదిమందిలో ఒకడు మాత్రమే. అందుకే అతనిని ‘మహాసముద్రంలో నీటి బిందువు’తో పోల్చారు రచయిత్రి.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-8/ 

కార్తీక వైభవం ప్రవచనములు – నివేదిక లింక్

కార్తీక మాస సందర్భముగా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ ప్రాంగణములో (కోనేరు వద్ద, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా) తేది 25-11-2024 సోమవారం ఉదయం 10గం.లకు 'కార్తీక వైభవం' - ప్రవచనం చెప్పాను. ఆ కార్యక్రమంపై జెట్టి వంశీకృష్ణ అందించిన నివేదిక సంచికలో చదవగలరు.


https://sanchika.com/kartika-vaibhavam-pravachanam-nivedika/

డిసెంబర్ 2024 సహరి మాసపత్రికలో నా కథ కుక్కమూతి పిందెలు

'కుక్కమూతి పిందెలు' అనే శీర్షికతో నేను వ్రాసిన కథ డిసెంబర్ 2024 సహరి మాసపత్రికలో ప్రచురితమైంది.
చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు.

 


Click on the image to view in bigger size